హైదరాబాద్‌లో టీవీఎస్‌ నకిలీ పార్ట్‌లు | TVS fake parts in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టీవీఎస్‌ నకిలీ పార్ట్‌లు

Published Fri, Jan 26 2018 12:53 AM | Last Updated on Fri, Jan 26 2018 12:53 AM

TVS fake parts in Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉప్పు, పప్పులే కాదండోయ్‌.. వాహన విడిభాగాల్లోనూ నకిలీలున్నాయ్‌! అవి కూడా హైదరాబాద్‌లో. ఇటీవల వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ కంపెనీ జరిపిన దాడిలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్‌ రాంకోఠికి చెందిన ఓ ప్రముఖ విక్రయశాలలో రూ.6 లక్షల విలువ చేసే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల నకిలీ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామని.. సంబంధిత స్టోర్‌ యజమాని మీద కేసులు కూడా నమోదు చేశామని టీవీఎస్‌ మోటర్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (పార్ట్స్‌ బిజినెస్‌) కె.వెంకటేశ్వర్లు గురువారమిక్కడ చెప్పారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

నకిలీ బ్రేకులు, క్లచ్‌లు..
మూడు నెలలుగా హైదరాబాద్‌తో సహా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, కోయంబత్తూరు నగరాల్లోని 55 ప్రాంతాల్లో దాడులు నిర్వహించాం. వీటిలో రూ.55 లక్షల విలువ చేసే నకిలీ విడిభాగాల్ని గుర్తించాం. బ్రేకులు, చెయిన్, కేబుల్స్, క్లచ్‌ ప్యాడ్స్‌ వంటి ఎక్కువ విక్రయాలు జరిగే విడిభాగాలే నకిలీలున్నాయి. ఇవి బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతాల్లోని 8 కేంద్రాల్లో తయారవుతున్నాయి. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు సరఫరా అవుతున్నాయి.

సంబంధిత తయారీ కేంద్రాలు, యాజమాన్యం మీద కాపీ రైట్స్‌ చట్టం కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్‌లో మాత్రం తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించలేదు. అయితే దాడులింకా పూర్తవ్వలేదు. ఈ ఏడాదంతా కొనసాగుతాయి. నకిలీ విడిభాగాలను గుర్తించేందుకు, దాడులు చేసేందుకు 12 ప్రైవేట్‌ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నాం. అవి గుర్తించిన ఉత్పత్తులను కంపెనీ పరిశోధన బృందం పరీక్షించి అవి నకిలీ ఉత్పత్తులేనని తేలాక.. సంబంధిత ప్రాంతాల్లో పోలీసు, ఏజెన్సీలతో కలసి దాడులు చేస్తాం.  

ఏప్రిల్‌లో హెచ్‌అండ్‌ఎస్‌ కేంద్రాలు..
హబ్‌ అండ్‌ స్పోక్‌ (హెచ్‌అండ్‌ఎస్‌) విధానంలో విడిభాగాలను విక్రయించాలని నిర్ణయించాం. ఈ కేంద్రాలేం చేస్తాయంటే.. కంపెనీ నుంచి హబ్‌కు బల్క్‌లో టీవీఎస్‌ ఉత్పత్తులను పంపిస్తాం. అక్కడి నుంచి 150 కి.మీ. పరిధిలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరుతాయి. ప్రతి హబ్‌ 2 నెలలకొకసారి ప్రతి రిటైలర్లతో సంప్రతించడం, పర్యవేక్షించడం వంటివి చేయాలి. ఇదంతా టెక్నాలజీతో కలిసి ఉంటుంది.

ప్రతి రిటైల్‌ స్టోర్, ఉత్పత్తులు ట్రాక్‌ అవుతాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఏడాదిన్నర క్రితం నుంచి తమిళనాడులో 10 హెచ్‌అండ్‌ఎస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూషన్లున్నాయి. వీటినే హెచ్‌అండ్‌ఎస్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏప్రిల్‌లో అధికారికంగా ప్రారంభిస్తాం. ఏడాది ముగిసే నాటికి మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు ఈ విధానాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాం.

విపణిలోకి అదనపు ఫీచర్లతో ఉత్పత్తులు..
ప్రతి విడిభాగం గరిష్ట అమ్మకం ధర (ఎంఆర్‌పీ) మీద ఒక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దాన్ని స్కాన్‌ చేస్తే అది నకిలీనా? ఒరిజినలా? అన్నది  తెలిసిపోతుంది. అయితే ఈ క్యూఆర్‌ కోడ్‌ను ఒకసారి స్కాన్‌ చేస్తే రెండోసారి చేసేటప్పుడు గతంలో వినియోగించారని వస్తోంది. అందుకే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న విడిభాగాల్లో అదనపు ఫీచర్లను జోడిస్తున్నాం. ప్రతి ఉత్పత్తి మీద సూక్ష్మ అక్షరాలతో టీవీఎస్‌ అని ఉంటుంది. ఇది చూసేందుకు రంగుతో ఉంటుంది కానీ, పరీక్ష చేస్తే కంపెనీ పేరు కనిపిస్తుంది. ఇలాంటి ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను విపణిలోకి ప్రవేశపెడుతున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement