ప్రతి ముగ్గురిలో ఒకరికి హ్రస్వదృష్టి
విపరీతమైన స్క్రీన్ టైమే కారణం
ఆసియాలో పెచ్చరిల్లుతున్న సమస్య
తల్లిదండ్రులకు కంటిపాపలైన చిన్నారుల్లో కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. సగటున ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు హ్రస్వదృష్టి (దూరంలోని వస్తువులు సరిగా కని్పంచని) సమస్యతో బాధపడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషణ ఒకటి హెచ్చరించింది. ఆసియాలోనైతే సమస్య మరీ దారుణంగా ఉంది. జపాన్‌లో ఏకంగా 85 శాతం, కొరియాలో 73 శాతం మంది బాలలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీలో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల పరిధిలోని 50కి పైగా దేశాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచి్చనట్టు పేర్కొంది. అధ్యయనంలో భాగంగా 50 లక్షలమందికి పైగా బాలలు, టీనేజర్లను పరీక్షించారు.
స్కూలు పుస్తకాలతో కుస్తీకి తోడు స్క్రీన్ సమయం విపరీతంగా పెరగడం, ఆరుబయట గడిపే సమయం తగ్గడం పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోట్లాది మంది పిల్లల కంటిచూపు బాగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. హ్రస్వదృష్టి సాధారణంగా స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టే దశలోనే మొదలవుతుంది. కళ్ల ఎదుగుదల ఆగిపోయేదాకా, అంటే 20 ఏళ్లొచ్చేదాకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుంది.
సగం యువతకు సమస్యే
→ ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మంది బాలలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు.
→ 1990 నుంచి 2023 మధ్యకాలంలోనే సమస్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది.
→ పిల్లల్లో హ్రస్వదృష్టి ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఏకంగా ఏడు రెట్లు తక్కువగా ఉండటం విశేషం.
→ ఉగాండాలో అతి తక్కువగా కేవలం ఒక్క శాతం మంది పిల్లల్లో మాత్రమే హ్రస్వదృష్టి నమోదైంది.
→ ఆఫ్రికా దేశాల్లో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయస్సులో ప్రారంభమ తుంది. పైగా పిల్లలు ఆరుబయట ఎక్కువగా గడుపుతున్నారు. దాంతో అక్క డ బాలలు, యువకుల్లో సమస్య తక్కువగా ఉంది.
→ జపాన్‌లో ఏకంగా 85%, దక్షిణ కొరియాలో 73% పిల్లలకు హ్రస్వదృష్టి ఉంది.
→ చైనా, రష్యాల్లో 40 % కంటే ఎక్కువగా, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో 15 శాతానికి పైగా పిల్లల్లో సమస్య ఉంది.
→ మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో 2050 నాటికి ఏకంగా 69 శాతం మంది హ్రస్వదృష్టి బారిన పడతారు.
→ అప్పటికి ప్రపంచ యువతలో కనీసం సగానికి సగం ఈ సమస్యను ఎదుర్కొంటారు.
→ వర్ధమాన దేశాల్లో 2050 నాటికి 40% మంది దీని బారిన పడే అవకాశముంది.
→ పిల్లలను రెండేళ్ల వయసులోనే బడిబాట పట్టించే సింగపూర్, హాంకాంగ్ వంటిచోట్ల సమస్య విస్తరిస్తోంది.
→ కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో బాలల్లో హ్రస్వదృష్టి సమస్య బాగా పెరిగింది.
→ కోట్లాది మంది ఇళ్లకే పరిమితమై స్మార్ట్ ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడటం దీనికి ప్రధాన కారణం.
అమ్మాయిల్లోనే ఎక్కువ
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే హ్రస్వదృష్టి ఎక్కువగా కని్పస్తున్నట్టు అధ్యయనం తేలి్చంది. ‘‘అబ్బాయిలతో పోలిస్తే ఎదిగేక్రమంలో వాళ్లు ఇంట్లో గానీ, స్కూల్లో గానీ ఆటలపై, ఆరుబయట, గడిపే సమయం తక్కువ. వీటికితోడు ఆహారపు అలవాట్లు తదితరాల వల్ల చాలా చిన్నవయసులోనే రజస్వల అవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారిలో చాలావరకు టీనేజ్‌లోనే హ్రస్వదృష్టి బారిన పడుతున్నారు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment