
హెడ్డాఫీస్ టెక్సాస్‌కు తరలింపు
కెంటకీ ఫ్రైడ్ చికెన్. క్లుప్తంగా కేఎఫ్‌సీ. పరిచయమే అక్కర్లేని ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్. ఈ ఫుడ్ జాయింట్ దిగ్గజానికి పిల్లల నుంచి పండు ముసలి దాకా లెక్కలేనంత మంది అభిమానులు! అమెరికాకు చెందిన ఈ బ్రాండ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇంతకాలం తన కేరాఫ్‌గా నిలిచిన కెంటకీలోని లూయిస్‌విల్లే నుంచి టెక్సాస్‌లోని ప్లానోకు ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తోంది.
కొన్ని కార్యకలాపాలు మాత్రం కెంటకీ నుంచి ఇకముందూ కొనసాగుతాయని యాజమాన్యం ప్రకటించింది. కేఎఫ్‌సీ నిర్ణయంపై కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషెర్ విచారం వెలిబుచ్చారు. ఈ విషయం తెలిస్తే బహుశా ఆ సంస్థ వ్యవస్థాపకుడు కల్నల్ హార్లండ్ శాండర్స్ కూడా బాధపడి ఉండేవాడన్నారు. ‘‘ఆ కంపెనీ పేరే మా రాష్ట్రంతో మొదలవుతుంది. తన ఉత్పత్తుల విక్రయానికి మా రాష్ట్ర సంస్కృతిని, వారసత్వాన్ని ఉపయోగించుకుంది’’అని చెప్పు కొచ్చారు.
పరిశ్రమలు, సంస్థలపై పన్నుల భారాన్ని టెక్సాస్ కొన్నే ళ్లుగా బాగా తగ్గించింది. దాంతో పాటు అక్కడి వ్యాపార అనుకూల వాతావరణానికి అమె రికన్ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్ర బాట పడుతున్నాయి. కేఎఫ్‌సీని 1930ల్లో కెంటకీలోని కోర్బిన్‌లో ఓ సరీ్వస్ స్టేషన్ దగ్గర ఫ్రైడ్ చికెన్ చిన్న దుకాణంగా శాండర్స్ మొదలు పెట్టారు. దాని రుచికి జనాలు ఫిదా కావడంతో చూస్తుండగానే యమా పాపులరైంది. ఇప్పుడు 145కు పైగా దేశాల్లో సంస్థకు ఏకంగా 24 వేల పై చిలుకు ఔట్‌లెట్లున్నాయి! ప్రతి కేఎఫ్‌సీ షాపు ముందూ కన్పించే గమ్మత్తైన ఫేసు దాని వ్యవస్థాపకుడు శాండర్స్‌దే.
– సాక్షి, నేషనల్ డెస్క్