
కేప్ కనవెరాల్: ఇంట్యూటివ్ మెషీన్స్ రెండో మిషన్ కూడా ఫెయిలయ్యింది. చంద్రుడిపైకి పంపిన ల్యాండర్ అథెనా పనిచేయకుండా పోయింది. టెక్సాస్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఫిబ్రవరి 26న అథెనాను పంపించింది. ఇందులో 11 పేలోడ్లు, సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి.
చంద్రుని దక్షిణ ధ్రువానికి 160 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత ప్రదేశంలో ఇది ల్యాండవ్వాల్సి ఉంది. కానీ, 250 మీటర్ల దూరంలో అతికష్టమ్మీద, అదీ ఇరుకైన గుంతలో దిగింది. తను దిగిన ప్రదేశాన్ని, పొజిషన్‌ను తెలపడంతోపాటు కొన్ని ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను సైతం యాక్టివేట్ చేసినట్లు ఫొటోలను పంపించింది.
వీటిని బట్టి చూస్తే ఇది ఇరుకైన గుంతలో పక్కకు ఒరిగి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు శుక్రవారం తేల్చారు. ల్యాండర్‌కు ఉన్న సౌర ఫలకాలున్న తీరు, గుంతలోని అతి శీతల పరిస్థితులను బట్టి చూస్తే, అథెనా బ్యాటరీలను రీఛార్జి చేయడం అసంభవమని గుర్తించారు. దీంతో, అథెనా పనిచేసే అవకాశాలు లేవని ప్రకటించారు. మిషన్ పూర్తయినట్లు ప్రకటించిన అధికారులు అది పంపించిన చిత్రాలను విశ్లేషించి పనిలో పడ్డారని ఇంట్యూటివ్ మెషీన్స్ తెలిపింది. అథెనా ఇంట్యూటివ్ రెండో మిషన్ కాగా, ఈ సంస్థ ఏడాది క్రితం పంపిన ఒడిస్సియస్ కూడా విఫలమైంది.