Eyesight problem
-
పాపం కంటిపాపలు
తల్లిదండ్రులకు కంటిపాపలైన చిన్నారుల్లో కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. సగటున ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు హ్రస్వదృష్టి (దూరంలోని వస్తువులు సరిగా కని్పంచని) సమస్యతో బాధపడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషణ ఒకటి హెచ్చరించింది. ఆసియాలోనైతే సమస్య మరీ దారుణంగా ఉంది. జపాన్‌లో ఏకంగా 85 శాతం, కొరియాలో 73 శాతం మంది బాలలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీలో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల పరిధిలోని 50కి పైగా దేశాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచి్చనట్టు పేర్కొంది. అధ్యయనంలో భాగంగా 50 లక్షలమందికి పైగా బాలలు, టీనేజర్లను పరీక్షించారు. స్కూలు పుస్తకాలతో కుస్తీకి తోడు స్క్రీన్ సమయం విపరీతంగా పెరగడం, ఆరుబయట గడిపే సమయం తగ్గడం పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోట్లాది మంది పిల్లల కంటిచూపు బాగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. హ్రస్వదృష్టి సాధారణంగా స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టే దశలోనే మొదలవుతుంది. కళ్ల ఎదుగుదల ఆగిపోయేదాకా, అంటే 20 ఏళ్లొచ్చేదాకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. సగం యువతకు సమస్యే → ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మంది బాలలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. → 1990 నుంచి 2023 మధ్యకాలంలోనే సమస్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. → పిల్లల్లో హ్రస్వదృష్టి ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఏకంగా ఏడు రెట్లు తక్కువగా ఉండటం విశేషం. → ఉగాండాలో అతి తక్కువగా కేవలం ఒక్క శాతం మంది పిల్లల్లో మాత్రమే హ్రస్వదృష్టి నమోదైంది. → ఆఫ్రికా దేశాల్లో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయస్సులో ప్రారంభమ తుంది. పైగా పిల్లలు ఆరుబయట ఎక్కువగా గడుపుతున్నారు. దాంతో అక్క డ బాలలు, యువకుల్లో సమస్య తక్కువగా ఉంది. → జపాన్‌లో ఏకంగా 85%, దక్షిణ కొరియాలో 73% పిల్లలకు హ్రస్వదృష్టి ఉంది. → చైనా, రష్యాల్లో 40 % కంటే ఎక్కువగా, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో 15 శాతానికి పైగా పిల్లల్లో సమస్య ఉంది. → మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో 2050 నాటికి ఏకంగా 69 శాతం మంది హ్రస్వదృష్టి బారిన పడతారు. → అప్పటికి ప్రపంచ యువతలో కనీసం సగానికి సగం ఈ సమస్యను ఎదుర్కొంటారు. → వర్ధమాన దేశాల్లో 2050 నాటికి 40% మంది దీని బారిన పడే అవకాశముంది. → పిల్లలను రెండేళ్ల వయసులోనే బడిబాట పట్టించే సింగపూర్, హాంకాంగ్ వంటిచోట్ల సమస్య విస్తరిస్తోంది. → కోవిడ్ లాక్డౌన్ సమయంలో బాలల్లో హ్రస్వదృష్టి సమస్య బాగా పెరిగింది. → కోట్లాది మంది ఇళ్లకే పరిమితమై స్మార్ట్ ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడటం దీనికి ప్రధాన కారణం. అమ్మాయిల్లోనే ఎక్కువ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే హ్రస్వదృష్టి ఎక్కువగా కని్పస్తున్నట్టు అధ్యయనం తేలి్చంది. ‘‘అబ్బాయిలతో పోలిస్తే ఎదిగేక్రమంలో వాళ్లు ఇంట్లో గానీ, స్కూల్లో గానీ ఆటలపై, ఆరుబయట, గడిపే సమయం తక్కువ. వీటికితోడు ఆహారపు అలవాట్లు తదితరాల వల్ల చాలా చిన్నవయసులోనే రజస్వల అవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారిలో చాలావరకు టీనేజ్లోనే హ్రస్వదృష్టి బారిన పడుతున్నారు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శుక్లం శాపం, దృష్టి లోపం.. కారణాలు, లక్షణాలు, చికిత్స
కంటిశుక్లం అత్యంత విలువైన కంటి చూపును తగ్గించే తీవ్రమైన సమస్య. దీనిపై ప్రజలలో ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. ఇది నిదానంగా పెరిగే సమస్య కావడం వల్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. తద్వారా సమస్య తీవ్రత పెరిగేందుకు కారణమవుతున్నారు. ఈ నేపధ్యంలో కంటి శుక్లం– శస్త్రచికిత్స/క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం...పై అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చెందిన వైద్యులు, ప్రముఖ క్యాటరాక్ట్ సర్జన్ డా. అల్పా అతుల్ పూర్బియా అందిస్తున్న సమాచారం ఇది... కంటి శుక్లం..కారణాలు... కంటి లెన్స్ పుట్టుకతో స్పష్టంగా ఉంటుంది, ప్రధానంగా నీరు మరియు ప్రోటీన్లతో కూడి ఉంటుంది. ప్రోటీన్లు కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో, లెన్స్ తెల్లగా లేదా బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తుంది, ఇది స్పష్టమైన చూపును నిరోధిస్తుంది. దీనికి సాధారణంగా వయస్సు పెరగడం కాగా, అతినీలలోహిత కిరణం/సూర్య కాంతికి గురికావడం వంటివి కూడా కంటిశుక్లంను ప్రేరేపించడానికి కారణాలే. ఇక ఇతర కారణాలలో అతిగా ధూమపానం, దీర్ఘకాలిక మధుమేహం, దీర్ఘకాలిక స్టెరాయిడ్స్ వాడకం వంటివి కూడా ఉండవచ్చు. అలాగే ఆల్కహాల్ దుర్వినియోగం, ఊబకాయం, రేడియేషన్ థెరపీ మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కంటికి అయిన గాయాలు కూడా కంటిశుక్లం వృద్ధికి కారణం కావచ్చు. కొన్ని సార్లు పుట్టుకతో కూడా కంటిశుక్లం వచ్చే అవకాశం ఉంది. చాలా అరుదుగా పిల్లలలో అభివృద్ధి చెందే కంటిశుక్లంని డెవలప్మెంటల్ క్యాటరాక్ట్ అంటారు. గుర్తించాల్సిందే... కంటిశుక్లం నిదానంగా అభివృద్ధి చెందే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం కష్టమవుతుంది. దీనిని ముందుగా గుర్తించడానికి రాత్రిపూట దృష్టికి అంతరాయం, తక్కువ కాంతిలో చూడటం కష్టతరం అవడం వంటి లక్షణాలు ఉపకరిస్తాయి. కంటి శుక్లం ఉన్న రోగులు సాధారణంగా లైట్ చుట్టూ ఒక కాంతిని చూస్తారు. అలాగే కంటి శుక్లం ఉన్నప్పుడు ప్రకాశవంతమైన లైట్ల మెరుపు బాధాకరంగా ఉంటుంది, కంటిశుక్లం ఉన్న వ్యక్తులు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో సరిగ్గా చూడటం కష్టంగా ఉండవచ్చు లేదా రాత్రి సమయంలో కొన్నిసార్లు మరింత చెదిరిన దృష్టిని గమనించవచ్చు. వారికి ఇండోర్ లైట్లలో కూడా చూపు కష్టంగా ఉండవచ్చు. వీధి లైట్లు ఎదురుగా వచ్చే వాహనాల నుండి వచ్చే హెడ్లైట్ల వల్ల కలిగే కాంతి కారణంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ సమస్యగా మారవచ్చు చికిత్స...? కంటిశుక్లం బాగు చేసేందుకు మందులతో చేయగలిగిన వైద్య చికిత్స లేదు. మసకబారిన చూపును, దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స ద్వారా కంటిశుక్లం తొలగించడమే మార్గం. . కంటిశుక్లం లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లయితే, అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం కావచ్చు, కానీ కాలక్రమేణా కంటిశుక్లం మరింత తీవ్రమవుతుంది. తర్వాత తర్వాత సాధారణ రోజువారీ కార్యకలాపాలకు కూడా ఇది ఆటంకం కలిగిస్తే శస్త్రచికిత్స చేయక తప్పదు. కంటిశుక్లం తొలగింపు శస్త్రచికిత్స ప్రక్రియను ఇంట్రాకోక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్స్ తో ఫాకోఎమల్సిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో, కంటిశుక్లం వృద్ధి చెందిన అసలు లెన్స్, కృత్రిమ (ఇంట్రాకోక్యులర్ లెన్స్)తో భర్తీ చేయబడుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. ఈ శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజుల పాటు దురద, తేలికపాటి అసౌకర్యం కంటిలో నీరు కారడం వంటివి కనిపించవచ్చు. అయితే నేడు అందుబాటులో ఉన్న తాజా సాంకేతికతతో విజువల్ రికవరీ చాలా వేగంగా ఉంది. శస్త్రచికిత్స తర్వాత కోలుకునే కాలం ఒకరి నుండి మరొకరికి భిన్నంగా ఉండవచ్చు. కొంతమంది కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు, మరికొందరికి కోలుకోవడానికి వారాలు పడుతుంది. ఇతరత్రా సమస్యలు లేనట్లయితే వైద్యులు ఒక వారం విశ్రాంతిని సిఫార్సు చేస్తారు. సాధారణంగా అయితే కొన్ని గంటలలోపే, కంటిలో కాలుష్యం లేదా ధూళి కణాలు ప్రవేశించకుండా నిరోధించడానికి రోగిని రక్షించే గ్లాస్ లేదా కంటికి ఐ ప్యాడ్‌తో ఇంటికి తిరిగి పంపుతారు. ––డా. అల్పా అతుల్ పూర్బియా, క్యాటరాక్ట్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి, కొండాపూర్ -
కరోనాతో మందగిస్తున్న కంటి చూపు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌తో కొందరిలో కంటిచూపు మందగిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కంటి నరంలో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల కంటిచూపు తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒక్కసారిగా చూపు మసకబారడం, కంటి నాళాల్లో గడ్డల ద్వారా రెటీనాకు రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది. ప్రధానంగా కోవిడ్ బారినపడి స్టెరాయిడ్స్ వాడి రికవరీ అయినవారిలో ఈ పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు. కాబట్టి కోవిడ్ నుంచి కోలుకున్న వారు కంటి చూపునకు సంబంధించిన సమస్యలు వస్తే... వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. చదవండి: (అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు) కరోనా నేపథ్యంలో కంటి వైద్య నిపుణులు అత్యవసర కేసులను నేరుగా పరీక్షించాల్సిందేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కంటికి దెబ్బ తగలడం, కంట్లో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన కనురెప్పల గాయాలు, ఫోటోఫోబియా, ఫ్లోటర్లు, రెటినాల్ డిటాచ్మెంట్, రెటినాల్ టియర్, వైరల్ రెటినిటిస్ అత్యవసర వైద్యంగా గుర్తించాలని స్పష్టం చేసింది. అటువంటి కేసులను పరీక్షించాలని సూచించింది. కరోనా కాలంలో సురక్షిత పద్దతుల్లో నేత్రదానం చేయొచ్చని పేర్కొంది. కరోనా ఉంటే కంటి ఆపరేషన్లు చేయొద్దు... అన్ని కంటి ఆసుపత్రుల్లో రోగుల సందర్శనలను తగ్గించడానికి టెలి–కౌన్సెలింగ్, టెలికన్సల్టేషన్‌ను ప్రోత్సహించాలి. కంటిశుక్లం శస్త్రచికిత్స వంటి వాటి కోసం రోగులను ఆసుపత్రికి తీసుకురాకతప్పదు. రోగుల మొబైల్ నంబర్లు, గుర్తింపుకార్డులను, వారి వివరాల జాబితాను తీసుకోవాలి. భవిష్యత్తులో అవసరమైతే కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఈ జాబితా ఉపయోగపడుతుంది. రోగుల ప్రాథమిక పరీక్షల వివరాల ఫ్లోచార్ట్ ఉండాలి. తదనుగుణంగా వారిని పరీక్షించాలి. డిజిటల్ ప్రిస్క్రిప్షన్‌ను ప్రోత్సహించాలి. అత్యవసర కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక రోగితో ఒక అటెండర్‌ను మాత్రమే అనుమతించాలి. డాక్టర్ గదిలో సాధ్యమైనంతవరకు అన్ని సమయాల్లో కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. ►టోనోమెట్రీ, గోనియోస్కోపీ, కెరాటోమెట్రీ, ఎ–స్కాన్, బి–స్కాన్, యూబీఎం, ఓసీటీ, ఎఫ్‌ఎఫ్‌ఎ మొదలైన పరీక్షలు చేస్తున్నప్పుడు, ప్రతి కొత్త కేసుకు ముందు తరువాత పరికరాలను శుభ్రపరచాలి. ►కంట్లో వేసే చుక్కలను రోగికి తాకకుండా పైనుంచి వేయాలి. ►ఒకవేళ కోవిడ్ ఉన్న కంటి రోగిని పరీక్షించాలంటే, ప్రత్యేక గది లేదా ఐసోలేషన్ వార్డును ఉపయోగించాలి. కరోనా నేపథ్యంలో రోగి సమగ్ర ఆరోగ్య వివరాలను నమోదు చేసుకోవాలి. కోవిడ్ ఉంటే మాత్రం ఆపరేషన్ చేయకూడదు. అనారోగ్య వ్యక్తులను ఇతరులకు దూరంగా ఉంచాలి. ►నేత్ర వైద్యానికి సంబంధించిన పరీక్ష, ఇతర విధానాల్లో రోగికి దగ్గరగా ఉండాల్సి ఉంటుంది. నేత్ర వైద్య నిపుణులు, సాంకేతిక నిపుణులు, నర్సులు, సహాయక సిబ్బంది, రోగుల్లో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ►కంటైన్మెంట్ జోన్లలో కంటి ఆసుపత్రులు తెరవకూడదు. వాటి వెలుపల ఉన్న జోన్లలో మాత్రమే తెరవడానికి అనుమతిస్తారు. ►సాధ్యమైనంతవరకు కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. మాస్క్‌లు వాడటం తప్పనిసరి. చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. సాధ్యమైన చోట ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల వాడొచ్చు. కంటి సమస్యలు వస్తున్నాయి కోవిడ్‌తో కంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి. కంటి నరంలో వాపురావడం, ఆప్టిక్ నరం సమస్యలు వస్తున్నాయి. కంటి నరం మెదడుకు వెళుతుంది. దాంట్లో రక్తం సరఫరా తగ్గుతుంది. అప్పుడు సడన్‌గా కంటి చూపు తగ్గుతుంది. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ మందులు వాడడం వల్ల, ఆ తర్వాత రికవరీ అయ్యాక సమస్యలు వస్తున్నాయి. అత్యవసర కేసుల్లో మాత్రమే నేరుగా కంటి ఆసుపత్రిలో డాక్టర్‌ను కలవాలి. లేకుంటే టెలీకన్సల్టేషన్ మేలు. కంటి ఆపరేషన్‌కు ముందు అందరికీ కోవిడ్ స్క్రీనింగ్ తప్పనిసరికాదని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే రోగి తనకున్న జబ్బులు చెప్పాలి. – డాక్టర్ దీపశిల్పిక, ప్రముఖ కంటి వైద్య నిపుణులు, హైదరాబాద్ -
‘కంటి వెలుగు’...స్ఫూర్తి కనుమరుగు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు పథకం స్ఫూర్తిని కొందరు వైద్యులు దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు, చత్వారం ఉన్న వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలన్న సర్కారు ఆశయాన్ని కొందరు తుంగలో తొక్కుతున్నారు. కొన్నిచోట్ల చత్వారం ఉన్నప్పటికీ బాధితులకు కేవలం రీడింగ్ గ్లాసులు ఇచ్చి పంపుతున్నారు.ప్రిస్క్రిప్షన్‌లో మాత్రం చత్వారం గ్లాసులు రాస్తూ.. రీడింగ్ గ్లాసులు చేతికి ఇవ్వడం గమనార్హం. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఆ మధ్య నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో ఒక మహిళా ఉద్యోగి ప్రసన్నకు చత్వారం ఉందని నిర్దారించారు. ప్రిస్క్రిప్షన్పైనా చత్వారం కళ్లద్దాలు అని రాసి ఉన్నా ఆమెకు రీడింగ్ గ్లాసులు ఇచ్చి పంపడంపై విమర్శలు వచ్చాయి. అత్యంత కీలకమైన హైదరాబాద్ సచివాలయంలోనే ఇలా జరిగితే, ఇక సాధారణ గ్రామీణ ప్రాంతాల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉందంటున్నారు. 11.98 లక్షల మందికి చత్వారం... రాష్ట్రంలో కంటి వెలుగు పథకం ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న వారందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు, చత్వారం కళ్లద్దాలు, క్యాటరాక్ట్ వంటి లోపాలుంటే ఆపరేషన్లు చేయాలన్నది సర్కారు లక్ష్యం. పథకం ప్రారంభమైన నాటి నుంచి సోమవారం వరకు 85.83 లక్షల మందికి కంటి పరీక్షలు జరిపారు. అందులో 52.68 లక్షలు (61.38%) మందికి ఎలాంటి కంటి లోపాలు లేవని నిర్ధారించారు. మిగిలిన వారిలో 15.02 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు.మొత్తం 11.98 లక్షల మందికి చత్వారం ఉందని నిర్ధారించారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇస్తామన్నారు. ఇప్పటివరకు కేవలం 78 వేల మందికే చత్వారం కళ్లద్దాలు అందాయి. ఇంకా 11.19 లక్షల మందికి ఆ గ్లాసులను సరఫరా చేయనేలేదు. నెల రోజుల్లోగా అందజేయాలని అనుకున్నా కూడా సరఫరా చేయడంలేదు. సరఫరాలో అనేక లోపాలున్నందున చాలాచోట్ల వైద్యులు, కొందరు అధికారులు చత్వారం ఉన్నా కూడా సాధారణ రీడింగ్ గ్లాసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. మరోవైపు 12.29 లక్షల మంది ప్రజలకు వివిధ రకాల కంటి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. అక్కడక్కడ ఆపరేషన్లు వికటించడంతో, ఎన్నికల సమయంలో ఆపరేషన్లు చేయకూడదని నిర్ణయించారు.ఇలా ఆపరేషన్లకు బ్రేక్ పడింది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. -
కడుపునొప్పితో వెళ్తే.. కంటిచూపు పోగొట్టారు
వేములవాడ : తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. వచ్చీరాని వైద్యంతో ఓ వ్యక్తి కంటిచూపు పోగొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన నేరెళ్ల సాయిలుకు భార్య జలజ, కూతుళ్లు అక్షయ, అర్షిత ఉన్నారు. ఏప్రిల్ 21న జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ వైద్యంకోసం వేములవాడలోని డాక్టర్ మనోహర్ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు రక్తకణాలు తగ్గాయని అడ్మిట్ చేసుకున్నారు. ఐదురోజులు వైద్యం చేసి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన సాయిలుకు కంటిచూపు పోయింది. వెంటనే అదే ఆస్పత్రిలోని డాక్టర్ దిలీప్‌ను సంప్రదించారు. ఆయన సూచనతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సంప్రదించాడు. వైద్యం తీసుకున్నా.. కుడి కన్ను చూపు పోయింది. నోటికి తిమ్మిర్లు వచ్చాయి. నాలుక రుచి గుర్తించడంలేదు. ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపించిన సాయిలు సోమవారం మనోహర్ ఆస్పత్రికి చేరుకున్నాడు. తనకు మెరుగైన వైద్యం చేయించి ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. తనకు న్యాయం చేసేవరకు ఇక్కడే ఉంటానని కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి ఎదుట బైఠాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రివద్దకు చేరుకుని బందోబస్తు చేపట్టారు. కాగా బాధితుడి బంధువులు, కుటుంబసభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు వైద్యులతో సంప్రదింపులు జరిపారు. వైద్యం చేయడంలో తమ తప్పిదమేమీ లేదని వైద్యులు చెప్పారని ఎంపీపీ వెంకటేశ్‌గౌడ్ తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ్నుంచి బాధితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డాక్టర్ మనోహర్, డాక్టర్ దిలీప్‌పై ఫిర్యాదుచేశారు. ఈమేరకు ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేశారు. నేరెళ్ల సాయిలును వైద్యపరీక్షల కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు టౌన్ సీఐ వెంకటస్వామి తెలిపారు. ఈవిషయంపై డాక్టర్ మనోహర్‌ను వివరణ కోరగా, సాయిలుకు ప్లేట్లేట్స్ సంఖ్య 8 వేలకు పడిపోయిందని, ఆ తర్వాతే ఆస్పత్రికి వచ్చాడన్నారు. ప్లేట్లెట్స్ పెంపుకోసం వైద్యం చేశామే తప్ప కంటిచూపునకు సంబంధించి వైద్యం తాము చేయలేదని వివరించారు. -
స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..
బీజింగ్: స్మార్ట్ఫోన్లు వచ్చాక ప్రపంచం సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్‌లో మునిగిపోయింది. మనుషులు వాటికి బానిసలుగా మారిపోతున్నారు. ఎంతలా అంటే రోజువారి జీవితంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా గడపలేనంతగా మారిపోయారు. అలా ఓయువతి స్మార్ట్‌ఫోన్‌లో బానిసగా మారి ఫోన్లో ఒకరోజంతా ఆటలాడటం ద్వారా అంధురాలిగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన షుడోనిమవూ జియాజింగ్ అనే 21 ఏళ్ల యువతి ఓకంపెనీలో ఫైనాన్స డిపార్ట్మెంట్లో పనిస్తోంది. ఈనెల ఒకటో తేదీన 'కింగ్ గ్లోరీ' అనే గేమ్‌ను రోజు మొత్తం ఆడింది. దీంతో ఆమె కుడి కన్ను పాక్షికంగా పనిచేయడం మానేసింది. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుడికన్ను రెటినాల్ ఆర్టరి ఆక్యులోషన్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చూపు కోసం పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించినా ఉపయోగం లేకపోయింది. జియాజింగ్ ప్రతిరోజు 8గంటల పాటు గేమ్ ఆడేది. కనీసం తిండి తినడం, ఏదైనా తాగకుండా ఏకధాటిగా ఆడేది. ఆక్టోబర్ ఒకటిన మాత్రం ఒకరోజంతా ఆటతోనే గడిపింది. దీంతో తన చూపు కోల్పోవాల్సి వచ్చింది. ఈ గేమ్‌కు చైనాలో అత్యంత ప్రజాదరణ ఉంది. ఏకంగా 200 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. -
చూపు తగ్గుతోంది..!
న్యూఢిల్లీ: నగరంలో కంటిచూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్లలోపు ఉన్న వంద మంది చిన్నారులను పరిశీలిస్తే.. సుమారు ఎనిమిది మందికిపైగా పిల్లలు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కొందరిలో కంటిఅద్దాలు సమకూర్చినా చూపు బాగుపడని పరిస్థితి ఉంది. పిల్లల్లో చూపు తగ్గడానికి అనేక కారణాలున్నారుు. ప్రధానంగా కంటిచూపు తగ్గడానికి జన్యుపర సమస్య ఒకటైతే, విటమిన్-ఏ లోపం, తగినంత వెలుతురు లేని గదుల్లో విద్యాభ్యాసం చేయడం, అదేపనిగా వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ చూడటం వ ంటివి కూడా కారణమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కంటిచూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరునెలలకో సారి ఏ-విటమిన్ పిల్లలకు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. విటమిన్ ‘ఏ’ ద్రవం అందించే కార్యక్రమం పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోపణలున్నారుు. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కంటిచూపు సమస్యతో బాధపడుతునన వారిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది. వీరిలో నాలుగు శాతం పదేళ్ల వయసులోపు పిల్లలు ఉండగా ... 11 నుంచి 16 సంవత్సరాల లోపు వారు ఎక్కువ గా ఉంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ద్రాక్ష, బొప్పాయి, చిలగడ దుంపలు వంటి తినడంతో కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న ఏదైనా వ స్తువును తదేకంగా చూడాలి. తర్వాత దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా ఐదారుసార్లు చేయడంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూసి తెరుస్తుండడం మరిచిపోవద్దు. పిల్లలు, పెద్దలు ఎలాంటి సమస్యలేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చిన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేందుకు పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాలి. చూపు తగ్గడానికి కారణాలు ఇవీ.. * పిల్లలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు, అసవరం అయినంతమేరకు తీసుకోకపోవడంతో ఏ-విటమిన్, కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపుతోపాటు ఇతర ఆరోగ్యసమస్యలూ వస్తాయి. * వెలుతురు, గాలి లేని ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేయడం. * గతంలో బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్‌తో అక్షరాలు రాసేవారు. ఈ అక్షరాలు కళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్దగా కూడా కనిపించేవి. తరగతి గదిలో చివరివరుసలో కూర్చున్నా..అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్‌బోర్డుపై మార్కర్‌తో చిన్న అక్షరాలు రాస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడిపడి నరాలపై ప్రభావం చూపి చూపు తగ్గుతోంది. * పస్తుతం పుస్తకాల్లో అక్షరాలు కూడా మరీ చిన్నవిగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది. * టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతోంది.