ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌తో కొందరిలో కంటిచూపు మందగిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కంటి నరంలో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల కంటిచూపు తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒక్కసారిగా చూపు మసకబారడం, కంటి నాళాల్లో గడ్డల ద్వారా రెటీనాకు రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది. ప్రధానంగా కోవిడ్ బారినపడి స్టెరాయిడ్స్ వాడి రికవరీ అయినవారిలో ఈ పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు. కాబట్టి కోవిడ్ నుంచి కోలుకున్న వారు కంటి చూపునకు సంబంధించిన సమస్యలు వస్తే... వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. చదవండి: (అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు)
కరోనా నేపథ్యంలో కంటి వైద్య నిపుణులు అత్యవసర కేసులను నేరుగా పరీక్షించాల్సిందేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కంటికి దెబ్బ తగలడం, కంట్లో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన కనురెప్పల గాయాలు, ఫోటోఫోబియా, ఫ్లోటర్లు, రెటినాల్ డిటాచ్మెంట్, రెటినాల్ టియర్, వైరల్ రెటినిటిస్ అత్యవసర వైద్యంగా గుర్తించాలని స్పష్టం చేసింది. అటువంటి కేసులను పరీక్షించాలని సూచించింది. కరోనా కాలంలో సురక్షిత పద్దతుల్లో నేత్రదానం చేయొచ్చని పేర్కొంది.
కరోనా ఉంటే కంటి ఆపరేషన్లు చేయొద్దు...
అన్ని కంటి ఆసుపత్రుల్లో రోగుల సందర్శనలను తగ్గించడానికి టెలి–కౌన్సెలింగ్, టెలికన్సల్టేషన్‌ను ప్రోత్సహించాలి. కంటిశుక్లం శస్త్రచికిత్స వంటి వాటి కోసం రోగులను ఆసుపత్రికి తీసుకురాకతప్పదు. రోగుల మొబైల్ నంబర్లు, గుర్తింపుకార్డులను, వారి వివరాల జాబితాను తీసుకోవాలి. భవిష్యత్తులో అవసరమైతే కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఈ జాబితా ఉపయోగపడుతుంది. రోగుల ప్రాథమిక పరీక్షల వివరాల ఫ్లోచార్ట్ ఉండాలి. తదనుగుణంగా వారిని పరీక్షించాలి. డిజిటల్ ప్రిస్క్రిప్షన్‌ను ప్రోత్సహించాలి. అత్యవసర కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక రోగితో ఒక అటెండర్‌ను మాత్రమే అనుమతించాలి. డాక్టర్ గదిలో సాధ్యమైనంతవరకు అన్ని సమయాల్లో కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి.
►టోనోమెట్రీ, గోనియోస్కోపీ, కెరాటోమెట్రీ, ఎ–స్కాన్, బి–స్కాన్, యూబీఎం, ఓసీటీ, ఎఫ్‌ఎఫ్‌ఎ మొదలైన పరీక్షలు చేస్తున్నప్పుడు, ప్రతి కొత్త కేసుకు ముందు తరువాత పరికరాలను శుభ్రపరచాలి.
►కంట్లో వేసే చుక్కలను రోగికి తాకకుండా పైనుంచి వేయాలి.
►ఒకవేళ కోవిడ్ ఉన్న కంటి రోగిని పరీక్షించాలంటే, ప్రత్యేక గది లేదా ఐసోలేషన్ వార్డును ఉపయోగించాలి. కరోనా నేపథ్యంలో రోగి సమగ్ర ఆరోగ్య వివరాలను నమోదు చేసుకోవాలి. కోవిడ్ ఉంటే మాత్రం ఆపరేషన్ చేయకూడదు. అనారోగ్య వ్యక్తులను ఇతరులకు దూరంగా ఉంచాలి.
►నేత్ర వైద్యానికి సంబంధించిన పరీక్ష, ఇతర విధానాల్లో రోగికి దగ్గరగా ఉండాల్సి ఉంటుంది. నేత్ర వైద్య నిపుణులు, సాంకేతిక నిపుణులు, నర్సులు, సహాయక సిబ్బంది, రోగుల్లో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
►కంటైన్మెంట్ జోన్లలో కంటి ఆసుపత్రులు తెరవకూడదు. వాటి వెలుపల ఉన్న జోన్లలో మాత్రమే తెరవడానికి అనుమతిస్తారు.
►సాధ్యమైనంతవరకు కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. మాస్క్‌లు వాడటం తప్పనిసరి. చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. సాధ్యమైన చోట ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల వాడొచ్చు.
కంటి సమస్యలు వస్తున్నాయి
కోవిడ్‌తో కంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి. కంటి నరంలో వాపురావడం, ఆప్టిక్ నరం సమస్యలు వస్తున్నాయి. కంటి నరం మెదడుకు వెళుతుంది. దాంట్లో రక్తం సరఫరా తగ్గుతుంది. అప్పుడు సడన్‌గా కంటి చూపు తగ్గుతుంది. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ మందులు వాడడం వల్ల, ఆ తర్వాత రికవరీ అయ్యాక సమస్యలు వస్తున్నాయి. అత్యవసర కేసుల్లో మాత్రమే నేరుగా కంటి ఆసుపత్రిలో డాక్టర్‌ను కలవాలి. లేకుంటే టెలీకన్సల్టేషన్ మేలు. కంటి ఆపరేషన్‌కు ముందు అందరికీ కోవిడ్ స్క్రీనింగ్ తప్పనిసరికాదని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే రోగి తనకున్న జబ్బులు చెప్పాలి. – డాక్టర్ దీపశిల్పిక, ప్రముఖ కంటి వైద్య నిపుణులు, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment