ఆస్పత్రి ఎదుట బైఠాయించిన బాధితుడు నేరెళ్ల సాయిలు, కుటుంబసభ్యులు
వేములవాడ : తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. వచ్చీరాని వైద్యంతో ఓ వ్యక్తి కంటిచూపు పోగొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన నేరెళ్ల సాయిలుకు భార్య జలజ, కూతుళ్లు అక్షయ, అర్షిత ఉన్నారు. ఏప్రిల్ 21న జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ వైద్యంకోసం వేములవాడలోని డాక్టర్ మనోహర్ ఆస్పత్రిలో చేరాడు.
పరీక్షించిన వైద్యులు రక్తకణాలు తగ్గాయని అడ్మిట్ చేసుకున్నారు. ఐదురోజులు వైద్యం చేసి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన సాయిలుకు కంటిచూపు పోయింది. వెంటనే అదే ఆస్పత్రిలోని డాక్టర్ దిలీప్‌ను సంప్రదించారు. ఆయన సూచనతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సంప్రదించాడు. వైద్యం తీసుకున్నా.. కుడి కన్ను చూపు పోయింది. నోటికి తిమ్మిర్లు వచ్చాయి. నాలుక రుచి గుర్తించడంలేదు.
ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపించిన సాయిలు సోమవారం మనోహర్ ఆస్పత్రికి చేరుకున్నాడు. తనకు మెరుగైన వైద్యం చేయించి ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. తనకు న్యాయం చేసేవరకు ఇక్కడే ఉంటానని కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి ఎదుట బైఠాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రివద్దకు చేరుకుని బందోబస్తు చేపట్టారు. కాగా బాధితుడి బంధువులు, కుటుంబసభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు వైద్యులతో సంప్రదింపులు జరిపారు. వైద్యం చేయడంలో తమ తప్పిదమేమీ లేదని వైద్యులు చెప్పారని ఎంపీపీ వెంకటేశ్‌గౌడ్ తెలిపారు.
బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ్నుంచి బాధితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డాక్టర్ మనోహర్, డాక్టర్ దిలీప్‌పై ఫిర్యాదుచేశారు. ఈమేరకు ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేశారు. నేరెళ్ల సాయిలును వైద్యపరీక్షల కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు టౌన్ సీఐ వెంకటస్వామి తెలిపారు.
ఈవిషయంపై డాక్టర్ మనోహర్‌ను వివరణ కోరగా, సాయిలుకు ప్లేట్‌లేట్స్ సంఖ్య 8 వేలకు పడిపోయిందని, ఆ తర్వాతే ఆస్పత్రికి వచ్చాడన్నారు. ప్లేట్‌లెట్స్ పెంపుకోసం వైద్యం చేశామే తప్ప కంటిచూపునకు సంబంధించి వైద్యం తాము చేయలేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment