
వీరభద్రుడికి వీరశైవుల ఆహ్వానం
శివకల్యాణోత్సవం సందర్భంగా వేడుక
కష్టాల నుంచి గట్టెక్కిస్తే శివుడిని వివాహమాడే ఆనవాయితీ
వేములవాడ: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో శివకల్యాణోత్సవాలకు ప్రత్యేకత ఉంది. అన్ని ఆలయాల్లో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్ల వివాహ వేడుకను తిలకించి పులకించిపోతారు. కానీ వేములవాడలో శివకల్యాణం సందర్భంగా అత్యధిక మంది శివుడిని పెళ్లాడటం ఆనవాయితీ. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తే స్వామినే పెళ్లాడుతామని మొక్కుకుంటారు.
ఆ నమ్మకంతో కష్టాలు తొలగిపోయిన వారు ఏటా శివకల్యాణోత్సవం సందర్భంగా త్రిశూలం పట్టుకొని స్వామిని వివాహమాడుతుంటారు. శివకల్యాణోత్సవాల్లో ఆకట్టుకునే మరో ప్రత్యేకత వీరశైవులు (జంగమయ్యలు) వీరభద్రుడికి ఆహ్వానం పలికే వేడుక. వీరభద్రుడికి వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఇక్కడి జంగమయ్యలు పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీరశైవ అర్చకులు దండకాలు (ఖడ్గాలు) వేస్తూ స్వామిని ఆహ్వానిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో పట్టణానికి చెందిన 28 కుటుంబాలు పాల్గొంటాయి.
స్మార్థ వైదిక పద్ధతిని అనుసరించి..
రాష్ట్రంలోని మిగతా శైవక్షేత్రాలలో ‘కారణాగమము’అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవాలు చేస్తుంటారు. కానీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం ‘స్మార్థ వైదిక’పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీరాజరాజేశ్వరుల వివాహం జరిపిస్తుంటారు.
ఈశ్వరుడు తపస్సులో ఉండగా, మన్మథుడు తన బాణాన్ని సంధించి తపస్సును భగ్నం చేశాడని, దీంతో ఈశ్వరునికి కోపమొచ్చి మన్మథున్ని త్రినేత్రంతో దహనం చేశాడని, అందుకోసమే కామదహనం తర్వాత మరుసటి రోజున ఈశ్వరుడు పార్వతిని కల్యాణం చేసుకుంటాడని అర్చకులు చెబుతున్నారు.
ఇల్లు సల్లంగుండాలని..
ఏటా రాజన్నను పెళ్లాడే శివపార్వతులు ముందుగా ఇల్లు సల్లంగుండాలని రుద్రాక్ష పూజ చేసుకుంటారు. తమ ఆరోగ్యాలు బాగుండాలని, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని, కుటుంబ సమస్యలు తీరాలని, మానసిక పరిస్థితులు మెరుగుపడాలని ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న వారంతా వయో, లింగభేదం లేకుండా ఇక్కడి వీరశైవులతో రుద్రాక్షపూజ నిర్వహించుకుంటారు.
అనంతరం రాజన్న కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఇక్కడి వీరశైవులు వీరికి ప్రత్యేక పూజలు చేసి రుద్రాక్షధారణ నిర్వహిస్తారు. అనంతరం వారంతా రాజన్న సేవలో తపించడంతోపాటు తమతమ కుటుంబ వ్యవహారాల్లోనూ కొనసాగుతుంటుంటారు. రాజన్నకు ఉచిత ప్రచార కర్తలుగా పని చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment