కంటిశుక్లం అత్యంత విలువైన కంటి చూపును తగ్గించే తీవ్రమైన సమస్య. దీనిపై ప్రజలలో ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. ఇది నిదానంగా పెరిగే సమస్య కావడం వల్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. తద్వారా సమస్య తీవ్రత పెరిగేందుకు కారణమవుతున్నారు. ఈ నేపధ్యంలో కంటి శుక్లం– శస్త్రచికిత్స/క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం...పై అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చెందిన వైద్యులు, ప్రముఖ క్యాటరాక్ట్ సర్జన్ డా. అల్పా అతుల్ పూర్బియా అందిస్తున్న సమాచారం ఇది...
కంటి శుక్లం..కారణాలు...
కంటి లెన్స్ పుట్టుకతో స్పష్టంగా ఉంటుంది, ప్రధానంగా నీరు మరియు ప్రోటీన్లతో కూడి ఉంటుంది. ప్రోటీన్లు కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో, లెన్స్ తెల్లగా లేదా బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తుంది, ఇది స్పష్టమైన చూపును నిరోధిస్తుంది. దీనికి సాధారణంగా వయస్సు పెరగడం కాగా, అతినీలలోహిత కిరణం/సూర్య కాంతికి గురికావడం వంటివి కూడా కంటిశుక్లంను ప్రేరేపించడానికి కారణాలే. ఇక ఇతర కారణాలలో అతిగా ధూమపానం, దీర్ఘకాలిక మధుమేహం, దీర్ఘకాలిక స్టెరాయిడ్స్ వాడకం వంటివి కూడా ఉండవచ్చు. అలాగే ఆల్కహాల్ దుర్వినియోగం, ఊబకాయం, రేడియేషన్ థెరపీ మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కంటికి అయిన గాయాలు కూడా కంటిశుక్లం వృద్ధికి కారణం కావచ్చు. కొన్ని సార్లు పుట్టుకతో కూడా కంటిశుక్లం వచ్చే అవకాశం ఉంది. చాలా అరుదుగా పిల్లలలో అభివృద్ధి చెందే కంటిశుక్లంని డెవలప్‌మెంటల్ క్యాటరాక్ట్ అంటారు.
గుర్తించాల్సిందే...
కంటిశుక్లం నిదానంగా అభివృద్ధి చెందే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం కష్టమవుతుంది. దీనిని ముందుగా గుర్తించడానికి రాత్రిపూట దృష్టికి అంతరాయం, తక్కువ కాంతిలో చూడటం కష్టతరం అవడం వంటి లక్షణాలు ఉపకరిస్తాయి. కంటి శుక్లం ఉన్న రోగులు సాధారణంగా లైట్ చుట్టూ ఒక కాంతిని చూస్తారు. అలాగే కంటి శుక్లం ఉన్నప్పుడు ప్రకాశవంతమైన లైట్ల మెరుపు బాధాకరంగా ఉంటుంది, కంటిశుక్లం ఉన్న వ్యక్తులు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో సరిగ్గా చూడటం కష్టంగా ఉండవచ్చు లేదా రాత్రి సమయంలో కొన్నిసార్లు మరింత చెదిరిన దృష్టిని గమనించవచ్చు. వారికి ఇండోర్ లైట్లలో కూడా చూపు కష్టంగా ఉండవచ్చు. వీధి లైట్లు ఎదురుగా వచ్చే వాహనాల నుండి వచ్చే హెడ్‌లైట్ల వల్ల కలిగే కాంతి కారణంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ సమస్యగా మారవచ్చు
చికిత్స...?
కంటిశుక్లం బాగు చేసేందుకు మందులతో చేయగలిగిన వైద్య చికిత్స లేదు. మసకబారిన చూపును, దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స ద్వారా కంటిశుక్లం తొలగించడమే మార్గం. . కంటిశుక్లం లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లయితే, అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం కావచ్చు, కానీ కాలక్రమేణా కంటిశుక్లం మరింత తీవ్రమవుతుంది. తర్వాత తర్వాత సాధారణ రోజువారీ కార్యకలాపాలకు కూడా ఇది ఆటంకం కలిగిస్తే శస్త్రచికిత్స చేయక తప్పదు.
కంటిశుక్లం తొలగింపు శస్త్రచికిత్స ప్రక్రియను ఇంట్రాకోక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్స్ తో ఫాకోఎమల్సిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో, కంటిశుక్లం వృద్ధి చెందిన అసలు లెన్స్, కృత్రిమ (ఇంట్రాకోక్యులర్ లెన్స్)తో భర్తీ చేయబడుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. ఈ శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజుల పాటు దురద, తేలికపాటి అసౌకర్యం కంటిలో నీరు కారడం వంటివి కనిపించవచ్చు.
అయితే నేడు అందుబాటులో ఉన్న తాజా సాంకేతికతతో విజువల్ రికవరీ చాలా వేగంగా ఉంది. శస్త్రచికిత్స తర్వాత కోలుకునే కాలం ఒకరి నుండి మరొకరికి భిన్నంగా ఉండవచ్చు. కొంతమంది కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు, మరికొందరికి కోలుకోవడానికి వారాలు పడుతుంది. ఇతరత్రా సమస్యలు లేనట్లయితే వైద్యులు ఒక వారం విశ్రాంతిని సిఫార్సు చేస్తారు. సాధారణంగా అయితే కొన్ని గంటలలోపే, కంటిలో కాలుష్యం లేదా ధూళి కణాలు ప్రవేశించకుండా నిరోధించడానికి రోగిని రక్షించే గ్లాస్ లేదా కంటికి ఐ ప్యాడ్‌తో ఇంటికి తిరిగి పంపుతారు.
––డా. అల్పా అతుల్ పూర్బియా, క్యాటరాక్ట్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి, కొండాపూర్
Comments
Please login to add a commentAdd a comment