సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు పథకం స్ఫూర్తిని కొందరు వైద్యులు దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు, చత్వారం ఉన్న వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలన్న సర్కారు ఆశయాన్ని కొందరు తుంగలో తొక్కుతున్నారు. కొన్నిచోట్ల చత్వారం ఉన్నప్పటికీ బాధితులకు కేవలం రీడింగ్ గ్లాసులు ఇచ్చి పంపుతున్నారు.ప్రిస్క్రిప్షన్‌లో మాత్రం చత్వారం గ్లాసులు రాస్తూ.. రీడింగ్ గ్లాసులు చేతికి ఇవ్వడం గమనార్హం. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఆ మధ్య నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో ఒక మహిళా ఉద్యోగి ప్రసన్నకు చత్వారం ఉందని నిర్దారించారు. ప్రిస్క్రిప్షన్‌పైనా చత్వారం కళ్లద్దాలు అని రాసి ఉన్నా ఆమెకు రీడింగ్ గ్లాసులు ఇచ్చి పంపడంపై విమర్శలు వచ్చాయి. అత్యంత కీలకమైన హైదరాబాద్ సచివాలయంలోనే ఇలా జరిగితే, ఇక సాధారణ గ్రామీణ ప్రాంతాల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉందంటున్నారు.
11.98 లక్షల మందికి చత్వారం...
రాష్ట్రంలో కంటి వెలుగు పథకం ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న వారందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు, చత్వారం కళ్లద్దాలు, క్యాటరాక్ట్ వంటి లోపాలుంటే ఆపరేషన్లు చేయాలన్నది సర్కారు లక్ష్యం. పథకం ప్రారంభమైన నాటి నుంచి సోమవారం వరకు 85.83 లక్షల మందికి కంటి పరీక్షలు జరిపారు. అందులో 52.68 లక్షలు (61.38%) మందికి ఎలాంటి కంటి లోపాలు లేవని నిర్ధారించారు. మిగిలిన వారిలో 15.02 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు.మొత్తం 11.98 లక్షల మందికి చత్వారం ఉందని నిర్ధారించారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇస్తామన్నారు.
ఇప్పటివరకు కేవలం 78 వేల మందికే చత్వారం కళ్లద్దాలు అందాయి. ఇంకా 11.19 లక్షల మందికి ఆ గ్లాసులను సరఫరా చేయనేలేదు. నెల రోజుల్లోగా అందజేయాలని అనుకున్నా కూడా సరఫరా చేయడంలేదు. సరఫరాలో అనేక లోపాలున్నందున చాలాచోట్ల వైద్యులు, కొందరు అధికారులు చత్వారం ఉన్నా కూడా సాధారణ రీడింగ్ గ్లాసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. మరోవైపు 12.29 లక్షల మంది ప్రజలకు వివిధ రకాల కంటి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. అక్కడక్కడ ఆపరేషన్లు వికటించడంతో, ఎన్నికల సమయంలో ఆపరేషన్లు చేయకూడదని నిర్ణయించారు.ఇలా ఆపరేషన్లకు బ్రేక్ పడింది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment