సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవ్వాతాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వారికి క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా వారున్న చోటుకే పింఛను డబ్బు పంపిస్తున్నారు. మరో పక్క వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా మలి వయసులో చూపు మసకబారిన అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు నింపుతున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదే సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి రావడంతో ఆ సమయంలో కొంత అవరోధం కలిగింది. కోవిడ్ ప్రభావం తగ్గగానే మళ్లీ ప్రారంభించారు. రాష్ట్రంలోని 60 సంవత్సరాలు దాటిన అవ్వా తాతలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు ఉచితంగా ఇస్తున్నారు. అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు.
56,88,424 మంది అవ్వా తాతలకు కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 31,77,994 మందికి పరీక్షలు చేశారు. 11,46,659 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు 8,81,659 మంది అవ్వా తాతలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. మిగతా వారికి కూడా కళ్లద్దాలను ఆర్డర్ ఇచ్చారు. 1,86,628 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని గుర్తించగా ఇప్పటి వరకు 53,416 మందికి ఉచితంగా ఈ సర్జరీలు చేసి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చారు.
త్వరగా సర్జరీలు చేయండి సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి
వైఎస్సార్ కంటి వెలుగు కింద అవ్వా తాతలకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ కార్యక్రమంపై వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో కలిసి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కంటి పరీక్షల బృందం గ్రామాల పర్యటన షెడ్యూల్‌ను ముందుగానే విలేజ్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఆస్పత్రులతో సమన్వయం చేసుకొని క్యాటరాక్ట్ సర్జరీలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. వైఎస్సార్ జిల్లా అధికారులు పక్షం రోజుల్లోనే 3,650 శస్త్రచికిత్సలు చేయించారని చెప్పారు. మిగతా జిల్లాలు కూడా ఆపరేషన్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. శస్త్ర చికిత్సలకు జిల్లాకు లక్ష రూపాయల చొప్పున మొబిలైజేషన్ నిధులను విడుదల చేశామన్నారు. వైఎస్పార్ కంటి వెలుగు కార్యక్రమం పురోగతిని పక్షం రోజులకోసారి పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
కంటి వెలుగుతో చూపు
మాది పేద కుటుంబం. భర్త చనిపోయాడు. ఎవరూ లేరు. జగనన్న ఇస్తున్న పింఛను మీద జీవిస్తున్నాను. ఒక రోజు కంటిలో మసక వచ్చింది. వస్తువులు కనపడడంలేదు. మా ప్రాంతంలోని ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ రత్నంను సంప్రదించగా, కంటికి క్యాటరాక్ట్ సమస్య ఉందని చెప్పారు. దాని కి ఖర్చు భరించలేనని చెప్పడంతో వెంటనే కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా చేస్తామన్నారు.
మార్చి 29న ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కన్ను బాగా కనిపిస్తోంది. నా పని నేను చేసుకుంటున్నాను. జగనన్న ఇస్తున్న పింఛన్ డబ్బులు, కంటి వెలుగు పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకొని సంతోషంగా జీవిస్తున్నాను.
–డి. లక్ష్మీ నారాయణమ్మ, 65 సంవత్సరాలు, మధురవాడ,బాపూజీ నగర్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment