Kanti Velugu
-
నేత్ర దరహాసం... వికారాబాద్ జిల్లాలో ‘కంటి వెలుగు’ సంపూర్ణం
వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం పూర్తయ్యింది. వంద పని దినాల్లో ప్రోగ్రామ్‌ను పూర్తిచేయాల్సి ఉండగా.. గడువులోపే ముగించి సర్కారు సంకల్పాన్ని విజయవవంతం చేశారు. ఇందుకోసం వైద్య సిబ్బంది, అధికారులు ఎంతగానో శ్రమించారు. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే కంటివెలుగు శిబిరాలు కొనసాగించారు. ఇదిలా ఉండగా అద్దాలు పంపిణీ చేసే విషయంలో మిగితా జిల్లాలతో పోలిస్తే వికారాబాద్ ముందు వరుసలో నిలిచింది. కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఇతర అధికారుల నిరంతర పర్యవేక్షణతో పరీక్షలు, చికిత్సలు, అద్దాల పంపిణీ పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ వ్యక్తికి నేత్ర పరీక్షలు చేయాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం జిల్లాలో త్వరగా పూర్తి కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పరీక్షలు.. అవగాహన జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు, 97 వార్డులు ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాల్లో సుమారు 9.27 లక్షల జనాభా ఉంది. వీరందరికీ నేత్ర పరీక్షలు చేసేందుకు 42 వైద్య బృందాలను నియమించారు. ఓ పక్క కంటి వెలుగు స్క్రీనింగ్ చేస్తూనే.. మరోపక్క నేత్ర సమస్యల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో స్క్రీనింగ్ కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నవారిలో 25శాతం (1,24,364) మంది ఏదో ఒక కంటి సమస్యతో బాధ పడుతున్నట్లు తేలింది. ఇందులో కొందరికి రీడింగ్ గ్లాసెస్ అవసరమవగా మరికొందరికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించిన వైద్యులు వీటిని పంపిణీ చేశారు. మనమే నంబర్ వన్ జిల్లాలో జనవరి 19న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో నిత్యం 42 బృందాలతో శిబిరాలు నిర్వహించారు. ఒక్కో క్యాంపులో నిత్యం 150 నుంచి 170 మందికి కళ్ల స్క్రీనింగ్ చేశారు. ప్రతీ శిబిరంలో వైద్యాధికారితో పాటు నేత్రవైద్యుడు, సిబ్బంది కలిపి ఎనిమిది మంది పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 9.27 లక్షల జనాభా ఉండగా.. ఇందులో 18 ఏళ్లు పైబడిన 4,83,794 మందికి నేత్ర పరీక్షలు పూర్తిచేశారు. వీరిలో 64,798 మందికి రీడింగ్ గ్లాసెస్ అవసరమని తేల్చి ఆరుగురు మినహా 64,792 మందికి అద్దాలు అందజేశారు. 59,566 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని నిర్ధారించి.. ఇప్పటివరకు 50,235 మందికి అద్దాలు అందజేశారు. మిగిలిన వారికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను పంపిణీ చేయడంలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సమష్టి కృషితోనే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేశాం. పరీక్షలు నిర్వహించిన వారిలో తొంభైశాతం మందికి పైగా అద్దాలు పంపిణీ చేశాం. మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తాం. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైంది. – పల్వాన్‌కుమార్, డీఎంహెచ్ఓ -
లక్షలాది అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవ్వాతాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వారికి క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా వారున్న చోటుకే పింఛను డబ్బు పంపిస్తున్నారు. మరో పక్క వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా మలి వయసులో చూపు మసకబారిన అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదే సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి రావడంతో ఆ సమయంలో కొంత అవరోధం కలిగింది. కోవిడ్ ప్రభావం తగ్గగానే మళ్లీ ప్రారంభించారు. రాష్ట్రంలోని 60 సంవత్సరాలు దాటిన అవ్వా తాతలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు ఉచితంగా ఇస్తున్నారు. అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. 56,88,424 మంది అవ్వా తాతలకు కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 31,77,994 మందికి పరీక్షలు చేశారు. 11,46,659 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు 8,81,659 మంది అవ్వా తాతలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. మిగతా వారికి కూడా కళ్లద్దాలను ఆర్డర్ ఇచ్చారు. 1,86,628 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని గుర్తించగా ఇప్పటి వరకు 53,416 మందికి ఉచితంగా ఈ సర్జరీలు చేసి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చారు. త్వరగా సర్జరీలు చేయండి సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి వైఎస్సార్ కంటి వెలుగు కింద అవ్వా తాతలకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ కార్యక్రమంపై వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కలిసి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కంటి పరీక్షల బృందం గ్రామాల పర్యటన షెడ్యూల్‌ను ముందుగానే విలేజ్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఆస్పత్రులతో సమన్వయం చేసుకొని క్యాటరాక్ట్ సర్జరీలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. వైఎస్సార్ జిల్లా అధికారులు పక్షం రోజుల్లోనే 3,650 శస్త్రచికిత్సలు చేయించారని చెప్పారు. మిగతా జిల్లాలు కూడా ఆపరేషన్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. శస్త్ర చికిత్సలకు జిల్లాకు లక్ష రూపాయల చొప్పున మొబిలైజేషన్ నిధులను విడుదల చేశామన్నారు. వైఎస్పార్ కంటి వెలుగు కార్యక్రమం పురోగతిని పక్షం రోజులకోసారి పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. కంటి వెలుగుతో చూపు మాది పేద కుటుంబం. భర్త చనిపోయాడు. ఎవరూ లేరు. జగనన్న ఇస్తున్న పింఛను మీద జీవిస్తున్నాను. ఒక రోజు కంటిలో మసక వచ్చింది. వస్తువులు కనపడడంలేదు. మా ప్రాంతంలోని ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ రత్నంను సంప్రదించగా, కంటికి క్యాటరాక్ట్ సమస్య ఉందని చెప్పారు. దాని కి ఖర్చు భరించలేనని చెప్పడంతో వెంటనే కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా చేస్తామన్నారు. మార్చి 29న ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కన్ను బాగా కనిపిస్తోంది. నా పని నేను చేసుకుంటున్నాను. జగనన్న ఇస్తున్న పింఛన్ డబ్బులు, కంటి వెలుగు పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకొని సంతోషంగా జీవిస్తున్నాను. –డి. లక్ష్మీ నారాయణమ్మ, 65 సంవత్సరాలు, మధురవాడ,బాపూజీ నగర్, విశాఖపట్నం -
అన్నిఅక్రమాలే డాక్టర్ సెల్ఫీ వీడియో
-
ప్రజలకు ఆనందబాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీటిబాష్పాలు
సాక్షి, సిద్దిపేట: కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలకు ఆనంద బాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీటి బాష్పాలు వస్తున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటిదాకా 50 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. 25 పని దినాల్లో 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేశామన్నారు. గతంలో 827 బృందాలు పనిచేస్తే, ఈసారి 1500కు పెంచామని హరీశ్‌రావు తెలిపారు. 50 లక్షల మందికి పరీక్షలు చేస్తే 16 లక్షల మందికి దృష్టి లోపం ఉన్నట్టు తేలిందన్నారు. ఇప్పటివరకు 1,68,062 మందికి కంటి పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందని కొనియాడారు. దక్షిణ భారత దేశ ధాన్యాగారంగా తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని హరీశ్‌రావు చెప్పారు. దేశంలో వ్యవసాయం వృద్ధి రేటు 4% శాతం ఉంటే, రాష్ట్రంలో 7.8% శాతం ఉందన్నారు. -
ఖాళీగా కళ్లద్దాల పెట్టెలు.. అవాక్కయిన కంటి రోగులు
కామారెడ్డి టౌన్: కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్ష చేయించుకున్నారు. కళ్లద్దాల పెట్టె అందిస్తే ఆనందంగా అందుకున్నారు.. తీరా దాన్ని తెరిచి చూస్తే ఖాళీగా కనిపించడంతో అవాక్కవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన దూడ బీరయ్య కంటి వెలుగు కార్యక్రమంలో తనిఖీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు వైద్య సిబ్బంది కళ్లద్దాల పెట్టె అందజేశారు. కానీ పెట్టె తెరిచాక అందులో కళ్లద్దాలు లేకపోవడంతో బీరయ్య, అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది విస్తుపోయారు. మళ్లీ వివరాలను నమోదు చేసుకుని ఆర్డర్ చేస్తామని తెలిపారు. చాలాచోట్ల ఇలాగే జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. -
‘కంటి వెలుగు’కు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘కంటి వెలుగు’కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 14,92,450 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 2,11,184 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా...42 వేల మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,38,608 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. జనవరి 19 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జనవరి 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. కంటి వెలుగు వైద్య శిబిరాలు స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సందడిగా ఉన్నాయి. క్యాంపుల నిర్వహణకు జిల్లా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాలు కంటి పరీక్షలు చేస్తున్నాయి. వైద్య శిబిరాల్లో ప్రత్యేక సాప్ట్వేర్ సహాయంతో కంటి పరీక్షలు చేస్తున్నారు. డీఈవో, ఏఎన్ఎంలు ట్యాబ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. కంటి పరీక్షల తర్వాత అదే వైద్య శిబిరంలో అవసరమైతే అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు పంపిణీ చేస్తున్నారు. దీంతో కంటి వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధిత కార్యాలయాలలో, పత్రిక విలేకరులకు ఆయా ప్రెస్‌క్లబ్‌ల వద్ద, పోలీస్ బెటాలియన్ సిబ్బందికి వారి కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. -
కేసీఆరే నా కొడుకు..
ఖమ్మంమయూరిసెంటర్ : ఖమ్మం పాత మున్సిపల్ కార్యాలయంలోని బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా పరీక్షలు చేయించుకున్న పలువురితో ఆయన మాట్లాడారు. ఈక్రమంలో వృద్ధురాలు పద్మతో ‘కళ్లజోడు పెట్టుకున్నావు కదా మంగా కనిపిస్తోందా’ అని ఆరా తీశారు. దీంతో ఆమె స్పందిస్త ‘మంచిగా కనబడుతుంది కొడకా.. దండం పెడతా’ అంటూ సమాధానం చెప్పారు. ‘నాకు కొడుకులు లేరు.. కంటి పరీక్షలు ఉతంగా చేయడమే కాక అద్దాలు ఇప్పించి కేసీఆరే నా కొడుకు’ అని ఆమె సమాధానం చెప్పడంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దృష్టి లోపాలను దూరం చేసి, అంధ రహిత సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పువ్వాడ ఈ సందర్భంగా తెలిపారు. -
రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమం క్షేత్రస్థాయి క్యాంప్‌ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండటంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 97,335 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కంటి వెలుగు అమలుపై శనివారం ఆమె బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఇందులో పాల్గొన్నారు. కాగా, అన్ని జిల్లాల్లోని బఫర్ టీమ్స్‌ను ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలియన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్‌ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్‌లను నిర్వహించాలని శాంతి కుమారి సూచించారు. -
రెండో రోజు 2.14 లక్షల మందికి కంటి వెలుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు శుక్రవారం 2.14 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో రెండ్రోజుల్లో 3.81 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లయింది. రెండో రోజు 53,719 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 38 వేలమందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించారు. కంటి సమస్యలు లేనివారు 1.22 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. -
బడిలో ‘కంటి వెలుగు’.. పక్కింట్లో పాఠాలు..
కురవి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమా న్ని నిర్వహించడంతో విద్యార్థులకు పక్కింట్లో తరగతులు నిర్వహించారు. పైగా ఈ కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించడం గమనార్హం. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్య తండాలో గురువారం జరిగింది. తాట్య తండాలోని ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమానికి ఆరోగ్య, వైద్య శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేయగా, మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. పాఠశాలలో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయడంతో ఆ పక్కనే భూక్య భద్రు అనే వ్యక్తి ఇంట్లో ఉపాధ్యాయురాలు పద్మ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సైతం అదే ఇంటి ఆవరణలో వడ్డించారు. దీనిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. కంటివెలుగు కార్యక్రమాన్ని వేరేచోట కాకుండా బడిలో నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుపట్టారు. -
కంటి‘వెలుగు’ షురూ
సాక్షి నెట్వర్క్: రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో దీనిని ప్రారంభించగా, గురువారం నుంచి రాష్ట్రంలోని 1,500 కేంద్రాల్లో కంటి పరీక్షలు చేపట్టారు. తొలిరోజు 1.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 72,580 మంది పురుషులు, 87,889 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 70 వేల మందిలో సమస్యలు గుర్తించారు. 37 వేల మందికి దగ్గరి చూపు లోపానికి సంబంధించి అద్దాలు అందజేశారు. మరో 33 వేల మందిలో ఇతరత్రా సమస్యలు గుర్తించి అద్దాల కోసం సిఫారసు చేశారు. అతి తక్కువ మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చారు. మొత్తం మీద తొలిరోజు పరీక్షించిన వారిలో 43.75 శాతం మందికి రకరకాల చూపు సమస్యలు ఉన్నట్లు తేలింది. పట్టణ ప్రాంతాల్లో రద్దీ తక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 40 ఏళ్ల పైబడ్డ వారితో క్యూ లైన్లు నిండిపోయాయి. పలువురు ప్రముఖులకు అద్దాలు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో కంటి పరీక్ష చేసుకోగా, ఆయనకు దగ్గరి చూపు (షార్ట్ విజన్) లోపం ఉన్నట్లు గుర్తించి అద్దాలు అందజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వేములపల్లి మండల కేంద్రంలో పరీక్ష చేసుకోగా లోపం ఉందని గుర్తించి రీడింగ్ గ్లాసులు అందజేశారు. సూర్యాపేటలో పరీక్ష చేయించుకున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎలాంటి అద్దాలు అవసరం లేదని నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పరీక్షలు చేయించుకున్నారు. వీరిద్దరికీ అద్దాలు అందజేశారు. ఎక్కడ కావాలంటే అక్కడికే.. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు.. ఎక్కడ సేవలు కావాలన్నా ట్విట్టర్ లేదా వెబ్సైట్లో రిక్వెస్ట్ పెడితే అక్కడికే కంటి వెలుగు బృందాలు వస్తాయని మంత్రి హరీశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఏపని చేపట్టినా ప్రజల మంచి గురించి ఆలోచించి చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. టీఎస్‌ఎంఐడీసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి తదితరులు పాల్గొన్నారు. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి హైదరాబాద్ అమీర్‌పేటలో కంటి వెలుగు పరీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అంధత్వ రహిత తెలంగా ణ కంటి వెలుగు లక్ష్యమని చెప్పారు. ఎవరూ కంటి చూపు సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో 2018లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో 8 నెలల పాటు కంటి వెలుగు నిర్వహిస్తే ఈసారి 100పనిదినాల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ దఫా కంటి వెలుగు ద్వారా 55 లక్షల కళ్ళ జోళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. -
100 రోజుల్లో కోటిన్నర మందికి స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం బుధవారం మొదలుకానుంది. ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనికోసం వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 19 నుంచి రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు. ఇందులో ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 కేంద్రాల్లో కంటి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. 100 పనిదినాల్లో కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. తద్వారా గిన్నిస్ బుక్‌లో నమోదయ్యేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి కళ్లద్దా్దలు ఇస్తారు. మొత్తం 55 లక్షల కళ్లద్దాలు సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఒక్కోచోట 300 మందికి, పట్టణ ప్రాంతాల్లో 400 మందిని పరీక్షించాలన్నది లక్ష్యం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తారు. 15 వేల మంది సిబ్బంది : కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 15 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. కంటి పరీక్షలకు అవసరమైన ఏఆర్ యంత్రాలు, కళ్లద్దాలు సిద్ధంగా ఉంచారు. కంటి వెలుగు శిబిరాల్లో కంటి శుక్లం, మెల్ల కన్ను, టెరీజియం పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి చుక్కల మందులు, మాత్రలు ఇస్తారు. శిబిరాల్లో స్క్రీనింగ్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
‘కంటి వెలుగు’కు ఆధార్ తప్పనిసరి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్టంలో చేపడుతున్న కంటివెలుగు రెండో దశ కార్యక్రమానికి అన్ని శాఖలు సహకరించాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈనెల 18న ఖమ్మంలో కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. శిబిరానికి వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు తెచ్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి, కమిషనర్ శ్వేతతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శిబిరాల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన భద్రత కల్పించాలని హరీశ్‌రావు సూచించారు. ఈనెల 18న ఖమ్మంలో సీఎం లాంఛనంగా ప్రారంభించనుండగా, జిల్లాల్లో ఈనెల 19న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్లు తదితరులు కంటివెలుగును ప్రారంభించాలని చెప్పారు. వైద్యబృందాలు సమీప పట్టణాలు, మండల కేంద్రాల్లోనే రాత్రిబస చేసేలా పర్యవేక్షిస్తూ ప్రతిరోజూ ఉదయం 8–45 గంటలకల్లా తప్పనిసరిగా శిబిరాలను తెరవాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగును నిర్వహిస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కంటి ‘వెలుగు’ కావాలి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం రెండో విడత మొదలవనుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గతంలో కంటి పరీక్షలు చేసినప్పుడు ఇచ్చిన అద్దాలు ఇప్పుడు పనిచేయడం లేదని, కొత్తవి ఇవ్వాలన్న విజ్ఞప్తులతోపాటు.. ఆపరేషన్లు అవసరమయ్యే వారికి వెంటనే చేయించేలా ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కేవలం పరీక్షలు జరిపి అద్దాలు, మందులతో సరిపెట్టవద్దని.. శస్త్రచికిత్స చేయించాలని బాధితులు కోరుతున్నారు. ఘనంగా ప్రారంభించినా.. రాష్ట్రంలో ప్రజల దృష్టి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 25% మంది ఏదో ఒక స్థాయిలో కంటి సమస్యలతో బాధపడుతున్నారన్న విషయాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎనిమిది మందితో కూడిన వైద్యబృందాలు పరీక్షలు చేపట్టాయి. రూ.196.79 కోట్ల వ్యయంతో 826కిపైగా బృందాలతో నాలుగున్నర నెలలపాటు కార్యక్రమం కొనసాగింది. తొలిరోజున 1,09,000 మందిని పరీక్షించారు. గరిష్టంగా ఒక రోజున లక్షన్నర మందికి కంటి పరీక్షలు చేశారు. మొత్తంగా 38 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో అవసరమైన వారికి అద్దాలు, మందులు ఇచ్చారు. ఆరున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఇందులో మూడో వంతు మందికి ఆపరేషన్లు చేసినా.. ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా మిగతా వారికి నిర్వహించలేకపోయారు. ఈసారి ఆపరేషన్లు చేస్తారా? ‘కంటి వెలుగు’ పథకం రెండో విడత ఈనెల 18న ఖమ్మం వేదికగా మొదలుకానుంది. శస్త్రచికిత్సలు అవసరమయ్యే పలు రకాల కంటి వ్యాధులతో బాధపడేవారు ఈసారి తమకు ఊరట లభిస్తుందనుకున్నా.. అధికారుల తీరుతో ఆందోళన నెలకొంది. ‘కంటి వెలుగు’కు సంబంధించిన ప్రకటనల్లో, వివరాల్లో ఎక్కడా శస్త్రచికిత్సల ప్రస్తావన రావడం లేదు. గతంలో చేసిన పరీక్షల ప్రకారమే నాలుగున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి దానికి అదనంగా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఆపరేషన్లు చేయించే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు వయసు మీద పడుతున్న కొద్దీ కంటి సమస్యలు తీవ్రమవుతుంటాయని, అందువల్ల ఏటా కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మసకబారుతున్న చూపు! క్రితంసారి ఇచ్చిన కంటి అద్దాల్లో చాలామందికి ఇప్పుడవి పనిచేయడం లేదు. వారిలో చూపు మసకబారి దృష్టి లోపాలు పెరిగిపోతున్నాయి. వీరిలో కొందరు శస్త్రచికిత్స అవసరమైన స్థితికి చేరినట్టు అంచనా. కంటిచూపు బాధితుల్లో అధికులు పేద, మధ్య తరగతివారే. వీరిలో కొందరు అప్పోసప్పో చేసి ప్రైవేటులో చికిత్స చేయించుకుంటున్నా.. చాలామందికి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక అంధత్వం బారిన పడుతున్నారు. అప్పుడిచ్చిన అద్దాలు సరిగా పనిచేయట్లేదు.. ప్రభుత్వం కంటి వెలుగు పథకం కింద కంటి అద్దాలు ఇచ్చింది. అయితే కొన్నిరోజుల నుంచి అవి సరిగా పనిచేయట్లేదు. సరిగా కనిపించడం లేదు. ఆ అద్దాలు పెట్టుకోవట్లేదు. కొత్త అద్దాలు ఇవ్వాలి. – తోకునూరి నర్సమ్మ, చింతపల్లి, సీరోలు మండలం, మహబూబాబాద్ జిల్లా ఈసారైనా ఆపరేషన్ చేస్తారో..లేదో! నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు. తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్లు పరీక్షించి.. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇంతవరకు చేయలేదు. చాలా ఇబ్బంది అవుతోంది. ఈసారి చేయిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడైనా అవుతుందో లేదో.. – రంగమ్మ, సోంపురం, కేటీదొడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా కంటి వెలుగుకు సహకరిస్తాం ప్రభుత్వం పేదల కోసం మంచి కార్య క్రమం చేపట్టింది. దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వ హించి అద్దాలు ఇవ్వడం అభినందనీయం. ప్రభుత్వం పిలిస్తే ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న వేలమంది ఆప్తా ల్మాలజిస్టులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తరఫున స్వచ్ఛందంగా కంటివెలుగులో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
18న సీఎం చేతులమీదుగా ‘కంటివెలుగు’ ప్రారంభం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ఈనెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం నుంచి ప్రారంభిస్తారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కంటివెలుగు ఏర్పాట్లపై మంత్రి గురువారం ఖమ్మం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు మొదలుపెట్టేలా ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు. పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాలకు శుక్రవారం సాయంత్రానికల్లా కంటి పరీక్షల యంత్రాలు, అద్దాలు, మందులు చేరవేయాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతికి తెలపాలని చెప్పారు. జిల్లాస్థాయి అధికారులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమన్వయం చేసుకోవాలని, సంబంధిత బృందాలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఒకసారి వాట్సాప్‌లో వివరాలు అప్డేట్ చేయాలని మంత్రి సూచించారు. ప్రచార కార్యక్రమాలు చేపట్టండి ప్రజలకు కంటివెలుగుపై అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం చేయాలని, వారికి అర్థమయ్యేలా పూర్తి వివరాలతో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని.. ఆధార్ కార్డు తప్పక తీసుకురావాలన్న విషయాన్ని చెప్పాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం ఎనిమిది నెలలు కొనసాగితే, ఈసారి వంద రోజుల్లో పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం గతంలో ఉన్న 827 బృందాలను ఈసారి 1,500కు పెంచామని చెప్పారు. వైద్య బృందం సభ్యులకు పరీక్షా కేంద్రాలకు సమీపంలో వసతి ఏర్పాటుచేయాలన్నారు. విడతల వారీగా, 16,533 కేంద్రా (గ్రామాల్లో 12,763, పట్టణ ప్రాంతాల్లో 3,788)ల్లో క్యాంపులు ఏర్పాటు చేయనుండగా, ప్రాథమికంగా 30 లక్షల రీడింగ్ గ్లాస్లు, 25 లక్షల ప్రిస్కిప్షన్ అద్దాలను అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. క్యాంపులను సందర్శించాలి.. ఎంపీడీఓ, తహసీల్దార్, మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీఓలు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో డీఎంహెచ్ఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు కంటివెలుగు క్యాంపులను పర్యవేక్షించాలని మంత్రిహరీశ్‌రావు ఆదేశించారు. ప్రతిరోజూ క్యాంపులను సందర్శించేలా కలెక్టర్ టూర్ రూపొందించాలని.. మొత్తంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులంతా ఇందులో భాగస్వాములై అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యానికి, సీఎం కేసీఆర్ సంకల్పానికి చేయూతనివ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఇ.రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘కంటివెలుగు’పై అవగాహన కల్పించండి
సాక్షి, హైదరాబాద్/ ఏజీవర్సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం అమలుకోసం గ్రామాల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులకు సూచించారు. ఈనెల 18 నుంచి కంటి వెలుగు రెండో విడత ప్రారంభించనున్న నేపథ్యంలో గ్రామాలలో ఈ కార్యక్రమం తేదీలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఈ పథకంపై ఏర్పాట్లను సమీక్షించారు. ఎస్‌హెచ్‌జీల ఆదాయం పెంచడమే లక్ష్యం.. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆదాయ మార్గా లను పెంపొందించే లక్ష్యాన్ని మరువరాదని పీఆర్ ‘సెర్ప్’సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం వివిధ జిల్లాల అధికారుల ఓరియెంటేషన్ వర్క్ షాపులో ఆయన మాట్లాడారు. గత సీజన్లో ఖమ్మం జిల్లాలో ఎస్‌హెచ్‌జీ ద్వారా ప్రయోగాత్మకంగా ఎండుమిర్చి కొనుగోలు, మార్కెటింగ్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు మహబూబాబాద్, వరంగల్, జనగామ, సూర్యాపేట జిల్లాలకు దీనిని విస్తరించనున్నట్లు వెల్లడించారు. -
‘కంటివెలుగు’ కోసం 1,500 బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్న రెండో దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యక్రమం సన్నద్ధతపై మంగళవారం మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు ఇతర మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు శ్వేత మహంతి, డాక్టర్ శ్రీనివాస్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచాయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ మొదటిదఫా కంటివెలుగు కార్యక్రమంలో 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసి, 50 లక్షల కళ్లద్దాలు ఇచ్చామని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు గ్రామం, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుందని చెప్పారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండోవిడత కంటి వెలుగు వంద పనిదినాల్లో పూర్తి చేస్తామన్నారు. మొదటి దఫా కంటివెలుగులో 827 బృందాలు పనిచేయగా, ఇప్పుడు 1,500 బృందాలను ఏర్పాటు చేశామని, తద్వారా గిన్నిస్ రికార్డులో నమోదయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఒక్కో బృందంలో అప్టో మెట్రిస్ట్, సూపర్వైజర్, ఇద్దరు ఏఎన్ఎం, ముగ్గురు ఆశా, డీఈవో ఉంటారన్నారు. 55 లక్షల కళ్లద్దాల పంపిణీ... పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్ అన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిçప్షన్ గ్లాసెస్ ఉంటాయని, మొత్తం 55 లక్షల కళ్లద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోజువారీ వైద్యసేవలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీలోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటివెలుగు సమావేశాలు నిర్వహించాలని, అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లకు షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. రేషన్ షాపుల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో క్యాంపుల నిర్వహణ తేదీలు అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో 10, జిల్లాకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి ఆదేశారు. -
75 బృందాలు..100 రోజులు
సాక్షి,మేడ్చల్ జిల్లా: రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే నెల 18న కార్యక్రమం ప్రారంభం కానుండగా, ఇప్పటికే గ్రామీణ, పట్టణ జనాభాకు అనుగుణంగా వైద్య బృందాల నియామకం పూర్తయింది. ఈ మేరకు నేత్ర వైద్య సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. వంద రోజుల పాటు నిర్వహించే కంటివెలుగుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వారానికి అయిదు రోజుల పాటు నిర్దేశించిన కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. 2018లో మొదటి విడత కంటివెలుగు నిర్వహించిన సమయంలో పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్నవారిలో కొందరికే శస్త్రచికిత్స చేశారు. ఈసారైనా శస్త్రచికిత్స చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారని కంటి రోగులు ఆశిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్స చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు.. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో 27,75,067 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 40 డివిజన్ల పరిధిలో 20,92,711 మందికి పరీక్షలు చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు 43 బృందాలను నియమించారు. జిల్లాలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్,నిజాంపేట నగర పాలక సంస్థలు , మేడ్చల్, గుండ్లపోచంపల్లి ,దుండిగల్ ,కొంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 289 డివిజన్లు/ వార్డులు ఉండగా, 5,36,567 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో 18 బృందాలను నియమించారు. అలాగే, 61 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,45,789 జనాభా ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు అంచనా వేసి, 10 బృందాలను నియమించారు. జిల్లావ్యాప్తంగా మొత్తంగా 75 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో వైద్యుడు, నేత్ర వైద్య సహాయకుడు, ఆపరేటర్ ఉంటారు. వీరికి స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు సహకరిస్తారు. ఇటీవలే వైద్య బృందాలకు శిక్షణ ఇచ్చారు. సెలవు దినాలు మినహా వారానికి అయిదు రోజుల చొప్పున 100 రోజుల పాటు వైద్య పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షించే పరికరాలను, ఆటో రిఫ్రాక్టర్(ఏఆర్) మీటర్లను ప్రభుత్వం సమకూరుస్తుంది. నిరంతరాయంగా శిబిరాలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు వైద్యఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఇటీవలి కాలంలో కంటి సంబంధిత సమస్యలతో బాధ పడే వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో కంటివెలుగు కార్యక్రమం అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షలతో సరిపెట్టకుండా లోపాలున్న ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని వారందరికీ శస్త్రచికిత్స నిర్వహిస్తేనే పేదలకు ప్రయోజనం కలగనుంది. ఈసారైనా శస్త్రచికిత్సలు జరిగేనా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొలి విడతలో 1,27,146 మందిని పరీక్షించగా 82,157 మందికి మాత్రమే కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 42,148 మందికి అధిక దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించటంతోపాటు కంటి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించినప్పటికిని, 545 మందికి మాత్రమే కంటి ఆపరేషన్లు చేశారు. మిగతా వారందరికి విడతల వారిగా శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.బాధితులు శస్త్రచికిత్స కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి ఒక్కరికీ పరీక్షలు.. జిల్లాలో కంటివెలుగు నిర్వహణ కోసం వైద్య బృందాలను నియమించాం. పరికరాలు, ఇతర వనరులపై ప్రభుత్వానికి నివేదించాం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి -
ఈసారి ఆపరేషన్లు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు రెండో విడతలో ఆపరేషన్లు ఉండవని తెలుస్తోంది. మొదటి విడత లో కొందరికి ఆపరేషన్లు చేయించగా అవి వికటించడంతో వాటిని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా కళ్లద్దాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారవర్గాల సమాచారం. ఇదిలా ఉండగా కంటి వెలుగు రెండో విడతలో కోటిన్నర మందికి పరీక్షలు చేస్తే, దాదాపు 10 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం అవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. చాలామందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే జనవరి 18వ తేదీ నుంచి రాష్ట్రంలో కంటి వెలుగు–2 కార్యక్రమం ప్రారంభం కానున్న విష యం తెలిసిందే. పని దినాల ప్రకారం వంద రోజు ల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా 55 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రీడింగ్ గ్లాసులు, చత్వారం అద్దాలను అందజేస్తారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కళ్లద్దాలనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే టెండర్లు పిలిచింది. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి పరీక్షలు 2018లో ప్రారంభమైన కంటి వెలుగు మొదటి విడత దాదాపు 8 నెలలపాటు జరిగింది. అప్పుడు 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే ఉండటం గమనార్హం. అప్పట్లో ఎన్నికలకు ముందు సర్కారుకు ఇది మంచి పేరు తెచ్చిపెట్టింది. కంటి ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం దాదాపు 9.30 లక్షల మందిని గుర్తించారు. కాగా, ఇందులో కొందరికి ఆపరేషన్లు చేయించారు. ఒకట్రెండు చోట్ల ఆపరేషన్లు వికటించడంతో ఆపరేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. ఇదిలా ఉండగా రెండో విడత కంటి వెలుగులో ఆపరేషన్లపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. కేవలం కళ్లద్దాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. ఆపరేషన్లు ఎక్కడైనా వికటిస్తే అది మొత్తం కార్యక్రమానికే చెడ్డపేరు తెస్తుందని అంటున్నారు. కాగా, ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ఆపరేషన్లు చేయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గిన్నిస్‌లోకి కంటి వెలుగు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యేలా నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేస్తే గిన్నిస్‌లోకి చేరుతుందని ఆయన చెప్పారు. జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించే కంటి వెలుగు–2 కార్యక్రమంపై జిల్లా వైద్యాధికారులు, జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని హరీశ్‌రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి కంటి వెలుగు కార్యక్రమంలో 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్, 50 లక్షల కళ్ళ అద్దాలు ఇచ్చామన్నారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా నిలిచిందన్నారు. ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించామనీ, ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. మొదటి కంటి వెలుగును 8 నెలల్లో పూర్తి చేయగా, ఈసారి 100 పని దినాల్లో చేయాలని నిర్ణయించామన్నారు. వంద రోజుల్లో పూర్తి చేసేందుకు 1,500 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 969 మంది డాక్టర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 969 మంది డాక్టర్లను నియమించేందుకు వచ్చే నెల ఒకటో తేదీన తుది జాబితాను విడుదల చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పల్లె దవాఖానాల్లో 811 మంది బీఏఎంఎస్ డాక్టర్లను నియమించామని చెప్పారు. 1,500 ఆప్టో మెట్రిషన్స్, 1,500 డేటా ఎంట్రీ ఆపరేటర్లను త్వరగా నియమించాలన్నారు. కంటి వెలుగును విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, కలెక్టర్ల సహకారం తీసుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. జనవరి 1వ తేదీ నాటికి ఆటో రీఫ్రాక్తో మెషీన్లు జిల్లాలకు వస్తాయని చెప్పారు. కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగానే రీడింగ్ గ్లాసెస్ వస్తాయని, పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఆఖరి సంవత్సరం వైద్య విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చి వినియోగిస్తామన్నారు. రాష్ట్రస్తాయిలో 10, జిల్లాకొకటి చొప్పున క్వాలిటీ కంట్రోల్ టీంలు ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు వివరించారు. ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని ఈ టీంలు పరిశీలన చేస్తాయన్నారు. ఎల్ వీ ప్రసాద్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రుల సహకారంతో ఆ టీంలకు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్ తీర్చేలా ఆటోమేటిక్ ఆర్డర్ ఫెసిలిటీ ఉంటుందన్నారు. జనవరి 10 వరకే 10 నుంచి 15 లక్షల కళ్ళ జోళ్లు జిల్లాలకు చేరతాయన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమానికి తమ శాఖ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. -
మళ్లీ కంటి వెలుగు.. జనవరి 18 నుంచి షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కంటి వెలుగు అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నమూనాల పరిశీలన, ప్రజారోగ్యం, వైద్యం అంశాలపై సీఎం కేసీఆర్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల కన్నుల్లో వెలుగులు నింపాం ‘గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా కంటి చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు ఈ పథకం ద్వారా కంటి చూపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అందించింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. అందువల్ల మరోసారి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం కింద ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారందరికీ ఉచితంగానే కంటి అద్దాలు కూడా అందిస్తాం’ అని సీఎం తెలిపారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, కళ్లద్దాలు, పరికరాలు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీని వాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్ రెడ్డి, జి.విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజే శ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ప్రభు త్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం -
'కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారింది'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి శాసనమండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. కంటివెలుగు పథకం కింద కంటి ఆపరేషన్లు ఎవరికి చేయడం లేదని, ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తే ఆరోగ్య శ్రీని నిలిపివేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఆరోగ్య శ్రీని కూడా కంటిన్యూ చేయాలన్నారు. కాగా బడ్జెట్లో విద్య కోసం రూ.14728 కోట్లు కేటాయించారని, అయితే విద్యపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. (‘అప్పుడు కరెంట్ బందు.. ఇప్పుడు రైతు బంధు’) బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థుల పట్ల పోలీసులు నియంతృత్వంగా వ్యవహరించడం దారుణంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఊసే లేదని, గ్రూఫ్స్ నోటిఫికేషన్ ఇప్పటికి ఇవ్వలేదన్నారు. యునివర్సిటీల్లోనూ పోస్టులు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు కావడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఎలాంటి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. రేషన్‌షాపుల్లో ఇవ్వాల్సిన తొమ్మిది రకాల సరుకులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పండుగ పూట ఇవ్వాల్సిన చక్కెర, గోధుమలు, కిరోసిన్ లాంటివి ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు. రుణమాఫీలో భాగంగా రూ. 50వేల వరకు ఉన్న రైతులకు ఒకసారి, 50 వేలకు పైగా ఉన్న రైతులకు రెండు విడతల్లో రుణమాఫీ చేస్తే బాగుంటుందని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
టీడీపీ నేతలను నిలదీయండి: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని.. టీడీపీ నేతలు త్వరలో చేపట్టనున్న జన చైతన్య యాత్రలో వారిని నిలదీయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ నార్త్, కంచరపాలెంలో మూడవ విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తర నియోజకవర్గంలో ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందుంటారని తెలిపారు. ఆయన హామీలను కేవలం 8 నెలల్లో అమలు చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు ద్వారా జిల్లాలో నాలుగు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.(ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఆ యాత్ర) -
స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నా పెన్షన్ రాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వెరిఫికేషన్ చేసి అర్హత ఉందని తేలితే... రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే.. ఐదు రోజుల్లో పెన్షన్‌కార్డు ఇస్తామని పేర్కొన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామనీ.. అయినప్పటికీ పథకం అందలేదన్న మాటలు వినిపిస్తున్నాయన్నారు. పెన్షన్ దరఖాస్తులను ఫిబ్రవరి 17 నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్ చేయాలని, 18కల్లా అప్లోడ్ చేసి, 19, 20 తేదీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. తుది జాబితా 20న ప్రకటించాలని సూచించారు. మార్చి 1న కార్డుతో పాటు, పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని పునరుద్ఘాటించారు. బియ్యం కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. అదే విధంగా అర్హులు ఎవ్వరికీ బియ్యం కార్డు రాలేదనే మాట వినిపించకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘‘ఫిబ్రవరి 18 కల్లా రీ వెరిఫికేషన్ పూర్తి కావాలి. ఫిబ్రవరి 15 నుంచి బియ్యంకార్డుల పంపిణీ. ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందవద్దని చెప్పండి. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా కార్డు వస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఫిబ్రవరి 15 నుంచి పంపిణీ చేస్తారు. మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ. కర్నూలు, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఫిబ్రవరి 15 నుంచి... అనంతపురం, ఉభయగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మార్చి 7 నుంచి... కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో మార్చి 25 నుంచి... ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ .1.41 కోట్ల మందికి క్యూఆర్ కోడ్‌తో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. కాబట్టి కొంత సమయం పడుతుంది. రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం’’అని పేర్కొన్నారు. చంద్రబాబు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.. ‘‘ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. స్పందన ద్వారా 2 లక్షల పైచిలుకు వినతులు వస్తే 1 లక్షా 3 వేల వినతులకు శాంక్షన్ ఇచ్చాం. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం వల్ల దాదాపు 40 వేల వినతులను పెండింగులో ఉన్నట్టు చూస్తున్నాం. పూరిగుడిసెలో ఉన్నవాళ్లకు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఆపేయడం కరెక్టు కాదు. గ్రామ వాలంటీర్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి.. ఇళ్లపట్టా పొందడానికి అర్హుడు అని అనిపిస్తే.. వెంటనే ఇళ్లపట్టా ఇవ్వండి. నేను గ్రామాల్లో తిరిగే సరికి... ఇంటి పట్టా మాకు లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. ఇళ్లపట్టాల విషయంలో కలెక్టర్లు చురుగ్గా పనిచేయాల్సి ఉంది. లక్షలమంది మనపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే 2 వారాలు అధికారులు ఇళ్లపట్టాలపై దృష్టిపెట్టాలి. ప్లాటింగ్, మార్కింగ్ పనులు త్వరితగతిన పూర్తికావాలి. ఇళ్లపట్టాలకు అవసరమైన భూమిని మార్చి 1 కల్లా సిద్ధం చేయాలి. 25 లక్షలమంది పట్టాలు ఇవ్వాలన్న మంచి కార్యక్రమం దిశగా మనం అడుగులు వేస్తుంటే... దీన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేసులు పెట్టి.. అడ్డుకోమని టెలికాన్ఫరెన్స్‌ల్లో తన నాయకులకు చెప్తున్నాడు. భూములు కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు సాగాలి. అనుకున్నచోట భూములు దొరకని పక్షంలో ప్లాన్- బీ కూడా కలెక్టర్లు సిద్ధంచేసుకోవాలి. ఇంటి స్థలం లేని నిరుపేద రాష్ట్రంలో ఉండకూడదు. కావాల్సిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఉగాది రోజు ఆ కుటుంబాల్లో కచ్చితంగా పండుగ వాతావరణం ఉండాలి. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి 6 లక్షల ఇళ్లు చొప్పున నిర్మించుకుంటూ పోతాం’’ అని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు. కంటి వెలుగు పథకం మూడో విడతలో భాగంగా... పిల్లలకు చేయాల్సిన సర్జరీలను వేసవి సెలవులు నాటికి వాయిదా వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ‘‘25 రోజుల విశ్రాంతి అవసరం ఉన్న దృష్ట్యా తల్లిదండ్రుల కోరిక మేరకు కంటి శస్త్రచికిత్సలు వాయిదా వేశాం. కళ్లజోళ్లు కూడా అవసరమైన విద్యార్థులకు పంపిణీచేస్తున్నాం. మూడోవిడత కంటి వెలుగు కింద 56 లక్షలమంది అవ్వాతాతలకు స్క్రీనింగ్. అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీతో పాటు వాలంటీర్లచే కళ్లజోళ్లు పంపిణీ. మార్చి నుంచి అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు. గ్రామ సచివాలయాల్లోనే స్క్రీనింగ్. ప్రతి మండలానికి 2 నుంచి 3 టీంలు. దీనికోసం రూట్‌మ్యాప్‌లు సిద్ధంచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కలెక్టర్లంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలి. కంటివెలుగు మూడోవిడత ‘‘అవ్వా-తాత’’ కార్యక్రమం 18న కర్నూలులో ప్రారంభం. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటాను. ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులకూ అదే రోజు శంకుస్థాపన. 4906 సబ్ సెంటర్లను నిర్మిస్తున్నాం. 4472 సబ్ సెంటర్లకు స్థలాలు గుర్తించారు. మిగిలిన వాటికి వెంటనే స్థలాలను గుర్తించాలి. ఈ నెలాఖరుకల్లా పనులు ప్రారంభం అవుతాయి’’అని తెలిపారు. జగనన్న వసతి దీవెన ఫిబ్రవరి 24న ప్రారంభం ‘‘ఉన్నత చదువులు చదువుతున్నవారికి అండగా వసతి దీవెన కార్యక్రమం. విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సంవత్సరానికి రూ.20వేల రూపాయలు రెండు దఫాల్లో ఇస్తాం.11,87,904 మందికి లబ్ధి. 53720 ఐటీఐ చదువుతున్న వారికి మొదటి దఫా రూ.5వేలు, ఏడాదికి రూ.10వేలు. పాలిటెక్నిక్ చదువుతున్న వారికి మొదటి దఫా రూ. 7,500వేలు, ఏడాదికి రూ.15వేలు. డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న వారికి మొదటి దఫా రూ.10వేల రూపాయలు. ఏడాదికి రూ.20వేలు. విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తాం’’అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. షాపులు నడుపుకుంటున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు వచ్చే మార్చిలో ఏడాదికి రూ.10వేలు కాపు నేస్తంలో భాగంగా మహిళలను ఆదుకునే కార్యక్రమం కూడా మార్చిలో ప్రారంభం మార్గదర్శకాలు తయారుచేసి వాలంటీర్ల సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలి చిరునామాల మ్యాపింగ్ అనేది గ్రామ, వార్డు సచివాలయాల్లో ముఖ్యమైన కార్యక్రమం గ్రామ వాలంటీర్ల చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి అడ్రస్ మ్యాపింగ్ సరిగ్గా చేయని కారణంగా.. పెన్షన్లు ఇవ్వడానికి కొన్నిచోట్ల సమయం పడుతుంది మ్యాపింగ్ జరిగితే.. వేగవంతంగా పెన్షన్లు ఇవ్వగలుగుతాం వచ్చే నెల పెన్షన్లు మొదటి 2 రోజుల్లోనే పూర్తికావాలి గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకోవాలి వాలంటీర్లు అందుబాటులో ఉన్నారా? లేదా? అన్న కనీస సమాచారం మనవద్ద ఉండాలి లేకపోతే ఆ యాభై కుటుంబాలకు సంబంధించిన సేవలు పెండింగులో ఉంటాయి ఇక వార్డు, గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులు కూడా సమయానికి వస్తున్నారా? లేదా? చూసుకోవాలి గ్రామ, వార్డు సచివాలయాల్లో మనం అందిస్తామన్న 541 సేవలు అనుకున్న సమయానికి అందుతున్నాయా? లేదా? చూసుకోవాలి ఈ పరిశీలనలవల్ల లోపాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది గ్రామ సచివాలయాలనుంచే వినతులు, దరఖాస్తులు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి రైతు భరోసా కేంద్రాల గురించి.. ఈ ఏడాది ఖరీఫ్ కల్లా రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం ప్రతి 2వేల జనాభాకు సంబంధించి పూర్తి వ్యవసాయ అవసరాలను ఈ రైతు భరోసా కేంద్రాలు తీరుస్తాయి ఇ-క్రాపింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మారుస్తాయి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలి ఎక్కడైనా రైతు ఆత్మహత్యచేసుకుంటే... కలెక్టర్ కచ్చితంగా వెళ్లాలని చెప్పాం పరిహారం అందని రైతు కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలి ఎలాంటి ఆలస్యం లేకండా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చెల్లింపులు చేయాలి 2014 నుంచి 2019లో మనం అధికారంలోకి వచ్చేంత వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాల్లో పరిహారం అందని 422 మంది కుటుంబాలకు ఈనెల 24న పరిహారం అందించాలి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా కుటుంబాల దగ్గరికి వెళ్లి వారికి పరిహారం ఇవ్వాలి -
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బోధనాసుపత్రి
రాష్ట్రంలోని 13 జిల్లాలను ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని, వాటిలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సులు ప్రారంభించడంపై దృష్టి సారించాలి. ఇదే సమయంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు మెడికల్ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. వాటి పరిధిలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అంశాలపై సమగ్ర విధానం ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ మే నాటికి వైద్య, ఆరోగ్య శాఖలో అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్), జీఎంపీ (గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీ చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలని, జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనివల్ల సిబ్బంది కొరత తీరే అవకాశాలుంటాయని, మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్ సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యకార్డుల జారీపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విధానం చాలా పాతది అని, కొత్త విధానం గురించి ఆలోచించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో తొమ్మిది చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయని అధికారులు సూచాయగా తెలుపుతూ.. నాలుగైదు ఆసుపత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదనను అమలు చేయవచ్చని సీఎంకు వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలని, ఈ బోధనాసుపత్రులు స్వయం శక్తితో నడిచేలా ఆలోచించాలని సీఎం సూచించారు. ప్రజారోగ్య రంగం గురించి ఇదివరకటి ప్రభుత్వాలు ఆలోచించలేదని, అందువల్లే ఇవాళ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నామని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఏర్పాటు చేసి, భవిష్యత్తులో అవి మెరుగ్గా నడిచేలా ప్రణాళిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 11 కాలేజీలకు అదనంగా ప్రతిపాదిస్తున్న కాలేజీలతో కలిపి కనీసం 27 నుంచి 28 కాలేజీలు అవుతాయని, దీంతో భవిష్యత్తులో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అవ్వాతాతలకు కంటి పరీక్షలు మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద ఈ నెల 17వ తేదీ నుంచి అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నామని, దాదాపు 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు వివరించారు. జూలై వరకూ మూడో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉన్నందున ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్క్రీనింగ్, లోపాల గుర్తింపు, కంటి అద్దాల పంపిణీ, ఆపరేషన్లు అన్నీ సమకాలంలో జరుగుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా, అవసరం లేకున్నా సిజేరియన్లు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆ మేరకు వైద్యులకు సూచనలు చేయాలని, తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్లపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అర్హులు ఎవ్వరూ కూడా మిగిలిపోకూడదని, ఎవరైనా మిగిలిపోతే వలంటీర్లను వినియోగించుకుని గుర్తించాలని ఆదేశించారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద 46,725 మందికి ఫిబ్రవరి 2 వరకు రూ.33.14 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అవుతున్న సందర్భంలోనే రోగుల విశ్రాంతి సమయానికి ఇవ్వాల్సిన డబ్బును చేతిలో పెట్టాలని, మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమం కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, టీబీ, లెప్రసీ వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి విస్తృతంగా పరీక్షలు నిర్వహించనున్నామని, గుర్తించిన వారి వైద్యం వివరాలు ఆరోగ్య కార్డులో పొందుపరచనున్నట్లు అధికారులు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు పైలట్ ప్రాజెక్టు అమలుపై సీఎం ఆరా తీశారు. 17న ఆసుపత్రుల్లో నాడు–నేడు ప్రారంభం ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ.. ‘నాడు– నేడు’లో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని, ఈ విషయంలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. నాడు – నేడులో భాగంగా 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నాడు –నేడు కింద 11 మెడికల్ కాలేజీలు, 6 బోధనాసుపత్రుల్లో ,13 జిల్లా ఆసుపత్రుల్లో కూడా అభివృద్ధి పనులు చేపడతారు. కొత్తగా 7 మెడికల్ కాలేజీలు, 8 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 1 క్యాన్సర్ ఆసుపత్రి, 7 నర్సింగ్ కాలేజీల నిర్మాణం చేపడతారు. కాగా, ఈ నెల 17న ఆసుపత్రుల్లో నాడు– నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలులో ప్రారంభించనున్నారు. అదే రోజు సబ్‌సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన, మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూల్లోనే ప్రారంభిస్తారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1.43 కోట్ల కుటుంబాలు వైఎస్సార్ నవశకం ద్వారా రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలను ఆరోగ్యశ్రీకి అర్హులుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వార్షికాదాయ పరిమితిని రూ.5 లక్షల వరకు చేసినందున ఇంత మందికి లబ్ధి కలుగుతోందన్నారు. వీరందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కొత్త కార్డులను మార్చి 15వ తేదీలోగా ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 72, చెన్నైలో 23, బెంగళూరులో 35 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3 వేల మంది రోగులు చికిత్స చేయించుకున్నారని అధికారులు వివరించారు. ఈ నెల 17న ఎనీమియా ముక్త్ భారత్‌లో భాగంగా ఐఎఫ్ఏ టాబ్లెట్లు, సిరప్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సదరం సెంటర్లు 52 నుంచి 167కు పెంచామని, వారానికి 8,680 మందికి స్లాట్లు ఇస్తున్నామని, డిసెంబర్ 3 నుంచి ఫిబ్రవరి 3 వరకు 20,642 మందికి సర్టిఫికెట్లు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు జోన్లు ఇలా.. 1. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం 2. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు 3. కృష్ణా, గుంటూరు 4. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి 5. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం