గౌరాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది
సాక్షి, సిద్దిపేట: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గతేడాది ఆగస్టు 15న జిల్లాలో కంటి పరీక్షలు ప్రారంభించారు. ఈ ఏడాది పిబ్రవరి 24వ తేదీతో పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 3,47,120 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,17,872 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇందులో 43,010 మందికి దగ్గరి చూపులోపించడంతో వారికి అద్దాలు అందజేశారు. మిగిలిన వారిలో 51,850 మందికి దూరం చూపు, ఇతర కంటి సమస్యలతో కళ్లు కన్పించకుండా ఉన్నవారు ఉన్నారు.
వీరికి అద్దాలు పంపిణీ చేయడం కోసం ఆన్‌లైన్‌లో అప్‌లై చేసుకున్నారు. ఇందుకు గాను జిల్లాలో 24 బృందాలను నియమించారు. ఒకొక్క బృందంలో మెడికల్ ఆఫీసర్, ఒక కంటి వైద్య నిపుణుడు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌తోపాటు ఒక ఫార్మసిస్టు, హెల్త్ అసిస్టెంట్, సూపర్‌వైజర్, ముగ్గురు ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఆశలు పనిచేశారు. జిల్లాలో 2,806 క్యాంపులు నిర్వహించారు. ఒకొక్క క్యాంపు ఖర్చుగా రూ.2500 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి.
అయితే ఈ క్యాంపు ఖర్చులకి తాగునీరు, టెంట్లు, కుర్చీలు, పనిచేసిన బృందానికి స్నాక్స్, భోజనం మొదలైనవి అందజేయాలి. అయితే ఈ క్యాంపుల్లో అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, మహిళా సమాఖ్య భవనాలు, యువజన సంఘాల భవనాల్లో నిర్వహించారు. తాగునీరు, కుర్చీలు, టెంట్ల ఖర్చు పెద్దగా కాలేదు. అదేవిధంగా పలు గ్రామాల్లో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు భోజన సౌకర్యం కూడా కల్పించారు. పలు క్యాంపుల్లో పెద్దగా ఖర్చు కాలేదని క్యాంపులో పాల్గొన్న వారు చెప్పడం గమనార్హం.
వైద్యులకు, ఇతర ఉద్యోగులకు ముందస్తుగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సమావేశాలు, ఇతర మెటీరియల్, వెహికిల్ స్టిక్కరింగ్ కోసం రూ.5లక్షలు ఖర్చుచేసినట్లు చూపిస్తున్నారు. కానీ ఇందులో సగం కూడా ఖర్చు కాలేదని ఆరోపణలు ఉన్నాయి.
నేటికి సమర్పించని యూసీలు
కంటి వెలుగు పథకం అమలుకోసం ప్రభుత్వం నుంచి నిధులు మాత్రం విడుదలయ్యాయి. కానీ ఏడు నెలలు గడిచినా నేటికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించలేదు. నిధులు తొలివిడత రెండు సార్లు రూ.1,59,35,000 తర్వాత, రెండో విడత రూ. 44,65,000, మూడో విడత రూ. 30,11,396 మొత్తం రూ. 2,34,11,396 ప్రభుత్వం నుంచి విడుదల చేశారు. ఈ నిధులను క్యాంపు ఖర్చులకోసం ఒకొక్క క్యాంపుకు రూ. 2500 చొప్పున రూ. 70,15,000 కాగా ఇందులో రూ. 34,50,000 క్యాంపు నిర్వాహకుల ఖాతాలో జమచేశారు.
రూ. 35,65,000 చెల్లించాల్సిఉంది. 25 వాహనాలకు ఒకొక్క వాహనానికి నెలకు రూ. 33వేల చొప్పున ఏడు నెలల కాలానికి రూ.57,75,000 కాగా ఇప్పటి వరకు రూ. 49,50,000 చెల్లించారు. మిగిలిన రూ. 8,25,000 చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా మెడికల్ ఆఫిసర్‌కు నెలకు రూ.30వేల చొప్పున, కంటి వైద్యులకు నెలకు రూ.20వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నెలకు రూ.
15వేల చొప్పున మొత్తం రూ. 86,97,700 చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.66,75,000 చెల్లించగా రూ. 20,22,700 చెల్లించాలి. ఏఆర్ హైరింగ్, వాహనాలకు స్టిక్కర్లు, పెషెంట్లకు అందజేసిన కార్డుల ప్రింటింగ్ మొదలైన వాటికి రూ. 10,52,331 ఖర్చు అయినట్లు చూపించారు.
ఇందులో ఇప్పటి వరకు రూ.3,60,000 చెల్లించగా రూ.6,92,331 చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు చెల్లించిన డబ్బులు, క్యాంపుల నిర్వాహణ ఖర్చులకు సంబంధించిన యూసీలను ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు చెల్లించిన డబ్బులు పోగా.. మిగిలిన చెల్లింపులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అనుమతి కోరగా.. ఖర్చుల వినియోగం ఫైల్స్ అస్పష్టంగా ఉందని, యూసీలు లేకపోవడంతో ఫైల్ వెనక్కి పంపినట్లు సమాచారం.
యూసీలు ఇప్పటికీ రాలేదు..
కంటి వెలుగు పరీక్షల నిర్వాహణ, కంటి అద్దాల పంపిణీ కోసం నిర్వహించిన క్యాంపుల కోసం ఖర్చు సంబంధించిన యూసీలు ఇప్పటి వరకు అందజేయలేదు. క్యాంపు నిర్వహణకు రూ. 2500లకు మించకుండా ఖర్చుల వివరాలు అందజేస్తే, మిగిలిన డబ్బులు విడుదల చేస్తాం. తప్పుడు బిల్లులు సమర్పిస్తే చర్యలు తీసుకుంటాం.
–నర్సింహం, ఏఓ డీఎండీహెచ్‌ఓ కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment