సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్‌రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఐఏఎస్ నుంచి ఉద్యోగ విరమణ చేస్తున్నట్లు ఆయన పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఆ వెంటనే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెంకట్రామ్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం రాత్రి తన సోదరుడితో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. వెంకట్రామ్‌రెడ్డి కొంతకాలంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతుండగా, గత ఏడాది నవంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరపున ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.
ఓ నిర్మాణ సంస్థకు యజమానులుగా ఉన్న వెంకట్రామ్‌రెడ్డి కుటుంబానికి టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ మాజీ మంత్రి కుటుంబంతో సన్నిహిత బంధుత్వం ఉంది. ఆయన ఒకట్రెండు రోజుల్లో టీఆర్‌ఎస్‌లో అధికారికంగా చేరే అవకాశముంది. ఇదిలాఉంటే శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో పోటీ చేసేందుకు కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ పొందిన తర్వాతే వెంకట్రామ్‌రెడ్డి ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 11న కేసీఆర్‌తో భేటీ తర్వాత వెంకట్రామ్‌రెడ్డి ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. శాసనమండలి ఎన్నికలో స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ లేదా మెదక్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వెంకట్రామ్‌రెడ్డి స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినప్పటికీ దీర్ఘకాలంగా తాను ఐఏఎస్ అధికారిగా పనిచేసిన మెదక్ నుంచే శాసన మండలికి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఆదర్శంగా సిద్దిపేట
తెలంగాణను అణువణువూ అర్థం చేసుకున్న కేసీఆర్ రాష్ట్రాన్ని తన అపార అనుభవంతో అభివృద్ధి చేశారని వెంకట్రామ్‌రెడ్డి కొనియాడారు. తన పదవీ విరమణ దరఖాస్తు ఆమోదం పొందాక తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా సిద్దిపేట జిల్లాలో ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఎన్నో కొత్త ఆలోచనలకు సిద్దిపేట జిల్లా వేదికైంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎక్కువగా అభివృద్ధి సాధించింది. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిగా మారడం ఆనందంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 9వేల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా భూ సేకరణ జరిపాం. ముంపు గ్రామాలను ఖాళీ చేయించిన సమయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా చూశాం. 26 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఏడేళ్లపాటు మెదక్ జిల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సీఎం కేసీఆర్ తనను అనేక కార్యక్రమాల్లో భాగస్వామిని చేశారు’ అని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారా అని ప్రశ్నకు సీఎం కేసీఆర్ తనకు ఏ పదవి అప్పగించినా కష్టపడి పనిచేస్తానని బదులిచ్చారు.
చదవండి: ‘టీఆర్ఎస్-బీజేపీలవి పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు’
గ్రూప్–1 అధికారిగా ప్రభుత్వ సర్వీసులోకి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) ఓదెల మండలం ఇందుర్తికి చెందిన పి.వెంకట్రామ్‌రెడ్డి 1996లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో గ్రూప్–1 అధికారిగా ప్రభుత్వ సర్వీసులోకి వచ్చారు. బందరు, చిత్తూరు, తిరుపతి ఆర్‌డీఓగా, మెదక్ డ్వామా పీడీ, హుడా కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్, ఇన్‌కాప్ ఎండీగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. గత ఏడాది దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కొంతకాలం సిరిసిల్ల కలెక్టర్‌గా బదిలీపై వెళ్లి తిరిగి సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సెప్టెంబర్, 2022 వరకు పదవీకాలం ఉంది.
వివాదాలు...
సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం సమయంలో వెంకట్రామ్‌రెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై విమర్శలు వచ్చాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ విషయంలో హైకోర్టులో భూ నిర్వాసితుల పిటిషన్ వేయడంతో జరిమానా, శిక్ష సైతం విధించిన విషయం తెలిసిందే. తాజాగా రైతుల విషయంలో మాట్లాడిన మాటలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment