సాక్షి, మెదక్: సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తాజాగా ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. వరి సాగు చేస్తే ఊరుకునేది లేదని, రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని.. అమ్మితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. వ్యాపారం రద్దు చేసి షాపుని మూయిం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డీలర్లు సుప్రీం కోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా షాపు ఓపెన్ చేసేది లేదని తేల్చిచెప్పారు.
‘నేను చెప్పిన దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు జడ్జి చెప్పినా, రాష్ట్ర హైకోర్టు జడ్జి చెప్పినా, ప్రజా ప్రతినిధులు చెప్పినా నేను కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితులలో షాపులు తెరుచుకోవు. ఒకవేళ డీలర్లు విత్తనాలు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారు.’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment