సత్తుపల్లిలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యబృందం
సత్తుపల్లిటౌన్ (ఖమ్మం): కంటివెలుగు పేరిట నిర్వహిస్తున్న వైద్యశిబిరాలపై పట్టింపు కానరావట్లేదు. దృష్టి లోప నివారణే లక్ష్యంగా ఎంతో ప్రచారం చేసి..ఆర్భాటంగా శిబిరాలు నిర్వహించినప్పటికీ..కంటిచూపు సమస్యలతో బాధ పడేవారికి మాత్రం ఉపశమనం లభించడంలేదు. కావాల్సిన కళ్లజోళ్లు, ఇవ్వాల్సిన మందుల లోపాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ల కోసం ఎంపికచేసిన వారికి ఇంతరవకు..శస్త్రచికిత్సలు నిర్వహించకపోవడం ప్రధాన లోపంగా మారింది.
అసలు..ఈ కంటివెలుగు ప్రక్రియపై చిన్నచూపు చూస్తున్నారని, ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూపు మందగించడం, కళ్ల మంటలు, ఇతర నేత్ర సమస్యలతో వచ్చిన వారికి పరీక్షలు సాఫీగా సాగుతున్నా..శస్త్రచికిత్సలు నిర్వహించట్లేదు. ప్రత్యేక కళ్లద్దాలు అందకపోవడం, చుక్కల మందు, డి–విటమిన్ మందుబిల్లల కొరతతో జిల్లాలో కంటి వెలుగు మసకబారుతోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల హడావిడితో అధికార యంత్రాంగం ఇటువైపు దృష్టి పెట్టకపోవడంతో అవాంతరాలు ఎదురవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15న ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండు నెలలుగా సాగుతోంది. పరీక్షలపై ఉన్న శ్రద్ధ.... శస్త్రచికిత్సలు, కళ్లద్దాలు, మందుల పంపిణీపై కనిపించట్లేదు. క్షేత్ర స్థాయిలో కంటి వెలుగు కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందికి సైతం వీటి సరఫరాపై సమాచారం లేకపోవడంతో ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ఇస్తామో..? అని వైద్యసిబ్బందే సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల రోగులు కంటి అద్దాల కోసం వైద్య సిబ్బందితో గొడవలకు దిగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఆపరేషన్లు ఎప్పుడు జేస్తరో..?
నేత్ర పరీక్షల్లో 17,165 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించి రిఫర్ చేశారు. ఇప్పటి వరకు నామమాత్రంగానే చికిత్సలు జరిగాయి. మిగిలిన వారు తమకు కంటి ఆపరేషన్ల కోసం ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. వీరిలో క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్నావారే ఎక్కువ. దగ్గర చూపులోపం ఉన్నవారికి అద్దాలు అరకొరగానే ఉండటం, దూరదృష్టిలోపం ఉన్నవారికి 60 రోజులు అవుతున్నా, ఇంతవరకు ప్రత్యేక అద్దాలు అందించకపోవడంతో ఆందోళన నెలకొంటోంది. వైద్య శిబిరాల్లో ఎంతో ఆశగా వరుసల్లో నిలబడి వేలాదిమంది కంటి పరీక్షలు చేయించుకుంటున్నా..చివరికి వీరికి లబ్ధిచేకూరట్లేదు.
కళ్లజోళ్ల కొరతతోనే ఇబ్బందులు..
కంటి సమస్యలకు అవసరమైన వారికి అందించాల్సిన కళ్లజోళ్ల కొరత రోగులను ఇబ్బంది పెడుతోంది. గత రెండు నెలలుగా జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 162 గ్రామాలు, మున్సిపాలిటీల్లోని 23 వార్డుల్లో 1.07 లక్షల మందికి వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించాయి. జిల్లాలోని 21 మండలాల్లో 32 వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దగ్గరచూపు కళ్లజోళ్లు మినహా ఇతర ప్రత్యేక అద్దాలు అందించిన దాఖలాలు లేవు. రోగులకు ఇవి ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వేలాది మంది మధ్యవయస్సు వారు, వృద్ధులు కళ్లజోళ్లు అందక పోవడంతో నిరాశ చెందుతున్నారు.
రెండు నెలలుగా చూస్తున్నా..
కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేశారు. ఆపరేషన్ చేయాలన్నారు. రెండు నెలలైంది. ఇంతవరకు ఏ జాడా లేదు. కళ్లు కనిపించక ఇబ్బంది పడుతున్నా. కంటి సమస్యకు ఆపరేషన్ చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నా. – సీహెచ్.సావిత్రి, సత్తుపల్లి
Comments
Please login to add a commentAdd a comment