opticals
-
కొందరికే వెలుగు
గీసుకొండ(పరకాల): కంటి వెలుగు పథకం కొందరికే వెలుగునిచ్చింది.. పరీక్షలు చేసి చేతులు దులుపుకోవడమే వైద్యాధికారులకు అలవాటుగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి చూపును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన ఈ కార్యక్రమం అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదు. కంటి పరీక్షలు చేయించుకుని కంటి అద్దాలు, ఆపరేషన్లు అవసరం ఉన్న వారు వాటి కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. పీహెచ్‌సీలు, హెల్త్ సబ్సెంటర్లతో పాటు గ్రామాల్లోని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల చుట్టూ తిరుగుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించి అద్దాలు, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని అధికారులు చెప్పడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిం చింది. గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకోవడానికి జనం కంటి వెలుగు శిబిరాలకు అధికంగా వస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలను పంపిణీ చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ముఖ్యంగా వృద్ధుల నుంచి శిబిరాలకు విశేష స్పందన కనిపిస్తోంది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు, సిబ్బంది చీటీలను బాధితుల చేతిలో పెట్టి ఆపరేషన్ల గురించి ఊసెత్తడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని కంటి వెలుగు శిబిరాలపై ఆశలు పెట్టుకున్న వారి నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోతోంది. జిల్లా వ్యాప్తంగా ‘కంటి వెలుగు’లెక్క.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,72,758 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 1,10,729 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో దూరదృష్టి లోపం ఉన్నవారు 38,139 మంది కాగా కేవలం 13,867 మందికి కంటి అద్దాలు(ప్రిస్కిప్షన్ గ్లాసెస్) ఇప్పటివరకు పంపిణీ చేశారు. అలాగే 50,895 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. కాగా కంటి ఆపరేషన్ల కోసం జిల్లాలో 21,695 మంది ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరు వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకున్నారని, అధికారులు చెబుతున్నా వారి వద్ద వీటికి సంబంధించిన సమాచారం లేదు. జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించడంతో ప్రభుత్వం ఆపరేషన్ల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే తొందరపడి ఆపరేషన్లు చేయించడం లేదని, పరీక్షల శిబిరాలు ముగిసిన తర్వాత నిపుణులైన వైద్యుల టీంలను ఏర్పాటు చేసి విడతల వారిగా ఆపరేషన్లు చేయిస్తామని చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు ‘కంటి వెలుగు’ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఫిబ్రవరి మొదటి వారం వరకు కొనసాగిస్తాం. అన్ని గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను పూర్తి చేస్తాం. దూరపు చూపు కంటి అద్దాల పంపిణీ గ్రామాల్లో లబ్దిదారులకు విడతల వారిగా జరుగుతోంది. ఆపరేషన్ల విషయంలో నిపుణులైన వైద్యులతో టీంలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆపరేషన్లు చేయిస్తాం. – డాక్టర్ సీహెచ్.మధుసూదన్, డీఎంహెచ్ఓ -
తిండిలో తొండి
ఖమ్మంవైద్యవిభాగం: శిబిరాలకు వేళకు వస్తారు.. రోగులను పరీక్షిస్తారు.. కంటి అద్దాలతోపాటు మందులు అందిస్తారు.. శస్త్ర చికిత్సలు అవసరముంటే ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు.. ఇంత సేవ చేసినా భోజన విరామంలో సమయానికి కడుపునిండా తినలేని పరిస్థితి.. ఇక్కడే ఉంది అసలు వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి.. అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం కొందరు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు వరంలా మారింది. కంటి వెలుగు సిబ్బందికి అందించే ఆహారంలో కక్కుర్తికి పాల్పడుతూ నిధులు కాజేస్తున్నారు. నాణ్యత లోపించిన సరుకులతో వండిన భోజనం సరఫరా చేస్తూ వారి కడుపుకొట్టడమే కాకుండా.. ఆహారానికి కేటాయించిన నిధులు అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారుల కక్కుర్తి విధానాల వల్ల కంటి వెలుగు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను ప్రశ్నించలేక.. వడ్డించిన భోజనాన్ని అతి కష్టంమీద తినాల్సి వస్తోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో బృందంలో 10 మంది సిబ్బంది కంటి వెలుగు శిబిరానికి సంబంధించి ఒక్కో బృందంలో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్, ఇద్దరు డీఈఓలు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశలు శిబిరంలో పాల్గొంటున్నారు. ఒక్కో బృందానికి ప్రతిరోజు రూ.2,500 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. సిబ్బందికి నాణ్యతతో కూడిన ఆహారం సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే.. అది కొందరు అధికారులకు వరంలా మారింది. కొందరు అధికారులు కక్కుర్తిపడి సిబ్బందికి నాసిరకమైన ఆహారం సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై బృందం సభ్యులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అయితే శిబిరాలపై దృష్టి సారించాల్సిన జిల్లా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారు ఆడిండే ఆట.. పాడిందే పాట అనే చందంగా పరిస్థితి తయారైంది. 32 బృందాలదీ అదే పరిస్థితి.. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 32 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 పీహెచ్‌సీలు, మూడు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించగా.. జిల్లాలో కార్యక్రమం నిర్వహించేందుకు 32 బృందాలను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అయితే అన్ని పీహెచ్‌సీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వీరికి ఆహారం సరఫరా చేసే విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమం ప్రారంభమై నాలుగు నెలలు దాటినా తమకు సదుపాయాలు కల్పించడంలో అధికారులు చిన్నచూపు చూస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తూ.. ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలు చేయడంలో వీరి పాత్రే కీలకం. శిబిరంలో పాల్గొనే ఒక్కో బృందం గ్రామీణ ప్రాంతాల్లో రోజూ 250 మంది, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు చేయాలనే నిబంధన ఉంది. నాలుగు నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 4,50,000 మందికి కంటి పరీక్షలు చేశారు. విధి నిర్వహణలో పనిభారం వీరిపైనే ఎక్కువగా ఉంటుంది. నిత్యం కష్టపడుతున్నా వీరిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కోసం నెలకు రూ.20లక్షలు.. కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనే సిబ్బందికి ప్రతిరోజూ ఉదయం టిఫిన్, టీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి శని, ఆదివారం శిబిరాలకు సెలవు. శిబిరాలు ఉన్నన్ని రోజులు సిబ్బందికి మంచి ఆహారం సరఫరా చేయాల్సి ఉండగా.. ఈ మెనూ ఎక్కడా పాటించడం లేదు. ప్రభుత్వం వీటికోసం నెలకు రూ.20,00,000 నిధులు కేటాయిస్తోంది. ప్రతిరోజూ 32 బృందాలకు కలిపి రూ.80వేలు కేటాయిస్తున్నారు. కానీ.. ఇందులో సిబ్బంది కోసం 30 శాతం నిధులు కూడా ఖర్చు చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ, నగర పరిధిలో ఉండే సిబ్బంది కోసం మధ్యాహ్నం పూట నాసిరకం ఆహారం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే కొంతమంది సిబ్బందికి స్థానిక గ్రామస్తులు భోజనం ఏర్పాటు చేస్తుండగా, మరికొందరు ఇంటి నుంచి లంచ్‌బాక్స్‌లు తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. సిబ్బంది మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. ఫిర్యాదు చేస్తే తమపై చర్యలు తీసుకుంటారనే భయంతో వారు మిన్నకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది ఆహారం కోసం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా.. సక్రమంగా వినియోగించేలా చూడాలని కంటి వెలుగు సిబ్బంది కోరుతున్నారు. ఫిర్యాదులు అందలేదు.. కంటి వెలుగు సిబ్బంది ఆహారం కోసం ప్రభు త్వం రూ.2,500 చెల్లిస్తున్నట్లు జీఓ ఇచ్చినా.. రూ.1,500 చొప్పున మాత్రమే అందజేస్తున్నారు. సిబ్బందికి ఆహారం సక్రమంగానే సరఫరా చేస్తున్నాం. వారి నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటాం. కార్యక్రమం జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతోంది. – డాక్టర్ కోటిరత్నం, కంటి వెలుగు కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ -
చిన్న‘చూపు’
సత్తుపల్లిటౌన్ (ఖమ్మం): కంటివెలుగు పేరిట నిర్వహిస్తున్న వైద్యశిబిరాలపై పట్టింపు కానరావట్లేదు. దృష్టి లోప నివారణే లక్ష్యంగా ఎంతో ప్రచారం చేసి..ఆర్భాటంగా శిబిరాలు నిర్వహించినప్పటికీ..కంటిచూపు సమస్యలతో బాధ పడేవారికి మాత్రం ఉపశమనం లభించడంలేదు. కావాల్సిన కళ్లజోళ్లు, ఇవ్వాల్సిన మందుల లోపాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ల కోసం ఎంపికచేసిన వారికి ఇంతరవకు..శస్త్రచికిత్సలు నిర్వహించకపోవడం ప్రధాన లోపంగా మారింది. అసలు..ఈ కంటివెలుగు ప్రక్రియపై చిన్నచూపు చూస్తున్నారని, ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూపు మందగించడం, కళ్ల మంటలు, ఇతర నేత్ర సమస్యలతో వచ్చిన వారికి పరీక్షలు సాఫీగా సాగుతున్నా..శస్త్రచికిత్సలు నిర్వహించట్లేదు. ప్రత్యేక కళ్లద్దాలు అందకపోవడం, చుక్కల మందు, డి–విటమిన్ మందుబిల్లల కొరతతో జిల్లాలో కంటి వెలుగు మసకబారుతోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల హడావిడితో అధికార యంత్రాంగం ఇటువైపు దృష్టి పెట్టకపోవడంతో అవాంతరాలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15న ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండు నెలలుగా సాగుతోంది. పరీక్షలపై ఉన్న శ్రద్ధ.... శస్త్రచికిత్సలు, కళ్లద్దాలు, మందుల పంపిణీపై కనిపించట్లేదు. క్షేత్ర స్థాయిలో కంటి వెలుగు కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందికి సైతం వీటి సరఫరాపై సమాచారం లేకపోవడంతో ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ఇస్తామో..? అని వైద్యసిబ్బందే సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల రోగులు కంటి అద్దాల కోసం వైద్య సిబ్బందితో గొడవలకు దిగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్లు ఎప్పుడు జేస్తరో..? నేత్ర పరీక్షల్లో 17,165 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించి రిఫర్ చేశారు. ఇప్పటి వరకు నామమాత్రంగానే చికిత్సలు జరిగాయి. మిగిలిన వారు తమకు కంటి ఆపరేషన్ల కోసం ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. వీరిలో క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్నావారే ఎక్కువ. దగ్గర చూపులోపం ఉన్నవారికి అద్దాలు అరకొరగానే ఉండటం, దూరదృష్టిలోపం ఉన్నవారికి 60 రోజులు అవుతున్నా, ఇంతవరకు ప్రత్యేక అద్దాలు అందించకపోవడంతో ఆందోళన నెలకొంటోంది. వైద్య శిబిరాల్లో ఎంతో ఆశగా వరుసల్లో నిలబడి వేలాదిమంది కంటి పరీక్షలు చేయించుకుంటున్నా..చివరికి వీరికి లబ్ధిచేకూరట్లేదు. కళ్లజోళ్ల కొరతతోనే ఇబ్బందులు.. కంటి సమస్యలకు అవసరమైన వారికి అందించాల్సిన కళ్లజోళ్ల కొరత రోగులను ఇబ్బంది పెడుతోంది. గత రెండు నెలలుగా జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 162 గ్రామాలు, మున్సిపాలిటీల్లోని 23 వార్డుల్లో 1.07 లక్షల మందికి వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించాయి. జిల్లాలోని 21 మండలాల్లో 32 వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దగ్గరచూపు కళ్లజోళ్లు మినహా ఇతర ప్రత్యేక అద్దాలు అందించిన దాఖలాలు లేవు. రోగులకు ఇవి ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వేలాది మంది మధ్యవయస్సు వారు, వృద్ధులు కళ్లజోళ్లు అందక పోవడంతో నిరాశ చెందుతున్నారు. రెండు నెలలుగా చూస్తున్నా.. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేశారు. ఆపరేషన్ చేయాలన్నారు. రెండు నెలలైంది. ఇంతవరకు ఏ జాడా లేదు. కళ్లు కనిపించక ఇబ్బంది పడుతున్నా. కంటి సమస్యకు ఆపరేషన్ చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నా. – సీహెచ్.సావిత్రి, సత్తుపల్లి -
కళ్లద్దాలు రాలే..
సాక్షి, వరంగల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం అభాసుపాలవుతోంది. పరీక్షలు చేసిన వైద్యాధికారులు అద్దాలు అందజేయడం లేదని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అద్దాల గురించి కంటి చూపు బాధితులు స్థానిక ఆశ కార్యకర్తలను అడిగితే ఎప్పుడొస్తాయో తమకు తెలియదంటుండగా, వైద్యాధికారులు ఆర్డర్ పెట్టామని, త్వరలో వస్తాయని దాటవేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా అద్దాలు అందజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో నిర్వహించిన కంటివెలుగు పరీక్షల్లో ప్రతీ వంద మందిలో 50 మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. 50 రోజులైనా అందని అద్దాలు.. కంటి చూపులో దూరపు చూపు, దగ్గరి చూపు కనబడని వారు, అసలు కనబడని వారిని పరీక్షల్లో గుర్తిస్తున్నారు. దగ్గరి చూపు కనబడడం లేదని డాక్టర్లు నిర్ధారిస్తే వెంటనే వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు సమస్య ఉన్నవారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి అద్దాలకు ఆర్డర్ పెడుతున్నారు. రెండు కళ్లకు ఒకే రకమైన సైట్ ఉంటేనే కంటి అద్దాలు అందిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయగా 30 రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయని సమాచారమిచ్చారు. కంటి పరీక్షలు ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా అద్దాలు ఇంత వరకూ రాలేదు. ఆర్డర్ పెట్టిన అద్దాలు వస్తాయా ? రావా ? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అద్దాలు ఎప్పుడు వస్తాయని కంటి వెలుగు శిబిరాల్లో అడిగినా ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. అందుబాటులో తొమ్మిది రకాల అద్దాలే.. కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వెంటనే అందించేందుకు ప్రభుత్వం తొమ్మిది రకాల కంటి అద్దాలనే అందుబాటులో ఉంచింది. 1.0 ఆర్‌ఎంబీఎఫ్ నుంచి 2.5ఆర్‌ఎంబీఎఫ్, 1.0 నుంచి 2.5 ఆర్ఎంబీ వరకు మాత్రమే కంటి అద్దాలు ఉన్నాయి. 23 వేల మందికి అందిన అద్దాలు.. కంటి వెలుగు కార్యక్రమానికి 1,07,160 మంది హాజరుకాగా 23,352 మందికి కంటి అద్దాలను అందించారు. 22,731 కంటి అద్దాల కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. 11,123 మందికి కంటి శస్త్ర చికిత్స కోసం రెఫర్ చేశారు. అద్దాలు లేక తీవ్ర ఇబ్బందులు డాక్టర్లు నెల రోజులకు అద్దాలు వస్తాయని చెప్పినా ఇప్పటి వరకు అద్దాలు రాలేదు. ఎవరిని అడిగినా ఏమి చెప్పడం లేదు. దీంతో కళ్లు కనపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. వెంటనే కళ్లద్దాలను అందించాలి. –గోరంట్ల లక్ష్మీ, నర్సక్కపల్లి గ్రామం, పరకాల మండలం త్వరలో వస్తాయి.. ఆర్డర్ పెట్టిన కంటి అద్దాలు త్వరలో వస్తాయి. దూరపు, దగ్గర చూపు అద్దాలు స్టాక్ లేవు కాబట్టి ఆర్డర్ పెట్టాం. కొంత ఆలస్యమైనప్పటికీ అద్దాలన్నీ వస్తాయి. ఒకటి, రెండు పీహెచ్‌సీలకు ఈ రెండు రోజుల్లో వస్తాయి. వాటిని పంపిణీ చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్డర్ తీసుకున్న వారందరికీ అద్దాలు అందిస్తాం. –మధుసూదన్, డీఎంహెచ్ఓ -
అద్దాల్లేవ్..
వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో మంగళవారం కంటి వెలుగు క్యాంపునకు 232 మంది హాజరుకాగా పరీక్షలు నిర్వహించి, వారిలో 135 మందికి కంటి అద్దాలు అవసరం అని నిర్ధారించారు. అలాగే 15 మందికి శస్త్ర చికిత్స అవసరమని సిఫార్సు చేశారు. దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న 61 మందికే కంటి అద్దాలు అందుబాటులో ఉండగా వారికే అందించారు. దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న 75 మందికి కంటి అద్దాల కోసం అర్డర్ కోసం ఆన్లైన్లో నమోదు చేశారు. వారికి అక్టోబర్ 5న వస్తాయని, ఇంటికి ఆశ వర్కర్ తీసుకొచ్చి ఇస్తారని చెప్పారు. దీంతో కంటి అద్దాలు అందిస్తారని ఆశతో వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. సాక్షి, వరంగల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న దూరపు చూపు బాధితులకు అద్దాలు అందుబాటులో లేవు. ఆ అద్దాల కోసం వైద్య సిబ్బంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగా నెల రోజుల గడువు చూపిస్తోంది. దీంతో కంటి పరీక్షలకు వెళ్లిన దూరపు చూపు బాధితులు క్యాంపు నుంచి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి కేంద్రంలో కంటి పరీక్షలకు ఐదు గదులు ఏర్పాటు చేశారు. వీటిలో రిజిస్ట్రేషన్, తర్వాత కంటి పరీక్ష, వైద్యుడి పరీక్ష, కంప్యూటర్ పరీక్ష, కంటి అద్దాల పంపిణీ గదులు ఉన్నాయి. కాగా గ్రామాల్లో ప్రతి వంద మందిలో సగటున 30 మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు కంటి పరీక్షల నివేదికలు వెల్లడిస్తున్నాయి. దూరపు చూపు అద్దాలు.. నెల రోజులకు.. కంటి చూపులో దూరపు, దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్నవారు, అసలు కనబడని వారిని పరీక్షల్లో గుర్తిస్తున్నారు. దగ్గరి చూపు కనబడడం లేదని డాక్టర్లు నిర్ధారిస్తే వెంటనే వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు కనబడని వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఆర్డర్ పెడుతున్నారు. రెండు కళ్లకు ఒకే రకమైన సైట్ ఉంటేనే కంటి అద్దాలు అందిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయగా 30 రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయనే సమాచారం వస్తోంది. దీంతో బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అసలు కంటి అద్దాలు వస్తాయో.. రావో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుబాటులో తొమ్మిది రకాల అద్దాలే.. కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వెంటనే అందించేందుకు ప్రభుత్వం 9 రకాల కంటి అద్దాలనే అందుబాటులో ఉంచారు. 1.0 ఆర్‌ఎంబీఎఫ్ నుంచి 2.5 ఆర్‌ఎంబీఎఫ్, 1.0 నుంచి 2.5 ఆర్ఎంబీ వరకు మాత్రమే కంటి అద్దాలు ఉన్నాయి. అనుకూల ఆస్పత్రులకే శస్త్ర చికిత్సకు రెఫర్.. కంటి వెలుగులో పరీక్షలు చేయించుకున్న వారికి కంటి శస్త్ర చికిత్స చేయాలని నిర్ధారించిన వారిని కొన్ని రెఫరల్ ఆస్పత్రులకు మాత్రమే సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఏ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటా నంటే ఆ వైద్యశాలకు రెఫర్ చేయాల్సి ఉండగా అలా క్యాంప్‌లో జరగడం లేదు. ఆయా కంటి ఆస్పత్రులతో కొందరు మిలాఖతై వారి ఆస్పత్రికే ఎక్కువగా రెఫర్ చేస్తున్నారని సమాచారం. నిరాశగా పోతున్నా కంటి పరీక్షలు చేస్తున్నారంటే వచ్చి చేయించుకున్నా. –1, –2 సైట్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. కంటి అద్దాలు ఇచ్చే దగ్గరికి వెళ్లి చిట్టీ చూపిస్తే ట్యాబ్‌లో ఎంటర్ చేశారు. నెల రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయని చెప్పారు. దీంతో నిరాశతో పోతున్నా. వస్తాయో లేదో మరి.. చూడాలి. – సారయ్య, దుగ్గొండి ఆర్డర్ తీసుకుంటున్నాం జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం బాగా జరుగుతోంది. అందుబాటులో లేని కంటి అద్దాలు ఆర్డర్ తీసుకుంటున్నాం. ఆర్డర్ పెట్టిన కంటి అద్దాలు రాగానే అందిస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను వెంటనే అందిస్తున్నాం. –డాక్టర్ వెంకటరమణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ, వరంగల్ రూరల్ -
అద్భుతాలను చూపించే కళ్లజోడు
బుడాపెస్ట్: కళ్లముందు అద్భుతాలను ఆవిష్కరించే కళ్లజోడును హంగేరికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ బెన్స్ అగోస్టన్ కనిపెట్టాడు. ఆప్టికల్ ఇల్యూషన్స్ (దృశ్య భ్రాంతి) సిద్ధాంతం ఆధారంగా దీన్ని అభివృద్ధి చేశారు. దీనికి ‘మూడ్ స్పెక్టాకల్స్’ అని పేరు కూడా పెట్టాడు. దీన్ని ధరిస్తే కళ్లు ముందు దృశ్యాలు కదలనిది కదిలినట్టుగా, కదిలేది కదలనట్టుగా, కొండవాలు నుంచి జాలువారే జలపాతం పైకి ఎగబాకుతున్నట్టుగా సప్తవర్ణశోభితమై కనవిందు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకాన్ని విస్మరించి దేదీప్యమానమైన దివ్యలోకాన్ని సందర్శిస్తున్న భ్రాంతి కలుగుతుంది. అంతే కాకుండా ధరించిన వ్యక్తి మానసిక స్థితిని బట్టి కళ్లముందు కదలాడే దృశ్యాలు క్షణక్షణం మారిపోతుంటాయి. మరో మాటలో చెప్పాలంటే ‘బాహుబలి’ చిత్రంలో బాహుబలి కొండ ఎక్కుతున్న దృశ్యంలో అచ్చం మనమే ఉన్నట్టుగా భ్రాంతి కలుగుతుంది. ఇక్కడ సినిమాకు, ఈ కళ్లజోడు ధరించిన వ్యక్తి అనుభూతికి తేడా ఏమిటంటే...సినిమాలో కనిపించేది వాస్తవంగా భావిస్తే, అందులో జాలువారుతున్న భారీ జలపాతం మధ్య మేరు పర్వత శిఖరాన్ని బాహుబలి అధిరోహిస్తుంటాడు. కళ్లుజోడు ధరించిన వ్యక్తి ఉన్నచోటు నుంచి కదలడు కనుక తన చుట్టే భారీ జలపాతం జాలువారుతున్నట్టు, మేరు పర్వతం కాళ్ల కింది నుంచి కిందకు తరగిపోతున్నట్టు దృశ్య భ్రాంతి కలుగుతోంది. కళ్లజోడు ధరించిన ప్రతివ్యక్తికి ఒకేలాంటి దృశ్యభ్రాంతి కూడా కలగదు. వారి వారి మూడ్స్, ఆలోచనలనుబట్టి దృశ్యభ్రాంతులుంటాయి. ఎప్పుడు సంగీతాన్ని ఆస్వాదించేవారికి, కొండలు, లోయల మధ్య విహరిస్తూ ఉభయ సంధ్య వేళల్లో ప్రకృతి రమణీయతనను ఆనందించేవారికి ఈ క ళ్లజోడు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదని చెబుతున్నారు ఆర్టిస్ట్ అగోస్టన్. ఈస్థాయిలోకాకున్నా ఇలాంటి దృశ్యభ్రాంతిని కలిగించే మాదకద్రవ్యాలు చీకటి మార్కెట్లో కొన్ని దేశాల్లో లభిస్నున్నాయి. అలాంటి డ్రగ్స్ వాడడం ప్రాణాంతకం. మూడ్ కళ్లజోడును వాడడం ఒక్క మూర్ఛ రోగులకు తప్ప ఎవరికి ఎలాంటి హాని కలిగించదు. అలా అని దృశ్యభ్రాంతిలో ఉండడం వల్ల ఎలాంటి చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడరాదు సుమా. ఈ కళ్లజోడును ఎలా తయారు చేశారంటే.... 3డీ ప్రింటర్ ద్వారా కళ్లజోడు ఫ్రేమ్‌ను తయారు చేశారు. అందులో ఆర రకాల లెన్సులను అమర్చారు. వాటికి ఆకుపచ్చ, ఎరుపు, నీలి రంగుల్లో ఉండే మూడు కాంతి (లైట్) ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫిల్టర్లను ఎవరికి వారు తిప్పుకునే అమరిక ఉంటుంది. వీటిని తిప్పడం ద్వారానే కళ్లు ముందున్న దృశ్యాలు అద్భుతరూపాల్లోకి మారుతాయి. కాంతి కిరణాలు రంగునుబట్టి పరావర్తనం చెందుతాయన్న సైన్స్ సూత్రం తెల్సిందే. ఆ సూత్రం ఆధారంగానే ఈ కళ్లజోడులో కలర్ ఫిల్టర్లు పనిచేస్తాయి. ఈ సరికొత్త కళ్లజోడును అగోస్టన్ ఇప్పటి వరకు ఒకటే తయారు చేశారు. ప్రస్తుతం వివిధ కంపెనీలతో మాట్లాడుతున్నారు. ఎంపిక చేసుకున్న కంపెనీ ద్వారా వీటిని ఉత్పత్తిచేసి మార్కెట్లో విక్రయించాలన్నది ఆయన ఆలోచన.