అద్భుతాలను చూపించే కళ్లజోడు | Mood glasses designed by Bence Agoston simulate psychedelic hallucinations of LSD | Sakshi
Sakshi News home page

అద్భుతాలను చూపించే కళ్లజోడు

Published Fri, Aug 7 2015 2:08 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

అద్భుతాలను చూపించే కళ్లజోడు

అద్భుతాలను చూపించే కళ్లజోడు

బుడాపెస్ట్: కళ్లముందు అద్భుతాలను ఆవిష్కరించే కళ్లజోడును హంగేరికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ బెన్స్ అగోస్టన్ కనిపెట్టాడు. ఆప్టికల్ ఇల్యూషన్స్ (దృశ్య భ్రాంతి) సిద్ధాంతం ఆధారంగా దీన్ని అభివృద్ధి చేశారు. దీనికి ‘మూడ్ స్పెక్టాకల్స్’ అని పేరు కూడా పెట్టాడు. దీన్ని ధరిస్తే కళ్లు ముందు దృశ్యాలు కదలనిది కదిలినట్టుగా, కదిలేది కదలనట్టుగా, కొండవాలు నుంచి జాలువారే జలపాతం పైకి ఎగబాకుతున్నట్టుగా సప్తవర్ణశోభితమై కనవిందు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకాన్ని విస్మరించి దేదీప్యమానమైన దివ్యలోకాన్ని సందర్శిస్తున్న భ్రాంతి కలుగుతుంది. అంతే కాకుండా ధరించిన వ్యక్తి మానసిక స్థితిని బట్టి కళ్లముందు కదలాడే దృశ్యాలు క్షణక్షణం మారిపోతుంటాయి.

మరో మాటలో చెప్పాలంటే ‘బాహుబలి’ చిత్రంలో బాహుబలి కొండ ఎక్కుతున్న దృశ్యంలో అచ్చం మనమే ఉన్నట్టుగా భ్రాంతి కలుగుతుంది. ఇక్కడ సినిమాకు, ఈ కళ్లజోడు ధరించిన వ్యక్తి అనుభూతికి తేడా ఏమిటంటే...సినిమాలో కనిపించేది వాస్తవంగా భావిస్తే, అందులో జాలువారుతున్న భారీ జలపాతం మధ్య మేరు పర్వత శిఖరాన్ని బాహుబలి అధిరోహిస్తుంటాడు. కళ్లుజోడు ధరించిన వ్యక్తి ఉన్నచోటు నుంచి కదలడు కనుక  తన చుట్టే భారీ జలపాతం జాలువారుతున్నట్టు, మేరు పర్వతం కాళ్ల కింది నుంచి కిందకు తరగిపోతున్నట్టు దృశ్య భ్రాంతి కలుగుతోంది. కళ్లజోడు ధరించిన ప్రతివ్యక్తికి ఒకేలాంటి దృశ్యభ్రాంతి కూడా కలగదు. వారి వారి మూడ్స్, ఆలోచనలనుబట్టి దృశ్యభ్రాంతులుంటాయి.

ఎప్పుడు సంగీతాన్ని ఆస్వాదించేవారికి, కొండలు, లోయల మధ్య విహరిస్తూ ఉభయ సంధ్య వేళల్లో ప్రకృతి రమణీయతనను ఆనందించేవారికి ఈ క ళ్లజోడు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదని చెబుతున్నారు ఆర్టిస్ట్ అగోస్టన్. ఈస్థాయిలోకాకున్నా ఇలాంటి దృశ్యభ్రాంతిని కలిగించే మాదకద్రవ్యాలు చీకటి మార్కెట్‌లో కొన్ని దేశాల్లో లభిస్నున్నాయి. అలాంటి డ్రగ్స్ వాడడం ప్రాణాంతకం. మూడ్ కళ్లజోడును వాడడం ఒక్క మూర్ఛ రోగులకు తప్ప ఎవరికి ఎలాంటి హాని కలిగించదు. అలా అని దృశ్యభ్రాంతిలో ఉండడం వల్ల ఎలాంటి చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడరాదు సుమా.

 ఈ కళ్లజోడును ఎలా తయారు చేశారంటే....
 3డీ ప్రింటర్ ద్వారా కళ్లజోడు ఫ్రేమ్‌ను తయారు చేశారు. అందులో ఆర రకాల లెన్సులను అమర్చారు. వాటికి ఆకుపచ్చ, ఎరుపు, నీలి రంగుల్లో ఉండే మూడు కాంతి (లైట్) ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫిల్టర్లను ఎవరికి వారు తిప్పుకునే అమరిక ఉంటుంది. వీటిని తిప్పడం ద్వారానే కళ్లు ముందున్న దృశ్యాలు అద్భుతరూపాల్లోకి మారుతాయి. కాంతి కిరణాలు రంగునుబట్టి పరావర్తనం చెందుతాయన్న సైన్స్ సూత్రం తెల్సిందే. ఆ సూత్రం ఆధారంగానే ఈ కళ్లజోడులో కలర్ ఫిల్టర్లు పనిచేస్తాయి. ఈ సరికొత్త కళ్లజోడును అగోస్టన్ ఇప్పటి వరకు ఒకటే తయారు చేశారు. ప్రస్తుతం వివిధ కంపెనీలతో మాట్లాడుతున్నారు. ఎంపిక చేసుకున్న కంపెనీ ద్వారా వీటిని ఉత్పత్తిచేసి మార్కెట్‌లో విక్రయించాలన్నది ఆయన ఆలోచన.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement