చిన్నపిల్లలు తమ కళ్లను అటు ఇటు తిప్పి చూస్తున్నప్పుడు వాళ్ల రెండు కన్నులు సమానంగా ఉండాలి. అలా కాకుండా వాటిలో ఏదైనా కనుపాప పక్కకు చూస్తున్నట్లుగా ఉండి. కన్నుల మధ్య అలైన్‌మెంట్ లోపించడాన్ని మెల్ల కన్నుగా చెప్పవచ్చు. కొంతమంది చిన్నారుల్లో ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పిల్లల్లో చూపు కాస్త మసగ్గా ఉండవచ్చు లేదా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు.
అందుకే చిన్నారులు తమ మూడో నెల వరకు ఒకేచోట దృష్టి కేంద్రీకరించలేరు. మూడు నెలల వయసప్పటి నుంచి పిల్లలు ఒక వస్తువు (ఆబ్జెక్ట్) మీద దృష్టి పెట్టడం మెుదలుపెడతారు. మూడు నెలల వయసు దాటాక పిల్లల్లో మెల్లకన్ను కనిపిస్తుంటే వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. అంతేతప్ప మెల్ల అదృష్టమనే అపోహతో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజానికి అది దురదృష్టం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా, కారణాలూ, చికిత్స త్వరగా ఎందుకు చేయించాలనే అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
మెల్ల ఉందని తెలుసుకోవడమెలా?
పిల్లల కన్నులు ఒకేలా లేకపోవడం, ఒక పక్కకు చూసినప్పుడు వాళ్లలో కేవలం ఒక కన్నుకు మాత్రమే ఆ పక్కకు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘మెల్ల’ అని అనుకోవచ్చు. పసిపాపలు బలహీనంగా ఉండి, వాళ్లలో ఏదైనా రుగ్మత ఉండటం వల్ల ఈ లక్షణం కనిపించినా దాన్ని మెల్ల అనే అనుకోవాలి.
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పై లక్షణాలు కనిపిస్తే దాని గురించి అంతగా ఆందోళన అక్కర్లేదు. అయితే మూడు నెలలు దాటాక కూడా అవే లక్షణాలు కనిపిస్తే వెంటనే పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించాలి.
కారణాలు...
మెల్లకన్ను రావడానికి ఇదీ కారణమని నిర్దిష్టంగా చెప్పడం కష్టం. కొందరిలో పుట్టుకతోనే రావచ్చు. లేదా దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఉండటం వల్ల... అంటే హ్రస్వ దృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం, మజిల్ ఇంబాలెన్సెస్, నరాల సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. అయితే స్పష్టంగా కనిపించడం అన్నది కాస్త పిల్లలు పెద్దయ్యాక జరుగుతుంటుంది. మెదడుకు సంబంధించిన రుగ్మతలు, జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కూడా మెల్ల కన్ను వస్తుంది.
త్వరిత నిర్ధారణ చాలా ముఖ్యం
చిన్నారుల్లో మెల్ల కన్ను ఉన్నట్లు చూడటంగానీ లేదా అనుమానించడం గాని జరిగినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. వుూడు నెలలు దాటాక లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించి, తగిన చికిత్స అందించక΄ోతే ఆ కండిషన్ శాశ్వతం అయ్యే అవకాశం ఉంది.
మెల్లకన్ను ఉన్న పిల్లల్లో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఏమైనా ఉన్నాయా అని నిర్ధారణ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే చక్కదిద్దేందుకు కళ్లద్దాలు (కరెక్టివ్ స్పెక్టకిల్స్) వాడటం తప్పనిసరి. ఆ తర్వాత కూడా డాక్టర్ చెప్పిన విధంగా పిల్లలను కంటి డాక్టర్ ఫాలో అప్‌లో ఉంచాలి.
మెల్లకన్నుకు వీలైనంత త్వరగా చికిత్స చేయించకోకపోతే అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు / కాంప్లికేషన్‌కు దారితీయవచ్చు. అంటే... మెల్ల ఉన్న కంటిలో చూపు క్రవుంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆరేళ్ల లోపు దీన్ని చక్కదిద్దకోకపోతే ఆ దృష్టిలోపం శాశ్వతమయ్యే అవకాశాలూ ఎక్కువే.
చికిత్స
మెల్ల కన్నుల్లోని అకామడేటివ్, ఈసోట్రోపియా అనే రకాలకు ‘ప్లస్’ కళ్లజోళ్లను డాక్టర్లు సూచిస్తారు. ఒక కన్నులో దృష్టిలోపం ఉండి, ఒక కన్ను నార్మల్‌గా ఉన్నప్పటికీ... దృష్టిలోపం ఉన్న కన్ను క్రమంగా మెల్లకన్నులా మారుతుంది. రానురానూ ఇది ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా) అనే కండిషన్‌కు దారితీస్తుంది. దీనికి కూడా కళ్లజోడు వాడటమే సరైన చికిత్స. అప్పుడప్పుడూ కనిపించే మెల్ల కన్ను (ఇంటర్‌మిటెంట్ స్క్వింట్) అనేది కంటి కండరాల బలహీనత వల్ల వస్తుంది.
కంటి వ్యాయామాల ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కొందరు చిన్నారులు పుట్టుకతోనే మెల్లకన్ను కలిగి ఉంటారు. దీనికి న్యూరాలజిస్ట్ సహాయంతో చికిత్స అందించాల్సి వస్తుంది. వీటన్నింటితోనూ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు కంటి వైద్య నిపుణులు శస్త్రచికిత్సను సూచిస్తారు.
ఈ శస్త్రచికిత్స చాలా సులువైనదీ, ఫలితాలు కూడా చక్కగా ఉంటాయి. ఇప్పటికీ చాలాచోట్ల మారుమూల పల్లెల్లో మెల్ల కన్ను అదృష్టమనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. చిన్నారులు తమ దృష్టి జ్ఞానం కోల్పోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మెల్లకన్నుకు చికిత్స అందించడం అవసరం.
డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment