
ఊసరవెల్లుల్లా రంగులు మార్చే ఈ చెట్లు ‘ఉప్ప’చెట్లు. ఈ చెట్లు ఏడాదికి రెండుసార్లు రంగులు మార్చుకుంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో అరకులోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలం దుర్గం గ్రామ పంచాయతీ బంగారం గరువు సమీపంలోని ఉప్ప గ్రామంలో ఈ చెట్లను చూడవచ్చు. దాదాపు పదహారువేల ఎకరాల విస్తీర్ణంలోని వనంలో ఈ చెట్లు ఉన్నాయి. ఇవి దాదాపు ఇరవై మీటర్ల ఎత్తులో గుండ్రంగా పెరుగుతాయి. వీటి ఆకులు దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. ‘సపోటసీ’ కుటుంబానికి చెందిన ఈ వృక్షాన్ని ‘ఇండియన్ బటర్ ట్రీ’ అని పిలుస్తారు. ఉప్ప చెట్ల వనంలో నెమళ్లు సహా రకరకాల పక్షులు, కోతులు కనిపిస్తాయి. ఇక్కడ దోమలు, గబ్బిలాలు మాత్రం కనిపించవు.
ఏడాదికి రెండుసార్లు రంగుల మార్పు
ఈ చెట్ల ఆకులు ఏడాదికి రెండుసార్లు రంగులు మారుతాయి. సాధారణం ఇవి మిగిలిన ఆకుల్లా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరోసారి రంగులు మారుతుంటాయి. తొలుత తెలుపుగా, తర్వాత లేతగులాబిగా మారి, చివరకు ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ చెట్ల పువ్వులు నాగమల్లి పూలలా తెల్లగా, అందంగా ఉంటాయి. వీటి పరిమళాలు చాలా దూరం వరకు గుబాళిస్తుంటాయి.
పిక్కలకు ఓ లెక్కుంది!
ఉప్ప కాయలను పగలగొడితే లోపల పిక్కలుంటాయి. సాదాగా ఉంటే మగ పిక్కలని, త్రికోణాకారంలో ఉంటే ఆడ పిక్కలని గిరిజనులు నమ్ముతారు. విద్యుత్తు సౌకర్యం లేని రోజుల్లో– కిరోసిన్ కూడా అందుబాటులో లేనప్పుడు పిక్కకు రంధ్రం చేసి ఒత్తి గుచ్చి వెలిగించేవారు.
లేదంటే సన్నని ఇనుప తీగతో పిక్కలను దండలా గుచ్చి వెలిగించేవారు. ఈ పిక్కలను మెత్తగా దంచి నూనె తీస్తారు. ఈ నూనెను తలకు రాసుకోవడానికి, దీపం పెట్టడానికి, శరీరంపై దద్దుర్లు వస్తే పైపూతగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడతారు.
బీజం ఎక్కడ పడింది!
ఉప్ప చెట్లు శ్రీలంకలో ఎక్కువగా ఉంటాయి. ఇది వారి జాతీయ వృక్షం. మన దేశంలో హిమాలయాల చుట్టుపక్కల, బిహార్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. దక్షిణాదిన అల్లూరి జిల్లాలోనే తారసపడతాయి. ఈ చెట్ల పుట్టుక గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 17వ శతాబ్దంలో ఒక సాధువు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఇంటికి వెళ్లి అన్నం పెట్టాలని అడిగాడట! వారు తిరస్కరించగా, కొంత దూరం ప్రయాణించి మరో ఇంటికి వెళ్లి వేడుకున్నాడు. ఆ ఇంట్లో భోజనం పెట్టగా, తిని సంతృప్తి చెంది,
ఆ ప్రాంతంలో బంగారం పండుతుందని ఆశీర్వదించి, అన్నం పెట్టని చోట ఉప్ప చెట్లు పెరుగుతాయని శాపం పెట్టినట్లు గిరిజనం చెబుతున్నారు. అవే బంగారం గరువు, ఉప్ప గ్రామాలు అయ్యాయని ప్రతీతి. జయపురం రాజా విక్రమ్‌దేవ్‌వర్మ ఈ ప్రాంతంలో ఉప్ప విత్తులు జల్లించారన్నది మరో కథనం. గిరిజనులు ఈ చెట్లను అతి పవిత్రంగా చూసుకుంటారు.
ఈ తోటలో ఎవరైనా మలమూత్రాదులు విసర్జిస్తే శిక్షిస్తారు. ఈ మేరకు హెచ్చరిక బోర్డులు పెట్టారు. చెట్లను కొడితే కఠిన శిక్షలు అమలుచేస్తారు. ఈ వనాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మార్చారు. ఈ చెట్ల రక్షణ బాధ్యత గ్రామ దేవత గుణాలమ్మ తల్లి చూసుకుంటుందని నమ్ముతారు. అరవై ఏళ్ల కిందట గ్రామదేవతకు గుడి నిర్మించారు. ఏటా ఇక్కడ ఘనంగా జాతర జరుపుతారు.
ఎలా చేరుకోవాలంటే...
పాడేరుకు 30 కిలోమీటర్లు, అరకు నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉప్ప గ్రామం ఉంది. విశాఖపట్నం నుంచి 130 కిలోమీటర్ల దూరాన ఉంది. సబ్బవరం మీదుగా పాడేరు–అరకు మార్గంలో ఉప్ప గ్రామానికి చేరుకోవచ్చు.
కార్లు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లవచ్చు. ఈ మార్గంలో వచ్చేవారు వాహనాల్లో ఇంధనం నింపుకోవాలంటే డుంబ్రిగుడలో మాత్రమే పెట్రోల్ బంకు ఉంది. ఉప్ప తోటల్లో పర్యాటకులు సెల్ఫీలు తీసుకుని సంబరపడుతుంటారు. ఇటీవలి కాలంలో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు విరివిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సత్యదేవ్ నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ