నగరంలోని ఓ శిబిరంలో సిబ్బందికి సరఫరా చేసిన నాసిరకమైన భోజనం
ఖమ్మంవైద్యవిభాగం: శిబిరాలకు వేళకు వస్తారు.. రోగులను పరీక్షిస్తారు.. కంటి అద్దాలతోపాటు మందులు అందిస్తారు.. శస్త్ర చికిత్సలు అవసరముంటే ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు.. ఇంత సేవ చేసినా భోజన విరామంలో సమయానికి కడుపునిండా తినలేని పరిస్థితి.. ఇక్కడే ఉంది అసలు వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి.. అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం కొందరు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు వరంలా మారింది.
కంటి వెలుగు సిబ్బందికి అందించే ఆహారంలో కక్కుర్తికి పాల్పడుతూ నిధులు కాజేస్తున్నారు. నాణ్యత లోపించిన సరుకులతో వండిన భోజనం సరఫరా చేస్తూ వారి కడుపుకొట్టడమే కాకుండా.. ఆహారానికి కేటాయించిన నిధులు అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారుల కక్కుర్తి విధానాల వల్ల కంటి వెలుగు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను ప్రశ్నించలేక.. వడ్డించిన భోజనాన్ని అతి కష్టంమీద తినాల్సి వస్తోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం
తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
ఒక్కో బృందంలో 10 మంది సిబ్బంది
కంటి వెలుగు శిబిరానికి సంబంధించి ఒక్కో బృందంలో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్, సూపర్‌వైజర్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్, ఇద్దరు డీఈఓలు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఇద్దరు ఆశలు శిబిరంలో పాల్గొంటున్నారు. ఒక్కో బృందానికి ప్రతిరోజు రూ.2,500 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. సిబ్బందికి నాణ్యతతో కూడిన ఆహారం సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే.. అది కొందరు అధికారులకు వరంలా మారింది. కొందరు అధికారులు కక్కుర్తిపడి సిబ్బందికి నాసిరకమైన ఆహారం సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై బృందం సభ్యులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అయితే శిబిరాలపై దృష్టి సారించాల్సిన జిల్లా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారు ఆడిండే ఆట.. పాడిందే పాట అనే చందంగా పరిస్థితి తయారైంది.
32 బృందాలదీ అదే పరిస్థితి..
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 32 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 పీహెచ్‌సీలు, మూడు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించగా.. జిల్లాలో కార్యక్రమం నిర్వహించేందుకు 32 బృందాలను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అయితే అన్ని పీహెచ్‌సీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వీరికి ఆహారం సరఫరా చేసే విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కార్యక్రమం ప్రారంభమై నాలుగు నెలలు దాటినా తమకు సదుపాయాలు కల్పించడంలో అధికారులు చిన్నచూపు చూస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తూ.. ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలు చేయడంలో వీరి పాత్రే కీలకం. శిబిరంలో పాల్గొనే ఒక్కో బృందం గ్రామీణ ప్రాంతాల్లో రోజూ 250 మంది, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు చేయాలనే నిబంధన ఉంది. నాలుగు నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 4,50,000 మందికి కంటి పరీక్షలు చేశారు. విధి నిర్వహణలో పనిభారం వీరిపైనే ఎక్కువగా ఉంటుంది. నిత్యం కష్టపడుతున్నా వీరిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆహారం కోసం నెలకు రూ.20లక్షలు..
కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనే సిబ్బందికి ప్రతిరోజూ ఉదయం టిఫిన్, టీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి శని, ఆదివారం శిబిరాలకు సెలవు. శిబిరాలు ఉన్నన్ని రోజులు సిబ్బందికి మంచి ఆహారం సరఫరా చేయాల్సి ఉండగా.. ఈ మెనూ ఎక్కడా పాటించడం లేదు. ప్రభుత్వం వీటికోసం నెలకు రూ.20,00,000 నిధులు కేటాయిస్తోంది. ప్రతిరోజూ 32 బృందాలకు కలిపి రూ.80వేలు కేటాయిస్తున్నారు. కానీ.. ఇందులో సిబ్బంది కోసం 30 శాతం నిధులు కూడా ఖర్చు చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టణ, నగర పరిధిలో ఉండే సిబ్బంది కోసం మధ్యాహ్నం పూట నాసిరకం ఆహారం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే కొంతమంది సిబ్బందికి స్థానిక గ్రామస్తులు భోజనం ఏర్పాటు చేస్తుండగా, మరికొందరు ఇంటి నుంచి లంచ్‌బాక్స్‌లు తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. సిబ్బంది మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. ఫిర్యాదు చేస్తే తమపై చర్యలు తీసుకుంటారనే భయంతో వారు మిన్నకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది ఆహారం కోసం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా.. సక్రమంగా వినియోగించేలా చూడాలని కంటి వెలుగు సిబ్బంది కోరుతున్నారు.
ఫిర్యాదులు అందలేదు..
కంటి వెలుగు సిబ్బంది ఆహారం కోసం ప్రభు త్వం రూ.2,500 చెల్లిస్తున్నట్లు జీఓ ఇచ్చినా.. రూ.1,500 చొప్పున మాత్రమే అందజేస్తున్నారు. సిబ్బందికి ఆహారం సక్రమంగానే సరఫరా చేస్తున్నాం. వారి నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటాం. కార్యక్రమం జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతోంది. – డాక్టర్ కోటిరత్నం, కంటి వెలుగు కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment