రైస్‌మిల్లు వ్యవహారంపై హైడ్రామా .. డీటీపై క్రిమినల్‌ కేసు | Subsidy Rice Fraud In Khammam | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లు వ్యవహారంపై హైడ్రామా .. డీటీపై క్రిమినల్‌ కేసు

Published Thu, Jul 22 2021 8:52 AM | Last Updated on Thu, Jul 22 2021 8:52 AM

Subsidy Rice Fraud In Khammam - Sakshi

సాక్షి, గద్వాల(ఖమ్మం): ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సంరక్షించాల్సిన అధికార యంత్రాంగమే కక్కుర్తి పడింది. పేదలకు సబ్సిడీ బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే అక్రమార్కులు రూ.లక్షల్లో దండుకునేందుకు జిల్లాలో నెలకు వేల మెట్రిక్‌ టన్నుల సబ్సిడీ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. గత అక్టోబర్‌ 2న జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రేఖా రైస్‌మిల్లుపై రెవెన్యూ, పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. 170.5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకుని డీసీఎం వాహనాన్ని సీజ్‌ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

అయితే విజిలెన్స్‌ విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం అయోమయంలో పడ్డారు. మూడు నెలల్లోనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకోవాలని నివేదికలు ఇచ్చినా పెడచెవిన పెట్టారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. చివరకు గత నెల 21న డీటీ గణపతిరావుపై గద్వాల పట్టణ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసినా బయటకు వెల్లడించలేదు.

ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ముందు నుంచి ఈ కేసు విచారణలోనే క్లోజ్‌ చేయాలని ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పారు. మార్చి చివరి వారంలో బదిలీ అయ్యారు. మూడు నెలల తర్వాతే రేఖా రైస్‌ మిల్లు వ్యవహారంపై ఇక్కడి అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.  

కొత్త మలుపులు.. 
ఈ వ్యవహారంలో కొందరు పోలీసు, రెవెన్యూ, సివిల్‌ సప్లయ్‌ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఉండటంతో విజిలెన్స్‌ బృందంపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో సీఐడీ లేదా ఏసీబీకి బదిలీ చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే సీఐడీకి అప్పగిస్తే తమ శాఖపై అపవాదు వస్తుందనే గ్రహించి ఏసీబీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ కేసు విచారణలో ప్రలోభాలకు గురిచేసే వారిపై మరింత దూకుడుగా చర్యలు తీసుకోవచ్చనే భావిస్తున్నారు. బియ్యం పట్టుబడిన క్రమంలో ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన అంశాలపై లోతైన విచారణ చేయాలనే ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. మూడు శాఖల అధికారులపై కొరడా ఝుళిపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 

కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు 
నిందితుడు డీటీ గణపతిరావు పరారీలో ఉన్నాడు. అయితే కాల్‌డేటా ఆధారంగా నిఘా ఉంచాం. త్వరలో అదుపులోకి తీసుకుంటాం. బాధ్యులపై కఠినచర్యలు తప్పవు. ప్రత్యేక నిఘా బృందంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఆశాఖ అధికారుల కాల్‌డేటాను సైతం పరిశీలిస్తాం. బంధువులు, స్నేహితుల వివరాలపై ఆరా తీస్తున్నాం. 

– రమాదేవి, పట్టణ రెండో ఎస్‌ఐ, గద్వాల

ఆదేశాలు వస్తే విచారణ చేపడ్తాం 
రేఖా రైస్‌మిల్లులో పట్టుబడిన బియ్యం కేసుపై ఆదేశాలు వచ్చిన వెంటనే విచారణ చేపడ్తాం. అయితే కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలిస్తున్నాం. ఏదిఏమైనా ప్రజాధనం దుర్వినియోగం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్, ఏసీబీ సంయుక్తంగా పనిచేస్తాయి. అక్రమార్కులపై నిఘా ఉంచాం.  

– కృష్ణయ్యగౌడ్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఏసీబీ అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement