rice subsidy
-
రైస్‌మిల్లు వ్యవహారంపై హైడ్రామా .. డీటీపై క్రిమినల్ కేసు
సాక్షి, గద్వాల(ఖమ్మం): ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సంరక్షించాల్సిన అధికార యంత్రాంగమే కక్కుర్తి పడింది. పేదలకు సబ్సిడీ బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే అక్రమార్కులు రూ.లక్షల్లో దండుకునేందుకు జిల్లాలో నెలకు వేల మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. గత అక్టోబర్ 2న జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రేఖా రైస్‌మిల్లుపై రెవెన్యూ, పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాడులు నిర్వహించారు. 170.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అయితే విజిలెన్స్ విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం అయోమయంలో పడ్డారు. మూడు నెలల్లోనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకోవాలని నివేదికలు ఇచ్చినా పెడచెవిన పెట్టారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. చివరకు గత నెల 21న డీటీ గణపతిరావుపై గద్వాల పట్టణ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసినా బయటకు వెల్లడించలేదు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ముందు నుంచి ఈ కేసు విచారణలోనే క్లోజ్ చేయాలని ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పారు. మార్చి చివరి వారంలో బదిలీ అయ్యారు. మూడు నెలల తర్వాతే రేఖా రైస్ మిల్లు వ్యవహారంపై ఇక్కడి అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. కొత్త మలుపులు.. ఈ వ్యవహారంలో కొందరు పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఉండటంతో విజిలెన్స్ బృందంపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో సీఐడీ లేదా ఏసీబీకి బదిలీ చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే సీఐడీకి అప్పగిస్తే తమ శాఖపై అపవాదు వస్తుందనే గ్రహించి ఏసీబీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసు విచారణలో ప్రలోభాలకు గురిచేసే వారిపై మరింత దూకుడుగా చర్యలు తీసుకోవచ్చనే భావిస్తున్నారు. బియ్యం పట్టుబడిన క్రమంలో ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాలపై లోతైన విచారణ చేయాలనే ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. మూడు శాఖల అధికారులపై కొరడా ఝుళిపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు నిందితుడు డీటీ గణపతిరావు పరారీలో ఉన్నాడు. అయితే కాల్‌డేటా ఆధారంగా నిఘా ఉంచాం. త్వరలో అదుపులోకి తీసుకుంటాం. బాధ్యులపై కఠినచర్యలు తప్పవు. ప్రత్యేక నిఘా బృందంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఆశాఖ అధికారుల కాల్‌డేటాను సైతం పరిశీలిస్తాం. బంధువులు, స్నేహితుల వివరాలపై ఆరా తీస్తున్నాం. – రమాదేవి, పట్టణ రెండో ఎస్ఐ, గద్వాల ఆదేశాలు వస్తే విచారణ చేపడ్తాం రేఖా రైస్‌మిల్లులో పట్టుబడిన బియ్యం కేసుపై ఆదేశాలు వచ్చిన వెంటనే విచారణ చేపడ్తాం. అయితే కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలిస్తున్నాం. ఏదిఏమైనా ప్రజాధనం దుర్వినియోగం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్, ఏసీబీ సంయుక్తంగా పనిచేస్తాయి. అక్రమార్కులపై నిఘా ఉంచాం. – కృష్ణయ్యగౌడ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఏసీబీ అధికారి -
సబ్సిడీలపై కోతకు రెడీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయింపులు 10% కుదింపు బియ్యం, విద్యుత్ సబ్సిడీల భారం కుదింపే లక్ష్యంగా బాబు సర్కారు నిర్ణయం పీఆర్సీ ఊసే లేదు.. 27 శాతం ఐఆర్‌కే సూచన సాక్షి, హైదరాబాద్: పేద వర్గాలకు ఇచ్చే సబ్సిడీల భారాన్ని వీలైనంత మేర తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోని ప్రణాళికేతర కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన నిధుల్లో భారీగా కోతలు పెట్టిన ప్రభుత్వం.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కే టాయింపుల్లో కూడా ఆ వర్గాలకు కేటాయింపులను ప్రస్తుతానికన్నా 10 శాతం మేర తగ్గించేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సబ్సిడీ బియ్యం, విద్యుత్ సబ్సిడీలను వీలైనంత వరకు తగ్గించేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) బడ్జెట్ ప్రణాళికేతర కేటాయింపులకు, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర కేటాయింపుల్లో సవరణలకు సంబంధించి ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం.. సబ్సిడీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 10% మేర తగ్గించి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తద్వారా బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీల భారాన్ని తగ్గించుకోనుంది. అలాగే ఇతర గ్రాంట్ ఇన్ ఎయిడ్ రంగాల కేటాయింపులను.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులకన్నా 10% మేర తగ్గించాలని పేర్కొంది. అంటే రైతుల రుణ విముక్తి, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య కార్డులు, వడ్డీలేని రుణాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు, స్థానిక సంస్థలకు ఇచ్చే ఆర్థిక సాయం రంగాలకు కేటాయింపులను తగ్గించనున్నారన్నమాట. ఇక ఈ మార్గదర్శకాల్లో ఉద్యోగుల పీఆర్సీ ఊసే లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఉద్యోగుల వేతనాలకు కేటాయించిన మొత్తాన్ని 2% మేర తగ్గించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని ఆర్థిక శాఖ సూచించింది. మధ్యంతర భృతిని 27 శాతంగా ప్రతిపాదించాలని పేర్కొంది. డీఏ కింద వేతనాల్లో 90% ప్రతిపాదించాలని తెలిపారు. ఇంటి అద్దె అలవెన్స్ కింద 15%, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు 2%, ఆర్జిత సెలవు కింద 8% ప్రతిపాదించాలని పేర్కొన్నారు. కార్యాలయాలకు సంబంధించిన మంచినీరు, విద్యుత్ చార్జీలను ప్రస్తుత ఏడాదికన్నా 10% పెంచి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తద్వారా ప్రజలకు సంబంధించిన నీటి, కరెంటు చార్జీల మోత కూడా తప్పదనే సంకేతాలిచ్చింది.