సబ్సిడీలపై కోతకు రెడీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయింపులు 10% కుదింపు
బియ్యం, విద్యుత్ సబ్సిడీల భారం కుదింపే లక్ష్యంగా బాబు సర్కారు నిర్ణయం
పీఆర్సీ ఊసే లేదు.. 27 శాతం ఐఆర్‌కే సూచన
సాక్షి, హైదరాబాద్: పేద వర్గాలకు ఇచ్చే సబ్సిడీల భారాన్ని వీలైనంత మేర తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోని ప్రణాళికేతర కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన నిధుల్లో భారీగా కోతలు పెట్టిన ప్రభుత్వం.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కే టాయింపుల్లో కూడా ఆ వర్గాలకు కేటాయింపులను ప్రస్తుతానికన్నా 10 శాతం మేర తగ్గించేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సబ్సిడీ బియ్యం, విద్యుత్ సబ్సిడీలను వీలైనంత వరకు తగ్గించేయనుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) బడ్జెట్ ప్రణాళికేతర కేటాయింపులకు, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర కేటాయింపుల్లో సవరణలకు సంబంధించి ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం.. సబ్సిడీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 10% మేర తగ్గించి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తద్వారా బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీల భారాన్ని తగ్గించుకోనుంది.
అలాగే ఇతర గ్రాంట్ ఇన్ ఎయిడ్ రంగాల కేటాయింపులను.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులకన్నా 10% మేర తగ్గించాలని పేర్కొంది. అంటే రైతుల రుణ విముక్తి, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య కార్డులు, వడ్డీలేని రుణాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు, స్థానిక సంస్థలకు ఇచ్చే ఆర్థిక సాయం రంగాలకు కేటాయింపులను తగ్గించనున్నారన్నమాట. ఇక ఈ మార్గదర్శకాల్లో ఉద్యోగుల పీఆర్సీ ఊసే లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఉద్యోగుల వేతనాలకు కేటాయించిన మొత్తాన్ని 2% మేర తగ్గించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని ఆర్థిక శాఖ సూచించింది.
మధ్యంతర భృతిని 27 శాతంగా ప్రతిపాదించాలని పేర్కొంది. డీఏ కింద వేతనాల్లో 90% ప్రతిపాదించాలని తెలిపారు. ఇంటి అద్దె అలవెన్స్ కింద 15%, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు 2%, ఆర్జిత సెలవు కింద 8% ప్రతిపాదించాలని పేర్కొన్నారు. కార్యాలయాలకు సంబంధించిన మంచినీరు, విద్యుత్ చార్జీలను ప్రస్తుత ఏడాదికన్నా 10% పెంచి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తద్వారా ప్రజలకు సంబంధించిన నీటి, కరెంటు చార్జీల మోత కూడా తప్పదనే సంకేతాలిచ్చింది.