Medical Reimbursement
-
AP: ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకం గడువును 2022 ఆగస్టు 1వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎంటి క్రిష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన అనంతరం మరికొంత కాలం పాటు దీన్ని పొడిగిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్ఎస్)తో పాటు మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీంను కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్ఎస్ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాల్ని అందుబాటులోకి తేవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒకు సూచించారు. ఇందుకు సంబంధించి ఆరోగ్య శ్రీ సీఈవో అవసరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఉండేందుకు గాను తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆర్థిక శాఖ సమ్మతి మేరకే ఈ ఉత్తర్వుల్ని జారీ చేశామని కృష్ణ బాబు స్పష్టం చేశారు. చదవండి: AP: ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువు పొడిగింపు -
జూన్ వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు వైద్యచికిత్స ఖర్చుల రీయింబర్స్మెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం ఈ ఏడాది జూన్ వరకు కొనసాగుతుందని పేర్కొంటూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రీయింబర్స్మెంట్ విధానంతోపాటు ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్ఎస్) సమాంతరంగా కొనసాగుతాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. 2017 డిసెంబర్ 31తోనే మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో 2018 జనవరి 1 నుంచి ఈహెచ్ఎస్ ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు, పింఛనుదారులకు వైద్యసేవలను కొనసాగించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఈహెచ్ఎస్ నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను, సిబ్బందిని నియమించకపోవడంతో వైద్యసేవల నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో రీయింబర్స్మెంట్ విధానాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు ముగియడంతో తాజాగా మరోసారి పొడిగించింది. -
ఉద్యోగుల ‘రీయింబర్స్మెంట్’ బంద్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రక్రియ నిలిచిపోయింది. 2017 డిసెంబరు 31తోనే మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం గడువు ముగియగా.. దాని కొనసాగింపుపై వైద్యారోగ్య శాఖ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ముందుగా ప్రతిపాదించిన ప్రకారం 2018 జనవరి నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం ఉండబో దని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల వైద్యసేవల పథకం (ఈహెచ్ఎస్) ఆధ్వర్యంలోనే ఉద్యోగులు, పింఛనుదారులకు వైద్య సేవల ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నాయి. ఈ లెక్కన వెల్నెస్ సెంటర్ల ద్వారానే ఉద్యోగులు, పింఛన్‌దారులకు వైద్య సేవలు కొనసాగుతాయి. వెల్నెస్ సెంటర్లలో ఓపీ సేవలు అందిస్తారు. అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఆధారంగా మెరుగైన చికిత్స అవసరమని గుర్తిస్తే.. ఎంపిక చేసిన ఆస్పత్రులకు పంపుతారు. ఇందులో వీలైనంత వరకు ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసే విషయంలో వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. ఈహెచ్ఎస్ నిర్వహణకు అవసరమైన ఉద్యోగులు, సిబ్బందిని నియమించకపోవడంతో వైద్య సేవల నిర్వహణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. లక్షలాది మందికి ఇబ్బంది.. రాష్ట్రంలో 8,32,085 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3,06,125 పింఛనుదారులు ఈహెచ్ఎస్ కింద నమోదయ్యారు. వీరికి వైద్య సేవలు అందించేందుకు ఈహెచ్ఎస్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా 200 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. 2018 జనవరి 1 నుంచి వెల్నెస్ సెంటర్లకు వెళ్లిన తర్వాతే వైద్య సేవలు పొందాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ ఏడాదిగా చెబుతోంది. వాస్తవానికి మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం ముగిసేలోపు రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. 2016 డిసెంబర్ 17న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మొదటి వెల్నెస్ సెంటర్, 2017 ఫిబ్రవరిలో వనస్థలిపురంలో, ఇదే ఏడాది నవంబర్‌లో వరంగల్‌లో మరో వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సిద్దిపేటలోనూ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినా.. సిబ్బంది కొరతతో పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదు. మొత్తంగా ఈహెచ్ఎస్ విధానాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయకుండానే.. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేయడంతో ఉద్యోగులు, పింఛనుదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. -
‘వెల్నెస్’కు వెళ్తేనే వైద్యం!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వైద్య సేవల విషయంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. జనవరి 1 నుంచి ఉద్యోగులు వెల్నెస్ సెంటర్లకు వెళ్లిన తర్వాతే వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం ఈ ఏడాది డిసెంబర్‌తో ఆగిపోనుంది. నచ్చిన ఆస్పత్రుల్లో ఉద్యోగులు చికిత్స చేయించుకునే పరిస్థితికి తెరపడనుంది. అయితే మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం ముగిసేలోగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా అది జరగలేదు. ఈ విషయంలో వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో జనవరికల్లా పాత జిల్లాల కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికీ రెండే వెల్నెస్ సెంటర్లు, అవీ హైదరాబాద్‌లోనే (ఖైరతాబాద్, వనస్థలిపురంలలో) ఉన్న నేపథ్యంలో తాజా పరిణామం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత విధానంలో ఎక్కడైనా వైద్యం... రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, మరో ఏడు లక్షల మంది వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 11 లక్షల మంది ప్రభుత్వపరంగా వైద్య సేవలు పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే అందుబాటులోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి బిల్లులతో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు వైద్య సేవలను అందించే ఆస్పత్రుల జాబితాను రూపొందించింది. కొన్నిసార్లు ఈ జాబితాలో లేని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఉద్యోగులు పెట్టిన ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. గడువులోగా వెల్నెస్ కేంద్రాలు వచ్చేనా? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య సేవల విషయంలో మార్పులు చేసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రవేశపెట్టింది. పథకం అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలోనే వైద్య సేవలను అందించాలని నిర్ణయించింది. అలాగే జర్నలిస్టుల వైద్య సేవల పథకాన్ని దీనికి అనుసంధానించింది. ఈ పథకం ప్రకారం వెల్నెస్ సెంటర్లలో అందుబాటులో ఉండే అన్ని విభాగాల వైద్యులు... చికిత్సల కోసం వచ్చే వారిని పరిశీలించి అవసరమైన టెస్ట్‌లు ప్రతిపాదించి వాటి నివేదికలను చూశాక అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య సేవలు అవసరమైతే ప్రభుత్వాస్పత్రులకు రిఫర్ చేస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేని వైద్య సేవల విషయంలో మాత్రమే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే ప్రభుత్వ ఆలోచన బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం అంతులేని జాప్యం నెలకొంది. తొలి దశలో భాగంగా 2016 డిసెంబర్ 17న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మొదటి వెల్నెస్ సెంటర్‌ను, 2017 ఫిబ్రవరి 2న వనస్థలిపురంలో రెండో సెంటర్‌ను ఏర్పాటు చేసిన సర్కారు... మిగిలిన జిల్లాల్లో డిసెంబర్‌లోగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఏవీ మొదలుకాలేదు. మరో రెండు నెలల్లో అన్ని పాత జిల్లాల కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నా గడువులోగా వాటి ఏర్పాటు ప్రక్రియ ముగిసే అవకాశాలు కనిపించట్లేదు. ఉన్న రెండు సెంటర్లలో విపరీతమైన రద్దీ రాష్ట్రంలో ప్రస్తుతం రెండే వెల్నెస్ సెంటర్లు ఉండడంతో ఈ కేంద్రాలకు వచ్చే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఖైరతాబాద్, వనస్థలిపురం వెల్నెస్ సెంటర్లకు రోజూ కనీసం 1,500 మంది చొప్పున ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తున్నారు. దీంతో వైద్యుల అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే వైద్యులకు పరీక్షల నివేదికలను చూపి అవసరమైన మందులను పొందడం మరింత ఆలస్యమవుతోంది. ఈ రెండు సెంటర్లలో ఇప్పటివరకు 2,40,517 మందిని వైద్యులు పరీక్షించి వారిలో 1,33,046 మందికి ఉచితంగా మందులు ఇచ్చారు. 25,221 మందిని చికిత్సల కోసం వివిధ ఆస్పత్రులకు పంపించారు. -
మరో మూడేళ్లు మెడికల్ రీయింబర్స్మెంట్ !
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, పింఛన్‌దారులకు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని మరో మూడేళ్లు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి గడువు ఈ నెల 31తో ముగియనుండగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. సుమారు 14 కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్‌కార్డుల అమలుపై స్తబ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
సబ్సిడీలపై కోతకు రెడీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయింపులు 10% కుదింపు బియ్యం, విద్యుత్ సబ్సిడీల భారం కుదింపే లక్ష్యంగా బాబు సర్కారు నిర్ణయం పీఆర్సీ ఊసే లేదు.. 27 శాతం ఐఆర్‌కే సూచన సాక్షి, హైదరాబాద్: పేద వర్గాలకు ఇచ్చే సబ్సిడీల భారాన్ని వీలైనంత మేర తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోని ప్రణాళికేతర కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన నిధుల్లో భారీగా కోతలు పెట్టిన ప్రభుత్వం.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కే టాయింపుల్లో కూడా ఆ వర్గాలకు కేటాయింపులను ప్రస్తుతానికన్నా 10 శాతం మేర తగ్గించేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సబ్సిడీ బియ్యం, విద్యుత్ సబ్సిడీలను వీలైనంత వరకు తగ్గించేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) బడ్జెట్ ప్రణాళికేతర కేటాయింపులకు, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర కేటాయింపుల్లో సవరణలకు సంబంధించి ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం.. సబ్సిడీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 10% మేర తగ్గించి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తద్వారా బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీల భారాన్ని తగ్గించుకోనుంది. అలాగే ఇతర గ్రాంట్ ఇన్ ఎయిడ్ రంగాల కేటాయింపులను.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులకన్నా 10% మేర తగ్గించాలని పేర్కొంది. అంటే రైతుల రుణ విముక్తి, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య కార్డులు, వడ్డీలేని రుణాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు, స్థానిక సంస్థలకు ఇచ్చే ఆర్థిక సాయం రంగాలకు కేటాయింపులను తగ్గించనున్నారన్నమాట. ఇక ఈ మార్గదర్శకాల్లో ఉద్యోగుల పీఆర్సీ ఊసే లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఉద్యోగుల వేతనాలకు కేటాయించిన మొత్తాన్ని 2% మేర తగ్గించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని ఆర్థిక శాఖ సూచించింది. మధ్యంతర భృతిని 27 శాతంగా ప్రతిపాదించాలని పేర్కొంది. డీఏ కింద వేతనాల్లో 90% ప్రతిపాదించాలని తెలిపారు. ఇంటి అద్దె అలవెన్స్ కింద 15%, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు 2%, ఆర్జిత సెలవు కింద 8% ప్రతిపాదించాలని పేర్కొన్నారు. కార్యాలయాలకు సంబంధించిన మంచినీరు, విద్యుత్ చార్జీలను ప్రస్తుత ఏడాదికన్నా 10% పెంచి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తద్వారా ప్రజలకు సంబంధించిన నీటి, కరెంటు చార్జీల మోత కూడా తప్పదనే సంకేతాలిచ్చింది. -
మరో 2 నెలలు మెడికల్ రీయింబర్స్మెంట్
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పథకం ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రానందున మరో 2 నెలల (ఫిబ్రవరి ఆఖరు వరకు) మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం జీవో జారీ చేసింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తోపాటు హెల్త్ కార్డుల పథకమూ అమల్లో ఉంటుందని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ జీవోలోని ఇతర ముఖ్యాంశాలు.. * ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖలతో చర్చించి అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి. * కార్పొరేట్ ఆసుపత్రులు, ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులపై ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్యం అందేలా ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖలు, ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్యలు తీసుకోవాలి. మెడికల్ డెరైక్టర్‌తో కలసి ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాలతో ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్చించాలి. * ఉద్యోగ సంఘాల నుంచి మరిన్ని వివరాలు, ఫిర్యాదులు స్వీకరించడానికి త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలి. * హెల్త్‌కార్డులు రూపొందించేందుకు ఆర్థిక శాఖ వద్ద ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆధార్ నంబర్లు వంటి సకల వివరాలూ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఇవ్వాలి. సీఎఫ్ఎంఎస్ ద్వారా ఉద్యోగుల వివరాలు ఆర్థిక శాఖకు అందడంలో జాప్యం జరిగే పక్షంలో.. ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ స్కీం (ఈహెచ్ఎస్) పోర్టల్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా డేటా నమోదుకు అవకాశమివ్వాలి. -
ఉద్యోగులకు ఊరట
మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపు.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ గుండెజబ్బు రోగుల స్టెంట్ల ధరల నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ఊరట లభించింది. వారికి ఆరోగ్య ధీమా కల్పించింది. మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు సమాంతరంగా కొనసాగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నం.40) జారీ చేసింది. ఉద్యోగులు, పింఛన్‌దారులు, ఉద్యోగుల కుటుంబసభ్యులకు నగదు రహిత వైద్యసేవలు అందించేందుకు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని గత నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే, ఈ పథకం అమలులో ఉండగా రీయింబర్స్‌మెంటు పథకం వర్తించదని తొలుత ప్రకటించింది. ఆయా కార్పొరేటు ఆసుపత్రులతో ప్రభుత్వానికి ఒప్పందం కుదరకపోవడం, ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందకపోవడంతో తేరుకున్న ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్‌మెంటు పథకాన్ని నవంబరు 30వ తేదీ వరకు పొడిగించింది. ఈలోగా కూడా కార్పొరేటు ఆసుపత్రులతో ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో ఉద్యోగులకు వైద్యసేవలు అందించడంలో ఎక్కడా ఇబ్బం దులు తలెత్తకుండా నగదు రహిత వైద్యసేవలతోపాటు, రీయింబర్స్‌మెంటు పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం రాజయ్య ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. అయినా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోని ఆసుపత్రుల్లోనూ నగదురహిత వైద్య అందడం లేదు. ప్రభుత్వం ఇంకా ఎలాంటి ధరలు నిర్ణయించకపోవడం, ‘ఆరోగ్య శ్రీ’కి మాదిరిగానే డబ్బులు చెల్లించాలని యోచించడం కార్పొరేట్ ఆసుపత్రులకు రుచించడంలేదు. ప్రత్యేక రేట్లను ఖరారు చేయాలని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరాయి. ఒప్పందం కుదిరే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు నెలలపాటు రెండు పథకాలకూ అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, ఆరోగ్యశ్రీ సేవల్లో భాగంగా గుండెజబ్బు రోగులకు స్టెంట్లు అమర్చేందుకు చెల్లించాల్సిన ఖర్చులకు సంబంధించి మరో ఉత్తర్వు (జీవో నెం.39)ను జారీ చేసింది. బేర్ మెటల్ స్టెంట్‌కు రూ.55 వేలు, అదనపు స్టెంట్‌కు రూ.10 వేలు, ‘డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్’కు రూ.65 వేలు, అదనపు స్టెంట్‌కు రూ.20 వేలుగా ప్యాకేజీని నిర్ణయించింది. ఈ మేరకే చెల్లింపులు చేయాలని ఆరోగ్య శ్రీ సీఈవోకు అనుమతినిచ్చింది. -
అవినీతికి చిరునామాగా జిల్లా విద్యాశాఖ
నెల్లూరు (టౌన్ ), న్యూస్‌లైన్ : విద్యాశాఖలో అక్రమార్కులపై వేటు పడింది. మెడికల్ రీయింబర్స మెంట్ వ్యవహారంలో దొంగబిల్లులు సమర్పించిన 29 మంది ఉపాధ్యాయులు, ఒక డీడీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ కమిషనర్, రాష్ర్ట డెరైక్టరేట్ అధికారులు డీఈఓ కార్యాలయానికి బుధవారం రాత్రి మెయిల్ పంపారు. దీంతో జిల్లాలో ఉపాధ్యాయుల అవినీతి బాగోతం బయటపడింది. ఈ విషయం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. జిల్లా విద్యాశాఖ అవినీతి, అక్రమాలకు నిలయమైందని కొన్నేళ్లుగా ఆరోపణలు న్నాయి. సస్పెన్షన్ వేటు పడటంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది. వివరాల్లోకి వెళితే... 2009-11 మధ్య కాలం లో మెడికల్ రీయింబర్స్మెంట్ వ్యవహారంలో రాష్ట్రంలోనే పెద్ద రాకెట్ కేం ద్రం నడిచింది. ప్రధానంగా నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారు. ఈ వ్యవహారం నల్గొండ జిల్లా లో ముదిరి పాకాన పడింది. అప్పట్లో డీఈఓ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు నల్గొండలో తగలబెట్టేందుకు ప్రయత్నించడంతో ఈ దొంగ బిల్లుల వ్యవహారం వెలుగుచూసింది. అకౌంట్ జనరల్(ఏజీ) కార్యాలయం ఈ బిల్లులను స్క్రూటినీ చేసింది. వారికి అనుమానం వచ్చి నేరుగా ఆస్పత్రులకు వెళ్లి పరిశీలించగా వైద్యం హుళక్కే అని తేలింది. అంతేకాక స్టాంపులు, ఇతరత్రా అంతా దొంగ వ్యవహారమే అని నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ కమిటీని వేసి అన్ని జిల్లాల్లో విచారించాలని ఆదేశించింది.మూడేళ్ల క్రితం డీఈఓతో కుమ్మక్కై పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల దగ్గరి బంధువులు మెడికల్ రీయింబర్స్మెంట్ పేరుతో దొంగ బిల్లులు సమర్పించారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ కమిటీని విచారణకు ఆదేశించింది. కమిటీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. దీని ప్రకారంగా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి భార్య, గతం లో ఇక్కడ ఏడీగా పనిచేసి పదోన్నతిపై హైదరాబాద్‌కు డిప్యూ టీ డెరైక్టర్‌గా బదిలీ అయిన మరొక మహిళ ఉన్నారు. వీరితో పాటు మరో 28 మంది టీచర్లు కూడా ఊబిలో చిక్కుకున్నారు. -
ఖజానాకు తాళం!
ఎన్నికల కారణంగా గత మూడు నెలలుగా అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కోడ్‌ను కూడా ఎత్తివేశారు. అయినా పనులు జరిగే అవకాశం లేదు. రాష్ట్ర విభజన ముహూర్తం సమీపించడమే దీనికి కారణం. విభజన ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఖజానాకు తాళం పడనుంది. కొత్త రాష్ట్రంలో కొత్త అకౌంట్లు తెరిచి.. నిధులు మంజూరు చేసే వరకు నిధులు, పనుల మంజూరీలు స్తంభించిపోనున్నాయి. మరోవైపు విభజన ప్రభావంతో ఖజానా శాఖలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఖజానా.. మరికొన్ని శాఖలు విలీనమై, ఉద్యోగులు తగ్గిపోయే అవకాశం ఉంది. శ్రీకాకుళంకలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన కారణంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. గతంలో మంజూరైన నిధులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజనతోపాటే ఖజానా శాఖ కూడా రెండుగా విడిపోనుండటంతో ఈ శాఖ సేవలను ఈ నెల 24 నుంచి పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నారు. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పాటై కొత్త అకౌంట్లు తెరవడంతోపాటు బడ్జెట్ నిధులు జమ అయ్యే వరకు కనీసం 10 రోజుల పాటు ఖజానా సేవలు స్తంభించిపోనున్నాయి. ఈ కారణంగానే ఇప్పటికే అందిన బిల్లుల చెల్లింపుల్లో ఆ శాఖ సిబ్బంది బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపునకే ప్రాధాన్యమిస్తున్నారు. దాంతో పంచాయతీరాజ్, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పనుల బిల్లులు, డైట్, కాంట్రాక్టు, మెడికల్ రీయింబర్స్మెంట్, ఇతరత్రా ప్రభుత్వపరమైన బిల్లులన్నీ నిలిచిపోయాయి. జీతాల చెల్లింపునకే సమయం కేటాయింపు జీతాల చెల్లింపునకే ఖజానా శాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా సమయా లు కేటాయించడంతో మిగిలిన బిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేటాయించిన సమయాల ప్రకారం ఆయా జిల్లాల వారు జీతాలకు సంబంధించిన బిల్లులను ఆన్లైన్లో ఖజానా శాఖకు సమర్పించాలి. వీటికి సంబంధించిన టోకెన్ రిలీజ్ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో సీడీపీవో, ఎంపీ ల్యాడ్స్, పంచాయతీరాజ్, ఇతర శాఖల పనులకు సంబంధించి సుమా రు రూ. 30కోట్ల బిల్లులు నిలిచిపోయా యి. కొత్త రాష్ట్రం ఏర్పడేవరకు వీటిని చెల్లించే పరిస్థితి కన్పించడం లేదు. కనీసం ఉద్యోగి లేదా పింఛన్‌దారు మరణించిన సందర్భాల్లో దహన సం స్కారాలకు ఇవ్వాల్సిన నగదు సహా యం కూడా చెల్లించే అవకాశం లేదు. ఖజానా చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ఈ నెల 24వ తేదీలోపు ఆర్థిక లావాదేవీలు ముగించాల్సి ఉండటంతో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు తమ జీతభత్యాలు, బకాయిలు, ఇతర బిల్లు లు మంజూరు చేయించుకునేందుకు ఖజానా శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా మంది సిబ్బంది బిల్లులు పెట్టడం తెలియక సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే అష్టకష్టాలు పడి బిల్లులు తయారు చేసి ట్రెజరీకి తీసుకువెళితే అక్కడ సర్వర్ మొరాయించడం, ఆన్లైన్లో జమ కాకపోవడంతో నానా అవస్థలు పడా ల్సి వస్తోంది. గత మూడునాలుగు రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు జీతాల బిల్లుల కోసం ఖజానా శాఖ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉద్యోగాల కుదింపు విభజన నేపథ్యంలో ఖజానా శాఖలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖ పరిధిలో 24 మంది డిప్యూటీ డెరైక్టర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతం వారే. వారంతా కొత్తగా 13 జిల్లాలో ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో పని చేసేందుకు ఆప్షన్ ఇస్తే ఈ జిల్లాల్లో పని చేస్తున్న ఏటీవో, డీటీవో క్యాడర్ అధికారులకు రివర్షన్ తప్పదు. అలాగే ఈ శాఖ నుంచి ప్లానింగ్, అకౌంట్స్, తదితర శాల్లో ఫారెన్ సర్వీసుల్లో ఉన్న సిబ్బంది తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఒక డీడీ, ఐదుగురు ఏటీవోలు, 28 మంది ఎస్టీవోలు, 73 మంది సీనియర్, 33 మంది జూనియ ర్ గణాంకకులు, 16 మంది సర్ప్లు, 26 మంది కార్యాలయ సహాయకులు, 11 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మరో 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులను రద్దు చేసి ఉన్నవారితోనే సరిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన నేపథ్యంలో ఖజానా, పే అండ్ అకౌంట్స్, వర్క్ డిపార్టుమెంట్లు ఒకే గొడుగు కిందకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే ఇప్పటికే ఈ శాఖల మధ్య కొరవడిన సమన్వయం మరింత పెరగడంతోపాటు ఆధిపత్య పోరు తలెత్తే ప్రమా దం ఉంది. ఇప్పటి వరకు వేర్వేరు శాఖాధిపతులుగా ఉన్నవారు ఒకే శాఖలోకి వస్తే కొందరి అధికారులు తగ్గిపోతాయి. కొత్త సమస్యలు తలెత్తుతాయి. పైగా సిబ్బందికి పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
స్కాలర్షిప్లు, మందులకు నిధులు బంద్
జీతాలు, పెన్షన్లకు మాత్రమే నిధులు రెవెన్యూ వ్యయ బీఆర్వోలు జారీ కాకుండా చేసిన ఆర్థికశాఖ సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల స్కాలర్షిప్లు, ఆసుపత్రుల్లో మందులు, మెడికల్ రీయింబర్స్మెంట్, రవాణా భత్యం, హాస్టళ్ల మెటీరియల్, కార్యాలయాల నిర్వహ ణ వంటి రెవెన్యూ వ్యయాలకు ఆర్థిక శాఖ నిధుల విడుదలను నిలిపేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో నాల్గో త్రైమాసిక నిధులు సుమారు రూ.20 వేల కోట్ల విడుదల నిలిచిపోయింది. ఆ నిధులు విడుదల కాకుండా కంప్యూటర్లోనే ఆర్థిక శాఖ సీజ్ చేసింది. దీంతో రెవెన్యూ వ్యయానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వోలు) జారీ కావు. నాల్గో త్రైమాసిక నిధులను ఈ నెలలో విడుదల చేయాల్సి ఉంది. అయితే రెవెన్యూ లోటులోకి వెళ్లకుండా జాగ్రత్తల్లో భాగంగా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, నిర్మాణాలకు మాత్రమే నిధులను విడుదల చేయనుంది. ఆస్తుల కల్పనపై వ్యయం తగ్గిపోయి, రెవెన్యూ వ్యయం పెరిగిపోవడంతో ఆడిటర్ జనరల్ (ఏజీ) ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సెక్యూరిటీలు విక్రయించగా వస్తున్న కోట్ల రూపాయలను ఆస్తుల కల్పనపై కాకుండా రెవెన్యూ వ్యయానికి వినియోగిస్తున్నారంటూ ఆర్థిక శాఖకు ఏజీ లేఖ కూడా రాశారు. అయితే అప్పులను కచ్చితంగా ఆస్తుల కల్పనపైనే ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. దీన్ని అతిక్రమిస్తున్నట్లు ఏజీ పేర్కొనడంతో ఇక తప్పని ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు వంటి ప్రణాళికేతర రెవెన్యూ వ్యయానికి, అలాగే ఆస్తుల కల్పనకు సంబంధించిన నిర్మాణ వ్యయానికి మాత్రమే నిధుల విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రణాళికా పద్దు కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 59,442 కోట్లను వ్యయం చేయాల్సి ఉండగా డిసెంబర్ వరకు కేవలం రూ.28 వేల కోట్లను వ్యయం చేశారు. ఆర్థిక సంవత్సరం మరో రెండున్నర నెలల్లో ముగుస్తున్నప్పటికీ కీలకమైన ప్రణాళికా వ్యయం కేటాయింపుల్లో సగం కూడా ఖర్చు చేయలేదు. మరో పక్క ప్రణాళికేతర వ్యయం మాత్రం డిసెంబర్ నాటికి రూ. 61 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రణాళికేతరంలోకి వచ్చే రెవెన్యూ వ్యయాన్ని నిలుపుదల చేసి ప్రణాళికా వ్యయం పెంచాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
ఉద్యోగుల ఆరోగ్య పథకంలో కొత్త వివాదం
* భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకరి తల్లిదండ్రులకే పథకం వర్తింపు * ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో సర్కారు స్పష్టీకరణ.. ఉద్యోగుల అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం విషయంలో క్రమంగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య అగాధం పెరుగుతోంది. ఉద్యోగులు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వకుండానే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, కొత్తగా మరిన్ని మెలిక లు పెట్టడాన్ని ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా పరిస్థితులు ఉత్పన్నం కావటంపట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు వారిద్దరి తల్లిదండ్రులు ఈ పథకం పరిధిలోకి రావాల్సి ఉండగా... కేవలం ఒకరి తల్లిదండ్రులకే పథకం వర్తిస్తుందన్న కొత్త మెలిక తాజాగా ఉద్యోగాల్లో ఆందోళనకు కారణమైంది. ప్రస్తుతం మెడికల్ రీయింబర్స్మెంట్ పథకంలో ప్రీమియం చెల్లించే వారు తల్లిదండ్రులకు పథకం వర్తిస్తోంది. ఇదే పద్ధతిని ఉద్యోగుల ఆరోగ్య పథకంలోనూ వర్తింప చేయాలన్న ఉద్యోగుల డిమాండ్‌కు విరుద్ధంగా, ఒకరి తల్లిదండ్రులనే పథకం పరిధిలోకి తెచ్చారు. ఉద్యోగుల వివరాలను ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఇటీవల ప్రభుత్వం సూచించటంతో, ఆ కసరత్తు ప్రారంభించిన సందర్భంగా ఉద్యోగులకీ విషయం తెలిసింది. అందులో ఒకరి తల్లిదండ్రుల వివరాలనే నమోదు చేసే పరిస్థితి ఉండటంతో ఉద్యోగులు మళ్లీ స్పష్టత కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇద్దరూ ఉద్యోగులైనప్పుడు పథకం నిబంధనల ప్రకారం ఇద్దరూ ప్రీమి యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెల్లిస్తే సరిపోతుందం టూ కొన్ని రోజులక్రితం ప్రభుత్వం స్పష్టంచేసింది. ఎవరు ప్రీమియం చెల్లించారో వారి తల్లిదండ్రులకే పథకం వర్తించే వీలుందన్న సంగతి అప్పట్లో ఉద్యోగులు గ్రహించలేకపోయారు. తీరా వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేసే సందర్భంలో వారికి అసలు విషయం తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులైన భార్యాభర్తలిద్దరు ప్రీమియం చెల్లించేందుకు సిద్ధమని, వారి ఇద్దరి తల్లిదండ్రులను కూడా పథకం పరిధిలోకి తేవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పాత అభ్యంతరాలపై స్పష్టత రాని సమయంలో, కొత్త అభ్యంతరాలు రావటంతో పథకం కాస్తా మళ్లీ చిక్కుముడిలా మారుతోంది. 184 జీఓ, 174 జీఓల ప్రకారం చూసినా ప్రభుత్వోద్యోగులైన భార్యాభర్తలు ఇద్దరి తల్లిదంద్రులకు పథకం వర్తిం చాల్సి ఉన్నందున ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో పలు జిల్లాలకు చెందిన కొందరు టీచర్ల వివరాలు గల్లంతయ్యాయని, వాటిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. -
తెలంగాణ కు అడ్డుపడితే పోరుకు సిద్ధం
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఇన్నారెడ్డి మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటే ప్రత్యక్ష పోరాటలకు దిగుతామని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు టి.ఇన్నారెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో నిర్వహించిన పీఆర్టీయూ మండల శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన తెలంగాణ బిల్లు పత్రులను చింపివే యడం సీమాంధ్రుల నీతిమాలిన తనానికి నిదర్శమన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి ఈ ప్రాంత మంత్రులు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల పీఆర్సీ అమలులో భాగంగా 50 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అది జూన్ నెల నుంచే అమలు చేయాలని వారు సమావేశంలో తీర్మానించారు. అంతే కాకుండా 2014 జనవరి నెలలో మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం రద్దవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు వెంటనే హెల్త్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు డి.అరవింద్‌కుమార్, నాయకులు మెకార్తి వెంకటేశ్వర్, ఎం.జాన్, జె.పోచయ్య, కర్నాల సత్యనారాయణ, రామస్వామి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వైద్య ఖర్చులు రూ. కోటి
న్యూఢిల్లీ: మెడికల్ రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విపిన్శర్మ అత్యధికంగా రూ. 1.32 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యే అత్యంత తక్కువగా రూ. 8,182 పొందారు. ఇదిలాఉంచితే ఆయా ఎమ్మెల్యేల ప్రయాణ బిల్లులు కూడా ఏమీ తక్కువగా లేవు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో బీజేపీ ఎమ్మెల్యే షకూర్ బస్తీ శ్యామ్లాల్గార్గ్ రూ. 3.87 లక్షలు పొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజౌరీ గార్డెన్ ఎంపీ ఎ.దయానంద్ చండీలియా రూ. 17,682 పొందారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సుభాష్ అగర్వాల్ అనే ఓ సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకొచ్చాయి. ఇదిలాఉండగా మెడిక్లెయిమ్ కింద కాంగ్రెస్ ఎమ్మెల్యే విపిన్శర్మ రూ. 1.32 కోట్లు పొందగా, ఆయనతోపాటు నజఫ్‌గఢ్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే భరత్‌సింగ్ రూ. 2.75 లక్షలు, హరినగర్ ఎమ్మెల్యే హరిశరణ్ సింగ్ బల్లీ రూ. 17.4 లక్షలు పొందారు. -
కోటి రూపాయల మెడికల్ రీయింబర్స్మెంట్ తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎంత విచ్చలవిడిగా తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటారో అందరికీ తెలిసిందే. అందునా అధికార పార్టీ ఎమ్మెల్యేలైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన నిర్వాకం. ఆయన పేరు విపిన్ శర్మ. వయసు 35 సంవత్సరాలు. దేశ రాజధాని నగరంలో ప్రజాప్రతినిధులకు కేటాయించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లో ఆయనగారు ఏకంగా కోటీ మూడు లక్షల రూపాయలు క్లెయిమ్ చేశారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద బయటపడింది. మొత్తం 43 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్ వివరాలను ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలున్నారు. వీళ్లు 2008 నుంచి 2013 అక్టోబర్ వరకు క్లెయిమ్ చేసిన మెడికల్ బిల్లుల వివరాలను ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ కోరారు. వీళ్లలో అత్యధికంగా విపిన్ శర్మ 1.03 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేయగా, ఆయన తర్వాతి స్థానంలో రూ. 25 లక్షలతో స్వతంత్ర ఎమ్మెల్యే భరత్ సింగ్ ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే హెచ్.ఎస్.బల్లి తన వైద్య ఖర్చుల కింద 17 లక్షలు క్లెయిమ్ చేశారు. అదీ అయ్యవార్ల వైభోగం!! -
వైద్య బిల్లుల స్వాహా టీచర్లపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు బిల్లులు సమర్పించి మెడికల్ రీయింబర్స్మెంట్ డబ్బు స్వాహా చేసిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ హైకోర్టుకు నివేదించారు. ఆరోపణలు వచ్చిన 143మంది ఉపాధ్యాయులపై విచారణ జరపగా.. అందులో 79మంది అక్రమ పద్ధతిలో మెడికల్ రీయింబర్స్మెంట్ మొత్తాలను స్వాహా చేసినట్లు రుజు వైందని వివరించారు. డ్రాయింగ్ అధికారులు, వారి సిబ్బందితో కలిసి పలువురు మండల విద్యాశాఖఅధికారులు, ఉపాధ్యాయులు ఈ చర్యలకు పాల్పడ్డారని, వారందరిపై ఇప్పటికే చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించామని కోర్టుకు నివేదించారు. టీచర్ల అక్రమ వైద్య బిల్లులపై దర్యాప్తుసంస్థతో విచారణ జరి పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ వ్యాజ్యంపై ఇంతటితో విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎస్సారెస్పీలో దొంగ మెడికల్ బిల్లులు
వరంగల్, న్యూస్‌లైన్ : అసలే పనిలేని విధులు... దాదాపు నాలుగేళ్లుగా ఖాళీ... మరమ్మతు, నిర్వహణ పనుల్లో అక్రమాలు... ఈ ఘనతను పలువురు ఎస్సారెస్పీ ఇంజినీర్లు ఇప్పటికే సొంతం చేసుకున్నారు. పని లేకుండా ఖాళీగా ఉండడంతో వారిలో పైసల ‘రోగం’ పెచ్చుమీరింది. బోగస్ మెడికల్ బిల్లులు సమర్పించి మెడికల్ రీయిం బర్స్మెంట్ కింద 1.20 కోట్లను అప్పనంగా కాజేశారు. ఎట్టకేలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స మెంట్ అధికారుల విచారణ ఊపందుకోవడంతో అక్రమార్కుల్లో గుబులు నెలకొంది. హైదరాబాద్‌లో తీగ లాగితే... హైదరాబాద్‌లోని ఎస్సారెస్పీ క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఎస్సారెస్పీ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (డీసీఈ)ను విచారణ అధికారిగా నియమించారు. అక్కడ తీగ లాగితే... హన్మకొండ చింతగట్టు ప్రాజెక్టులో డొంక కదిలింది. మెడికల్ బిల్లులకు సంబంధించి అన్ని వివరాలు అందజేయూలని పైసల ‘రోగం’ఎస్సారెస్పీ పరిధిలో ఉన్న వరంగల్ సీఈ కార్యాలయంలోని చింతగట్టు సర్కిల్, నాలుగు డివిజన్ల ఇంజినీర్లకు మెమోలు జారీ అయ్యాయి. చింతగట్టు క్వాలిటీ కంట్రోల్ సర్కిల్లో రికార్డులు దొరకడం లేదనే నెపంతో విచారణలో జాప్యం జరిగింది. దీంతో నీటి పారుదల శాఖ విచారణ బాధ్యతలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు వారు చింతగట్టు సర్కిల్ పరిధిలోని అన్ని విభాగాల్లో 2008-2013 మధ్య కాలంలో మెడికల్ బిల్లులు వివరాలను కావాలని నోటీసులిచ్చారు. వారికి రెండు డివిజన్లు మినహా మిగతా వాటి వివరాలు అందారుు. దీని ప్రకారం మూడు నె లలుగా జరుగుతున్న విచారణలో హన్మకొండ చింతగట్టు సర్కిల్, ఇతర డివిజన్లలో 36 మంది ఇంజినీర్లు, నలుగురు సిబ్బంది మెడికల్ బిల్లుల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. రోగం లేకున్నా తప్పుడు బిల్లులతో 1.20 కోట్లు నొక్కేసినట్లు గుర్తించారు. 2010, 2011లో చేపట్టిన నిర్వహణ పనుల్లో అక్రమ బాగోతంపై చార్జ్‌మెమోలు అందుకున్న ఇంజినీర్లు సైతం మెడికల్ బిల్లుల అక్రమాల ఘటనలో మెమోలు అందుకోవడం కొసమెరుపు. ఒకేసారి శాఖాపరంగా... ప్రభుత్వపరంగా విజిలెన్స్ విచారణ కొనసాగుతుండడంతో అక్రమార్కులు హడలిపోతున్నారు. -
ఎక్కడి ఫైళ్లు అక్కడే!
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాల యంలో చాలా ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోవటం వివాదాలకు కారణమవుతోంది. డీఎంహెచ్ఓ డాక్టర్ గీతాంజలి వ్యవహార శైలిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్‌లు, కారుణ్య నిమాయకాలకు సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని, అయినా ఆమె పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. దీంతో కార్యాలయంలో పరిస్థితి చినుకు చినికి గాలివానలా తయరయ్యేలా ఉంది. జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో నైట్‌వాచ్‌మెన్‌గా పనిచేసిన బహుదుర్ దాదాపు ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్, ఇతర ప్రయోజనాలను కుటుంబ సభ్యులకు ఇంతవరకు చెల్లించలేదు. కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడికి ఉద్యోగమూ ఇవ్వలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లా కేంద్రంలో పనిచేసినవారి పరిస్థితే ఇలా ఉంటే పీహెచ్‌సీల్లో పనిచేసే వారి దుస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని ఉద్యోగులు అంటున్నారు. అస్మదీయులకు పెద్దపీట నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించని డీఎంహెచ్ఓ, తన వెనుక తిరుగుతున్నవారి పనులను మాత్రం త్వరిత గతిన పూర్తి చేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సొమ్ము ఇస్తే గాని సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతి కోసం ఓ ఉద్యోగి రూ.40 వేలు ఇచ్చినా ఇంకా పనిచేసి పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు న్యాయంగా రావాల్సిన పదోన్నతి ఇవ్వటానికి కూడా డబ్బు అడిగారని, సొమ్ము ఇచ్చినా పని చేయలేదని ఆ ఉద్యోగి వాపోతున్నట్టు సమాచారం. యూనియన్ నేత ఒకరు నిత్యం డీఎంహెచ్ఓ పక్కనే ఉంటూ తమవారి పనులను చక్కబెట్టుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పీహెచ్సీలో పనిచేస్తున్న ఆయన అక్కడి విధులను విస్మరించి డీఎంహెచ్ఓ పనులు చేసిపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని చెబుతున్నారు. -
అయ్యవార్లకు అరదండాలు
వైవీయూ, న్యూస్‌లైన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు నైతికంగా ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు చేసిన తప్పులు వారిని వెంటాడుతున్నాయి. ఉపాధ్యాయుల ఆరోగ్య ప్రయోజనాల కోసం రూపొందించిన మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని తమ స్వార్థం కోసం బోగస్ బిల్లులు పెట్టి డబ్బులు కాజేశారు. దీనిపై 2009-10 సంవత్సరంలో ఆడిట్ అండ్ జనరల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు దొంగ బిల్లులతో డబ్బును కాజేసినట్లు గుర్తించారు. దీంతో విజిలెన్స్ విభాగం వారు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో వందలాది మంది ఉపాధ్యాయులు లేని జబ్బులకు సైతం బిల్లులు పెట్టి సొమ్ము కాజేసినట్లు గుర్తించారు. ఇలా గుర్తించిన వారిలో జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయురాలు ఉండటంతో వీరిపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల డీఈఓ కార్యాలయానికి దస్త్రాలు వచ్చాయి. దీంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇద్దరు ఉపాధ్యాయులపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం. మరో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు కాలేదు. ముగ్గరిలో ఓ ఉపాధ్యాయుడు ఏకంగా రూ.1.52 లక్షలకు దొంగబిల్లులు సమర్పించినట్లు తెలిసింది. మరో ఇద్దరు మాత్రం ఒకరు రూ.10 వేలు, మరొకరు రూ.3 వేలకు బిల్లులు సమర్పించారు. అయినా దొంగబిల్లులు చిన్నవైనా పెద్దవైనా ఒక్కటే అని భావించిన విజిలెన్స్ వారు చర్యలకు సిఫార్సు చేశారు. వీరిలో ఇద్దరు మాత్రం ఇప్పటికే తీసుకున్న సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించారు. చిన్నమొత్తంలో సొమ్మును తీసుకున్న ఉపాధ్యాయులు మాత్రం ప్రొసీజర్ ఫాల్స్ కారణంగానే తాము బిల్లులు పెట్టామని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు బిల్లులు సమర్పించలేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. బిల్లులను స్క్రూట్నీ చేయాల్సిన సంబంధిత రిమ్స్ సిబ్బంది ఎటువంటి అభ్యంతరం తెలుపకపోవడంతో తాము బిల్లులు పెట్టుకున్నామని, ఇందులో తమ తప్పేం లేదని వాపోయినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన దస్త్రాలు డీఈఓ కార్యాలయానికి వచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే.. ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. మరొకరిపై నమోదు చేయాలని ఆదేశించాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ అనంతరం రెండు నివేదికను డెరైక్టరేట్‌కు పంపుతాం. -
12 మంది టీచర్లపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, సంగారెడ్డి: బోగస్ మెడికల్ రీయింబర్స్మెంట్ వ్యవహారంలో 12 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ జిల్లా విద్యాశాఖను ఆదేశించింది. లేని రోగాలకు వైద్య చికిత్సలు చేయించుకున్నట్లు వైద్య బిల్లులు సృష్టించి నిధులను కొల్లగొట్టిన వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏజీ కార్యాలయం జరిపిన ఆడిట్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల సహకారంతో బోగస్ బిల్లులు సృష్టించి అక్రమంగా మెడికల్ రీయింబర్స్మెంట్ నిధులను సొమ్ముచేసుకున్నట్టు తేలింది. చికిత్స జరిగినట్లు బిల్లుల్లో పేర్కొన్న తేదీల్లో సదరు ఉపాధ్యాయులు సెలవుల్లో ఉండాల్సి ఉండగా, విధులకు హాజరైనట్లు హాజరు పట్టికల్లో సంతకాలు చేసి ఉండడంతో ఈ బండారం బయటపడింది. ఏజీ ఆడిట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలతోపాటు పాఠశాల విద్యాశాఖ అంతర్గతంగా విచారణ జరిపాయి. ఈ క్రమంలో జిల్లాలో 12మంది ఉపాధ్యాయులు అడ్డంగా దొరికిపోయారు. సిద్దన్నపేట(నంగనూరు) ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఎం. వెంకటి రూ.1,70,586, పీర్లపల్లి(జగదేవ్‌పూర్) ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ పి.రాజేశ్వరి రూ.1,73,055, నల్టూరు(జిన్నారం) ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీ కె.శశిధర్ రూ.21,218, మోటకింది తండా(మెదక్) ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ పి.శశికుమార్ రూ.19,598, జానకంపేట్(పటాన్చెరు) ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ పి.రామనరసింహరెడ్డి రూ.20,959 వైద్య బిల్లులను అక్రమంగా సొమ్ము చేసుకున్నారు. అదేవిధంగా కుసంగి(టేక్మాల్) జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు కె.కృష్ణారెడ్డి రూ.19,743, హంసాన్ పల్లి (కొల్చారం) జడ్పీహెచ్ఎస్ ఎస్ఏ ఎం.శ్రీనివాస్ రూ.21,852, సదాశివపల్లి(కౌడిపల్లి) ప్రాథమికోన్నత పాఠశాల ఎస్ఏ ఈ.యాదగిరి రూ.43,735, లక్ష్మాపూర్(రామాయంపేట) జడ్పీహెచ్ఎస్ ఎస్ఏ డి.దయానందరెడ్డి రూ. 22,392, రాంచంద్రాపురం జడ్పీహెచ్ఎస్ ఎస్ఏ బి.కృష్ణాగౌడ్ రూ.21,595, రంగంపేట్(కొల్చారం) జడ్పీహెచ్ఎస్ ఎస్ఏ సయ్యద్ అజీజ్‌అలీ రూ. 19,562, మెదక్ ఉన్నత పాఠశాల(కొత్త) ఎస్ఏ సయ్యదా అస్మాషాహీన్ రూ. 21,664 అక్రమంగా పొందినట్లు అప్పట్లో రుజువువైంది. 2010లో జరిగిన ఈ విచారణ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతోపాటు వందలమంది సస్పెండయ్యారు. వైద్య బిల్లుల రికవరీలూ అప్పట్లో చేపట్టారు. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ ఉపాధ్యాయులపై ఆరోపణలు నమోదు చేశారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని అప్పట్లో ప్రభుత్వం విద్యాశాఖకు సూచించింది. దీంతో జిల్లాలో బాధ్యులైన 12మందిపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నియమావళి అనుబంధం-1లోని ఆర్టికల్ 300నుంచి 302ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టాలని డీఈఓను ఆదేశిస్తూ పాఠశాల విద్యశాఖ కమిషనర్, డెరైక్టర్ వాణీమోహన్ ఈనెల 21న ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిఫారసుల మేరకు ఐపీసీ 403, 409, 129(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు సదరు ఉపాధ్యాయులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.