
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకం గడువును 2022 ఆగస్టు 1వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎంటి క్రిష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన అనంతరం మరికొంత కాలం పాటు దీన్ని పొడిగిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్ఎస్)తో పాటు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ స్కీంను కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు.
ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్ఎస్ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాల్ని అందుబాటులోకి తేవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒకు సూచించారు. ఇందుకు సంబంధించి ఆరోగ్య శ్రీ సీఈవో అవసరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఉండేందుకు గాను తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆర్థిక శాఖ సమ్మతి మేరకే ఈ ఉత్తర్వుల్ని జారీ చేశామని కృష్ణ బాబు స్పష్టం చేశారు.
చదవండి: AP: ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ గడువు పొడిగింపు
Comments
Please login to add a commentAdd a comment