రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం
ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ఫైల్
ఐఆర్, డీఏ, మెరుగైన పెన్షన్ విధానం తెస్తామని ఎన్నికల ముందు హామీ
వీటిలో ఒక్కటీ అమలు చేయకుండా ఉద్యోగ సంఘాల అణచివేతకు యత్నాలు
సర్కారు తీరుపై మండిపడుతున్న ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు సర్కారు ఆ పని చేయకపోగా.. తిరిగి వారిపైనే కత్తి దూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయ (సెక్రటేరియట్) ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం చేసింది. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటికే చేరింది. – సాక్షి, అమరావతి
ఉద్యోగులకు మధ్యంతర భృతితోపాటు క్రమం తప్పకుండా డీఏ ఇస్తామని, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం తెస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా.. ఆ విషయంపై ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలను అణచివేసే ప్రయత్నాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ సంఘం గుర్తింపు రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
70 ఏళ్ల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు కంకణం
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ హోదాలో కాకర్ల వెంకట్రావిురెడ్డి ఈ ఏడాది మార్చి నెలలో ఆర్టీసీ ఉద్యోగులను కలిశారు. ఎలాంటి సమావేశం, ప్రెస్‌మీట్ పెట్టకపోయినా కొన్ని పత్రికలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ తప్పుడు వార్తలు రాయడంతో ఆయనను సస్పెండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఆయనపై నాలుగు కేసులు పెట్టించారు.
దీంతో సంతృప్తి చెందని ప్రభుత్వం ఇపుడు ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం గుర్తింపును రద్దు చేసేందుకు సిద్ధపడింది. విచారణ నివేదికలు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం పేరు కూడా లేదు. అయినా కేవలం వెంకట్రావిురెడ్డిపై కక్షతో 70 ఏళ్ల చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
అప్పట్లో ఉద్యోగ సంఘాలను వాడుకుని..
2019 ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులను చంద్రబాబు ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. సత్యాగ్రహ దీక్ష పేరుతో ప్రత్యేక విమానంలో ఉద్యోగ సంఘాల నాయకులను ఢిల్లీ తీసుకెళ్లి.. వారితో నల్లచొక్కాలు తొడిగించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తిట్టించారు. బీజేపీని ఒక్క స్థానంలో కూడా గెలవనివ్వబోమని, ఏపీ నుంచి బీజేపీని తరిమి తరిమి కొడతామని పెద్దఎత్తున ప్రకటనలు కూడా అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకులతో ఇప్పించారు.
2019 ఎన్నికల తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలని చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయినా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దమనసుతో వ్యవహరించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ పనులు చేయించుకునేందుకు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం సహజమేనని, అలాంటి చిన్నచిన్న విషయాలకు ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించారు.
కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఉద్యోగులెవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘానికి ఎలాంటి సంబంధం లేని ఘటనను సాకుగా చూపించి.. సంఘాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఒకవేళ ప్రభుత్వ సంఘాల సమాఖ్య చైర్మన్ హోదాలో వెంకట్రావిురెడ్డి తప్పు చేస్తే ఆయనపై చర్యలు తీసుకోవాలి తప్ప సంఘాన్ని నాశనం చేయడం ఏమిటని సచివాలయ ఉద్యోగులంతా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదని వారంతా పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment