
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో మంత్రి లోకేశ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని, అయినప్పటికీ సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చలో ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని, వాటికి ప్రతి నెలా రూ.4,500 కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు వడ్డీలు కడుతున్నామని చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వ చర్యల వల్ల 12.40శాతం వృద్ధి రేటు సాధించామని, ఇకపై ఏటా 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇస్తామని చెప్పారు. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఏప్రిల్‌లో అమలు చేస్తామన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనతోపాటు నిరుద్యోగ భృతికి కట్టుబడి ఉన్నామన్నారు.
మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం ఇస్తామని, ప్రతి పంచాయతీలో ఓ మోడల్ స్కూల్, ప్రతి నియోజకవర్గంలో ఓ లీడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలి లీడ్ స్కూల్‌ను మంగళగిరిలో ప్రారంభిస్తామన్నారు. రాజకీయ పైరవీలకు తావులేని రీతిలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు వీలుగా టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్టును తీసుకొస్తున్నట్టు చెప్పారు. పీజీలో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని, విదేశీ విద్యను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
మూడేళ్లలో కోర్ క్యాపిటల్ పూర్తి
అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియాన్ని తలదన్నే స్థాయిలో, దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని అమరావతి స్పోర్ట్స్ సిటీలో నిర్మిస్తామని లోకేశ్ చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఐసీసీ అధ్యక్షుడు జై షా సానుకూలంగా స్పందించారన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 161 పౌర సేవలను అందిస్తున్నామని, త్వరలో 500 సేవలు అందిస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని, అమరావతిలో మూడేళ్లలో కోర్ క్యాపిటల్‌ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పీపీఏల రద్దు వల్లే విద్యుత్ చార్జీలు పెరిగాయన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై ఒక్క దొంగ కేసు కూడా పెట్టలేదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment