స్కాలర్‌షిప్‌లు, మందులకు నిధులు బంద్
జీతాలు, పెన్షన్లకు మాత్రమే నిధులు
రెవెన్యూ వ్యయ బీఆర్వోలు జారీ కాకుండా చేసిన ఆర్థికశాఖ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఆసుపత్రుల్లో మందులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రవాణా భత్యం, హాస్టళ్ల మెటీరియల్, కార్యాలయాల నిర్వహ ణ వంటి రెవెన్యూ వ్యయాలకు ఆర్థిక శాఖ నిధుల విడుదలను నిలిపేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో నాల్గో త్రైమాసిక నిధులు సుమారు రూ.20 వేల కోట్ల విడుదల నిలిచిపోయింది. ఆ నిధులు విడుదల కాకుండా కంప్యూటర్‌లోనే ఆర్థిక శాఖ సీజ్ చేసింది. దీంతో రెవెన్యూ వ్యయానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వోలు) జారీ కావు. నాల్గో త్రైమాసిక నిధులను ఈ నెలలో విడుదల చేయాల్సి ఉంది. అయితే రెవెన్యూ లోటులోకి వెళ్లకుండా జాగ్రత్తల్లో భాగంగా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, నిర్మాణాలకు మాత్రమే నిధులను విడుదల చేయనుంది.
ఆస్తుల కల్పనపై వ్యయం తగ్గిపోయి, రెవెన్యూ వ్యయం పెరిగిపోవడంతో ఆడిటర్ జనరల్ (ఏజీ) ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సెక్యూరిటీలు విక్రయించగా వస్తున్న కోట్ల రూపాయలను ఆస్తుల కల్పనపై కాకుండా రెవెన్యూ వ్యయానికి వినియోగిస్తున్నారంటూ ఆర్థిక శాఖకు ఏజీ లేఖ కూడా రాశారు. అయితే అప్పులను కచ్చితంగా ఆస్తుల కల్పనపైనే ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. దీన్ని అతిక్రమిస్తున్నట్లు ఏజీ పేర్కొనడంతో ఇక తప్పని ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు వంటి ప్రణాళికేతర రెవెన్యూ వ్యయానికి, అలాగే ఆస్తుల కల్పనకు సంబంధించిన నిర్మాణ వ్యయానికి మాత్రమే నిధుల విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రణాళికా పద్దు కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 59,442 కోట్లను వ్యయం చేయాల్సి ఉండగా డిసెంబర్ వరకు కేవలం రూ.28 వేల కోట్లను వ్యయం చేశారు. ఆర్థిక సంవత్సరం మరో రెండున్నర నెలల్లో ముగుస్తున్నప్పటికీ కీలకమైన ప్రణాళికా వ్యయం కేటాయింపుల్లో సగం కూడా ఖర్చు చేయలేదు. మరో పక్క ప్రణాళికేతర వ్యయం మాత్రం డిసెంబర్ నాటికి రూ. 61 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రణాళికేతరంలోకి వచ్చే రెవెన్యూ వ్యయాన్ని నిలుపుదల చేసి ప్రణాళికా వ్యయం పెంచాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.