కామెడ్-కె పీజీ ఎంట్రెన్స్‌లో తెలుగోడి ప్రతిభ
కాకినాడ, న్యూస్‌లైన్ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ విద్యార్థి కర్ణాటక మెడిసిన్ పీజీలో స్టేట్ ఫస్ట్ సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. కాకినాడ వినుకొండ వారి వీధికి చెందిన తార్కాసి వెంకట కృష్ణ మెయిన్ రోడ్డులోని భీమాస్ హోటల్ సమీపంలో చిన్నపాటి పూలకొట్టు నిర్వహిస్తున్నారు. ఆయన ఐదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నారు.
ఆయన భార్య రమణ ఏడో తరగతి వరకూ మాత్రమే చదివారు. వారికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. తాము చదువుకోలేకపోయామని భావించిన ఆ తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలనుకున్నారు. పెద్ద కుమారుడు హనుష్‌బాబు, రెండో కుమారుడు వెంకన్నదొర గౌతమ్‌ల చదువుపై వారు దృష్టి సారించారు. హనుష్‌బాబు ఇంటర్ వరకూ కాకినాడలోనే చదువుకున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసిన హనుష్‌బాబు కంపార్చుయం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆఫ్ కర్నాటక నిర్వహించిన పీజీ ఎంట్రన్స్ టెస్ట్‌లో స్టేట్‌ఫస్ట్ ర్యాంకు సాధించారు. చిన్న కుమారుడు గౌతమ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. హనుష్‌బాబు పీజీ టెస్ట్‌లో కర్నాటక స్టేట్ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.