ఏలూరు సిటీ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాయడం తప్పనిసరని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. మెడిసిన్ కోర్సుల్లో చేరే ఉద్దేశంతో జిల్లాలో 3,077 మంది విద్యార్థులు ఎంసెట్-16 పరీక్ష రాశారు. ఇందుకోసం లాంగ్ టెర్మ్, షార్ట్ టెర్మ్ కోచింగ్ కోసం పెద్దఎత్తున సొమ్ము వెచ్చించారు. చివరకు, నీట్ రాసి తీరాలనే నిబంధన అమల్లోకి రావడంతో తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని మెడిసిన్ ప్రవేశార్థులు ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లల భవి ష్యత్ ప్రశ్నార్థకంగా మారిం దని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి విషయాలపై విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్పష్టమైన వైఖరి ప్రకటిం చాలని, పరీక్ష నిర్వహించే దశలోనైనా ప్రభుత్వం స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. మెడిసిన్‌లో ప్రవేశం కోసం ఎంసెట్ రాసిన వారంతా జూలై 24న నిర్వహించే నీట్ రెండోదశ పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘నీట్’కు ప్రిపేరవడానికి సమయం చాలదని విద్యార్థులు వాపోతున్నారు.
డైలమాలో సర్కారు
అన్ని రాష్ట్రాల్లో నీట్ తప్పనిసరిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు 2013లోనే స్పష్టం చేసింది. ఈనెల 9న ఇచ్చిన తుది తీర్పులో రాష్ట్రాలు నీట్‌కు ప్రత్యామ్నాయంగా పరీక్షలు నిర్వహించేందుకు వీల్లేదని తేల్చిచెప్పింది. మే 1న నీట్-1 రాసిన విద్యార్థులు జూలై 24న నిర్వహించే నీట్-2 కూడా రాసుకునే అనుమతి ఇచ్చారు. ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగు, తమిళం, మరాఠీ వంటి ప్రాంతీయ భాషల్లో నిర్వహించినా అభ్యంతరం లేదని కోర్టు చెప్పటంతో ప్రభుత్వాలు డైలమాలో పడ్డాయి. నీట్-2 నిర్వహించే తేదీ విషయంలోనూ మార్పు చేసుకునే వెసులుబాటు సుప్రీం కోర్టు ఇచ్చింది. అయితే, నీట్‌పై న్యాయమూర్తుల బృందం పర్యవేక్షణ ఉంటుం దని స్పష్టం చేయటంతో సర్కారులో కంగారు మొదలైంది.
‘బీ’సీట్లు.. బేర్
ఎంసెట్ రాయకముందే ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్లను విక్రయించేశాయి. ఎలాగూ ఆ సీట్లు తామే భర్తీ చేసుకుంటామనే ధీమాతో భారీ రేట్లకు అమ్మేసుకున్నారు. రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ముందుగా సొమ్ము కట్టించుకుని మరీ సీట్లు రిజర్వ్ చేసుకున్నారు. యాజమాన్య కోటా సీట్లకు నామమాత్రంగా పరీక్ష నిర్వహించి భర్తీ చేసుకునే అవకాశం ఉండేది.
ఈ సీట్లకు యాజమాన్యాలు పరీక్ష నిర్వహించడం కుదరదని, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేయాలని సుప్రీం కోర్టు నిబంధన విధించడంతో సీట్లు కొనుక్కున్న వారితోపాటు యాజమాన్యాలు సైతం బావురుమంటున్నాయి. కట్టిన సొమ్ము ఇవ్వరేమో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా.. తమ పరిస్థితి ఏమిటని యాజమాన్యాలు కంగారుపడుతున్నాయి. బీ కేటగిరీ సీట్లకు ప్రభుత్వమే రూ.11.50 లక్షలుగా ధర నిర్ణయింటంతో ప్రైవేట్ యాజమాన్యాలు కుదేలయ్యాయి.
నీట్.. హీట్
Published Sun, May 15 2016 3:40 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
Advertisement