మేం అహానికి పోవట్లేదు! | Supreme Court lashes out at NEET ordinance | Sakshi
Sakshi News home page

మేం అహానికి పోవట్లేదు!

Published Fri, Jul 15 2016 4:32 AM | Last Updated on Fri, Nov 9 2018 4:14 PM

మేం అహానికి పోవట్లేదు! - Sakshi

మేం అహానికి పోవట్లేదు!

నీట్ ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టు
* విద్యార్థులు మన పిల్లలు.. వారి ప్రయోజనాలే ముఖ్యం
* కేంద్రం వైఖరిపై అసంతృప్తి   
* ఆర్డినెన్స్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు ఈ ఏడాది మినహాయింపునిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. అయితే, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆర్డినెన్స్‌పై స్టే విధించడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మేమిచ్చిన తుది తీర్పునకు ఆర్డినెన్స్ విరుద్ధంగా ఉంది.

ఇలా చేయడం ఎంతవరకు సమంజసం. విద్యార్థులు వివిధ రాష్ట్రాల వైద్య పరీక్షల కోసం నెలల తరబడి సన్నద్ధమయ్యారు. అందువల్ల కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై మేము అహానికి పోవట్లేదు. ఎందుకంటే ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఇప్పటికే సగానికిపైగా రాష్ట్రాలు ప్రత్యేక పరీక్షలు నిర్వహించుకున్నాయి. అందువల్ల ఈ దశలో మేము జోక్యం చేసుకుంటే గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయి’ అని వ్యాఖ్యానించింది. ‘విద్యార్థుల భవిష్యత్తును, ప్రయోజనాలను పరిరక్షించాలి. వారు మన పిల్లలు’ అని పేర్కొంది.

నీట్ నిర్వహించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు గత మే 9న తుది తీర్పు ప్రకటించగా.. రాష్ట్రాలు తమ ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చంటూ కేంద్రం మే 24న ఆర్డినెన్స్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ సంకల్ప్ చారిట బుల్ ట్రస్ట్, ఆనంద్ రాయ్ వేసిన పిటిషన్లను జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ శివ్‌కీర్తి సింగ్‌లతో కూడినత్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది.
 
అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తూ... కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కౌన్సెలింగ్ కూడా పూర్తిచేశాయని, మరికొన్ని జాబితాలు సిద్ధం చేసుకుంటున్నాయని వివరించారు. ఈ పిటిషన్‌తో మళ్లీ ఈ వివాదం మొదటికొచ్చిందని, దీనిపై వాదప్రతివాదనలు, విచారణ కొనసాగితే అక్టోబర్ వరకు జాప్యం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ అనిల్ ఆర్ దవే జోక్యం చేసుకుంటూ.. భారత వైద్య మండలి వైద్యవిద్య ప్రవేశాలకు ఒకే పరీక్ష ఉండాలని నిర్ణయం తీసుకుందని, ఆ సమయంలో కేంద్రం కూడా నీట్‌కు సంసిద్ధత వ్యక్తంచేసిందని, దానికనుగుణంగానే తీర్పు ఇచ్చామన్నారు. నీట్ ఉండాలని కోర్టులో చెప్పి.. పది రోజులకే ఆర్డినెన్స్ తేవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

పైగా తీర్పు ప్రకటించిన రోజు నుంచి, ఆర్డినెన్స్ వెలువడిన రోజుకు మధ్యకాలంలో కూడా రాష్ట్రాలు ప్రవేశ పరీక్ష నిర్వహించడంలో ఔచిత్యమేంటని నిలదీశారు. ఈ పరిస్థితుల్లో ఆర్డినెన్స్ రద్దు చేసే ఆదేశాల వల్ల విద్యార్థులకు మరింత నష్టం చేకూరుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వజాలమని పేర్కొంది.
 
పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అమరేందర్ శరణ్ వాదనలు వినిపిస్తూ.. ఆర్డినెన్స్ వ్యవహారం ఇంతటితో ఆగిపోదని, మిగిలిన అంశాల్లోనూ కోర్టు ఇచ్చిన తీర్పును కాదని ఏడాదికోసారి పొడిగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే ప్రమాదం ఉందన్నారు. సుప్రీం తీర్పును నిలిపివేసే అధికారం ఏ వ్యవస్థకూ లేకున్నప్పటికీ సుప్రీం తీర్పు అమలు కాదంటూ ఆర్డినెన్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. పరోక్షంగా సుప్రీం తీర్పును ఓడించేందుకు చేసిన ప్రయత్నమేనని వాదించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం ఈ విధంగా ఆర్డినెన్స్ తేవడం సరైన పద్ధతి కాదని, ఆర్డినెన్స్ చాలా ఇబ్బందిపెట్టేలా ఉందని ఆక్షేపించింది. ఆర్డినెన్స్‌పై వైఖరి చెప్పాలంటూ కేంద్రానికి నోటీసులిచ్చింది. కాగా, నీట్-1 రాసి, నీట్-2కు కూడా దరఖాస్తు చేసి, పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థుల గురించి సరైన నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement