సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో ఉత్తీర్ణత కాకపోవడం, తక్కువ మార్కులు రావడం వంటి కారణాలతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో జస్లీన్ కౌర్, తమిళనాడులోని విల్లుపురంలో ప్రతిభ, ఢిల్లీలో ప్రవర్ అనే విద్యార్థులు ఇవే కారణాలతో బలవన్మరణాలకు పాల్పడ్డారు. నీట్ కోచింగ్‌కు పేరుగాంచిన రాజస్తాన్‌లోని కోట పట్టణంలోనూ ఈ ఏడాది జనవరి నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి.
ఇక్కడ ఏడేళ్లలో వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తీవ్ర పోటీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అంచనాలను అందుకోలేకపోవడం, ఒత్తిడిని అధిగమించలేకనే విద్యార్థులు తనువుచాలిస్తున్నారని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా 60 వేల సీట్ల కోసం సుమారు 13 లక్షల మంది నీట్‌కు పోటీపడ్డారు.
ఫలితాలు వెలువడిన వెంటనే సోమవారం రాత్రి ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 12లో ప్రవర్..8 అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండోసారి పరీక్ష రాసినా ఫలితం దక్కకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆశించిన ర్యాంకు రాలేదన్న మనస్తాపంతో విల్లూరులో ప్రతిభ ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది.
ఇదే జిల్లా మెల్లసేపూరు గ్రామానికి చెందిన కీర్తిక అనే విద్యార్థిని విషం తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చెన్నై నమ్మల్వార్‌పేట రెడ్డికాలనీకి చెందిన కోటేశ్వరి అనే విద్యార్థిని నీట్‌లో అర్హత సాధించకపోవడంతో ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయింది.
దేశవ్యాప్తంగా వేలాది మంది..
జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం పరీక్షల్లో విఫలమైన కారణంతో దేశవ్యాప్తంగా 2014లో 2,403 మంది విద్యార్థులు, 2015లో 2,646, 2016లో 2,413 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, ఇతరత్రా కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన గణాంకాలు ఇంకా ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 2014లో 8,068 మంది, 2015లో 8,934 మంది, 2016లో 9,474 మంది విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. విభిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2014లో 333 మంది, 2015లో 360 మంది, 2016లో 295 మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణలో 2014లో 353 మంది, 2015లో 491 మంది, 2016లో 349 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment