ఎంత పని చేశావమ్మా.... | Amrutha NEET student commits suicide in hostel at Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఎంత పని చేశావమ్మా....

Published Sun, Jul 15 2018 8:01 AM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

Amrutha NEET student commits suicide in hostel at Visakhapatnam - Sakshi

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ‘అమృతా ఎంత పనిచేశావమ్మా.. నీకెంత కష్టం వచ్చిందమ్మా.. మాకెందుకు చెప్పలేదు.. ఎవరైనా ఇలా చేస్తారా.. మాకెందుకు దూరం అయ్యావమ్మా.. నిన్ను డాక్టర్‌ చేద్దామనుకుంటే శవంలా మారిపోయావా..’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన నీట్‌ విద్యార్థిని అమృత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. ఆశీలుమెట్ట వద్ద ఉన్న గ్రావిటీ ఐఐటీ–మెడికల్‌ అకాడమీలో నీట్‌ లాంగ్‌టెర్మ్‌ కోచింగ్‌ విద్యార్థిని అమృత(17) శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వివరాలిలా ఉన్నాయి. 
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన మర్రి సాంబమూర్తి వ్యవసాయం చేస్తూ ఎస్‌బీఐ మెసెంజర్‌గా పనిచేస్తున్నారు. ఈయన భార్య సుధారాణి అంగన్‌వాడీ కార్యకర్త. వీరికి అమృత, ఆదర్శ సంతానం. అమృతను ఈ నెల 9న గ్రావిటీ అకాడమీలో నీట్‌లో లాంగ్‌టర్మ్‌ శిక్షణ కోసం చేర్పించారు. ఆమె శనివారం ఉదయం స్నానం చేసి దుస్తులు మార్చుకోవడానికి ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. 

ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు మేట్రిన్‌ హరితకు సమాచారం అందజేశారు. ఆమె మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపు విరగ్గొట్టి చూడగా అప్పటికే అమృత మరణించింది. ఈమె అన్నయ్య ఆదర్శ్‌ గాజువాకలోని విశాఖ డిఫెన్స్‌ అకాడమీలో చదువుతున్నాడు. సంఘటన స్థలాన్ని మూడో పట్టణ సీఐ ఇమ్మానియేల్‌రాజు, ఎస్‌ఐలు సతీష్, డి.రేణుక పరిశీలించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

హాస్టల్‌ జీవనం అలవాటే..
అమృతకు హాస్టల్‌ వాతావరణం కొత్తేమీ కాదని ఆమె అన్నయ్య ఆదర్శ్‌ తెలిపాడు. ఆమె 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంది. తరువాత పార్వతీపురంలో ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం నీట్‌లో లాంగ్‌టెర్మ్‌ కోచింగ్‌ కోసం జాయిన్‌ అయింది. అమృత రాసిన డైరీని బట్టి నీట్‌లో మెరుగైన ర్యాంక్‌ సాధించలేనోమోనన్న బెంగతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

తలుపు విరగ్గొట్టి ఉంటే..
గదిలోకి వెళ్లిన అమృత దుస్తులు మార్చుకుంటుందన్న ఉద్దేశంతోనే మిగతా విద్యార్థినులు కొందరు స్నానాలకు, మరికొందరు బ్రష్‌ చేయడానికి వెళ్లిపోయారు. కానీ ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు విద్యార్థినులు కిటికీలోంచి చూడగా చున్నీతో ఉరివేసుకుని ఉండడం చూసి సిబ్బందికి, మేట్రిన్‌ హరితకు సమాచారమిచ్చారు. హాస్టల్‌ సిబ్బంది ముందుగానే తలుపు విరగ్గొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిబ్బంది మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి మిన్నకుండిపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో ఎస్‌ఐ సతీష్, కొందరు కానిస్టేబుళ్లు వచ్చి తలుపు విరగ్గొట్టి చూసి అమృత చనిపోయిందని నిర్ధారించారు. 

పోలీసులు రాకముందే తలుపులు విరగ్గొట్టొచ్చు
ఏదైనా హాస్టల్‌లో దురదృష్టవశాత్తూ ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసిన వెంటనే పోలీసుల కోసం ఎదురు చూడకుండా తలుపులు విరగ్గొట్టవచ్చు. కొన ఊపిరితో ఉంటే సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే వారు బతికే అవకాశం ఉంది. కానీ చాలామంది తలుపులు విరగ్గొడితే వారిపై కేసులు పెడతారేమోనన్న అనవసర భయాందోళనతో తలుపుల జోలికి వెళ్లడం లేదు. ఆశీలుమెట్ట హాస్టల్‌లో కూడా ఇలాగే జరిగింది. పోలీసులు వచ్చి తలుపులు విరగొట్టాల్సి వచ్చింది. 
– ఇమ్మానియేల్‌రాజు, సీఐ, 
 మూడో పట్టణ పోలీస్‌స్టేషన్, విశాఖ 

డైరీ స్వాధీనం
హాస్టల్‌లో చేరిన అమృత మూడు రోజుల పాటు ముభావంగా ఉందని సహచర విద్యార్థులు చెబుతున్నారు. తరగతి గదిలో పలుమార్లు ఏడ్చినట్టు కూడా చెప్పారు. అమృత రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘కోచింగ్‌ మొదటి రోజు సూపర్‌గా జరిగింది. కానీ, ఒక సబ్జెక్టు అర్థం కాలేదు. అందుకే ఏడ్చేశాను. రోజువారీ కోచింగ్‌ బాగానే ఉంది. ఏడుస్తూనే జువాలజీ క్లాసు విన్నాను. చాలా బాగా అర్థమైంది. నైట్‌ స్టడీలో ఫిజిక్స్‌ ఫార్ములాలు కూడా నేర్చుకున్నాను. నా క్లాసులో చాలా మంది టాపర్స్‌ ఉన్నారు. అందుకే కొంచెం భయంగా ఉంది. రెండో రోజు క్లాసులో జువాలజీ అర్థం కాలేదు’ అంటూ డైరీలో ఆమె రాసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement