Amrita
-
పనికెళ్లి తిరిగొస్తుండగా..
పెద్దపల్లి రూరల్: కూలీ పనులు చేస్తూ పొట్టపోసుకునే ఇద్దరు అభాగ్యులను కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి శివారులో మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రంగంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌కు సోమవారం రాత్రి ఓ విందు పనికి వెళ్లిన కుక్క భాగ్య (46), కుక్క అమృత (48), కుక్క పద్మ, కుక్క కాంత పని ముగించుకుని మంగళవారం వేకువజామున తమ ఇళ్లకు బయలుదేరారు. కాలినడకన రాజీవ్ రహదారి పక్కనుంచి వస్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భాగ్య, అమృత ఘటనా స్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పద్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాంత గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరంతా పెద్దపల్లి ఉదయ్‌నగర్‌కు చెందిన పాలెవాళ్లుగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భాగ్యకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురికి వివాహమవగా, దివ్యాంగురాలైన మరో కూతురు నవ్య ఇంటి వద్దే ఉంటోంది. భర్త కనకయ్య హమాలీగా పనిచేస్తున్నాడు. అమృత భర్త నర్సయ్య కూడా హమాలీగా పనిచేస్తున్నాడు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఏసీసీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌కుమార్ సందర్శించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటి సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ భోజ్‌పురి నటి అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం బీహార్‌లోని భాగల్పూర్లోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. అమృత పాండే ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. అయితే ఇటీవల భాగల్పూర్లో బంధువుల వివాహానికి వెళ్లింది. ఇంతలోనే ఇలా జరిగింది. శనివారం అమృతా తన వాట్సాప్ స్టేటస్‌పై ఓ నోట్‌ను పోస్ట్ చేసింది. అది పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో విగతజీవిలా కనిపించింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు తాను డిప్రెషన్లో ఉన్నట్లు చెబుతున్నారు.అమృతా పాండే కెరీర్ విషయానికొస్తే.. ఖేసరి లాల్ యాదవ్‌తో కలిసి 'దీవానాపన్' చిత్రంతో తొలిసారిగా నటించింది. ఈ భోజ్‌పురి చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఆ తర్వాత 2022లో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన చంద్రమణి ఝంగ్డేను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక వీరిద్దరు ముంబైలోనే నివాసముంటున్నారు. -
హనుమాన్ నా బాధ్యత పెంచింది
‘‘హనుమాన్’ సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి రుణం ‘జై హనుమాన్’ సినిమాతో తీర్చుకోబోతున్నాను. ‘హనుమాన్’కి వంద రెట్లు ఎక్కువగా ‘జై హనుమాన్’ ఉంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ–‘‘హనుమాన్’కి వచ్చిన స్పందన చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యత పెంచింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చే చిత్రాలను బాధ్యతగా తీస్తాను’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం’’ అన్నారు తేజ. ‘‘హనుమాన్’ని హిట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
ఆమె అందం అలాంటిది, జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆమె స్నేహం కోసం..
అమృత షేర్గిల్. 20వ శతాబ్దపు గొప్ప చిత్రకారిణి. 1941లో 28 ఏళ్ల చిన్న వయసులో మరణించినా ఆమె చిత్రాలు ఇప్పటికీ వార్తలు సృష్టిస్తూనే ఉన్నాయి. అమ్మలక్కల కబుర్లను ‘ది స్టోరీ టెల్లర్’ పేరుతో ఆమె బొమ్మ గీస్తే ఇప్పటివరకూ భారతదేశంలో ఏ చిత్రకారుడికీ పలకనంత వెల– 61.8 కోట్లు పలికింది. ఆ చిత్రం గురించి...ఆ గొప్ప చిత్రకారిణి గురించి. అమృత షేర్గిల్ తన జీవిత కాలంలో 200 లోపు చిత్రాలను గీసింది. అన్నీ కళాఖండాలే. వాటిలో చాలామటుకు ప్రఖ్యాత మ్యూజియమ్‌లలో ఉన్నాయి. కొన్ని మాత్రమే ఆమె చెల్లెలి (ఇందిర) కుమారుడు వివాన్ సుందరం, కుమార్తె నవీనల దగ్గర ఉన్నాయి. 1937లో తను గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రాన్ని అప్పటి లాహోర్‌లో మొదటిసారి ప్రదర్శనకు పెట్టింది అమృత. అప్పటి నుంచి ఆ చిత్రం చేతులు మారుతూ తాజాగా ఢిల్లీలో జరిగిన వేలంలో 61.8 కోట్లు పలికింది. ఇప్పటివరకూ భారతీయ చిత్రకారుల ఏ పెయింటింగ్‌కూ ఇంత రేటు పలకలేదు. ఆ విధంగా చనిపొయిన ఇన్నాళ్లకు కూడా అమృత రికార్డు స్థాపించ గలిగింది. దీనికంటే ముందు గతంలో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టెషన్’ అనే చిత్రం 51.75 కోట్లకు పలికి రికార్డు స్థాపించింది. దానిని అమృత బద్దలు కొట్టింది. రూ.61.8 కోట్లు ధర పలికిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రం గొప్ప చిత్రకారిణి అమృత షేర్గిల్ భారతీయ సిక్కు తండ్రి ఉమ్రావ్ సింగ్‌కి, హంగేరియన్ తల్లి ఎంటొనెట్కు జన్మించింది. బాల్యం నుంచి గొప్ప లావణ్యరాశిగా ఉండేది. ఐదేళ్ల నుంచి బొమ్మలు గీయడం మొదలు పెట్టింది. వీరి కుటుంబం సిమ్లాలో కొంత కాలం ఉన్నా అమృత బొమ్మల్లోని గొప్పదనాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు 16 ఏళ్ల వయసున్నప్పుడు పారిస్‌కు తీసుకెళ్లి ఐదేళ్ల పాటు చిత్రకళలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత అమృత గొప్ప చిత్రాలు గీస్తూ వెళ్లింది. అవన్నీ కూడా భారతీయ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేవే. ఇప్పుడు అత్యధిక రేటు పలికిన ‘ది స్టోరీ టెల్లర్’– పల్లెల్లో నలుగురు అమ్మలక్కలు కూచుని కబుర్లు చెప్పుకునే సన్నివేశం. ఇది కాకుండా ‘వధువు అలంకరణ’, ‘ఒంటెలు’, ‘యంగ్ బాయ్ విత్ త్రీ యాపిల్స్’, ‘జిప్సీ గర్ల్స్’, ‘యంగ్ గర్ల్స్’ ఆమె ప్రఖ్యాత చిత్రాలు. ఆమె తన సెల్ఫ్ పొర్ట్రయిట్ను కూడా గీసుకుంది. అకాల మరణం అమృత షేర్గిల్ తన హంగేరియన్ కజిన్ విక్టర్‌ను వివాహం చేసుకుంది. వారు లాహోర్‌లో ఉన్న సమయంలో కేవలం 28 ఏళ్ల వయసులో 1941లో మరణించింది. అందుకు కారణం కలుషిత ఆహారంతో వచ్చిన వాంతులు, విరేచనాలు అని చెప్తారు. మరో కారణం ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉందని సంప్రదాయ డాక్టర్‌గా ఉన్న విక్టర్ ఆమెకు రహస్యంగా, అశాస్త్రీయంగా అబార్షన్ చేయబోయాడని, అందువల్ల తీవ్రమైన బ్లీడింగ్ జరిగి మరణించిందని అంటారు. ఆకర్షణాజాలం అమృత షేర్గిల్ ఆ రోజుల్లో సంపన్న వర్గాల్లో గొప్ప ఆకర్షణ కలిగిన వ్యక్తిగా కీర్తి గడించింది. జవహర్లాల్ నెహ్రూ ఆమె స్నేహం కోసం అనేక లేఖలు రాశాడు. ఢిల్లీలో జరిగిన అమృత ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ‘అమృత ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఉన్నవారందరూ చేష్టలుడిగి ఆమెను చూస్తూ ఉండిపొయేవారు’ అని అనేకమంది రాశారు. ‘ఆమె జీవించి ఉంటే ప్రపంచం మొత్తం ఎన్నదగిన గొప్ప చిత్రకారిణి అయి ఉండేది’ అని ఆర్ట్ క్రిటిక్స్ అంటారు.ఆమె లేదు. కాని ఆమె చిత్రాలు ఆమెను సజీవంగా ఉంచుతూనే ఉన్నాయి. -
కోలుకుంటున్న అమృత
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో గురువారం రాత్రి తల్లీ, కుమారుడు ఆత్మహత్య కేసులో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఘటనలో కుమార్తె తీవ్రంగా గాయపడి విజయవాడలో చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందులా? లేక కుటుంబ కలహాల వల్ల ఈ తీవ్ర నిర్ణయానికి పాల్పడ్డారా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు త్రిభువన్ చదువులో ముందు వరుసలో ఉండేవాడు. కుటుంబం కలిసిమెలిసి ఉండేదని.. ఇంతటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని చుట్టుపక్కల వారు అంటున్నారు. గురువారం రాత్రి శ్రీదేవి సత్యప్రభ (38), పిల్లలు త్రిభువన్ (18), అమృత (16)లు గురువారం రాత్రి ఆత్మహత్యా యత్నం చేసిన సంగతి తెలిసిందే.. క్షణికావేశంలో సత్యప్రభ తీసుకున్న నిర్ణయానికి బిడ్డలు తలాడించినా, ఘటనా స్థలానికి చేరుకున్నాక, ప్రాణాలు తీసుకొనే విషయంలో తటపటాయించినట్లు చెబుతున్నారు. ఇంతలో త్రిభువన్ విజయవాడ వైపునకు వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయగా, అక్కడికక్కడే మరణించాడు. అనంతరం సత్యప్రభ, అమృతలు కూడా తిరుమల ఎక్స్‌ప్రెస్ కిందపడి బలవన్మరణానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సత్యప్రభ మృతిచెందగా.. అమృతకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబంలో మిగిలిన బిడ్డ ప్రాణం దక్కించుకొనేందుకు ఆ తండ్రి పోరాటం చేస్తున్నారు. శ్రీదేవి సత్యప్రభ, త్రిభువన్ మృతదేహాలకు ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం పోస్టుమార్టం పూర్తయ్యింది. విజయవాడ ఆసుపత్రిలో అమృత రైలు ఘటనలో తీవ్రగాయాలపాలైన అమృతను గూడెంలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోస ం విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అమృతకు మెదడు సంబంధిత శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్సై హరిబాబు తెలిపారు. -
ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ
‘‘నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో మొదటినుంచీ సినిమాలు తీస్తూనే ఉన్నాను. నా మొదటి సినిమా ‘శివ’ నుంచి కూడా అలానే చేశాను. ‘సర్కార్, 26/11, రక్తచరిత్ర’ సినిమాలు తీశాను. ‘మర్డర్’ సినిమా కూడా నిజ జీవితాల నుంచి తీసుకున్న కథాంశమే. ఏ కథ అయినా నిజజీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిందే’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ఆయన తాజా చిత్రం ‘మర్డర్’ వివాదంలో ఇరక్కుంది. ప్రణయ్, అమృతల ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారనే వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో సినిమాను ఆపేయాలని అమృత కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ని విచారించి, తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘మర్డర్’ సినిమా ఫలానా వాళ్ల జీవితం అని ఎప్పుడూ చెప్పలేదు. ఒక కేసు చాలా పాపులర్ అయింది. అందరూ ఈ సినిమా అదే అనుకున్నారు. కానీ కాదని ఎప్పుడో చెప్పాను. కేసు పెట్టిన వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. నాకు ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, నట్టి కరుణ కూడా పాల్గొన్నారు. -
మలైకాకు కరోనా పాజిటివ్: సోదరి అసహనం!
సాక్షి, ముంబై: బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా ఆరోరా, అర్జున్ కపూర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో మలైకా కరోనా పరీక్షలకు సంబంధించిన మెడికల్ రిపోర్టు ఫేస్‌బుక్‌తో పాటు పలు సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మలైకా సోదరి, నటీ అమ్రితా ఆరోరా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. తన సోదరి మెడికల్ రిపోర్టును సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. అలాగే తనకు కరోనా సోకడం సబబేనంటూ పలువురు వ్యాఖ్యనించడం దారుణమన్నారు. (చదవండి: అర్జున్ కపూర్‌కు, మలైకా అరోరాకు కరోనా) ఇలాంటి సమయంలో తనకు సపోర్టుగా ఉంటూ కోలుకునేలా మద్దతుగా నిలవల్సింది పోయి.. విమర్శలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తన మెడికల్ రిపోర్టును షేర్ చేస్తూ మలైకాను కించపరచడం సరికాదని, ఇలాంటి సమయంలో ఇలా చేయడమేంటని అసలు మనుషులకు ఏమైందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మహమ్మారి నుంచి కోలుకునేందుకు మలైక తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని, ఇందుకు తనని తాను తాను సిద్దం చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా తను కరోనా బారిన పడ్డానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని మలైకా ప్రకటించారు. ప్రస్తుతం తను ఐసోలేషన్‌కు వెళ్లానని, గత కొద్దిరోజులకు తనను కలిసిన వారు హోం క్వారంటైన్లో ఉండాలని, కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మలైకా విజ్ఞప్తి చేశారు. -
శృంగారం, పోర్నోగ్రఫీ ఒకటేనా?
న్యూఢిల్లీ: మన దేశంలో శృంగారాన్ని, పోర్నోగ్రఫీని ఒకేవిధంగా చూస్తున్నారని ప్రముఖ రచయిత్రి అమృత నారాయణన్ అభిప్రాయపడ్డారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందని.. శృంగారం ఆత్మాశ్రయమని ఇందులో ఒకరిపట్ల ఒకరికి ఆపేక్ష, భావోద్వేగాలు కలగలసి ఉంటాయని వెల్లడించారు. పోర్నోగ్రఫీలో కామం మాత్రమే ఉంటుందని వివరించారు. సాహిత్య ఆజ్‌తక్ కార్యక్రమంలో భాగంగా ‘రైటింగ్ ఎరోటికా ఇన్ ఇండియా’ అంశంపై జరిగిన చర్చలో మాధురి బెనర్జీతో కలిసి ఆమె పాల్గొన్నారు. మన భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం పుస్తకాలు కల్పిస్తాయని, అందుకే తాను రాయడం మొదలుపెట్టానని అమృత వెల్లడించారు. ‘కష్టపడి పనిచేసే మనుషులున్న దేశంగానే స్వాతంత్ర్యం వచ్చాక మనదేశం గుర్తింపు కోరుకుంది. హార్డ్‌వర్క్, లైంగికత రెండింటినీ కలపలేదు. స్వాతంత్ర్యం వచ్చాక సాంస్కృతిక వారసత్వంలో ఈ అంశాన్ని మనం వదిలేశాం. మన దేశానికి ఇంగ్లీషు పరిచయమైన కొత్తలో మనల్ని అనాగరీకులుగా చూశారు. మనం కూడా అలాగే వ్యవహరించాం. నైతిక విలువలను మధ్యతరగతి మీద రుద్దడంతో అది కూడా ఇలాగే కొనసాగింది. ఎందుకంటే దేశాన్ని ప్రమోట్ చేయడానికి ఈ ఇమేజ్ అవసరమైంది. అయితే పుస్తకాలు చదివినంతమాత్రాన ప్రజలు స్వతంత్రులుగా మారరు. తమంతట తామే ప్రజలు స్వేచ్ఛ సాధించాలి. దీనికి కచ్చితంగా పుస్తకాలు సహాయపడతాయ’ని అమృత వివరించారు. క్లినికల్ సైకాలజిస్ట్ అయిన ఆమె పారెట్స్ ఆఫ్ డిజైర్, ఏ ప్లెజెంట్ కెండ్ ఆఫ్ హెవీ వంటి పుస్తకాలు రాశారు. భారతదేశ శృంగార చరిత్రపై పరిశోధన కూడా సాగించారు. మాధురి బెనర్జీ మాట్లాడుతూ.. ‘కామసూత్ర’ స్థాయిలో ‘తమిళ సంగం’ పుస్తకాలకు పేరు రావాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల్లో భావోద్వేగాలు ఉంటాయని, కామసూత్రలో ఎటువంటి ఎమోషన్స్ ఉండవని చెప్పారు. శృంగార సాహిత్యంవైపు ఎందుకు మొగ్గుచూపారని ప్రశ్నించగా.. ‘నేను మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. మహిళ కన్యత్వాన్ని కోల్పోతే సమాజం ఎలా స్పందిస్తుందనే దాని గురించి నా మొదటి పుస్తకంలో రాశాను. మన దేశంలో సెక్సువాలిటీ గురించి బహిరంగంగా మాట్లాడరు. నా పుస్తకం 2010లో విడుదలైంది. లైంగికత గురించి చర్చ జరగాలని ఈ పుస్తకం రాశాను. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. నా పుస్తకాలు లైంగికత, శృంగారానికి పరిమితం కావు. మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తాయి. శృంగార సాహిత్యాన్ని మన విద్యావ్యవస్థలో భాగం చేయాలి. లైంగికత గురించి గోప్యత పాటిస్తుండటంతో పిల్లలు ఇంటర్నెట్ను ఆశ్రయించి పెడతోవ పడుతున్నారు. లైంగికతపై పిల్లలకు సదావగాహన కల్పించి, వారి భావాలను స్వేచ్ఛగా వెల్లడించేలా చేయాల’ని చెప్పారు. మాధురి బెనర్జీ.. లాసింగ్ మై వర్జినిటీ, గాళ్స్ నైటవుట్, మై క్లింజీ గాళ్‌ఫ్రెండ్, అడ్వాంటేజ్ లవ్, ఫర్బిడెన్ డిజైర్స్ వంటి శృంగార సాహిత్య పుస్తకాలు రాశారు. (చదవండి: పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల...) -
ప్రణయ్ హత్యకేసు ; చార్జిషీటు దాఖలు
సాక్షి, నల్గొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో మిర్యాలగూడ పోలీసులు జిల్లా కోర్టులో బుధవారం చార్జిషీటు దాఖలు చేశారు. మొత్తం 102 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1600 పేజీలతో చార్జిషీటు, 63 పేజీల్లో విచారణ నివేదిక కోర్టుకు సమర్పించారు. తమ కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో ప్రణయ్‌ను అమృత తండ్రి తిరునగరు మారుతీరావు దారుణంగా హత్యచేయించిన సంగతి తెలిసిందే. (ప్రణయ్ హత్య కేసు నిందితులు బెయిల్‌పై విడుదల) ఈ ఘటన గతేడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడ పట్టణంలో పట్టపగలే జరిగింది. ప్రణయ్ హత్యకేసులో అరెస్టయిన నిందితులు మారుతీరావు, అతని తమ్ముడు శ్రావణ్, మరొక నిందితుడు కరీంపై గతేడాది సెప్టెంబర్ 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించగా... ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ఈ ముగ్గురితోపాటు మరో ఐదుగురి పేర్లను కూడా పోలీసులు చార్జిషీటులో చేర్చారు. హత్యజరిగిన 9 నెలల అనంతరం చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం. -
ప్రణయ్ హత్య కేసు నిందితులు బెయిల్‌పై విడుదల
వరంగల్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీం ఆదివారం బెయిల్‌పై విడుదలయ్యారు. వీరికి హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా నిందితుల బంధువులు ఆ ఉత్తర్వులను శనివారం రాత్రి తీసుకురావడంతో విడుదల ఆదివారానికి వాయిదా పడింది. ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు 8.20 గంటలకు మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలను విడుదల చేశారు. ఈ ముగ్గురిపై గత ఏడాది సెప్టెంబర్ 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముగ్గురు వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం వీరు రెండు నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్ మంజూరు చేయద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్‌లు కోర్టుకు విన్నవించడంతో బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తర్వాత తిరిగి బెయిల్ కోరుతూ నిందితులు ముగ్గురూ ఇటీవల హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ముగ్గురిని విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఎన్.మురళీబాబు తెలిపారు. విడుదలైన వెంటనే నిందితులు రెండు వాహనాల్లో తమ బంధువులతో కలసి వెళ్లిపోయారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలి అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య డిమాండ్ చేసింది. తన కుమార్తె అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని సమాఖ్య అధ్యక్షుడు ఆనందరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల ప్రభుత్వం ప్రణయ్ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి ఎలాంటిహాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
ప్రణయ్ ప్రతిరూపంగా పెంచుకుంటా!
మిర్యాలగూడ: ‘ప్రణయ్ హత్యలో ఎంత మంది ఉన్నారో, వారిని దారుణంగా చంపాలి. వాళ్లను ఉరి తీయొద్దు.. అతి దారుణంగా చంపితేనే అది చూసి ఎవరు ఇలాంటి హత్యలు చేయకుండా ఉంటారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా భావిస్తున్నా’అని అమృత పేర్కొంది. మిర్యాలగూడలో సంచలనం రేపిన పరువు హత్యకు సంబంధించి ప్రణయ్ భార్య అమృత సంచలన విషయాలు వెల్లడించింది. కొందరు నాయకుల పేర్లను బయటపెట్టింది. ఆదివారం ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన ఆమె ప్రణయ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ‘ప్రాణాలు తీస్తారని ప్రణయ్ భయపడేవాడు కాదు. నాకు నిత్యం తోడుగా ఉంటూ చాలా ధైర్యం చెప్పేవాడు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రణయ్ అంటే నాకు ఎంత ఇష్టమో అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు. నేను వారి వద్దనే ఉంటా. నాకు పుట్టే బిడ్డను ప్రణయ్‌కి ప్రతిరూపంగా పెంచుకుంటా’ అని చెప్పింది. పరువు, కుల పిచ్చి ఉన్నవాళ్లకు మానవత్వం ఉండదని, వారిని ఎవరూ క్షమించరని, శిక్ష కఠినంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొంది. పలువురి పేర్లు వెల్లడి... ప్రణయ్ హత్యలో తన తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్, టీఆర్ఎస్ నేత, న్యాయ వాది భరత్‌కుమార్, నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, వ్యాపారవేత్తలు రంగా శ్రీకర్, రంగా రంజిత్ ఉన్నట్లు అమృత వెల్లడించింది. ‘వివాహం చేసుకున్న తర్వాత వీరేశం నన్ను, ప్రణయ్‌ని పిలిపిస్తే వెళ్లలేదు. అంతకుముందు రోజు నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య విషయాన్ని పత్రికల్లో చూసి వెళ్లలేదు. అందుకే కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ప్రణయ్ తండ్రి బాలస్వామిపై ఎల్ఐసీ డబ్బులు కట్టలేదని కేసు పెట్టించారు. ఆయన ఎల్ఐసీ ఏజెంట్ కాకపోవడంతో మేము ఐజీ వద్దకు వెళ్లాం. ఆ తర్వాత ఎస్పీని కలసి పూర్తి వివరాలు చెప్పాం’ అని గతంలో జరిగిన విషయాలను తెలియజేసింది. బయట తిరిగితే ప్రజలే చంపుతారు ప్రణయ్ తమ్ముడు అజయ్ ‘నా అన్న ప్రణయ్‌ని చంపిన మారుతీరావు బయట తిరిగితే ప్రజలే చంపుతారు. ప్రణయ్ అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వేధిస్తున్నాడు. ఇటీవల అమృతతో ఆమె తల్లి ఫోన్లో మాట్లాడేది. అలా నమ్మించి ప్రణయ్‌ని చంపారు. హత్యకు ముందురోజు వినాయచవితి నాడు నాతో ప్రణయ్ ఫోన్లో మాట్లాడాడు. ఇలా జరుగుతుందనుకోలేదు. అన్న, వదినలు అన్యోన్యంగా ఉండేవారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశాడు. నన్నూ చంపుతారు: ప్రణయ్ తండ్రి బాలస్వామి ‘నా కొడుకు ప్రణయ్‌ని చంపి తన కూతురిని తీసుకెళ్లాలనుకున్నాడు. అమృత అతని వద్దకు వెళ్లనంటోంది. మా వద్దనే ఉన్నా మంచిగా చూసుకుంటాం. కానీ ఆమెను తీసుకెళ్లడానికి నన్ను కూడా చంపుతాడు. మారుతీరావు, శ్రవణ్‌కుమార్‌లను శాశ్వతంగా మిర్యాలగూడ నుంచి బహిష్కరించాలి. నా కొడుకు అమృతను ప్రేమించిన నాటి నుంచే ఎన్నో సార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ప్రణయ్ కళాశాలకు వెళ్లకుండానే పరీక్షలు రాశాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డా వారిద్దరు మంచిగా ఉండేవారు. ఇటీవల అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పేవాడు. వారి కోపం తగ్గిందని భావించాం. కానీ నమ్మించి ఇలా చంపుతాడనుకోలేదు’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. -
నయీం గ్యాంగ్‌తో బెదిరించారు
మిర్యాలగూడ: ‘మేము 9వ తరగతినుంచి ప్రేమించుకున్నాం. మొదటినుంచీ మాకు నా తండ్రినుంచి బెదిరింపులు ఉన్నాయి. గతంలో నయీం గ్యాంగ్ ద్వారా బెదిరించాడు. నన్ను కూడా చంపి నాగార్జునసాగర్‌లో పడేస్తానని హెచ్చరించాడు. అయినా మేము భయపడలేదు. కానీ చివరికి అనుకున్నంత పనిచేశాడు. నా భర్తను అకారణంగా చంపేశాడు’అంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత రోదిస్తూ చెప్పింది. ప్రణయ్ హత్య అనంతరం మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన భార్య అమృతను శనివారం పలువురు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలపిస్తూ పలు సంచలన విషయాలు చెప్పింది. పలువురు రాజకీయనాయకులు సహా, అక్కడికి వచ్చిన వారు ఆమె పరిస్థితి చూసి కంటనీరు పెట్టుకున్నారు. ప్రణయ్‌ని హత్య చేసిన వారిని చంపేయాలంటూ అమృత విలపించింది. ప్రణయ్‌ని తన తండ్రి మారుతీరావే చంపినట్లు పేర్కొంది. తన భర్తను చంపించిన పుట్టింటికి వెళ్లేది లేదని, తనకు పుట్టే బిడ్డను ప్రణయ్ గుర్తుగా పెంచుకుంటానని వెల్లడించింది. ప్రణయ్‌తో తాను 9వ తరగతి నుంచి ప్రేమలో ఉన్నానని, తనను ఎంతో బాగా చూసుకునే వాడని, తనను కూడా ప్రణయ్ వద్దకు పంపించేయాలని రోదించింది. మాట్లాడుకోవద్దని కొట్టారు.. తామిద్దరూ ప్రేమించుకున్న విషయం గతంలోనే ఇంట్లో వారికి తెలియడంతో తన తండ్రి మారుతీరావు ప్రణయ్‌ని నయీం గ్యాంగ్‌తో బెదిరించినట్లు అమృత తెలిపింది. దాంతో అప్పట్లో ప్రణయ్ కొద్ది రోజుల పాటు కళాశాలకు కూడా రాలేదని చెప్పింది. ఆ తర్వాత ప్రణయ్‌తో మాట్లాడవద్దని ఇంట్లో తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్‌లు ఎన్నోసార్లు తనను కొట్టారని, కాలితో తన్నారని తెలిపింది. ఆ క్రమంలోనే ప్రణయ్‌తో మాట్లాడినట్లు తెలిస్తే తనను కూడా చంపి సాగర్‌లో పడేస్తామని బెదిరించినట్లు వెల్లడించింది. తాను ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రికి, బాబాయికి ఇష్టం లేదంది. తన తండ్రి మారుతీరావు కొంతకాలంగా ఫోన్లో మాట్లాడుతున్నాడని, గర్భవతి అయిన విషయాన్ని చెప్పగా అబార్షన్ చేయించుకోవాలని కోరినట్లు తెలిపింది. ప్రణయ్ హత్య జరగడానికి ఐదు నిమిషాల ముందు ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో తండ్రి మారుతీరావు ఫోన్ చేశాడని, కానీ ఫోన్ ఎత్తలేదని చెప్పింది. కాగా, రిసెప్షన్ సమయంలో ప్రణయ్, అమృతలు తీయించుకున్న వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. దానిని చూసిన అమృత తండ్రి మారుతీరావు మరింత కక్ష పెంచుకున్నట్లు తెలిసింది. కూతురులా చూసుకున్నాం ప్రణయ్ తండ్రి బాలస్వామి గతంలో నయీం గ్యాంగ్‌తో బెదిరించారని ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి చెప్పారు. శనివారం తనను పరామర్శించడానికి వచ్చిన పలువురు రాజకీయ నేతలకు ఆయన గత విషయాలను చెబు తూ విలపించారు. అమృతను కూతురులా చూసుకుంటున్నా తన కొడుకును మారుతీరావు పొట్టనబెట్టుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి కోరిక మేరకు ఇంటికి వెళ్లాలని అమృతకు చెబితే, ఆత్మహత్య చేసుకుంటానేగానీ అక్కడికి వెళ్లేదిలేదని, ప్రణయ్‌తోనే ఉంటానని చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అమృత తన తండ్రి ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
అ‘మృత’..మిగిల్చె కడుపుకోత
తమ కుమార్తెను ఉన్నతంగా చూడాలనుకున్నారు. ఆమె చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా డాక్టర్‌ను చేయాలనుకున్నారు. ఆమెను మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నీట్ లాంగ్‌టెర్మ్ కోచింగ్ నిమిత్తం విశాఖలోని ఓ కోచింగ్ సెంటర్లో చేర్చారు. దురదృష్టం. ఏమైందో ఏమో... ఆమె శనివారం ఉదయం తానుంటున్న గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటన ఆ కుటుంబంలోనే కాదు... గుమ్మలక్ష్మీపురం గ్రామంలోనూ విషాదం నింపింది. పెదవాల్తేరు(విశాఖ తూర్పు): అమృతా ఎంత పనిచేశావమ్మా.. నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా.. మాకెందుకు చెప్పలేదు.. ఎవరైనా ఇలా చేస్తారా.. మాకెందుకు దూరం అయ్యావమ్మా.. నిన్ను డాక్టర్ చేద్దామనుకుంటే శవంలా మారిపోయావా.. అంటూ ఆత్మహత్యకు పాల్పడిన నీట్ విద్యార్థిని అమృత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. ఆశీలుమెట్ట వద్ద ఉన్న గ్రావిటీ ఐఐటీ–మెడికల్ అకాడమీలో నీట్ లాంగ్‌టెర్మ్ కోచింగ్ విద్యార్థిని అమృత(17) శనివారం ఉదయం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. పిల్లల బంగారు భవిష్యత్ కోసం హాస్టల్లో చేర్పించి చదివిస్తే వారు ఇలా బలవన్మరణాలకు పాల్పడి తల్లిదండ్రులకు అంతులేని కడుపుకోత మిగుల్చుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన మర్రి సాంబమూర్తి వ్యవసాయం చేస్తూ ఎస్బీఐ అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఈయన భార్య సుధారాణి అంగన్వాడీ కార్యకర్త. వీరికి అమృత, ఆదర్శ సంతానం. అమృతను ఈ నెల 9న గ్రావిటీ అకాడమీలో నీట్లో లాంగ్‌టర్మ్ శిక్షణ కోసం చేర్పించారు. ఆమె శనివారం ఉదయం స్నానం చేసి దుస్తులు మార్చుకోవడానికి ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు మేట్రిన్ హరితకు సమాచారం అందజేశారు. ఆమె మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపు విరగ్గొట్టి చూడగా అప్పటికే అమృత మరణించింది. ఈమె అన్నయ్య ఆదర్శ్ గాజువాకలోని విశాఖ డిఫెన్స్ అకాడమీలో చదువుతున్నాడు. సంఘటన స్థలాన్ని మూడో పట్టణ సీఐ ఇమ్మానియేల్‌రాజు, ఎస్ఐలు సతీష్, డి.రేణుక పరిశీలించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ జీవనం అలవాటే.. అమృతకు హాస్టల్ వాతావరణం కొత్తేమీ కాదని ఆమె అన్నయ్య ఆదర్శ్ తెలిపాడు. ఆమె 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టల్లో ఉంటూ చదువుకుంది. తరువాత పార్వతీపురంలో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. ప్రస్తుతం నీట్లో లాంగ్‌టెర్మ్ కోచింగ్ కోసం జాయిన్ అయింది. అమృత రాసిన డైరీని బట్టి నీట్లో మెరుగైన ర్యాంక్ సాధించలేనోమోనన్న బెంగతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. డైరీలో ఏముంది? హాస్టల్లో చేరిన అమృత మూడు రోజుల పాటు ముభావంగా ఉందని సహచర విద్యార్థులు చెబుతున్నారు. తరగతి గదిలో పలుమార్లు ఏడ్చినట్టు కూడా చెప్పారు. అమృత రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘కోచింగ్ మొదటి రోజు సూపర్‌గా జరిగింది. కానీ, ఒక సబ్జెక్టు అర్థం కాలేదు. అందుకే ఏడ్చేశాను. రోజువారీ కోచింగ్ బాగానే ఉంది. ఏడుస్తూనే జువాలజీ క్లాసు విన్నాను. చాలా బాగా అర్థమైంది. నైట్ స్టడీలో ఫిజిక్స్ ఫార్ములాలు కూడా నేర్చుకున్నాను. నా క్లాసులో చాలా మంది టాపర్స్ ఉన్నారు. అందుకే కొంచెం భయంగా ఉంది. రెండో రోజు క్లాసులో జువాలజీ అర్థం కాలేదు’అంటూ డైరీలో ఆమె రాసుకుంది. పోలీసులు రాకముందే తలుపులు విరగ్గొట్టొచ్చు ఏదైనా హాస్టల్లో దురదృష్టవశాత్తూ ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసిన వెంటనే పోలీసుల కోసం ఎదురు చూడకుండా తలుపులు విరగ్గొట్టవచ్చు. కొన ఊపిరితో ఉంటే సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే వారు బతికే అవకాశం ఉంది. కానీ చాలామంది తలుపులు విరగ్గొడితే వారిపై కేసులు పెడతారేమోనన్న అనవసర భయాందోళనతో తలుపుల జోలికి వెళ్లడం లేదు. ఆశీలుమెట్ట హాస్టల్లో కూడా ఇలాగే జరిగింది. పోలీసులు వచ్చి తలుపులు విరగొట్టాల్సి వచ్చింది. – ఇమ్మానియేల్‌రాజు, సీఐ, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్, విశాఖ తలుపు విరగ్గొట్టి ఉంటే.. గదిలోకి వెళ్లిన అమృత దుస్తులు మార్చుకుంటుందన్న ఉద్దేశంతోనే మిగతా విద్యార్థినులు కొందరు స్నానాలకు, మరికొందరు బ్రష్ చేయడానికి వెళ్లిపోయారు. కానీ ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు విద్యార్థినులు కిటికీలోంచి చూడగా చున్నీతో ఉరిపోసుకుని ఉండడం చూసి సిబ్బందికి, మేట్రిన్ హరితకు సమాచారమిచ్చారు. హాస్టల్ సిబ్బంది ముందుగానే తలుపు విరగ్గొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిబ్బంది మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి మిన్నకుండిపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో ఎస్ఐ సతీష్, కొందరు కానిస్టేబుళ్లు వచ్చి తలుపు విరగ్గొట్టి చూసి అమృత చనిపోయిందని నిర్ధారించారు. గుమ్మలక్ష్మీపురంలో విషాదఛాయలు గుమ్మలక్ష్మీపురం(కురుపాం): అమృత ఆత్మహత్యతో గుమ్మలక్ష్మీపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. అమృత ఇంటర్ పార్వతీపురంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాకపోవడంతో ఆమెను లాంగ్ టెర్మ్ కోచింగ్ నిమిత్తం విశాఖలోని మూడు రోజుల క్రితమే చేర్పించారు. ఇంతలోనే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కన్నీటిపర్యంతమౌతున్నారు. ఆమె స్వగ్రామంలో అందరితో కలివిడిగా ఉండేదని, ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో షాక్‌కు గురయ్యామని వీరంతా చెప్తున్నారు. ఆత్మహత్యపై విచారణకు డిమాండ్ ద్వారకానగర్(విశాఖ దక్షిణ): గ్రావిటీ అకాడమీలో అమృత అనే విద్యార్థిని ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ కళాశాల అధినేత, మంత్రి నారాయణ బంధువులు కావడంతో ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. అమృత ఆత్మహత్యకు కారణమైన బాధ్యులను శిక్షించాలన్నారు. గ్రావిటీ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కల్యాణ జగదీష్ ప్రసాద్, అనిల్, జీవన్, జోజో, నీబీన్, శ్యామ్, చినబాబు, లీలాకృష్ణ, హరి పాల్గొన్నారు. -
ఎంత పని చేశావమ్మా....
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ‘అమృతా ఎంత పనిచేశావమ్మా.. నీకెంత కష్టం వచ్చిందమ్మా.. మాకెందుకు చెప్పలేదు.. ఎవరైనా ఇలా చేస్తారా.. మాకెందుకు దూరం అయ్యావమ్మా.. నిన్ను డాక్టర్ చేద్దామనుకుంటే శవంలా మారిపోయావా..’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన నీట్ విద్యార్థిని అమృత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. ఆశీలుమెట్ట వద్ద ఉన్న గ్రావిటీ ఐఐటీ–మెడికల్ అకాడమీలో నీట్ లాంగ్‌టెర్మ్ కోచింగ్ విద్యార్థిని అమృత(17) శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన మర్రి సాంబమూర్తి వ్యవసాయం చేస్తూ ఎస్బీఐ మెసెంజర్‌గా పనిచేస్తున్నారు. ఈయన భార్య సుధారాణి అంగన్వాడీ కార్యకర్త. వీరికి అమృత, ఆదర్శ సంతానం. అమృతను ఈ నెల 9న గ్రావిటీ అకాడమీలో నీట్లో లాంగ్‌టర్మ్ శిక్షణ కోసం చేర్పించారు. ఆమె శనివారం ఉదయం స్నానం చేసి దుస్తులు మార్చుకోవడానికి ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు మేట్రిన్ హరితకు సమాచారం అందజేశారు. ఆమె మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపు విరగ్గొట్టి చూడగా అప్పటికే అమృత మరణించింది. ఈమె అన్నయ్య ఆదర్శ్ గాజువాకలోని విశాఖ డిఫెన్స్ అకాడమీలో చదువుతున్నాడు. సంఘటన స్థలాన్ని మూడో పట్టణ సీఐ ఇమ్మానియేల్‌రాజు, ఎస్ఐలు సతీష్, డి.రేణుక పరిశీలించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ జీవనం అలవాటే.. అమృతకు హాస్టల్ వాతావరణం కొత్తేమీ కాదని ఆమె అన్నయ్య ఆదర్శ్ తెలిపాడు. ఆమె 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టల్లో ఉంటూ చదువుకుంది. తరువాత పార్వతీపురంలో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. ప్రస్తుతం నీట్లో లాంగ్‌టెర్మ్ కోచింగ్ కోసం జాయిన్ అయింది. అమృత రాసిన డైరీని బట్టి నీట్లో మెరుగైన ర్యాంక్ సాధించలేనోమోనన్న బెంగతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తలుపు విరగ్గొట్టి ఉంటే.. గదిలోకి వెళ్లిన అమృత దుస్తులు మార్చుకుంటుందన్న ఉద్దేశంతోనే మిగతా విద్యార్థినులు కొందరు స్నానాలకు, మరికొందరు బ్రష్ చేయడానికి వెళ్లిపోయారు. కానీ ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు విద్యార్థినులు కిటికీలోంచి చూడగా చున్నీతో ఉరివేసుకుని ఉండడం చూసి సిబ్బందికి, మేట్రిన్ హరితకు సమాచారమిచ్చారు. హాస్టల్ సిబ్బంది ముందుగానే తలుపు విరగ్గొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిబ్బంది మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి మిన్నకుండిపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో ఎస్ఐ సతీష్, కొందరు కానిస్టేబుళ్లు వచ్చి తలుపు విరగ్గొట్టి చూసి అమృత చనిపోయిందని నిర్ధారించారు. పోలీసులు రాకముందే తలుపులు విరగ్గొట్టొచ్చు ఏదైనా హాస్టల్లో దురదృష్టవశాత్తూ ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసిన వెంటనే పోలీసుల కోసం ఎదురు చూడకుండా తలుపులు విరగ్గొట్టవచ్చు. కొన ఊపిరితో ఉంటే సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే వారు బతికే అవకాశం ఉంది. కానీ చాలామంది తలుపులు విరగ్గొడితే వారిపై కేసులు పెడతారేమోనన్న అనవసర భయాందోళనతో తలుపుల జోలికి వెళ్లడం లేదు. ఆశీలుమెట్ట హాస్టల్లో కూడా ఇలాగే జరిగింది. పోలీసులు వచ్చి తలుపులు విరగొట్టాల్సి వచ్చింది. – ఇమ్మానియేల్‌రాజు, సీఐ, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్, విశాఖ డైరీ స్వాధీనం హాస్టల్లో చేరిన అమృత మూడు రోజుల పాటు ముభావంగా ఉందని సహచర విద్యార్థులు చెబుతున్నారు. తరగతి గదిలో పలుమార్లు ఏడ్చినట్టు కూడా చెప్పారు. అమృత రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘కోచింగ్ మొదటి రోజు సూపర్‌గా జరిగింది. కానీ, ఒక సబ్జెక్టు అర్థం కాలేదు. అందుకే ఏడ్చేశాను. రోజువారీ కోచింగ్ బాగానే ఉంది. ఏడుస్తూనే జువాలజీ క్లాసు విన్నాను. చాలా బాగా అర్థమైంది. నైట్ స్టడీలో ఫిజిక్స్ ఫార్ములాలు కూడా నేర్చుకున్నాను. నా క్లాసులో చాలా మంది టాపర్స్ ఉన్నారు. అందుకే కొంచెం భయంగా ఉంది. రెండో రోజు క్లాసులో జువాలజీ అర్థం కాలేదు’ అంటూ డైరీలో ఆమె రాసుకుంది. -
జయ రక్త నమూనాలు మా వద్ద లేవు: అపోలో
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత చికిత్సకు సంబంధించిన వైద్య డాక్యుమెంట్లు, రక్త నమూనాలు తమ వద్ద లేవని అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. అమృత అనే యువతి జయలలిత కుమార్తెగా రుజువు చేసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో జయ రక్తనమూనాలపై బదులివ్వాల్సిందిగా జడ్జి అపోలో ఆస్పత్రిని ఆదేశించారు. ‘ఆమె చికిత్సకు సంబంధించిన పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాం. చికిత్స సమయంలో ఆమె నుంచి సేకరించిన నమూనాలను అప్పటికప్పుడే వాడేశాం. ప్రస్తుతం మావద్ద ఏమీ లేవు’ అని గురువారం కేసు విచారణ సందర్భంగా కోర్టుకు ఆస్పత్రి వివరణ ఇచ్చింది. -
అమృత వర్సిటీకి శంకుస్థాపన
మంగళగిరి టౌన్: విలువలతో కూడిన సమాజం నిర్మాణం కోసం అమృత విశ్వవిద్యాలయం రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు కానుండటం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కురగల్లు, యర్రబాలెం గ్రామాల మధ్య నిర్మించనున్న అమృత విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. అమృతానందమయి ట్రస్ట్ పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు అండగా ఉందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రవేశాలు ప్రారంభించాలని కోరారు. రాజధాని ప్రాంతవాసుల మౌలిక సదుపాయాల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ, జడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, కలెక్టర్ కోన శశిధర్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, కొచ్చి అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక అసంపూర్ణ చిత్రం
ఆమె పేరు అమృత. జీవితం మాత్రం ఒక అసంపూర్ణ చిత్రం. ఈ రంగుల ప్రపంచాన్ని నలుమూలల నుంచి ఆమె వీక్షించింది. ఆ అద్భుతమైన రంగులతో కాన్వాస్ మీద రసరమ్య దృశ్యాలనే ఆవిష్కరించింది. తన బతుకు చిత్రం మాత్రం ప్రపంచ చిత్రకళా చరిత్ర మీద ఒలికిన రంగులా మిగిలిపోయింది. అమృత.. అమృతా షేర్గిల్ (జనవరి 30, 1913–డిసెంబర్ 7,1941) జీవనరేఖలను చూస్తే విస్మయంగా ఉంటుంది. పంజాబీ సిక్కు, సంస్కృతం, పర్షియన్, ఖగోళ శాస్త్రాలలో మహా పండితుడు– ఉమ్రావ్‌సింగ్ షేర్గిల్ మాజీతియా. కులీన కుటుంబానికి చెందినవాడు. ఆయన భార్య మేరీ ఆంటోనెట్ గోటెస్మాన్. ఈమె హంగెరీ దేశ యువతి. ఒపేరా గాయని. యూదు జాతీయురాలు. 1912లో మహారాజా దిలీప్‌సింగ్ కుమార్తె బాంబా సదర్‌ల్యాండ్‌తో కలసి భారతదేశానికి వచ్చినప్పుడు ఉమ్రావ్‌సింగ్ ఈమెను కలుసుకున్నాడు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి కూతురే అమృత. హంగెరీ రాజధాని బుడాపెస్ట్‌లో పుట్టింది. ఈమెకు ఒక సోదరి– ఇందిర. ఎంతో అందంగా ఉండే హంగెరీలోనే దునాహరాస్టీ అనే పట్టణంలో అమృత బాల్యం గడిచింది. ఐదేళ్ల వయసులోనే చిత్రలేఖనం మీద ఆసక్తి చూపించింది. కానీ 1921లో వీరి కుటుంబం ఆ అందాల హంగెరీని విడిచిపెట్టి రావలసి వచ్చింది. కారణం ఆర్థిక ఇబ్బందులు. భారతదేశంలోనే ఉమ్రావ్‌సింగ్ సొంత ఎస్టేట్ ఉన్న సిమ్లాకు తరలివచ్చారు. హిమాలయ సానువులకు సమీపంగా ఉండే ఈ హిల్‌స్టేషన్ పట్టణం కూడా అంతే అందమైనది. అప్పటికి అమృతకు తొమ్మిదేళ్లు. సిమ్లాలో అమృత, ఆమె సోదరి ఇందిర పియానో నేర్చుకున్నారు. అనతికాలంలోనే సంగీత సభలను నిర్వహించే స్థాయికి ఎదిగిపోయారు. అలాగే అక్కడ ఉన్న గెయిటీ థియేటర్లో ప్రదర్శించే నాటకాలలో పాత్రలు కూడా ధరించేవారు. ఆ వయసులోనే అమృత తీవ్ర భావాలు కలిగి ఉండేది. ఇవే ఆమె భావి జీవిత చిత్రాన్ని చాలా వరకు మలిచాయి. నాస్తికురాలినని చెప్పినందుకు ఆమెను పాఠశాల నుంచి బహిష్కరించారు. ఇవన్నీ ఎలా ఉన్నా అమృత ఆసక్తి మాత్రం చిత్రలేఖనమే. ఇది సరిగానే గుర్తించింది తల్లి. మేరీ ఆంటోనెట్ కూతురును తీసుకుని 1924లో ఇటలీ వెళ్లిపోయింది. అక్కడ సాంటా అనున్జియాటా ఆర్ట్ స్కూల్లో చేర్పించింది. తరువాత అంటే, 1930లో పారిస్ వెళ్లి ఎకోల్ బ్యూ ఆర్ట్స్ సంస్థలో అమృత చేరింది. నాలుగేళ్ల పాటు చదువుకుంది. యూరోపియన్ చిత్రరంగ ప్రముఖులు పాల్ సెజానె, పాల్ గౌగిన్ శైలులంటే అపారమైన ఆసక్తి ఏర్పరుచుకుంది. ఇటాలియన్ గురువుల దగ్గర కానీ, పారిస్‌లో గానీ అమృత ఎంతో నేర్చుకుంది. నిజం చెప్పాలంటే ఒక తపస్సులా, నిర్విరామంగా చిత్రకళను అభ్యసించింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రలేఖనా సంస్థలలో మెళకువలు నేర్చుకుంటున్నా, కుంచె చాలనంలో ఎంతో ప్రతిభ సాధిస్తున్నా, కాన్వాస్ మీదకు తీసుకురావలసిన ‘వస్తువు’ విషయంలో పెద్ద సంక్షోభానికి అమృత గురైందనిపిస్తుంది. కానీ ఆ సంఘర్షణ నుంచి, ఆ సంక్షోభం నుంచి అతి త్వరలోనే బయటపడగలిగే అవకాశం వచ్చింది. పారిస్‌లో చదువుతుండగానే ఆమె ఇండియా వచ్చారు. అప్పుడే తొలిచిత్రం గీశారు. దాని పేరు ‘యంగ్ గర్ల్స్’. లాహోర్‌లో (అఖండ భారతంలో) తన ఇంటì ఆవరణ లోని పచ్చిక బయలు మీద, ఒక రోలర్ మీద ముగ్గురు బాలికలను కూర్చోబెట్టి అమృత ఆ చిత్రాన్ని గీశారు. నిజానికి ఆ ముగ్గురు ఆమె పినతండ్రి పిల్లలు– బియాంత్ కౌర్, నర్వాయిర్ కౌర్, గుర్భజన్ కౌర్. ఈ మొదటి చిత్రంతోనే ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. చిత్రలేఖనంలో ప్రతిష్టాత్మక వేదిక గ్రాండ్ సెలూన్లో ఆమె సభ్యురాలైంది. యంగ్‌గర్ల్స్ చిత్రంలోని ప్రత్యేకతను ఆమె ప్రొఫెసర్ ఒకరు బాగానే గుర్తించారు కూడా. అదే విషయం ఆమెకు చెప్పారాయన. ‘నీవు పాశ్చాత్య శైలితో, ప్రాచ్య జీవితచిత్రాన్ని రచిస్తున్నావు, చాలా అద్భుతం’ అని శ్లాఘించారు. అప్పుడే అమృత పడుతున్న సృజనాత్మక సంక్షోభానికి సమాధానం దొరికింది. ఐదేళ్ల తరువాత కాస్త ఆలస్యంగా బాంబే ఆర్ట్ సొసైటీ కూడా యంగ్‌గర్ల్స్ చిత్రానికే బంగారు పతకం ప్రకటించింది. 1934లో చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చేసింది అమృత. అక్కడ నుంచి భారతీయ జీవిత చిత్రాన్ని కాన్వాస్‌కు ఎక్కించడానికి కొత్త తపస్సునే ఆరంభించింది. వలస భారతదేశంలో, పాశ్చాత్య జీవనానికే మొగ్గు చూపుతున్న సంఘంలో అమృత తన ఇతివృత్తాల కోసం అన్వేషించడమే వింతనిపిస్తుంది. ఆమె పుట్టుక, పెరుగుదల, విద్య ఎంత పాశ్చాత్యమైనప్పటికీ, తన మూలాలు ఎక్కడ ఉన్నాయో ఆమె పిన్నవయసులోనే సులభంగా గ్రహించింది. అజంతా గుహలలోని కుడ్యచిత్రాలు, మొగల్ చిత్రకళ, దక్షిణ భారతదేశ జీవనం ఆమెను బాగా ప్రభావితం చేశాయి. కానీ అమృత ఏ చిత్రం గీసినా పాశ్చాత్య చిత్రకళలోని సౌందర్యదృష్టిని మాత్రం మిళితం చేసేవారు. అలా ఒక కొత్త శైలికి నాంది పలికారామె. అందుకే 20వ శతాబ్దపు చిత్రకళలో ఆమెకు ప్రత్యేక స్థానం దక్కింది. ఆమె చూపిన సృజనలో ఒక విప్లవ పథం దర్శనమిచ్చింది కూడా. తన కాన్వాస్‌ను సంపద్వంతం చేసుకునేందుకు అమృత భారతదేశమంతటా తిరిగింది. అప్పుడే మూడు చిత్రాలు గీసింది, అవే– ‘పెళ్లికూతురి ముస్తాబు’, ‘బ్రహ్మచారులు’, ‘సంతకు పోతున్న పల్లెజనం’. తన చుట్టూ ఉన్న ప్రజల రూపురేఖలనే కాన్వాస్ మీదకు తీసుకువచ్చిందామె. ఆ చిత్రాల అంతరంగాలేమిటో తన రంగులతో ఉన్మీలనం చేయగలిగింది. ఇదంతా పోస్ట్ ఇంప్రెషనిస్ట్ శైలితో అమృత సాధించారని విమర్శకులు చెబుతారు. ఆ మూడు చిత్రాలలో పాశ్చాత్య శైలి, భారతీయ సంప్రదాయ చిత్రకళా ధోరణి కూడా ప్రతిబింబిస్తాయని అంటారు. అమృత ఎక్కడ పుట్టినా, ఎక్కడ చదివినా, ఎక్కడ చిత్రకళలో మెళకువలు నేర్చినా, ఎన్ని చిత్రకళా ధోరణులను అధ్యయనం చేసినా, ఎలాంటి చిత్రకళా మూర్తులను ఆరాధించినా– చివరికి ఆమె కుంచె వయ్యారాలు పోయినది భారతీయ జన జీవనం చూశాకే. ఆ చిత్రాల వెనుక భారతదేశపు పేదరికపు నీలినీడలు కూడా కనిపిస్తుంటాయి. ఆమె చిత్రాలలో కనిపించే మానవాకృతులలో అణచివేత, బాధ కూడా కనిపిస్తాయి. ‘గ్రామీణ చిత్రం’, ‘మహిళలలో’ వంటి అమృత చిత్రాలు ఇందుకు సాక్ష్యం చెబుతాయి. ముదురు రంగులలోనే అయినా పలచటి ముఖాలతో కనిపించే ఆమె చిత్రాలలోని మహిళలు అణచివేతకు చిహ్నాలుగానే కనిపిస్తారు. ఆ రెండు పద్ధతులతో ఆమె తన మనోభావాన్ని వ్యక్తీకరించిందని చెబుతారు. 1938లో ఆమె వివాహం చేసుకుంది. హంగెరీ జాతీయుడు డాక్టర్ విక్టర్ ఇగాన్ ఆమె భర్త. ఇతడు తల్లి వైపు నుంచి సమీప బంధువే. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత ఆమె చిత్రకళా జీవితం వైవిధ్యంగా కనిపిస్తుంది. రెండోదళ చిత్రాలలో బెంగాలీ కళాకారుల శైలి కనిపిస్తుందని చెబుతారు. ఇంకా చెప్పాలంటే రవీంద్రనాథ్ టాగూర్, అబనీంద్రనాథ్ టాగూర్, అబనీరాయ్ల ప్రభావం ఆమె చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తుంది. తన మూలాలను వెతుక్కుంటూ రావడం వల్ల కావచ్చు, సహజంగా సృజనాత్మక జీవులకుండే స్పందన వల్ల కావచ్చు– అమృత స్వదేశం వచ్చిన తరువాత తనను తాను తెలుసుకుందనిపిస్తుంది. అమృత ఎంత గొప్ప చిత్రకారిణో, అంత సౌందర్యరాశి. అలాగే నేపథ్యం వల్ల కావచ్చు, ఒక రకమైన విశృంఖల జీవితం కూడా గడిపారు. జీవితంలో అనేక మందితో స్నేహం చేశారు. సంబంధాలు పెట్టుకున్నారు. తన పోర్ట్రెయిట్‌లతో పాటు ఆ మిత్రుల పోర్ట్రెయిట్లను కూడా విపరీతంగా చిత్రించారు. పుంఖానుపుంఖాలుగా బొమ్మలు వేశారు. ఆమె సన్నిహితులలో జవహర్లాల్ నెహ్రూ కూడా ఒకరు. కానీ ఆయన చిత్రాన్ని అమృత చిత్రించలేదు. అందుకు కారణం కూడా చెప్పారు. ‘నెహ్రూ మరీ బాగా, చిత్రకళకు అందనంత బాగా కనిపిస్తారు’ అన్నారటామె. 1941 తరువాత అమృత దంపతులు భారతదేశానికి వచ్చి, గోరఖ్‌పూర్ దగ్గర నివాసం ఉన్నారు. అప్పుడు గీసిన చిత్రాలు ‘ఎర్ర ఇటుకల ఇల్లు’, ‘నులకమంచం మీద కూర్చున్న స్త్రీలు’, ‘కొండ దృశ్యం’, ‘పెళ్లి కూతురు’ వంటివి. ఆ సంవత్సరంలోనే డిసెంబర్లో అమృత గీసిన పెయింటింగ్స్‌తో లాహోర్‌లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అప్పుడు లాహోర్ చిత్రకారులకు, చిత్రకళకు పెట్టింది పేరు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. మరో రెండురోజులలో ప్రదర్శన అనగా అమృత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కోమాలోకి వెళ్లిపోయి, తుదిశ్వాస విడిచారు. ఆ చిత్రకళా ప్రదర్శన, అందులో ఆమెకు దక్కే గౌరవం ఏమీ చూడకుండానే ఆమె కన్నుమూసింది. అప్పటికి ఆమె వయసు 28 సంవత్సరాలు. ఆనాటికే ప్రపంచ ప్రఖ్యాతి వహించిన ఆ చిత్రకారిణి ప్రదర్శన జరగడానికి రెండు రోజుల ముందే డాక్టర్ భర్త ఆమెకు గర్భస్రావం చేశాడు. అదే ఆమె మరణానికి దారితీసిందనీ, భర్తే చంపేశాడనీ అమృత తల్లి ఆరోపించింది. కానీ ఇప్పటికీ అమృత మరణం వెనుక అసలు రహస్యం బయటపడలేదు. లాహోర్‌లోని తన స్టూడియోలో ఆమె గీసిన చివరి చిత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది– ఆమె జీవితం వలెనే. పాలబిందెలు మోసుకుంటూ, రెండు బర్రెలను తోలుకు వెళుతున్న ఒక గ్రామీణుడిని ఆమె చిత్రిస్తుండగా జీవితం ముగిసిపోయింది. అమృత చిత్రాలకు ఇప్పటికీ ఆదరణ ఉంది. ఆమె చిత్రలేఖనంలో తెచ్చిన విప్లవానికి విలువ ఉంది. 2006లో ఢిల్లీలో నిర్వహించిన అమృత చిత్రకళా ప్రదర్శనలో ఆమె గీసిన ‘గ్రామీణ దృశ్యం’ చిత్రం 6.9 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. 2013వ సంవత్సరాన్ని అంతర్జాతీయ అమృత షేర్గిల్ సంవత్సరంగా యునెస్కో ప్రకటించింది. అది ఆమె శత జయంతి. ఢిల్లీలోని మోడరన్ ఆర్ట్స్ గ్యాలరీలో ఆమె పెయింటింగ్స్‌తో ఒక విభాగమే ఉంది. ఎన్నెన్ని వర్ణాలు... ఎన్నెన్ని దృశ్యాలు అనిపించే ఆమె జీవితం ఆధారంగా కొన్ని నవలలు, నాటకాలు కూడా వచ్చాయి. సల్మాన్ రష్దీ ‘ది మూన్స్ లాస్ట్ సై’ ఇతివృత్తం అమృత జీవితమే. అమృత ఒక మిత్రురాలికి రాసిన లేఖలో మాటలు ఏమిటో తెలుసా! ‘నేను భారతదేశంలో మాత్రమే బొమ్మలు గీయగలను. రంగులు వేయగలను. ఐరోపా పికాసో, మాటిస్సె, బ్రక్యూలది. భారతదేశం మాత్రం నాకే సొంతం’. ∙డా. గోపరాజు నారాయణరావు -
నేను జయలలిత కూతురిని
-
నేను జయలలిత కూతురిని
శోభన్‌బాబు, జయ ప్రేమకు చిహ్నంగా జన్మించాను: అమృత సాక్షి, బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత తన కన్నతల్లి అని బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. కూతురినని నిరూపించుకునేందుకు డీఎన్ఏ పరీక్షలకు సైతం తాను సిద్ధమని ప్రకటించింది. మరోవైపు, జయలలితది సహజ మరణం కాదని, నిజాలను రాబట్టేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ తదితరులకు ఆమె రాసిన లేఖలు మంగళవారం వెలుగుచూశాయి. సదరు లేఖలో ఉన్న సారాంశం క్లుప్తంగా... ‘జయలలిత నా కన్నతల్లి. ఆమె తన అమ్మానాన్నలను కోల్పోయి మానసికంగా కుంగిపోయిన దశలో అలనాటి తెలుగు సినీ హీరో శోభన్‌బాబు సహచర్యంతో కోలుకుంది. ఆ సమయంలో వారిద్దరి ప్రేమకు గుర్తుగా నేను పుట్టాను. సామాజిక కట్టుబాట్ల కారణంగా వీరి వివాహం జరగలేదు. బెంగళూరులో ఉంటున్న జయ సోదరి శైలజ, భర్త సారథిలకు నన్ను అప్పగించారు. తన కుమార్తెననే విషయం చెప్పొద్దని వారితో జయ ఒట్టు వేయించుకున్నారు. 1996లో జయను కలవాల్సిందిగా శైలజ నాకు సూచించారు. కలిసినపుడు నన్ను చూడగానే జయ నా వివరాలు కనుక్కొని ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నారు. తర్వాతా అనేకసార్లు కలిశా. నేనే నీ తల్లినని ఆమె నాతో ఎన్నడూ అనలేదు. జయ మరణం తర్వాత దీప, దీపక్‌లు ఆమె ఆస్తులకు వారసులమని చెబుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను చూసి.. అమెరికాలో ఉన్న మా బంధువైన జయలక్ష్మి నాకు ఫోన్ చేసి జయ సంతానం నేనే అని చెప్పారు. బెంగళూరులో ఉంటున్న మరో బంధువు సైతం ఇదే మాట చెప్పారు. నా తల్లిని కొంతమంది కుట్రచేసి చంపారు. వారిలో అన్నాడీఎంకే నాయకురాలు శశికళ, నటరాజన్‌లు ముఖ్యులు’ అని లేఖలో రాశారు. -
ప్రేమకు కొత్త నిర్వచనం!
శ్రీకరణ్, అమృత, ప్రీతి ముఖ్యతారలుగా నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బెస్ట్ లవర్స్’. శ్రీకరణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత గొంటి శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. గొంటి శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే చిత్రమిది. ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం. దర్శకుడు సినిమాను చక్కగా తెరకెక్కించారు. సాయికిరణ్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. -
దెయ్యాల ఆట ఆరంభం...!
రెండు ప్రేమ జంటలు హాలీడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు రిసార్ట్స్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో బస చేస్తాయి. అక్కడ వారికి ప్రేతాత్మల వల్ల ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. ప్రేతాత్మల నుంచి ప్రేమికులు ఎలా బయటపడ్డారు? అనే కథతో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ది లాస్ట్ హర్రర్’. ఈ చిత్రాన్ని ఎఎన్వీïపీ సమర్పణలో మేఘాంశ్ మూవీస్‌పై సేమ్ టైటిల్‌తో తెలుగులోకి బి.ఎస్. ప్రసాద్ అనువదించారు. ‘దెయ్యాల ఆట మొదలైంది’ ఉపశీర్షిక. శ్యామ్, షరీఫ్, అమృత, నీతా ముఖ్య తారలు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. ‘‘సస్పెన్స్‌తో సాగే రొమాంటిక్ హరర్ చిత్రమిది’’ అన్నారు బి.ఎస్. ప్రసాద్. -
ఆనంద్ రాజా
రాజా చాలా హ్యాపీగా ఉన్నాడు.‘ఆనంద్’ సినిమా హిట్ అయినప్పుడుకంటే ఇంకా హ్యాపీగా ఉన్నాడు.‘ఆనంద్’ సినిమాతో స్టార్ అయ్యాడు. ఇప్పుడు‘దేవుని సేవకుడి’గా ఇంకాగొప్ప ఆనంద్ అయ్యాడు.పవిత్రమైన సేవలో పరిశుద్ధ ఆనందాన్ని పంచుతున్నాడు. ఇప్పుడురాజా స్టార్ సేవకుడు అయ్యాడు. ఆనంద రాజా అయ్యాడు గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా దూరమై దైవ సేవకునిగా ఆధ్యాత్మిక బాట పట్టారు. ఈ లైఫ్ ఎలా ఉంది? రాజా: నిజం చెప్పాలంటే సినిమాల కన్నా ఇప్పుడే హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుని స్పిరిచ్యువల్ లైఫ్ మొదలుపెట్టానో అప్పుడు ఈ లోకంలో దక్కించుకోలేనివి చాలా దక్కించుకున్నా. మొట్టమొదటిది నా భార్య అమ్రిత. రెండోది నా కూతురు లియోరా. ఎబౌవ్ ఆల్... దేవుణ్ణి తెలుసుకున్నందుకు హ్యాపీగా ఉంది. చెప్పాలంటే ఒకప్పటి కన్నా చాలా చాలా ఆనందంగా ఉన్నాను. సినిమా ఫేమ్‌ని సులువుగా ఎలా వదులుకోగలిగారు? సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలానే ఎంజాయ్ చేశాను. సక్సెస్, డబ్బు, దేశాలు – అన్నీ చూశాను. కానీ, సినిమాలనేవి శాశ్వతం కాదు. సక్సెస్‌లో ఉన్నంతవరకూ జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఫేడ్ అవుట్ అయితే మర్చిపోతారు. కానీ, దేవుడికి మన లైమ్లైట్తో సంబంధం లేదు. చీకట్లో ఉన్నా దేవుడి ప్రేమ మారదు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో నేను తెలుసుకున్నా. హీరోగా కెరీర్ అంతంత మాత్రంగా సాగుతున్న టైమ్‌లో ఇది ఫ్రస్ట్రేషన్లో తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చా? ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. కానీ, వీటి నుంచి పారిపోవడానికి లేదు. నిర్మాత, డైరెక్టర్, ఇతర టెక్నీషియన్స్ – అంతా హీరోపై ఆధారపడి ఉంటారు. సక్సెస్ అయితే ఎవరూ ఏమీ అనరు. కానీ ఫ్లాప్ వస్తేనే ఇబ్బంది. ఇతరుల ఇబ్బందులకు నేను కారణం కాకూడదనుకున్నా. అందుకే దైవ సహాయకుడిగా మారా. ఒకప్పుడు నేను క్లబ్బులు, పబ్బుల బయట కనిపించేవాణ్ణి. ఇప్పుడు చర్చి బయట కనిపిస్తున్నా. దేవుడు నాకు చాలా స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఇచ్చాడు. చీకటిలో ఉన్న నా లైఫ్‌ని వెలుగులోకి తీసుకొచ్చాడు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నవాళ్లకూ, క్రుంగిపోతున్నవారికీ దేవుడు ఒక కౌన్సెలర్. వాళ్లకు వెలుగుగా నిలుస్తాడు. నా ఈ ఆధ్యాత్మిక బాటలో నేను అలాంటివాళ్లకు సర్వీస్ చేయగలుగుతున్నా. ‘రాజా ఏం చేస్తున్నాడు? నిజంగానే ఆధ్యాత్మిక బాటలోనే ఉన్నాడా’ అన్నది కొందరి సందేహం? అలా సందేహించేవాళ్లు ఉన్నారు. ఆ విషయం నాకూ తెలుసు. ముఖ్యంగా ఫిల్మ్ సర్కిల్లోనే ఎక్కువ మంది అలా మాట్లాడుకుంటారు. వీడు నిజంగా మారాడా? లేకపోతే తాత్కాలికమా? అనుకుంటారు. నన్ను దగ్గరగా చూసినవాళ్లకు నిజమేంటో తెలుస్తుంది. నిజమైన సహాయకుడిగా నువ్వు ఉండగలిగితే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా దేవుడు నన్ను హెచ్చించాడు. చెప్పాలంటే... సినిమాల్లో చేసినప్పటికన్నా రాజా అనే వ్యక్తి ఈ రూట్‌కి వచ్చాక ఇంకా చాలామందికి తెలిశాడు. ఆ హెచ్చింపు, ఘనత దేవుడిచ్చినదే. ‘సహాయకుడి’గా మారాక ఆరేళ్లలో తెలుసుకున్నదేంటి? ఈ లోకంలో కష్టాల్లో ఉన్నవాళ్లకు ఏ విధంగా సహాయపడగలను అనేది తెలుసుకున్నా. మంచితో పాటు దైవత్వాన్ని పంచి పెట్టడం అనేది గొప్ప విషయమని అర్థమైంది. ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించడమనేది మంచి కార్యం. ఆ మధ్య బెంగళూరులో ఉన్న ఒకబ్బాయి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. అతని సమస్య తెలుసుకుని దాదాపు నెల రోజులు కౌన్సెలింగ్ ఇచ్చా. ఇప్పుడతను దేవుడి మార్గంలో నడుస్తూ కౌన్సెలరై, ఎందరికో స్ఫూర్తి అయ్యాడు. చిన్న వయసులోనే ఈ విధంగా మారడం చిన్న విషయం కాదేమో? తొందరగా పిలుపు వచ్చినందుకు సంతోషిస్తున్నా. చిన్న, పెద్ద వయసని ఏం లేదండి. నాకన్నా ఎంతో చిన్నవాళ్లు, టీనేజ్‌లో ఉన్నవాళ్లు దేవుడి సేవలో ఉండటం నేను చూశా. వాళ్లను చూసి, అయ్యో నేను ఆ ఏజ్‌లో ఎందుకు రాలేకపోయానని బాధపడుతుంటా. ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు కొంచెం హైపర్గానే ఉండేవారు కదా? అవునండి. ఇంతకు ముందు నాకు చాలా కోపం, అహంకారం, భయంకరమైన మాటలు, పదాలు నా నోటి నుంచి వచ్చేవి. బట్.. దేవుడు అన్నీ తీసేశాడు. ఈ లోకంలో ప్రతి విషయానికీ ఓ జడ్జిమెంట్ ఉంటుంది. ఉదాహరణకు సీట్ బెల్టు పెట్టుకోకుండా, రెడ్ సిగ్నల్ దాటి వెళ్తే ఫైన్ ఉంటుంది కదా? ఇంత చిన్న విషయాలకు మీకు తీర్పు ఉన్నప్పుడు మీ పాపాలకు తీర్పుండదా? కచ్చితంగా ఉంటుం ది. నా పాపాలకు తీర్పు నా బదులుగా నా దేవుడిచ్చాడు. నన్ను క్షమించాడు. ‘నీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను’ అని చెప్పిన ఏకైక వ్యక్తి ఏసుక్రీస్తు. ఆధ్యాత్మిక బాటలో వెళ్లేవాళ్లు ఉద్యోగాలు చేసుకోకూడదా? మీరెందుకు సినిమాలు వదిలేశారు? రెండు పడవలపై కాలు వేసి, నడిపించలేం. నా దృష్టిలో నువ్వు సేవకుడిగా ఉంటే సినిమాలు చేయకూడదు. నువ్వు బిలీవర్ అయితే అది నీ ఛాయిస్. బట్ ఎవరైతే సేవలో ఉంటారో వారు కచ్చితంగా సినిమాలు చేయరు. దైవ సహాయకులు పెళ్లి చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదు. ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు ‘ఫలించండి’ అన్నాడు. ‘బి ఫ్రూట్‌ఫుల్ అండ్ మల్టీప్లై’ అన్నాడు. అయితే రోమన్ క్యాథలిక్స్‌లో దేవుడి సేవకు అంకితం చేసుకున్న ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్ చేసుకోరు. ఇలాంటి విషయాలేమీ తెలుసుకోకుండా కొంతమంది అదో రకంగా మాట్లాడతారు. అంతెందుకు? క్రిస్టియానిటీని సినిమాల్లో ప్రెజెంట్ చేసే తీరు చాలా ఎగతాళిగానే ఉంటుంది. జనరల్‌గా కమర్షియల్ సినిమాల్లో ఫాదర్ రోల్స్ పెట్టించి వారి చేత కామెడీలు చేయిస్తారు. అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది చాలా శోచనీయం. మీది లవ్ మ్యారేజా? ఎరేంజ్డా? ఎరేంజ్డ్ మ్యారేజ్. రెండు ఫ్యామిలీలు మాట్లాడుకున్న తర్వాత మేం మాట్లాడుకున్నాం. ఒకరికొకరు నచ్చాం. 2014లో పెళ్లయింది. ఇండస్ట్రీలోని మీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నారా? స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఉన్నాను కదా. అందుకని ఎవరూ టచ్‌లో లేరు. కనీసం ఫోన్ కూడా చేయరు. మీరు సమస్యల్ని చూసే విధానం అంతకు ముందుకీ, ఇçప్పటికీ మారిందా? ఇప్పుడు ఏదైనా ప్రార్థన ద్వారానే. ‘ఐ డోంట్ ఫైట్ విత్ మై ప్రాబ్లమ్స్. నా సమస్యలతో నువ్వే ఫైట్ చేయా ల’ని దేవుడితో చెప్తాను. ‘నువ్వు నిలకడగా, నిబ్బరంగా ఉండు. భయపడకు, యుద్ధము నాది’ అని దేవుడు మాట ఇచ్చాడు. కావాలని దేవుడు మనకు సమస్యలను ఇవ్వడు. సమస్యలన్నీ మనం సృష్టించుకున్నవే. వాటిని కూడా తప్పిస్తానని మాట ఇచ్చాడంటే దేవుడు ఎంతో గొప్పవాడు. ‘దేవుడు నన్ను ఎలా క్షమించాడు’ అని కొన్నిసార్లు నేనే ఆశ్చర్యపోతాను. కలలోనో, మెలకువలోనో దేవుడు దర్శనమిచ్చాడా? దేవుడి దర్శనాలు తప్పకుండా అవుతాయండి. నాకు చాలాసార్లు దేవుడి దర్శనం అయ్యింది. ఓ రోజు ప్రార్థనలో ఉండగా పెద్ద వెలుగు కనిపించింది. అందులో దేవుడి ముఖం నాకు పూర్తిగా కనిపించలేదు. కానీ, ఆయన ఆకారం కనిపించింది. బైబిల్లోని కీర్తనలో దుడ్డుకర్ర అని ఒకటి ఉంటుంది. ఆ వెలుగు నుంచి ఓ చేయి ముందుకు వచ్చి నేను ప్రార్థన చేస్తుండగానే దుడ్డుకర్ర నా చేతిలో పెట్టారు. నాకు అది స్పష్టంగా అర్థమవుతోంది. నా జీవితంలో అందమైన క్షణాలవి. ఆ తర్వాత కొన్నాళ్లకు దర్శనాలకు అర్థం చెప్పే ఓ వ్యక్తిని కలిశా. నా దర్శనం గురించి చెప్పి దీనికి అర్థం ఏమిటి? అని అడిగాను. ‘దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు. చాలా అంశాలను అధిగమించడానికి, మిగతా ప్రజలు కూడా అధిగమించడంలో సహాయం చేయడాని నీకు అధికారం ఇచ్చాడు’ అని చెప్పారు. ఇటువంటి దర్శనం రెండుసార్లు కలిగింది. ఓ సహాయకుడిగా ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? ఎక్కువగా మీటింగ్స్‌లో ఉంటా. ఇప్పుడు మూమిన్ పేట్ గ్రామాన్ని దత్తత తీసుకున్నా. మూడు ఎకరాల స్థలాన్ని కమ్యూనిటీ సర్వీసెస్ కోసం కొన్నా. అక్కడ అనాథాశ్రమం, మెడికల్ డే కేర్ సెంటర్, ఒక చర్చ్ కట్టడానికి ప్రయత్నిస్తున్నా. రెండు ఆర్వో వాటర్ ప్లాంట్స్, బోర్వెల్, 25 టాయిలెట్స్ నిర్మిస్తానని గ్రామస్థులకు మాటిచ్చా. క్రిస్మస్ సందర్భంగా ఈ పండుగ గురించి చెబుతారా? క్రిస్మస్ అంటే వెలుగుల పండుగ. ఈ లోకానికి దేవుడు వెలుగులా వచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరూ లైట్స్ పెట్టుకుంటారు. వెలుగనేది మనసులో ఉండాలి. ఉంటే తప్పకుండా బయట కనిపిస్తుంది. అందుకని మనసులో వెలుగు నింపుకోవాలి. రత్నాలు, వజ్రాల కన్నా గొప్పది! నాకూ, నా భార్యకూ లభించిన గొప్ప వరం – మా పాప. ‘ఒక బిడ్డను తను వెళ్ళవలసిన మార్గంలో నువ్వు నడిపించగలిగితే... ఆ మార్గం నుంచి ఎన్నడూ తప్పిపోడు’ అని బైబిల్లో దేవుడు చెప్పాడు. నాలుగైదేళ్ల తర్వాత మా పాపకు అలాంటి ట్రైనింగ్ ఉంటుంది. బైబిల్లో ఓ స్త్రీకి ఇచ్చిన విలువ పురుషుడికి కూడా లేదండి. కెంపులు, రత్నాలు, వజ్రాల కంటే స్త్రీ ఎంతో గొప్పదని దేవుడు అన్నాడు. అసలు భార్య దొరకడమే మేలు అంటాడు. అమ్రిత వచ్చిన తర్వాతే నా నివాసాన్ని ఓ ఇల్లుగా మార్చింది. నాకు ఒక భర్త టైటిల్ ఇచ్చి, నాకు తండ్రి బిరుదు ఇచ్చి... అంతా మేలే చేసింది. నా జీవితంలో ప్రతిదాన్నీ రెట్టింపు చేసింది. ఐయామ్ వెరీ హ్యాపీ. హీరోగా ఉన్నప్పుడు మీరు చేసిన పనులన్నీ మీ భార్య దగ్గర పెళ్లికి ముందే చెప్పారా? రాజా: పెళ్లయ్యాక ఎవరో నా గురించి చెప్పడం కంటే ముందే నేను చెబితే మంచిది కదా. అందుకే దాచుకోకుండా నా గతమంతా చెప్పాను. అయినా నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. ఐయామ్ వెరీ గ్రేట్ఫుల్. రాజాలో ఏం నచ్చి, మీరు పెళ్లి చేసుకున్నారు? అమ్రిత: అందరూ అనుకుంటున్నట్లు ఆయన యాక్టర్ అని మాత్రం పెళ్లి చేసుకోలేదు. అసలు రాజా హీరో అనే సంగతి కూడా నాకు తెలీదు (మధ్యలో రాజా అందుకుంటూ.. నేను వెబ్సైట్లో కూడా యాక్టర్ అని పెట్టలేదు). మా ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చాక వెళ్లి రాజాను కలిశా. యేసు గురించి రాజా ప్రబోధిస్తున్న ఓ వీడియో చూశా. ‘నాకు సరైన వ్యక్తిని చూపించు దేవుడా! స్పిరిచ్యువల్ మైండ్ ఉన్న మంచి వ్యక్తిని చూపించు’ అని నేను ప్రార్థిస్తున్న సమయంలో ఆ వీడియో చూశా. అప్పుడు నాలోని హోలీ స్పిరిట్ ‘ఇతనే నీకు సరైన వ్యక్తి. ఇతనితో నీ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది’ అని చాలా స్పష్టంగా చెప్పింది. మా ఇంటికి (పెళ్లి చూపులకు) వచ్చిన మొదటి వ్యక్తి కూడా రాజానే. అప్పటి నుంచి ఇప్పటివరకూ దేవుడు మాకు ఇచ్చిన ప్రశాంతతలో ఏ విధమైన మార్పూ లేదు. రాజా: నేను నటించిన ఒక్క సినిమా కూడా మా ఆవిడ చూడలేదు. ‘నా భర్త నా వాడు. పరాయి స్త్రీతో నేను చూడలేను. అది తెరమీదైనా...’ అనుకుంటుంది. మరణించేవరకూ ఒకరితో మరొకరం నిజాయితీగా ఉండాలని ప్రమాణం చేసుకున్నాం. నా జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి వచ్చిన ఓ గొప్ప సహాయకురాలు ఆమె. దేవుడి దయ వల్ల మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలు వంటివి రాలేదు. ఎప్పటికీ రావు కూడా. అమ్రిత: యస్. ప్రతి ఏడాదికీ మా బంధం మరింత మెరుగవుతోంది. ‘చూడు.. దేవుడు నీకు ఎంత సరైన వ్యక్తిని ఇచ్చాడో’ అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. – డి.జి. భవాని -
జయను హత్య చేశారు
సోదరి కూతురు అమృత మండ్య(కర్ణాటక): ‘మా పెద్దమ్మ (జయలలిత) అంత్యక్రియలను ఈ రకంగా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఆమెది సహజ మరణం కాదు. హత్య చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలి’ అని తమిళనాడు దివంగత సీఎం జయలలిత చెల్లెలి కుమార్తె అమృత అన్నారు. శుక్రవారం శ్రీరంగ పట్టణంలో జయ ఉత్తర క్రియలను అమృత, బంధువులు వైష్ణవ సాంప్రదాయంలో నిర్వహించారు. శశికళ తమను జయ నుంచి దూరం పెట్టారని అమృత ఆరోపించారు. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే కసరత్తు మొదలైంది. సీఎం పన్నీర్‌సెల్వం నేతృత్వంలో 135 మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. తర్వాత పోయెస్‌గార్డెన్ కు వెళ్లి శశికళను కలిశారు. ఆమె ఆదేశాలపై 2వేల మంది నేతలు సైతం అక్కడికొచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను అక్రమంగా ఎంపికచేస్తున్నారని, దీనిపై స్టే విధించాలని పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప మద్రాసు హైకోర్టును కోరారు. -
కెమేరా వెనక్కి అప్పటి అమృత
సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలైన మణిరత్నం ‘అమృత’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటే, అందులో బాలనటిగా చేసిన కీర్తన గుర్తురాక మానదు. చిన్న వయసులోనే తన అభినయంతో ఆకట్టుకుంది కీర్తన. ఆ చిత్రానికి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇంతకీ ఈ కీర్తన ఎవరో కాదు.. తమిళ నటుడు పార్తీబన్, నటి సీత దంపతుల కుమార్తె. ఒకే ఒక్క చిత్రంలో మెరిసిన కీర్తన ఆ తర్వాత చదువుకు అంకితమైంది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఎలాగూ చిన్నప్పుడు నటించింది కదా.. ఇక కథానాయికగా రంగప్రవేశం చేస్తుందని చాలామంది ఊహించారు. కానీ, కీర్తన కలలు వేరేలా ఉన్నాయి. దర్శకురాలు కావాలన్నది ఆమె ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చుకునే దిశలో తొలి అడుగు వేసేసింది. తమిళ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా త్వరలో దర్శకత్వం వహించనున్న ఓ చిత్రానికి ఆమె సహాయ దర్శకురాలిగా చేరింది. కొంత అనుభవం సాధించాక దర్శకురాలిగా రంగప్రవేశం చేయాలనుకుంటోంది. కీర్తన తండ్రి పార్తీబన్ మంచి నటుడే కాదు, దర్శకునిగా కూడా నిరూపించుకున్నారు. ఇప్పుడు కీర్తన కూడా తండ్రిలానే మంచి డెరైక్టర్ అనిపించుకోవాలనుకుంటోంది. -
తల్లీకూతుళ్ల దారుణ హత్య
బషీరాబాద్/యాలాల: తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. దాదా పు ఏడాది తర్వాత విషయం వెలుగుచూసింది. వివాహిత భర్తే దారుణా నికి ఒడిగట్టాడు. శుక్రవారం పోలీసు లు వివాహిత మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించా రు. పోలీసుల కథనం ప్రకారం.. యాలాల మండలం బెన్నూరు గ్రా మానికి చెందిన అమృత(20)ను ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన అబ్దుల్లా ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు అనీసా(16 నెలలు) ఉంది. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భర్త వేధింపులు భరించలేక అమృత వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో కక్షగట్టిన అబ్దుల్లా దాదాపు ఏడాది క్రితం భార్యకు మాయమాటలు చెప్పి బషీరాబాద్ మండలం నీళ్లపల్లి సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ భార్యను రాయితో మోది హత్య చేశాడు. అనంతరం నీళ్లపల్లి-పర్వత్‌పల్లి మార్గంలో ఓ గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అనంతరం అబ్దుల్లా కూతురిని కూడా స్వగ్రామంలో చంపేసి పూడ్చివేశాడు. కొద్దికాలానికి ముంబై వెళ్లిపోయాడు. ఇటీవల ఒంటరిగా అబ్దుల్లా గ్రామానికి వచ్చాడు. కూతురు, మనవరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అమృత తల్లిదండ్రులు యాలాల ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు తాండూరు రూరల్ సీఐ శివశంకర్ అనుమానంతో ఇటీవల అబ్దుల్లాను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు అబ్దుల్లా. అతడు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం రూరల్ సీఐతో పాటు బషీరాబాద్, యాలాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకాలు జరుపగా అమృత అస్థిపంజరం లభ్యమైంది. పోలీసు లు అక్కడే వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. చిన్నారి మృతదేహాన్ని శనివారం వెలికి తీస్తుండొచ్చని సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది.