జయను హత్య చేశారు
సోదరి కూతురు అమృత
మండ్య(కర్ణాటక): ‘మా పెద్దమ్మ (జయలలిత) అంత్యక్రియలను ఈ రకంగా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఆమెది సహజ మరణం కాదు. హత్య చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలి’ అని తమిళనాడు దివంగత సీఎం జయలలిత చెల్లెలి కుమార్తె అమృత అన్నారు. శుక్రవారం శ్రీరంగ పట్టణంలో జయ ఉత్తర క్రియలను అమృత, బంధువులు వైష్ణవ సాంప్రదాయంలో నిర్వహించారు. శశికళ తమను జయ నుంచి దూరం పెట్టారని అమృత ఆరోపించారు.
అన్నాడీఎంకే అత్యవసర సమావేశం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే కసరత్తు మొదలైంది. సీఎం పన్నీర్‌సెల్వం నేతృత్వంలో 135 మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. తర్వాత పోయెస్‌గార్డెన్ కు వెళ్లి శశికళను కలిశారు. ఆమె ఆదేశాలపై 2వేల మంది నేతలు సైతం అక్కడికొచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను అక్రమంగా ఎంపికచేస్తున్నారని, దీనిపై స్టే విధించాలని పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప మద్రాసు హైకోర్టును కోరారు.