![ఆనంద్ రాజా](/styles/webp/s3/article_images/2017/09/4/41482604682_625x300.jpg.webp?itok=rAg7ShWN)
ఆనంద్ రాజా
రాజా చాలా హ్యాపీగా ఉన్నాడు.‘ఆనంద్’ సినిమా హిట్ అయినప్పుడుకంటే ఇంకా హ్యాపీగా ఉన్నాడు.‘ఆనంద్’ సినిమాతో స్టార్ అయ్యాడు.
ఇప్పుడు‘దేవుని సేవకుడి’గా ఇంకాగొప్ప ఆనంద్ అయ్యాడు.పవిత్రమైన సేవలో పరిశుద్ధ ఆనందాన్ని పంచుతున్నాడు. ఇప్పుడురాజా స్టార్ సేవకుడు అయ్యాడు. ఆనంద రాజా అయ్యాడు
గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా దూరమై దైవ సేవకునిగా ఆధ్యాత్మిక బాట పట్టారు. ఈ లైఫ్ ఎలా ఉంది?
రాజా: నిజం చెప్పాలంటే సినిమాల కన్నా ఇప్పుడే హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుని స్పిరిచ్యువల్ లైఫ్ మొదలుపెట్టానో అప్పుడు ఈ లోకంలో దక్కించుకోలేనివి చాలా దక్కించుకున్నా. మొట్టమొదటిది నా భార్య అమ్రిత. రెండోది నా కూతురు లియోరా. ఎబౌవ్ ఆల్... దేవుణ్ణి తెలుసుకున్నందుకు హ్యాపీగా ఉంది. చెప్పాలంటే ఒకప్పటి కన్నా చాలా చాలా ఆనందంగా ఉన్నాను.
సినిమా ఫేమ్‌ని సులువుగా ఎలా వదులుకోగలిగారు?
సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలానే ఎంజాయ్ చేశాను. సక్సెస్, డబ్బు, దేశాలు – అన్నీ చూశాను. కానీ, సినిమాలనేవి శాశ్వతం కాదు. సక్సెస్‌లో ఉన్నంతవరకూ జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఫేడ్ అవుట్ అయితే మర్చిపోతారు. కానీ, దేవుడికి మన లైమ్‌లైట్‌తో సంబంధం లేదు. చీకట్లో ఉన్నా దేవుడి ప్రేమ మారదు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో నేను తెలుసుకున్నా.
హీరోగా కెరీర్ అంతంత మాత్రంగా సాగుతున్న టైమ్‌లో ఇది ఫ్రస్ట్రేషన్‌లో తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చా?
ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. కానీ, వీటి నుంచి పారిపోవడానికి లేదు. నిర్మాత, డైరెక్టర్, ఇతర టెక్నీషియన్స్ – అంతా హీరోపై ఆధారపడి ఉంటారు. సక్సెస్ అయితే ఎవరూ ఏమీ అనరు. కానీ ఫ్లాప్ వస్తేనే ఇబ్బంది. ఇతరుల ఇబ్బందులకు నేను కారణం కాకూడదనుకున్నా. అందుకే దైవ సహాయకుడిగా మారా. ఒకప్పుడు నేను క్లబ్బులు, పబ్బుల బయట కనిపించేవాణ్ణి. ఇప్పుడు చర్చి బయట కనిపిస్తున్నా. దేవుడు నాకు చాలా స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఇచ్చాడు. చీకటిలో ఉన్న నా లైఫ్‌ని వెలుగులోకి తీసుకొచ్చాడు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నవాళ్లకూ, క్రుంగిపోతున్నవారికీ దేవుడు ఒక కౌన్సెలర్. వాళ్లకు వెలుగుగా నిలుస్తాడు. నా ఈ ఆధ్యాత్మిక బాటలో నేను అలాంటివాళ్లకు సర్వీస్ చేయగలుగుతున్నా.
‘రాజా ఏం చేస్తున్నాడు? నిజంగానే ఆధ్యాత్మిక బాటలోనే ఉన్నాడా’ అన్నది కొందరి సందేహం?
అలా సందేహించేవాళ్లు ఉన్నారు. ఆ విషయం నాకూ తెలుసు. ముఖ్యంగా ఫిల్మ్ సర్కిల్‌లోనే ఎక్కువ మంది అలా మాట్లాడుకుంటారు. వీడు నిజంగా మారాడా? లేకపోతే తాత్కాలికమా? అనుకుంటారు. నన్ను దగ్గరగా చూసినవాళ్లకు నిజమేంటో తెలుస్తుంది. నిజమైన సహాయకుడిగా నువ్వు ఉండగలిగితే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా దేవుడు నన్ను హెచ్చించాడు. చెప్పాలంటే... సినిమాల్లో చేసినప్పటికన్నా రాజా అనే వ్యక్తి ఈ రూట్‌కి వచ్చాక ఇంకా చాలామందికి తెలిశాడు. ఆ హెచ్చింపు, ఘనత దేవుడిచ్చినదే.
‘సహాయకుడి’గా మారాక ఆరేళ్లలో తెలుసుకున్నదేంటి?
ఈ లోకంలో కష్టాల్లో ఉన్నవాళ్లకు ఏ విధంగా సహాయపడగలను అనేది తెలుసుకున్నా. మంచితో పాటు దైవత్వాన్ని పంచి పెట్టడం అనేది గొప్ప విషయమని అర్థమైంది. ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించడమనేది మంచి కార్యం. ఆ మధ్య బెంగళూరులో ఉన్న ఒకబ్బాయి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. అతని సమస్య తెలుసుకుని దాదాపు నెల రోజులు కౌన్సెలింగ్ ఇచ్చా. ఇప్పుడతను దేవుడి మార్గంలో నడుస్తూ కౌన్సెలరై, ఎందరికో స్ఫూర్తి అయ్యాడు.
చిన్న వయసులోనే ఈ విధంగా మారడం చిన్న విషయం కాదేమో?
తొందరగా పిలుపు వచ్చినందుకు సంతోషిస్తున్నా. చిన్న, పెద్ద వయసని ఏం లేదండి. నాకన్నా ఎంతో చిన్నవాళ్లు, టీనేజ్‌లో ఉన్నవాళ్లు దేవుడి సేవలో ఉండటం నేను చూశా. వాళ్లను చూసి, అయ్యో నేను ఆ ఏజ్‌లో ఎందుకు రాలేకపోయానని బాధపడుతుంటా.
ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు కొంచెం హైపర్‌గానే ఉండేవారు కదా?
అవునండి. ఇంతకు ముందు నాకు చాలా కోపం, అహంకారం, భయంకరమైన మాటలు, పదాలు నా నోటి నుంచి వచ్చేవి. బట్.. దేవుడు అన్నీ తీసేశాడు. ఈ లోకంలో ప్రతి విషయానికీ ఓ జడ్జిమెంట్ ఉంటుంది. ఉదాహరణకు సీట్ బెల్టు పెట్టుకోకుండా, రెడ్ సిగ్నల్ దాటి వెళ్తే ఫైన్ ఉంటుంది కదా? ఇంత చిన్న విషయాలకు మీకు తీర్పు ఉన్నప్పుడు మీ పాపాలకు తీర్పుండదా? కచ్చితంగా ఉంటుం ది. నా పాపాలకు తీర్పు నా బదులుగా నా దేవుడిచ్చాడు. నన్ను క్షమించాడు. ‘నీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను’ అని చెప్పిన ఏకైక వ్యక్తి ఏసుక్రీస్తు.
ఆధ్యాత్మిక బాటలో వెళ్లేవాళ్లు ఉద్యోగాలు చేసుకోకూడదా? మీరెందుకు సినిమాలు వదిలేశారు?
రెండు పడవలపై కాలు వేసి, నడిపించలేం. నా దృష్టిలో నువ్వు సేవకుడిగా ఉంటే సినిమాలు చేయకూడదు. నువ్వు బిలీవర్ అయితే అది నీ ఛాయిస్. బట్ ఎవరైతే సేవలో ఉంటారో వారు కచ్చితంగా సినిమాలు చేయరు.
దైవ సహాయకులు పెళ్లి చేసుకోవచ్చా?
ఎందుకు చేసుకోకూడదు. ఫస్ట్ కమాండ్‌మెంట్ ఏంటి? దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు ‘ఫలించండి’ అన్నాడు. ‘బి ఫ్రూట్‌ఫుల్ అండ్ మల్టీప్లై’ అన్నాడు. అయితే రోమన్ క్యాథలిక్స్‌లో దేవుడి సేవకు అంకితం చేసుకున్న ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్ చేసుకోరు. ఇలాంటి విషయాలేమీ తెలుసుకోకుండా కొంతమంది అదో రకంగా మాట్లాడతారు. అంతెందుకు? క్రిస్టియానిటీని సినిమాల్లో ప్రెజెంట్ చేసే తీరు చాలా ఎగతాళిగానే ఉంటుంది. జనరల్‌గా కమర్షియల్ సినిమాల్లో ఫాదర్ రోల్స్ పెట్టించి వారి చేత కామెడీలు చేయిస్తారు. అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది చాలా శోచనీయం.
మీది లవ్ మ్యారేజా? ఎరేంజ్డా?
ఎరేంజ్డ్ మ్యారేజ్. రెండు ఫ్యామిలీలు మాట్లాడుకున్న తర్వాత మేం మాట్లాడుకున్నాం. ఒకరికొకరు నచ్చాం. 2014లో పెళ్లయింది.
ఇండస్ట్రీలోని మీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నారా?
స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఉన్నాను కదా. అందుకని ఎవరూ టచ్‌లో లేరు. కనీసం ఫోన్ కూడా చేయరు.
మీరు సమస్యల్ని చూసే విధానం అంతకు ముందుకీ, ఇçప్పటికీ మారిందా?
ఇప్పుడు ఏదైనా ప్రార్థన ద్వారానే. ‘ఐ డోంట్ ఫైట్ విత్ మై ప్రాబ్లమ్స్. నా సమస్యలతో నువ్వే ఫైట్ చేయా ల’ని దేవుడితో చెప్తాను. ‘నువ్వు నిలకడగా, నిబ్బరంగా ఉండు. భయపడకు, యుద్ధము నాది’ అని దేవుడు మాట ఇచ్చాడు. కావాలని దేవుడు మనకు సమస్యలను ఇవ్వడు. సమస్యలన్నీ మనం సృష్టించుకున్నవే. వాటిని కూడా తప్పిస్తానని మాట ఇచ్చాడంటే దేవుడు ఎంతో గొప్పవాడు. ‘దేవుడు నన్ను ఎలా క్షమించాడు’ అని కొన్నిసార్లు నేనే ఆశ్చర్యపోతాను.
కలలోనో, మెలకువలోనో దేవుడు దర్శనమిచ్చాడా?
దేవుడి దర్శనాలు తప్పకుండా అవుతాయండి. నాకు చాలాసార్లు దేవుడి దర్శనం అయ్యింది. ఓ రోజు ప్రార్థనలో ఉండగా పెద్ద వెలుగు కనిపించింది. అందులో దేవుడి ముఖం నాకు పూర్తిగా కనిపించలేదు. కానీ, ఆయన ఆకారం కనిపించింది. బైబిల్‌లోని కీర్తనలో దుడ్డుకర్ర అని ఒకటి ఉంటుంది. ఆ వెలుగు నుంచి ఓ చేయి ముందుకు వచ్చి నేను ప్రార్థన చేస్తుండగానే దుడ్డుకర్ర నా చేతిలో పెట్టారు. నాకు అది స్పష్టంగా అర్థమవుతోంది. నా జీవితంలో అందమైన క్షణాలవి. ఆ తర్వాత కొన్నాళ్లకు దర్శనాలకు అర్థం చెప్పే ఓ వ్యక్తిని కలిశా. నా దర్శనం గురించి చెప్పి దీనికి అర్థం ఏమిటి? అని అడిగాను. ‘దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు. చాలా అంశాలను అధిగమించడానికి, మిగతా ప్రజలు కూడా అధిగమించడంలో సహాయం చేయడాని నీకు అధికారం ఇచ్చాడు’ అని చెప్పారు. ఇటువంటి దర్శనం రెండుసార్లు కలిగింది.
ఓ సహాయకుడిగా ప్రస్తుతం మీరేం చేస్తున్నారు?
ఎక్కువగా మీటింగ్స్‌లో ఉంటా. ఇప్పుడు మూమిన్ పేట్ గ్రామాన్ని దత్తత తీసుకున్నా. మూడు ఎకరాల స్థలాన్ని కమ్యూనిటీ సర్వీసెస్ కోసం కొన్నా. అక్కడ అనాథాశ్రమం, మెడికల్ డే కేర్ సెంటర్, ఒక చర్చ్ కట్టడానికి ప్రయత్నిస్తున్నా. రెండు ఆర్వో వాటర్ ప్లాంట్స్, బోర్‌వెల్, 25 టాయిలెట్స్ నిర్మిస్తానని గ్రామస్థులకు మాటిచ్చా.
క్రిస్మస్ సందర్భంగా ఈ పండుగ గురించి చెబుతారా?
క్రిస్మస్ అంటే వెలుగుల పండుగ. ఈ లోకానికి దేవుడు వెలుగులా వచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరూ లైట్స్ పెట్టుకుంటారు. వెలుగనేది మనసులో ఉండాలి. ఉంటే తప్పకుండా బయట కనిపిస్తుంది. అందుకని మనసులో వెలుగు నింపుకోవాలి.
రత్నాలు, వజ్రాల కన్నా గొప్పది!
నాకూ, నా భార్యకూ లభించిన గొప్ప వరం – మా పాప. ‘ఒక బిడ్డను తను వెళ్ళవలసిన మార్గంలో నువ్వు నడిపించగలిగితే... ఆ మార్గం నుంచి ఎన్నడూ తప్పిపోడు’ అని బైబిల్‌లో దేవుడు చెప్పాడు. నాలుగైదేళ్ల తర్వాత మా పాపకు అలాంటి ట్రైనింగ్ ఉంటుంది. బైబిల్‌లో ఓ స్త్రీకి ఇచ్చిన విలువ పురుషుడికి కూడా లేదండి. కెంపులు, రత్నాలు, వజ్రాల కంటే స్త్రీ ఎంతో గొప్పదని దేవుడు అన్నాడు. అసలు భార్య దొరకడమే మేలు అంటాడు. అమ్రిత వచ్చిన తర్వాతే నా నివాసాన్ని ఓ ఇల్లుగా మార్చింది. నాకు ఒక భర్త టైటిల్ ఇచ్చి, నాకు తండ్రి బిరుదు ఇచ్చి... అంతా మేలే చేసింది. నా జీవితంలో ప్రతిదాన్నీ రెట్టింపు చేసింది. ఐయామ్ వెరీ హ్యాపీ.
హీరోగా ఉన్నప్పుడు మీరు చేసిన పనులన్నీ మీ భార్య దగ్గర పెళ్లికి ముందే చెప్పారా?
రాజా: పెళ్లయ్యాక ఎవరో నా గురించి చెప్పడం కంటే ముందే నేను చెబితే మంచిది కదా. అందుకే దాచుకోకుండా నా గతమంతా చెప్పాను. అయినా నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్.
రాజాలో ఏం నచ్చి, మీరు పెళ్లి చేసుకున్నారు?
అమ్రిత: అందరూ అనుకుంటున్నట్లు ఆయన యాక్టర్ అని మాత్రం పెళ్లి చేసుకోలేదు. అసలు రాజా హీరో అనే సంగతి కూడా నాకు తెలీదు (మధ్యలో రాజా అందుకుంటూ.. నేను వెబ్‌సైట్‌లో కూడా యాక్టర్ అని పెట్టలేదు). మా ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చాక వెళ్లి రాజాను కలిశా. యేసు గురించి రాజా ప్రబోధిస్తున్న ఓ వీడియో చూశా. ‘నాకు సరైన వ్యక్తిని చూపించు దేవుడా! స్పిరిచ్యువల్ మైండ్ ఉన్న మంచి వ్యక్తిని చూపించు’ అని నేను ప్రార్థిస్తున్న సమయంలో ఆ వీడియో చూశా. అప్పుడు నాలోని హోలీ స్పిరిట్ ‘ఇతనే నీకు సరైన వ్యక్తి. ఇతనితో నీ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది’ అని చాలా స్పష్టంగా చెప్పింది. మా ఇంటికి (పెళ్లి చూపులకు) వచ్చిన మొదటి వ్యక్తి కూడా రాజానే. అప్పటి నుంచి ఇప్పటివరకూ దేవుడు మాకు ఇచ్చిన ప్రశాంతతలో ఏ విధమైన మార్పూ లేదు.
రాజా: నేను నటించిన ఒక్క సినిమా కూడా మా ఆవిడ చూడలేదు. ‘నా భర్త నా వాడు. పరాయి స్త్రీతో నేను చూడలేను. అది తెరమీదైనా...’ అనుకుంటుంది. మరణించేవరకూ ఒకరితో మరొకరం నిజాయితీగా ఉండాలని ప్రమాణం చేసుకున్నాం. నా జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి వచ్చిన ఓ గొప్ప సహాయకురాలు ఆమె. దేవుడి దయ వల్ల మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలు వంటివి రాలేదు. ఎప్పటికీ రావు కూడా.
అమ్రిత: యస్. ప్రతి ఏడాదికీ మా బంధం మరింత మెరుగవుతోంది. ‘చూడు.. దేవుడు నీకు ఎంత సరైన వ్యక్తిని ఇచ్చాడో’ అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను.
– డి.జి. భవాని