
మంగళగిరి టౌన్: విలువలతో కూడిన సమాజం నిర్మాణం కోసం అమృత విశ్వవిద్యాలయం రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు కానుండటం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కురగల్లు, యర్రబాలెం గ్రామాల మధ్య నిర్మించనున్న అమృత విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు.
అమృతానందమయి ట్రస్ట్ పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు అండగా ఉందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రవేశాలు ప్రారంభించాలని కోరారు. రాజధాని ప్రాంతవాసుల మౌలిక సదుపాయాల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, కలెక్టర్ కోన శశిధర్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, కొచ్చి అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.