విరాళాలు, ఆస్తుల అమ్మకం.. ఆ విజన్‌కు ప్రపంచ స్థాయి అట! | AP CM Chandrababu Naidu Capital City Of Amaravati Construction Funds, More Details Inside | Sakshi
Sakshi News home page

విరాళాలు, ఆస్తుల అమ్మకం.. ఆ విజన్‌కు ప్రపంచ స్థాయి అట!

Published Thu, Jul 4 2024 5:40 AM | Last Updated on Thu, Jul 4 2024 10:25 AM

CM Chandrababu Capital city of Amaravati construction Funds

రాజధాని నిర్మాణానికి ఇలా నిధులు సమకూర్చుకుంటాం

సాక్షి, అమరావతి: ‘అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగు జాతికి జగన్‌ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్‌ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయా­న్ని తీసుకోరు. విధ్వంసానికి జగన్‌ ఒక కేస్‌ స్టడీ. మాకు రాజధాని లేదు అని చెప్పుకునేంత పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? రాష్ట్రంలో పుష్కలంగా వనరులు ఉన్నాయి. తెలివి గల మానవ వనరులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేశారు’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 

రాజధాని నిర్మాణానికి ఒక టైమ్‌ బాండ్‌ అంటూ పెట్టుకోలేదని, పాత ప్లాన్‌ ప్రకారం చేసు­కుంటూ ముందుకు వెళతామని స్పష్టం చేయడం చూస్తుంటే.. గత ప్రభుత్వం చెప్పిందే నిజ­మని స్ప­ష్టమవుతోంది. వెలగపూడి సచివాలయంలో బుధ­­వారం ఆయన రాజధాని అమరావతిపై శ్వేత­పత్రం విడుదల చేశారు. అనంతరం మాట్లాడు­తూ.. రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదని, రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు అమరావతి పేరును సూచించారన్నా­రు. 

రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుంచి.. దేశంలోని అన్ని పవిత్ర ప్రదేశాల నుంచి నీరు, మట్టిని కూడా తీసుకొచ్చామన్నారు. కుప్పం వారికైనా, ఇచ్ఛాపురం వారికైనా అమరావతి సమదూరంగా ఉంటుందని, అందువల్లే ఇక్కడ రాజధాని నిర్ణయించినట్టు చెప్పారు. బుద్ధి ఉన్న ఏ వ్యక్తీ అమరావతి రాజధానిని వ్యతిరేకించరని, రాజధాని­కి రెండు వైపులా 12 చొప్పున ఎంపీ స్థానాలు ఉన్నాయని, విభజన అనంతరం శివరామృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటించి కృష్ణా, గుంటూరు లేదా ఆ 2 జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు చెప్పిందన్నా­రు. ఏటా 3 పంటలు పండే మంచి భూమిని రాజ­ధాని కోసం తీసుకో­వడం సరికాదని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిన విషయాన్ని ఇక్కడ ఆయన వక్రీకరించి అనుకూలంగా మార్చుకున్నారు.

హైదరాబాద్‌కు కరెంట్, నీళ్లు.. బాబు ఘనతేనట
గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.15 వేల కోట్లు ఆర్థిక లోటు ఉన్నా, సైబరాబాద్‌ నిర్మాణ అనుభవంతో అమరావతిని నిర్మించాలని ఆలోచించామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌కు నాడు సరిగా కరెంట్, నీళ్లు లేవని.. రానురాను అన్నీ కలిసొచ్చాయన్నారు. ఎంత మంది ప్రయత్నించినా వీలుపడని కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చామని, 14 రోజుల పాటు అమెరికాలో తిరిగి ఐటీ పరిశ్రమలను కూడా సైబరాబాద్‌కు తీసుకొచ్చినట్టు సీఎం వివరించారు. 

పెద్ద పెద్ద ఇంజనీరింగ్‌ కాలేజీలు తీసుకొచ్చామని, తన హయాంలో సాగు నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఎయిర్‌ పోర్టులకు భూములు ఇచ్చిన వారు సంతృప్తిగా ఉండేలా చేశానని బాబు గొప్పలు చెప్పుకున్నారు. తొలుత అమరావతికి ల్యాండ్‌ పూలింగ్‌ సాధ్యమవు­తుందా.. అని అనుమాన పడినా, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను 29,966 మంది రైతులు ఇచ్చారన్నారు. ఈ రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వాలని నిర్ణయించామని, వ్యయసా­య కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్‌ అందిస్తున్న­ట్టు చెప్పారు. ఈ నెల 1నే దాన్ని రూ.5 వేలకు పెంచి అందించామన్నారు. వాస్తవంగా పెన్షన్‌ను పెంచింది గత ప్రభుత్వమనే విషయాన్ని మరచి తన ఖాతాలోకి వేసుకోవడం బాబుకే చెల్లింది.

గత ప్రభుత్వంపై ఏడుపు
వైఎస్‌ జగన్‌ 2019లో అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభించారని, కనీసం నిబంధనలు కూడా పాటించకుండా ప్రజా వేదికను కూల్చేశారని, తర్వాత మూడు రాజధానులు ప్రకటించారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘జీఎన్‌.రావు, బోస్టన్‌ కమిటీ అంటూ ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేశారు. ప్రజావేదిక శిథిలాలను తొలగించవద్దని ఇప్పుడు అంతా చెబుతున్నారు. అది చూస్తే ప్రతి ఒక్కరిలో గత ప్రభుత్వ విధ్వంసం గుర్తుకు రావాలి. జగన్‌ నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారు. తిరుపతి యాత్రకు వెళితే ఉండటానికి మండపాలు ఇవ్వకుండా వేధించారు. అరసవెల్లి యాత్రకు వెళితే దాడులు చేసి మధ్యలోనే నిలిపేయించారు’ అని సీఎం చంద్రబాబు మొసలి కన్నీళ్లు కార్చారు. 

గత పాలకులు అధికారంలోకి రాగానే రాజధానిలో అన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారని, వ్యవసాయ కూలీలకు అందించాల్సిన పెన్షన్లు, రైతు­లకు ఇవ్వాల్సిన కౌలు నిలిపేశారని, మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేశారని, రూ.1000 కోట్లు గ్రాంట్‌ రాకుండా కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేశా­రని.. ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. సింగపూర్‌ కన్సార్టియంపైనా ఆరోపణలు చేశారని, 14 ఎకరాల్లో 12 టవర్లతో నిర్మాణం తలపెట్టిన హ్యాపీ నెస్ట్‌ను నాశ­నం చేశారని, అది పూర్తయితే ప్రభు­త్వానికి రూ.­57.37 కోట్లు ఆదాయం వచ్చేదని, మున్ముందు రూ.885 కోట్లకు పెరిగేద­న్నా­రు. కానీ దాన్ని కూడా నాశనం చేయడంతో ఇప్పుడు రూ.164.5 కోట్ల నష్టంతో పాటు రాజధాని పరిధిలోని రోడ్లు, భవనాలు దెబ్బ తిన్నాయన్నారు.

నిర్మాణ ఖర్చు పెంచడానికే ఈ మాటలు..
గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసంతోనే రాజధాని నిర్మాణం ఖర్చు పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పడం చూస్తుంటే మళ్లీ ఎస్టిమేషన్లు పెంచుకోవడం కోసమేనని తెలుస్తోంది. ‘రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ బాగా దెబ్బతింది. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లింది. సంపద ఉత్పత్తి పెరగలేదు. అన్ని రంగాలు రివర్స్‌ అయ్యాయి. నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలో ఉన్న పనులు పూర్తవ­లేదు. రెవెన్యూ ఆదాయం తగ్గిపోయింది. ఏపీలో భూముల విలువ కూడా తగ్గిపోయింది. హైకోర్టు, హెచ్‌వోడీ, సచివాలయాల భవనాల ఐకానిక్‌ పునాదులన్నింటినీ నీళ్లలో ముంచేశారు. 

గెజిటెడ్‌ అధికారులు, మంత్రులు, జడ్జీల కోసం నిర్మించ తలపెట్టిన వాటిని కూడా అర్ధంతరంగా నిలిపేశారు. నేను పడ్డ కష్టం వృధా అయింది. అది చూస్తే మనసు నిగ్రహం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాజధాని కాలం కూడా అయిపోంది. పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయారు. సింగపూర్‌ ప్రతినిధులు వస్తారో రారో తెలీదు. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం మనది. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? నన్ను ఇబ్బందులు పెట్టారని నేను మాట్లాడడం లేదు. జగన్‌ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూ­డదు. బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతా’ అని అన్నారు.

ఉద్యోగ కల్పనకు నిలయంగా రాజధాని రూపకల్పన
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారికి ఉద్యోగాల కల్పన అమరావతిలో జరుగుతుందని సీఎం చంద్రబాబు మరోసారి చుక్కలు చూపారు. ప్రతి పంచాయతీ సంక్షేమానికి ఇది నిక్షేపంలా ఉంటుందన్నారు. అమరావతి నాది అని చెప్పుకు­నేలా ప్రణాళిక రూపొందించామని, మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు లేవని తెలిపారు. గతంలో రూపొందించిన అదే మాస్టర్‌ ప్లాన్‌ను కొనసాగి­స్తామన్నారు. ఇన్ని చెప్పిన బాబు.. అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని, కొన్ని ఆస్తులు అమ్మి సంపద సృష్టిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం ఎన్నో సందేహాలకు తెర లేపింది. 

ఇక్కడ భూములమ్మిన వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొంటే అక్కడ కూడా విలువ పెరుగుతుందని, ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు జరిగి ఉంటే ప్రభుత్వానికి కూడా పన్నులు, జీఎస్టీ రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్నారు. విట్, ఎస్‌ఆర్, అమృత్‌ లాంటి యూనివర్సిటీల్లో పేద పిల్లలు చదువుకుంటే కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయని యువతను మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. రాజధాని పునర్నిర్మానంపై కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పారు. రాజధాని పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే పనులు ప్రారంభిస్తామే తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. 

ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి సెంటు పట్టాలని డ్రామాలాడారని, ఇల్లు లేని వారికి వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ లెక్కన అమరావతిలో పేదలకు స్థానం లేదని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఎయిమ్స్‌కు కూడా నీళ్లివ్వకుండా గత ప్రభుత్వం వేధించిందని, తద్వారా పడకల పెరుగుదలకు అవరోధం ఏర్పడి ఆసుపత్రిలో ఓపీలు కూడా తగ్గాయని చెప్పారు. ఏ లెక్కన చంద్రబాబు ఈ మాట చెప్పారో అర్థం కావడం లేదు. వాస్తవానికి ఎయిమ్స్‌లో ఓపీలు పెరగడం గమనార్హం. గతంలో అనుమతులు పొందిన 132 సంస్థలకు గాను 122 సంస్థలు అమరావతికి రాలేదని చెప్పుకొచ్చారు.  

ఆ విజన్‌కు ప్రపంచ స్థాయి అట!
అమరావతిలో 53,748 ఎకరాలు సేకరించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్లు, ఇతర నిర్మాణాలకు 27,885 ఎకరాలు, రిటర్నబుల్‌ ప్లాట్ల కింద 11,826, ఇతర అవసరాలకు 14,037 ఎకరాలు పోను ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వద్దనున్న భూమి­ని విక్రయించి రాజధాని నిర్మాణం చేయొ­చ్చని ఆలోచించామని, కేంద్ర ప్రభుత్వం కేపిటెల్‌ గెయిన్‌ మినహాయింపునిచ్చి రూ.­2,500 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుని రూ.­1,500 కోట్లు కూడా అందించిందన్నారు.  

నాడు రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జేఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చా­యని, సింగపూర్‌తో ఎంఓయూ కుదుర్చు­కున్నా­మని తెలిపారు. మొదట సీఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్, తర్వాత రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ సంస్థ అందించింద­న్నారు. దేశంలోనే స్మార్ట్‌ సిటీగా, ప్రపంచ స్థాయి ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్‌ రూపొందించినట్టు చెప్పారు. అసెంబ్లీ, హై­కో­ర్టు, సెక్రటేరియట్‌తో పాటు అన్ని విభా­గాలు ఒకేచోట ఉండాలని మాస్టర్‌ ప్లాన్‌లో నిర్ణయించామన్నారు. 

దేశంలో ఏ సిటీకి లేనంత మేర నదీ ప్రాంతం అమరావతికి ఉందని, రెండు నదులను అనుసంధానం చేసే కాన్సెప్ట్‌తో నగరానికి రూపకల్పన చేశామన్నారు. రూ.51,687 కోట్లతో రాజ­ధా­ని పనులకు అంచనా వేసి, రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచామని, అప్పటికే జరి­గిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించామని, రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండింగులో ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement