విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడారు.
"14 ఏళ్లుగా సీఎంగా ఉన్నాను, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. అలాగే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం. అమరావతిని అభివృద్ధి చేస్తాం. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేస్తాం. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ప్రజాహితం కోసం ముందుకెళ్తాం. మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా అజెండా అని అన్నారు."
"ఎన్డీయే శాసనాసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ప్రజల తీర్పును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కలిసి పని చేయడం వల్ల కూటమికి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ తీర్పు వల్ల మనకు ఢిల్లీలో ప్రతిష్ట పెరిగింది. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ నన్ను పరామర్శించి పొత్తు పెట్టుకుందామని చెప్పారు. బీజేపీతో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేయడం వల్ల సీట్లు, ఓట్లు వచ్చాయి"
అలాగే తన కోసం రాష్ట్రంలో ఎక్కడా ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేను, పవన్ సామాన్యులమే. ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తాం అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు.. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆమోదం తెలిపారు. ఆ వెంటనే టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా చంద్రబాబును తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment