పేదల ఇళ్లు లూటీ! | Chandrababu Robbery Also In Poor People Houses Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్లు లూటీ!

Published Mon, Sep 4 2023 4:19 AM | Last Updated on Mon, Sep 4 2023 7:13 AM

Chandrababu Robbery Also In Poor People Houses Andhra Pradesh - Sakshi

చంద్రబాబుకు వివిధ మార్గాల్లో అందించిన రూ.కోట్లను కోడ్‌ భాషలో స్టీల్‌ టన్నులుగా పేర్కొంటూ మెయిల్‌లో దాచుకున్న షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేదల ఇళ్ల నిర్మా­ణాన్ని సైతం వదల్లేదు! రూ.వేల కోట్ల విలువైన కాంట్రా­క్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి వేసిన పథకం ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో బయటపడింది.

తాత్కాలిక భవన నిర్మాణాల్లో డొల్ల కంపెనీల పేరుతో రూ.వందల కోట్లు స్వాహా చేసి పక్కా ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు ‘ఈడబ్ల్యూఎస్‌’ పథకం కింద పేదల ఇంటి నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని 2019 నవంబర్‌ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించాడు.

తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్‌ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్‌ వాసుదేవ్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్‌ హౌసింగ్‌ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు.

అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్‌ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని, అంతేకాకుండా పార్టీ ఫండ్‌ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని కోరినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది.

నగదు బదిలీలో ఆ ముగ్గురు.. కోడ్‌ భాషలో
సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో డొల్ల కంపెనీలు హయగ్రీవా, అన్నై, షలఖ కంపెనీల ద్వారా అక్రమంగా నగదును చంద్రబాబు నాయుడుకు తరలించడంలో వినయ్‌ నంగాలియా, విక్కీ జైన్, అంకిత్‌ బలదూత కీలకపాత్ర పోషించినట్లు మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు ఐటీశాఖ నోటీసుల్లో పేర్కొంది. వీరంతా బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా నగదును చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌కు చేరవేసినట్లు పేర్కొన్నారు.

ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్‌లో దినార్‌ల రూపంలో చెల్లించినట్లు మనోజ్‌ వాసుదేవ్‌ అంగీకరించాడు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్‌ షీట్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నగదు బదిలీకి కోడ్‌ భాషలో హెచ్‌వైడీ అని అందులో ఉంది. విజయవాడకు విజయ్‌ అని, విశాఖపట్నంకు విష్‌ అని, బెంగళూరుకు బాంగ్‌ అని కోడ్‌ భాషల్లో నమోదు చేసుకున్న వివరాలను, ఎక్సెల్‌ షీటును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అడ్డగోలు వాదన ఆపి జవాబు చెప్పు!!
చంద్రబాబు అసంబద్ధ వాదనలను కట్టిపెట్టి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పి తీరాల్సిందేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది! సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో దొంగ ఇన్‌వాయిస్‌లు సృష్టించి నగదును అక్రమంగా తరలించినట్లు తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలున్నాయని, చట్ట ప్రకారం విచారించే అధికారం తమకు ఉన్నందున లెక్కల్లో చూపని రూ.118 కోట్లకు సమాధానం చెప్పాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది.

ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ తన రాజగురువు రామోజీ తరహాలో ఏదో ఒక అభ్యంతరాన్ని తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తు ముందుకు కదలకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌కు అసలు విచారణ పరిధి లేదని ఒకసారి, జ్యూరిస్‌డిక్షన్‌ అసెసింగ్‌ అధికారి ఈ కేసును సెంట్రల్‌ ఆఫీసుకు బదిలీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని మరోసారి, అసలు ఐటీ దాడుల్లో సీజ్‌ చేసిన వివరాలను తనకు తెలియచేయలేదని, అందులో తన పేరు ఎక్కడా లేదంటూ.. ఇలా వరుసగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు అడుగు ముందుకు పడకుండా కేసును సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు.

2022 అక్టోబర్‌ నుంచి లేఖల మీద లేఖలు రాస్తూ నాలుగుసార్లు దర్యాప్తును అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రతిసారి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చుతూ సహనంగా సమాధానాలిస్తోంది. ముందుగా రూ.118 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ పూర్తి సాక్ష్యాధారాలతో మరోసారి సెక్షన్‌ 153 సీ కింద నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులతో పాటు మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని (ఎంవీపీ), చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌లపై ఐటీ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎక్సెల్‌ షీట్లు, వాట్సాప్‌ మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్, బ్యాంకు లావాదేవీల వివరాలతో పాటు వారు విచారణ సందర్భంగా ఆ నగదును చంద్రబాబుకు ఏ విధంగా చేర్చారో వెల్లడిస్తూ వివరాలను పొందుపరిచింది.

తప్పించుకుని తిరుగుతూ..
చంద్రబాబు స్క్రూటినీ కేసును హైదరాబాద్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌–4 ప్రిన్సిపల్‌ కమిషనర్‌ గతేడాది సెక్షన్‌ 127 కింద హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌–2(4)కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి సెక్షన్‌ 153 సీ, 143(2)/142(1) కింద విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2022 అక్టోబర్‌ 10, అక్టోబర్‌ 27, ఈ ఏడాది జనవరి 31, జూన్‌ 20న చంద్రబాబు నాలుగు లేఖలు రాశారు.

అసలు సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయానికి సెక్షన్‌ 153 సీ కింద తనకు నోటీసులిచ్చే అధికారం లేదని వాదించగా దీన్ని తోసిపుచ్చింది. జ్యూరిస్‌డిక్షన్‌ అసెసింగ్‌ ఆఫీసర్‌ సెక్షన్‌ 127 కింద ఈ కేసును తమకు బదిలీ చేయడంతో చట్ట ప్రకారం తక్షణం దర్యాప్తు మొదలు పెట్టినట్లు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు వెంటనే సెక్షన్‌ 127 కింద కేసు బదిలీ కాకుండానే సెంట్రల్‌ సర్కిల్‌ ఆఫీసు తనకు నోటీసులు ఇచ్చిదంటూ వాదించగా దానికి కూడా స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇచ్చింది.

దర్యాప్తులో సీజ్‌ చేసిన వివరాలను తనకు పూర్తిగా తెలియచేయలేదని ఒకసారి పేర్కొనగా అందులో తన పేరు ఎక్కడా లేదు కాబట్టి తనకు నోటీసులు వర్తించవంటూ మరోసారి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఐటీ శాఖ స్పందిస్తూ మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని వద్ద సోదాల్లో సీజ్‌ చేసిన వస్తువుల వివరాలన్నీ మీకు (చంద్రబాబుకు) తెలియచేశామని, ముఖ్యమంత్రి హోదాలో కేటాయించిన కాంట్రాక్టుల నుంచి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో ఎటువంటి పనులు చేయకుండానే నగదు చంద్రబాబుకు చేరినట్లు బలమైన ఆధారాలను సేకరించడంతో మీ అభ్యంతరాలను కొట్టి వేస్తున్నామని, పూర్తి వివరాలను మరోసారి అందచేస్తున్నామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తునకు సహకరించాల్సిందేనంటూ తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది. 46 పేజీల సుదీర్ఘ నోటీసులో మొత్తం ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందో పూసగుచ్చినట్లు బ్యాంకు లావాదేవీలు, కోడ్‌ భాషలను క్రోడీకరించి రుజువులతో మరీ వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement