shapoorji pallonji
-
పేదల ఇళ్లు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేదల ఇళ్ల నిర్మాణాన్ని సైతం వదల్లేదు! రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి వేసిన పథకం ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో బయటపడింది. తాత్కాలిక భవన నిర్మాణాల్లో డొల్ల కంపెనీల పేరుతో రూ.వందల కోట్లు స్వాహా చేసి పక్కా ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదల ఇంటి నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని, అంతేకాకుండా పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని కోరినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. నగదు బదిలీలో ఆ ముగ్గురు.. కోడ్ భాషలో సబ్ కాంట్రాక్టుల ముసుగులో డొల్ల కంపెనీలు హయగ్రీవా, అన్నై, షలఖ కంపెనీల ద్వారా అక్రమంగా నగదును చంద్రబాబు నాయుడుకు తరలించడంలో వినయ్ నంగాలియా, విక్కీ జైన్, అంకిత్ బలదూత కీలకపాత్ర పోషించినట్లు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు ఐటీశాఖ నోటీసుల్లో పేర్కొంది. వీరంతా బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌కు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్‌లో దినార్ల రూపంలో చెల్లించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించాడు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నగదు బదిలీకి కోడ్ భాషలో హెచ్‌వైడీ అని అందులో ఉంది. విజయవాడకు విజయ్ అని, విశాఖపట్నంకు విష్ అని, బెంగళూరుకు బాంగ్ అని కోడ్ భాషల్లో నమోదు చేసుకున్న వివరాలను, ఎక్సెల్ షీటును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డగోలు వాదన ఆపి జవాబు చెప్పు!! చంద్రబాబు అసంబద్ధ వాదనలను కట్టిపెట్టి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పి తీరాల్సిందేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది! సబ్ కాంట్రాక్టుల ముసుగులో దొంగ ఇన్వాయిస్లు సృష్టించి నగదును అక్రమంగా తరలించినట్లు తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలున్నాయని, చట్ట ప్రకారం విచారించే అధికారం తమకు ఉన్నందున లెక్కల్లో చూపని రూ.118 కోట్లకు సమాధానం చెప్పాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ తన రాజగురువు రామోజీ తరహాలో ఏదో ఒక అభ్యంతరాన్ని తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తు ముందుకు కదలకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు అసలు విచారణ పరిధి లేదని ఒకసారి, జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ అధికారి ఈ కేసును సెంట్రల్ ఆఫీసుకు బదిలీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని మరోసారి, అసలు ఐటీ దాడుల్లో సీజ్ చేసిన వివరాలను తనకు తెలియచేయలేదని, అందులో తన పేరు ఎక్కడా లేదంటూ.. ఇలా వరుసగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు అడుగు ముందుకు పడకుండా కేసును సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి లేఖల మీద లేఖలు రాస్తూ నాలుగుసార్లు దర్యాప్తును అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రతిసారి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చుతూ సహనంగా సమాధానాలిస్తోంది. ముందుగా రూ.118 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ పూర్తి సాక్ష్యాధారాలతో మరోసారి సెక్షన్ 153 సీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులతో పాటు మనోజ్ వాసుదేవ్ పార్థసాని (ఎంవీపీ), చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌లపై ఐటీ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎక్సెల్ షీట్లు, వాట్సాప్ మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్, బ్యాంకు లావాదేవీల వివరాలతో పాటు వారు విచారణ సందర్భంగా ఆ నగదును చంద్రబాబుకు ఏ విధంగా చేర్చారో వెల్లడిస్తూ వివరాలను పొందుపరిచింది. తప్పించుకుని తిరుగుతూ.. చంద్రబాబు స్క్రూటినీ కేసును హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్–4 ప్రిన్సిపల్ కమిషనర్ గతేడాది సెక్షన్ 127 కింద హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్–2(4)కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి సెక్షన్ 153 సీ, 143(2)/142(1) కింద విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2022 అక్టోబర్ 10, అక్టోబర్ 27, ఈ ఏడాది జనవరి 31, జూన్ 20న చంద్రబాబు నాలుగు లేఖలు రాశారు. అసలు సెంట్రల్ సర్కిల్ కార్యాలయానికి సెక్షన్ 153 సీ కింద తనకు నోటీసులిచ్చే అధికారం లేదని వాదించగా దీన్ని తోసిపుచ్చింది. జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ ఆఫీసర్ సెక్షన్ 127 కింద ఈ కేసును తమకు బదిలీ చేయడంతో చట్ట ప్రకారం తక్షణం దర్యాప్తు మొదలు పెట్టినట్లు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు వెంటనే సెక్షన్ 127 కింద కేసు బదిలీ కాకుండానే సెంట్రల్ సర్కిల్ ఆఫీసు తనకు నోటీసులు ఇచ్చిదంటూ వాదించగా దానికి కూడా స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇచ్చింది. దర్యాప్తులో సీజ్ చేసిన వివరాలను తనకు పూర్తిగా తెలియచేయలేదని ఒకసారి పేర్కొనగా అందులో తన పేరు ఎక్కడా లేదు కాబట్టి తనకు నోటీసులు వర్తించవంటూ మరోసారి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఐటీ శాఖ స్పందిస్తూ మనోజ్ వాసుదేవ్ పార్థసాని వద్ద సోదాల్లో సీజ్ చేసిన వస్తువుల వివరాలన్నీ మీకు (చంద్రబాబుకు) తెలియచేశామని, ముఖ్యమంత్రి హోదాలో కేటాయించిన కాంట్రాక్టుల నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో ఎటువంటి పనులు చేయకుండానే నగదు చంద్రబాబుకు చేరినట్లు బలమైన ఆధారాలను సేకరించడంతో మీ అభ్యంతరాలను కొట్టి వేస్తున్నామని, పూర్తి వివరాలను మరోసారి అందచేస్తున్నామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తునకు సహకరించాల్సిందేనంటూ తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది. 46 పేజీల సుదీర్ఘ నోటీసులో మొత్తం ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందో పూసగుచ్చినట్లు బ్యాంకు లావాదేవీలు, కోడ్ భాషలను క్రోడీకరించి రుజువులతో మరీ వెల్లడించింది. -
యురేకా ఫోర్బ్స్‌కు షాపూర్జీ టాటా
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ యురేకా ఫోర్బ్స్ నుంచి నిర్మాణ రంగ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ పూర్తిగా బయటపడింది. కంపెనీలో మిగిలిన 8.7 శాతం వాటాను కొత్త యాజమాన్య సంస్థ లునోలక్స్కు విక్రయించింది. పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు చెందిన లునోలక్స్ 1.68 కోట్ల ఈక్విటీ షేర్లను(8.7 శాతం వాటా) షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ నుంచి సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని యురేకా ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. 2021 సెప్టెంబర్ 19న కుదిరిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం ఈ లావాదేవీని షాపూర్జీ పల్లోంజీ పూర్తి చేసినట్లు పేర్కొంది. షాపూర్జీ నుంచి రూ. 4,400 కోట్లకు యురేకా ఫోర్బ్స్‌ను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ ఇంటర్నేషనల్ గతేడాది సెప్టెంబర్‌లో డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్‌లో యురేకా ఫోర్బ్స్ నుంచి షాపూర్జీకి చెందిన ఏడుగురు డైరెక్టర్లు బోర్డు నుంచి తప్పుకోగా.. ఈ వారం మొదట్లో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ మాజీ సీఈవో ప్రతీక్ పోటాను చీఫ్‌గా యాడ్వెంట్ ఎంపిక చేసింది. ప్రతీక్ ఆగస్ట్ 16 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఒక్క ప్రాజెక్టు కోసం పోటీపడుతున్న ఆరు కంపెనీలు
గుజరాత్‌లోని లోథల్‌లో రూ.4,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేబోయే నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్(ఎన్ఎంహెచ్సీ) ప్రాజెక్టు దక్కించుకోవడం కోసం ఆరు ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థలు పోటీ పడుతున్నాయి. టాటా గ్రూప్, షాపూర్జీ పల్లోంజీ, కెఈసీ ఇంటర్నేషనల్, క్యూబ్ ఇన్ ఫ్రా, అహ్లువాలియా కాంట్రాక్ట్ కంపెనీలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం బిడ్లను సమర్పించినట్లు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు 80 కి.మీ దూరంలో ఉన్న లోథాల్లో, ఏఎస్ఐ ప్రాంతానికి సమీపంలో ఎన్ఎంహెచ్సీని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. పూర్వకాలం నుంచి ప్రస్తుతకాలం వరకు ఉన్న మన దేశ సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించే ప్రాంతంగా, ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా దీనిని తీర్చిదిద్దనున్నారు. భారతదేశ సముద్ర వారసత్వంపై ప్రపంచానికి అవగాహన పెంచడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన "ఎడ్యుటైన్మెంట్" విధానాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు. సౌరాష్ట్ర ప్రాంతంలో సబర్మతి నది, దాని ఉపనది భోగవో మధ్య ఉన్న పురాతన సింధు లోయ నాగరికత దక్షిణ నగరాల్లో లోథల్ ఒకటి. ఎంఎంహెచ్‌సీని 400 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. జాతీయ సముద్ర వారసత్వ ప్రదర్శనశాల, లైట్‌హౌస్ మ్యూజియం, వారసత్వ అంశాలతో రూపొందించిన పార్కు, మ్యూజియం తరహా హోటళ్లు, సముద్ర తరహా పర్యావరణహిత రిసార్టులు, సముద్ర సంస్థ వంటి విశిష్ఠ నిర్మాణాలను దశలవారీగా ఇక్కడ చేపడతారు. (చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు) ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర మ్యూజియంలలో ఒకటిగా దీనిని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది. గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే సరాగ్ వాలా గ్రామంలో 375 ఎకరాల భూమిని 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. క్రీ.పూ.2400 కాలంలో ఉన్న సింధు లోయ నాగరికత నాటి ప్రముఖ నగరాల్లో ఒకటైన పురాతన లోథల్ నగరాన్ని పునర్నిర్మించడం ఎన్ఎంహెచ్సీ ప్రత్యేకత. దీనికితోడు, వివిధ కాలాల్లో వర్ధిల్లిన భారత సముద్ర వారసత్వాన్ని వివిధ గ్యాలరీల ద్వారా ప్రదర్శిస్తారు. సముద్ర తీర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ సముద్ర సంబంధ కళాఖండాలు/ వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఎన్‌ఎంహెచ్‌సీలో ప్రత్యేక కేటాయింపు ఉంటుంది. సముద్ర వారసత్వ సముదాయం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఇది ఉంటుంది. 2026 నాటికి మూడు దశల్లో దీనిని అభివృద్ధి చేయనున్నారు. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ఎప్పుడో తెలుసా?) -
మిస్త్రీకి టాటా రైటే..!
దేశీ కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్‌లో మిస్త్రీకి చెందిన ఎస్పీ గ్రూప్ వాటాల వేల్యుయేషన్‌ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ సూచించింది. సుప్రీం ఉత్తర్వులపై టాటా గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌తో నాలుగేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. టాటా సన్స్ చైర్మన్‌గా ఆయన్ను పునర్నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో టాటా సన్స్ అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ‘2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నాం. టాటా గ్రూప్ అప్పీళ్లను అనుమతిస్తున్నాం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (మిస్త్రీ కుటుంబానికి చెందిన గ్రూప్) అప్పీళ్లను తోసిపుచ్చుతున్నాం‘ అని ఆదేశాలు ఇచ్చింది. దీనితో మిస్త్రీ తొలగింపుపై దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది. టాటా సన్స్ యాజమాన్య అధికారాలను విభజించాలన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎస్పీ గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థలు వేసిన పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే టాటా సన్స్ బోర్డులో సముచితంగా ప్రాతినిధ్యం కల్పించాలంటూ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ చేసిన అప్పీళ్లను కూడా తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై టాటా సన్స్‌తో పాటు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల తరబడి టాటా గ్రూప్ పాటిస్తున్న అత్యుత్తమ గవర్నెన్స్ ప్రమాణాలకు ఇది గుర్తింపు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రతన్ టాటా వారసుడిగా 2012లో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో పగ్గాలు చేపట్టడం, 2016లో ఆయన్ను అర్ధాంతరంగా తప్పించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ మిస్త్రీ, ఉద్వాసనను సమర్ధించుకుంటూ టాటా గ్రూప్ అప్పట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్నాయి. మిస్త్రీకి అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టాటా గ్రూప్, కంపెనీలో గవర్నెన్స్ లోపాలపై తాము లేవనెత్తిన అంశాలను ఎన్సీఎల్ఏటీ పరిష్కరించలేదంటూ మిస్త్రీ గ్రూప్.. సుప్రీంను ఆశ్రయించాయి. వేల్యుయేషన్‌పై... టాటా గ్రూప్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటాల విలువ ఎంత ఉంటుందనేది తేల్చుకోవడాన్ని ఇరుపక్షాలకు వదిలేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకోసం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 75 లేదా ఇతరత్రా న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చని సూచించింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) ఎస్పీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ లెక్కగట్టింది. తదనుగుణంగానే గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతోంది. అయితే, ఈ వాటాల వేల్యుయేషన్ రూ. 70,000–80,000 కోట్లే ఉంటుందని టీఎస్పీఎల్ వాదిస్తోంది. కేసు సాగిందిలా.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాలు చేయడంతో పాటు టాటా సన్స్ మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన 2 సంస్థలు ఎన్సీఎల్టీ (ముంబై)ని ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా అప్పటి టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ నియామకం. అదే ఏడాది ఫిబ్రవరి 6న మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ డైరెక్టర్‌గా తొలగించారు. మార్చి, ఏప్రిల్‌లో మిస్త్రీ కంపెనీల పిటీషన్లను ఎన్సీఎల్టీ (ముంబై) తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మిస్త్రీ కంపెనీలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. దాని ఆదేశాల మేరకు మరోసారి ఎన్సీఎల్టీకి వెళ్లాయి. ► 2018 జూలై 9: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు ఇతరత్రా అంశాలపై దాఖలైన పిటిషన్లను ఎన్సీఎల్టీ ముంబై మరోసారి తోసిపుచ్చింది. దీనిపై మిస్త్రీ కంపెనీలు మళ్లీ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా పునర్నియామకానికి అనుకూలంగా ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు టాటా గ్రూప్‌నకు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ► 2020 జనవరి 2: ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీంను ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్ 17న తుది ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ► 2020 మార్చి 26: మిస్త్రీ పునర్నియామకంపై ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను తోసిపుచ్చుతూ సుప్రీం తుది ఉత్తర్వులు ఇచ్చింది. మా విలువలకు నిదర్శనం.. గెలుపోటములకు సంబంధించిన అంశం కాదిది. నా నిబద్ధతపైనా, గ్రూప్ నైతిక విలువలపైనా నిరంతరంగా ఆరోపణల రూపంలో దాడులు జరిగాయి. అంతిమంగా టాటా సన్స్ అప్పీళ్లకు అనుకూలంగా తీర్పు రావడం మా విలువలు, నైతికతకు నిదర్శనం. చిరకాలంగా ఇవే మార్గదర్శక సూత్రాలుగా గ్రూప్ ప్రస్థానం సాగుతోంది. – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్ టాటా షేర్లు రయ్.. సుప్రీం కోర్టులో అనుకూల ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం జోరుగా పెరిగాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ 6%, టాటా పవర్ 5 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 4 శాతం, టాటా మోటార్స్ సుమారు 4 శాతం ఎగిశాయి. టాటా మెటాలిక్స్ 3 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ .. టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ చెరి 2.6 శాతం, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ .. వోల్టాస్ .. టాటా కెమికల్స్ దాదాపు 2 శాతం మేర పెరిగాయి. -
మిస్త్రీ కంపెనీలకు పూర్తిగా ’టాటా’
న్యూఢిల్లీ: మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి చెందిన షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్‌తో వ్యాపార లావాదేవీలు పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంపై టాటా గ్రూప్ దృష్టి పెట్టింది. టాటా గ్రూప్ ప్రమోటింగ్ సంస్థ టాటా సన్స్ ఈ మేరకు.. తమ గ్రూప్ సంస్థలకు ఈ నెల ప్రారంభంలో ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీ ఉన్న రోజుల్లోనే టాటా కంపెనీల నుంచి తమకొచ్చే ఇంజనీరింగ్, నిర్మాణ కాంట్రాక్టులు సున్నా స్థాయికి పడిపోయాయని, ఒకవేళ ఒకటీ అరా ఉన్నా అవి పెద్దగా ప్రాధాన్యం లేనివేనని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ పేర్కొంది. 2013 నవంబర్‌లో టాటా సన్స్‌కి చైర్మన్‌గా ఉన్నప్పుడే తన పదవీ కాలంలో ఎస్పీ గ్రూప్‌నకు కొత్తగా ఎటువంటి ఇంజనీరింగ్, నిర్మాణ కాంట్రాక్టులు ఇవ్వరాదంటూ మిస్త్రీ స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్ నుంచి 2012–13లో రూ. 1,125 కోట్లుగా ఉన్న ఆర్డర్ల పరిమాణం 2015–16 నాటికల్లా సున్నా స్థాయికి తగ్గిపోయాయని ఎస్పీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం రెండు గ్రూప్‌ల మధ్య మొదలైన వైరానికి ఇది కొనసాగింపుగా పరిశీలకులు అభిప్రాయపడ్డారు. 18.4 శాతం వాటాలతో టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉంది. -
ఎల్&టీకి 4,షాపుర్జీ పల్లోంజీకి 2..
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి టెండర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సీఆర్డీఏ సలహామండలితో సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి పలు కంపెనీలు అధికమొత్తంలో టెండర్లు దక్కించుకున్నాయి. నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ ఎల్ అండ్ టీ..సచివాయంలో నాలుగు భవనాలు...అలాగే షాపుర్జీ పల్లోంజీ సంస్థ రెండు భవనాలు నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్నాయి. చదరపు అడుగుకు రూ.3,350కి నిర్మించేందుకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నాయి. ఒక్కో చదరపు అడుగుకు రూ.350 అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా నోటిఫికేషన్ ప్రకారం చదరపు అడుగు రూ.3వేలుగా ప్రభుత్వం నిర్థారించగా, 5 శాతానికి మించి ఎక్కువ చెల్లించకూడదనే నిబంధన ఉన్నా సర్కార్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. కాగా ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 180 కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా మంగళగిరి మండంలోని వెలగపుడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టనుంది. 26 ఎకరాల స్థలంలో ఏపీ తాత్కాలిక సచివాయలం నిర్మాణం జరగనుంది. -
'తెలంగాణలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు షాపూర్జీ పాలోంజీ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో నిర్మించే రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఇతర నిర్మాణల కోసం పెట్టుబడులు పెట్టనుంది. గురువారం షాపూర్జీ పాలోంజీ కంపెనీ చైర్మన్ షాపూర్ మిస్తీ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ను కలిశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములవుతామని మిస్రీ చెప్పారు. కొత్త సెక్రటేరియట్, ఆధునిక పోలీస్ కమిషనరేట్, కళాభారతి నిర్మాణాల గురించి కేసీఆర్... షాపూర్‌కు వివరించారు.