న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ యురేకా ఫోర్బ్స్ నుంచి నిర్మాణ రంగ దిగ్గజం షాపూర్‌జీ పల్లోంజీ పూర్తిగా బయటపడింది. కంపెనీలో మిగిలిన 8.7 శాతం వాటాను కొత్త యాజమాన్య సంస్థ లునోలక్స్‌కు విక్రయించింది. పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు చెందిన లునోలక్స్ 1.68 కోట్ల ఈక్విటీ షేర్లను(8.7 శాతం వాటా) షాపూర్‌జీ పల్లోంజీ అండ్ కంపెనీ నుంచి సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని యురేకా ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది.
2021 సెప్టెంబర్ 19న కుదిరిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం ఈ లావాదేవీని షాపూర్‌జీ పల్లోంజీ పూర్తి చేసినట్లు పేర్కొంది. షాపూర్‌జీ నుంచి రూ. 4,400 కోట్లకు యురేకా ఫోర్బ్స్‌ను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ ఇంటర్నేషనల్ గతేడాది సెప్టెంబర్‌లో డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్‌లో యురేకా ఫోర్బ్స్ నుంచి షాపూర్‌జీకి చెందిన ఏడుగురు డైరెక్టర్లు బోర్డు నుంచి తప్పుకోగా.. ఈ వారం మొదట్లో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ మాజీ సీఈవో ప్రతీక్ పోటాను చీఫ్‌గా యాడ్వెంట్ ఎంపిక చేసింది. ప్రతీక్ ఆగస్ట్ 16 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment