ఎల్&టీకి 4,షాపుర్జీ పల్లోంజీకి 2..
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి టెండర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సీఆర్డీఏ సలహామండలితో సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి పలు కంపెనీలు అధికమొత్తంలో టెండర్లు దక్కించుకున్నాయి. నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ ఎల్ అండ్ టీ..సచివాయంలో నాలుగు భవనాలు...అలాగే షాపుర్జీ పల్లోంజీ సంస్థ రెండు భవనాలు నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్నాయి.
చదరపు అడుగుకు రూ.3,350కి నిర్మించేందుకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నాయి. ఒక్కో చదరపు అడుగుకు రూ.350 అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా నోటిఫికేషన్ ప్రకారం చదరపు అడుగు రూ.3వేలుగా ప్రభుత్వం నిర్థారించగా, 5 శాతానికి మించి ఎక్కువ చెల్లించకూడదనే నిబంధన ఉన్నా సర్కార్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
కాగా ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 180 కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా మంగళగిరి మండంలోని వెలగపుడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టనుంది. 26 ఎకరాల స్థలంలో ఏపీ తాత్కాలిక సచివాయలం నిర్మాణం జరగనుంది.