మిస్త్రీకి టాటా రైటే..! | Supreme Court sets aside NCLAT order which had reinstated Cyrus Mistry | Sakshi
Sakshi News home page

మిస్త్రీకి టాటా రైటే..!

Published Sat, Mar 27 2021 4:29 AM | Last Updated on Sat, Mar 27 2021 9:01 AM

Supreme Court sets aside NCLAT order which had reinstated Cyrus Mistry - Sakshi

దేశీ కార్పొరేట్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్‌నియమించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్‌లో మిస్త్రీకి చెందిన ఎస్‌పీ గ్రూప్‌ వాటాల వేల్యుయేషన్‌ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ సూచించింది. సుప్రీం ఉత్తర్వులపై టాటా గ్రూప్‌ హర్షం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌తో నాలుగేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. టాటా సన్స్‌ చైర్మన్‌గా ఆయన్ను పునర్‌నియమించాలంటూ నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో టాటా సన్స్‌ అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

‘2019 డిసెంబర్‌ 18న ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నాం. టాటా గ్రూప్‌ అప్పీళ్లను అనుమతిస్తున్నాం, షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ (మిస్త్రీ కుటుంబానికి చెందిన గ్రూప్‌) అప్పీళ్లను తోసిపుచ్చుతున్నాం‘ అని ఆదేశాలు ఇచ్చింది. దీనితో మిస్త్రీ తొలగింపుపై దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది. టాటా సన్స్‌ యాజమాన్య అధికారాలను విభజించాలన్న షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎస్‌పీ గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థలు వేసిన పిటిషన్లను కూడా డిస్మిస్‌ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే టాటా సన్స్‌ బోర్డులో సముచితంగా ప్రాతినిధ్యం కల్పించాలంటూ సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కార్పొరేషన్‌ చేసిన అప్పీళ్లను కూడా తోసిపుచ్చింది.

సుప్రీం కోర్టు ఉత్తర్వులపై టాటా సన్స్‌తో పాటు టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల తరబడి టాటా గ్రూప్‌ పాటిస్తున్న అత్యుత్తమ గవర్నెన్స్‌ ప్రమాణాలకు ఇది గుర్తింపు‘ అని టాటా సన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రతన్‌ టాటా వారసుడిగా 2012లో సైరస్‌ మిస్త్రీ టాటా గ్రూప్‌ చైర్మన్‌ హోదాలో పగ్గాలు చేపట్టడం, 2016లో ఆయన్ను అర్ధాంతరంగా తప్పించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ మిస్త్రీ, ఉద్వాసనను సమర్ధించుకుంటూ టాటా గ్రూప్‌ అప్పట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్నాయి. మిస్త్రీకి అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టాటా గ్రూప్, కంపెనీలో గవర్నెన్స్‌ లోపాలపై తాము లేవనెత్తిన అంశాలను ఎన్‌సీఎల్‌ఏటీ పరిష్కరించలేదంటూ మిస్త్రీ గ్రూప్‌.. సుప్రీంను ఆశ్రయించాయి.

వేల్యుయేషన్‌పై...
టాటా గ్రూప్‌లో షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ వాటాల విలువ ఎంత ఉంటుందనేది తేల్చుకోవడాన్ని ఇరుపక్షాలకు వదిలేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకోసం ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌లోని ఆర్టికల్‌ 75 లేదా ఇతరత్రా న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చని సూచించింది.   టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎల్‌) ఎస్‌పీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్‌పీ గ్రూప్‌ లెక్కగట్టింది. తదనుగుణంగానే గ్రూప్‌ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతోంది. అయితే, ఈ వాటాల వేల్యుయేషన్‌ రూ. 70,000–80,000 కోట్లే ఉంటుందని టీఎస్‌పీఎల్‌ వాదిస్తోంది.

కేసు సాగిందిలా..
► 2016 అక్టోబర్‌ 24: టాటా సన్స్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్‌ టాటా నియామకం.

► 2016 డిసెంబర్‌ 20: మిస్త్రీ తొలగింపును సవాలు చేయడంతో పాటు టాటా సన్స్‌ మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన 2 సంస్థలు ఎన్‌సీఎల్‌టీ (ముంబై)ని ఆశ్రయించాయి.  

► 2017 జనవరి 12:  టాటా సన్స్‌ కొత్త చైర్మన్‌గా అప్పటి టీసీఎస్‌ సీఈవో ఎన్‌ చంద్రశేఖరన్‌ నియామకం. అదే ఏడాది ఫిబ్రవరి 6న మిస్త్రీని టాటా సన్స్‌ బోర్డ్‌ డైరెక్టర్‌గా తొలగించారు. మార్చి, ఏప్రిల్‌లో మిస్త్రీ కంపెనీల పిటీషన్లను ఎన్‌సీఎల్‌టీ (ముంబై) తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మిస్త్రీ కంపెనీలు ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించాయి. దాని ఆదేశాల మేరకు మరోసారి ఎన్‌సీఎల్‌టీకి వెళ్లాయి.

► 2018 జూలై 9: మిస్త్రీ తొలగింపును సవాల్‌ చేయడంతో పాటు ఇతరత్రా అంశాలపై దాఖలైన పిటిషన్లను ఎన్‌సీఎల్‌టీ ముంబై మరోసారి తోసిపుచ్చింది. దీనిపై మిస్త్రీ కంపెనీలు మళ్లీ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించాయి.

► 2019 డిసెంబర్‌ 18: మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌గా పునర్‌నియామకానికి అనుకూలంగా ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు టాటా గ్రూప్‌నకు నాలుగు వారాల వ్యవధినిచ్చింది.  

► 2020 జనవరి 2: ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్‌ .. సుప్రీంను ఆశ్రయించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్‌ 17న తుది ఉత్తర్వులను రిజర్వ్‌ చేసింది.  
► 2020 మార్చి 26: మిస్త్రీ పునర్‌నియామకంపై ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను తోసిపుచ్చుతూ సుప్రీం తుది ఉత్తర్వులు ఇచ్చింది.  


మా విలువలకు నిదర్శనం..
గెలుపోటములకు సంబంధించిన అంశం కాదిది. నా నిబద్ధతపైనా, గ్రూప్‌ నైతిక విలువలపైనా నిరంతరంగా ఆరోపణల రూపంలో దాడులు జరిగాయి. అంతిమంగా టాటా సన్స్‌ అప్పీళ్లకు అనుకూలంగా తీర్పు రావడం మా విలువలు, నైతికతకు నిదర్శనం. చిరకాలంగా ఇవే మార్గదర్శక సూత్రాలుగా గ్రూప్‌ ప్రస్థానం సాగుతోంది.
– రతన్‌ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్‌

టాటా  షేర్లు రయ్‌..
సుప్రీం కోర్టులో అనుకూల ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో టాటా గ్రూప్‌ కంపెనీల షేర్లు శుక్రవారం జోరుగా పెరిగాయి. బీఎస్‌ఈలో టాటా స్టీల్‌ 6%, టాటా పవర్‌ 5 శాతం, టాటా కమ్యూనికేషన్స్‌ 4 శాతం, టాటా మోటార్స్‌ సుమారు 4 శాతం ఎగిశాయి. టాటా మెటాలిక్స్‌ 3 శాతం, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ .. టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌ చెరి 2.6 శాతం, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ .. వోల్టాస్‌ .. టాటా కెమికల్స్‌ దాదాపు 2 శాతం మేర పెరిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement