అమరావతిని ముక్కలు చేసి పంచుకున్న చంద్రబాబు అండ్ కో
లింగమనేని కోసం ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ మార్పులు
ఆ భూముల విలువ రూ.2 వేల కోట్లకు పైగా చేరేలా పన్నాగం..
ప్రతిగా క్విడ్ ప్రోకోలో హెరిటేజ్‌కు భూములు, బాబుకు కరకట్ట బంగ్లా
నారాయణ విద్యా సంస్థల కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు.. పవన్ కల్యాణ్‌కూ లాభం చేకూరుస్తూ అమరావతిలో ప్యాకేజీ
చంద్రబాబుది పైకి అభివృద్ధి మంత్రం.. లోన కుట్ర, కుతంత్రం. అరచేతిలో సింగపూర్‌ను చూపించి.. అమరావతిని చంద్రబాబు అండ్ కో ముక్కలు చేసి పంచుకుంది. పచ్చదండు బినామీలు పచ్చని భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. ఈ డ్రామాలో నారాయణ, లింగమనేని ఇలా ఎవరికి వారే వీర లెవల్లో రక్తి కట్టించారు. క్విడ్ ప్రోకోతో అనుమానం రాకుండా కథంతా నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట లింగమనేనికి భూముల లబ్ధి, నారాయణ కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు ఎసిసోడ్ ఈ డ్రామాకే హైలైట్. బాబు, నారాయణ ద్వయం లింగమనేని రమేశ్‌తో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో బేరం కుదుర్చుకుని క్విడ్ ప్రోకోకు బరితెగించారు. తిలా పాపం.. తలా పిడికెడు.. అన్నట్లు ఈ దోపిడీలో తన దత్తపుత్రుడికీ చంద్రబాబు కొద్దిపాటి వాటా పంచారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను తమకు భూములు కానుకగా ఇచ్చిన వారికి అనుకూలంగా చేయడమే ఈ క్విడ్ ప్రోకో కథ. ప్రతిఫలంగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు, బాబుకు కరకట్టపై బంగ్లా కానుక.
రాజధానిలో కాగితాలపై ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌ను ఇష్టమొచ్చినట్టుగా మెలికలు తిప్పుతూ తమ భూముల ధరలు వేల కోట్లకు పెంచుకోవడంలో చంద్రబాబు బరితెగింపునకు బాబోయ్ అనాల్సిందే. లింగమనేని రమేశ్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.887.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చేశారు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలతో సహా వెలికితీసి చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేపీవీ అంజని కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్ట్స్, నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది.
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సాగించిన దోపిడీ కాండ గురించి రెండు మూడు సీజన్లతో వెబ్ సిరీస్ తీయొచ్చు. ఈ కుంభకోణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పుల ఘట్టం అత్యంత కీలకం. సీఆర్‌డీఏ అధికారుల 94 కి.మీ. అలైన్‌మెంట్ ప్రకారం లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఐఆర్‌ఆర్ నిర్మించాలి. అయితే చంద్రబాబు ఆదేశాలతో సీఆర్‌డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు.
చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని ఐఆర్‌ఆర్ నిర్మించేలా అలైన్‌మెంట్ ఖరారు చేశారు. దీనిని గోప్యంగా ఉంచిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు.
అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే డిజైన్ ఉండాలని ఈ కన్సల్టెన్సీకి షరతు విధించారు. అంటే... అప్పటికే సీఆర్‌డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీని అడ్డం పెట్టుకొని ఆమోదించేలా చేశారు.
ఇదేం పని నారాయణ!
సీఆర్‌డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్‌మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగిస్తారు.
ఇలాగైతే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాలి. దీంతో సీఆర్‌డీఏ అధికారులపై నారాయణ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రపురం– కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు.
హెరిటేజ్‌కు భూ సంతర్పణ
అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పి లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి క్విడ్ ప్రోకోగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు సమకూరాయి. ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకునే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాల లబ్ధి కలిగింది. 2014 జూన్–సెపె్టంబర్ మధ్యలో ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ ఉన్నారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు బహుకరించారు. పవన్ కల్యాణ్‌కు ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌కు సమీపంలోనే 2.4 ఎకరాలు ధారాదత్తం చేశారు.
ఐఆర్‌ఆర్‌లో అవినీతి విశ్వరూపం
ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.50 లక్షలుండేది. ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు తర్వాత ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లింగమనేని కుటుంబ సభ్యులకు చెందిన 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్‌తో ఒప్పందం చేసుకున్న మరో 4.5 ఎకరాల విలువ సైతం రూ.24 కోట్లకు చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment