సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం సక్రమమేనంటూ టీడీపీ నాయకులు చూపిస్తున్న అనుమతి పత్రాలేవీ చెల్లవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారు చూపించే అనుమతులు కరకట్ట లోపల భవనాలు నిర్మించేందుకు వీలుగా లేవని సీఆర్‌డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. బిల్డింగ్ ప్లాన్ అనుమతి తీసుకోకుండా మిగిలిన ఎన్ని అనుమతులు తీసుకున్నా అవి లెక్కలోకి రావని చెబుతున్నారు. తమ అధినేత నివాసం ఉంటున్న భవనానికి పంచాయతీ అనుమతి ఉందని, నీటి పారుదల శాఖ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇచ్చిందని, రూ.18 లక్షల నాలా పన్ను కట్టామని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు పలు పత్రాలు చూపిస్తున్న విషయం తెలిసిందే. 2007లో ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకున్న తర్వాతే భవనాలు నిర్మించినట్లు చెబుతున్నా, వాస్తవానికి పంచాయతీ రికార్డుల్లో అది నమోదు కాలేదని సమాచారం. నిజంగా అనుమతి తీసుకుని ఉంటే పంచాయతీ రికార్డుల్లో నమోదై ఉండేదని, ఈ పరిస్థితిలో వారు చూపిస్తున్న అనుమతి పత్రం నకిలీదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ఉండవల్లి పంచాయతీని సీఆర్‌డీఏ అధికారికంగా సమాచారం కోరే అవకాశం ఉంది.
నాలా పన్ను కన్వర్షన్ వరకే.. భవన నిర్మాణానికి కాదు
వ్యవసాయ భూమిని నివాస యోగ్యంగా మార్చేందుకు కన్వర్షన్ పన్ను కట్టినా, అది భవన నిర్మాణానికి సరిపోదని సీఆర్‌డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ ఇచ్చిన ఎన్‌ఓసీ కూడా భవన నిర్మాణానికి ఇచ్చిన అనుమతి కాదని, నదీ తీరంలో తాత్కాలికంగా పరిమితమైన నిర్మాణాలకు అభ్యంతరం లేదని ఇవ్వడం వరకేనని చెబుతున్నారు. భవన యజమాని లింగమనేని రమేష్, టీడీపీ నాయకులు చూపిస్తున్న పంచాయతీ అనుమతి కూడా గతంలో వారిచ్చిన వివరణ ప్రకారం స్విమ్మింగ్ పూల్, దుస్తులు మార్చుకునే గదికి మాత్రమేనని చెబుతున్నారు. రికార్డుల్లో నమోదవ్వని పంచాయతీ అనుమతిని పరిగణనలోకి తీసుకున్నా, అది దుస్తులు మార్చుకునే గది వరకే తప్ప జీ+2 నిర్మాణం, అదీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నివసించే భవనానికి ఎలా సరిపోతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ పంచాయతీ అనుమతి ఉందనుకున్నా, జీ+2 భవనంతో పాటు హెలీ ప్యాడ్, పది షెడ్లు కట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు.
గతంలో ఇదీ సంగతి
ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నది నుంచి వంద మీటర్ల లోపు ఉండవల్లి పరిధిలోని 250, 254, 272, 274, 290/1 సర్వే నంబర్లలో లింగమనేని ఎస్టేట్స్ అధినేత రమేష్‌కు 1.31 ఎకరాల భూమి ఉంది. 2007 మే పదో తేదీన ఈ భూమిలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి నీటి పారుదల శాఖ నుంచి ఆయన నిరభ్యంతర పత్రం తీసుకున్నారు. కానీ స్విమ్మింగ్ పూల్ పేరుతో జీ+1 భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత రెండో అంతస్తు కూడా నిర్మించుకున్నారు. టీడీపీ హయాంలో జలవనరుల మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన 22 భవనాలపై చర్యలు తీసుకుంటామని 2015 మార్చి నెలలో ప్రకటించారు. అందులో ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న భవనం కూడా ఉంది. బిల్డింగ్ ప్లాన్ నిబంధనలు, నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాలను ఎందుకు కూల్చరాదో చెప్పాలంటూ అప్పట్లో తాడేపల్లి తహశీల్దార్ నోటీసులిచ్చారు. నోటీసులు ఇచ్చిన కొద్దిరోజులకే చంద్రబాబు ఆ అక్రమ భవనంలోకి మకాం మార్చారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలనూ సైతం పట్టించుకోలేదు. రూ.20 కోట్లకుపైగా ఖర్చు చేసి ఆ భవనాన్ని ఆధునీకరించడంతోపాటు రూ.3.30 కోట్లతో ప్రత్యేకంగా 33 కేవీ సబ్ స్టేషన్, కొత్త రోడ్ల నిర్మాణం, ప్రత్యేకంగా డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ భవనం అప్పగించడానికి ప్రతిఫలంగా చంద్రబాబు.. దాని యజమాని అయిన లింగమనేని రమేష్‌కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న లింగమనేనికి చెందిన రెయిన్ ట్రీ పార్కులో 700 ఫ్లాట్లను అధికారుల నివాసం కోసం అద్దెకు తీసుకుని ఒక్కో ప్లాటుకు నెలకు రూ.40 వేలు చొప్పున అద్దె చెల్లించారు. రాజధాని పేరుతో సాగించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో లింగమనేని గ్రూపు అడ్డగోలుగా సంపాదించింది. పథకం ప్రకారం కాజ, కంతేరు గ్రామాల్లో 804 ఎకరాలను తక్కువ రేటుకు కొనుగోలు చేసి వాటిని ఎస్టేట్స్‌గా మార్చారు. ఈ భూములు భూ సమీకరణ పరిధిలోకి రాకుండా తప్పించి భారీగా లబ్ధి పొందారు. ఈ ఎస్టేట్స్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు వాటాలున్నట్లు ఆరోపణలున్నాయి. కాజ గ్రామంలో సున్నపురాయి నిక్షేపాలున్న 300 ఎకరాలను రైతుల నుంచి లీజుకు తీసుకున్న లింగమనేని రమేష్ టీడీపీ అధికారంలో ఉండగా వాటిని తన సొంతం చేసుకున్నారు.
మరో పది భవనాలకు నోటీసులు
సీఆర్‌డీఏ అధికారులు శనివారం కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన మరో పది భవనాలకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం పది భవనాలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. శనివారం తులసి గార్డెన్స్, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్, సాగర్ వాటర్ ప్లాంట్, సత్యానంద ఆశ్రమం, శైవ క్షేత్రం తదితర భవనాల యజమానులకు నోటీసులు అందించారు. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన ప్రధాన అతిథి గృహాన్ని పరిశీలించిన తర్వాత నోటీసు ఇవ్వాలనుకుంటున్నారు. అందులో నాలుగు భవనాలుండగా ఒక దానికి గతంలో పరిమితమైన అనుమతి చూపిస్తున్నారని, పూర్తిగా పరిశీలించాక నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నారు. సోమవారం మిగిలిన అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment