సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణం కచ్చితంగా క్విడ్ ప్రో కోనే అన్నది స్పష్టమైంది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అన్నది తేటతెల్లమైంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు దక్కాయని తేలిపోయింది.
సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారులో ఏ–3 లింగమనేని రమేశ్ కుటుంబానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినందుకే వారిద్దరికీ ఆ ఆస్తులు దక్కాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది.
క్విడ్‌ప్రోకో అభియోగాలను కొట్టివేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. చంద్రబాబు కరకట్ట నివాసం, నారాయణకు అమరావతిలో ఉన్న ప్లాట్లు, కౌలు, బ్యాంకులో ఉన్న నిధుల అటాచ్‌మెంట్‌కు అనుమతినిస్తూ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులలో న్యాయస్థానం కీలక అంశాలను వెల్లడించింది. ఈ కుంభకోణంలో చంద్రబాబు, నారాయణ అంతా తామై నడిపిన వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
అంతా ఏ–1 చంద్రబాబే
అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్‌డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉందని తేల్చి చెప్పింది.
అలైన్‌మెంట్ మూడుసార్లు మార్పు
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడటంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారని న్యాయస్థానం వెల్లడించింది.
ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించారా లేదా అన్నదానితో దీనికి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లేని ఇన్నర్‌రింగ్ రోడ్డుపై కేసులు పెట్టడం ఏమిటంటూ టీడీపీ నేతలు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు.
అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు న్యాయస్థానం వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది. టీడీపీ 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే అదే అలైన్‌మెంట్ ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్డును నిర్మించి లింగమనేని కుటుంబానికి భారీగా లబ్ధి కలిగించేదన్నది స్పష్టం.
కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే
చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదని న్యాయస్థానం వెల్లడించడం గమనార్హం.
అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదన్నది స్పష్టం. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం అని దీంతో తేలిపోయింది. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.
హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం
లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదని న్యాయస్థానం పేర్కొంది. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని వ్యాఖ్యానించింది.
లోకేశ్‌దీ కీలక పాత్రే...
క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది.
కథ నడిపిన ఏ–2 నారాయణ
అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని న్యాయస్థానం వెల్లడించింది.
నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. వారు తన కుటుంబ సభ్యులు, బంధువులు అనే విషయాన్ని నారాయణ గోప్యంగా ఉంచారని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్‌డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తెలిపింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది.
అంతా క్విడ్ ప్రోకోనే..
అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పుల ద్వారా చంద్రబాబు, నారాయణ లింగమనేని రమేశ్‌తో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో క్విడ్‌ప్రోకోకు పాల్పడలేదంటూ లింగమనేని రమేశ్ చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ కేసును కొట్టి వేయాలన్న ఆయన వాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు అనుమతినిచ్చింది.
కరకట్ట సాక్షిగా క్విడ్ ప్రో కో.. అమరావతి భూకుంభకోణం ఏ–1 చంద్రబాబు నిర్వాకమే
Published Mon, Jul 3 2023 4:10 AM | Last Updated on Mon, Jul 3 2023 11:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment