Land scandal
-
‘ధరణి’ పోర్టల్‌లో దొంగలు పడ్డారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో దొంగలు పడ్డారు. జిల్లా కలెక్టర్ సహా తహసీల్దార్లంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా.. సదరు వెబ్‌సైట్‌ను పర్యవేక్షిస్తున్న ఇద్దరు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ తంతులో భారీగా భూములు చేతులు మారినట్లు తెలుస్తోంది. కలెక్టర్ పరిశీలన, అనుమతి లేకుండా దరఖాస్తులకు ఆమోదం (డిజిటల్ సంతకంతో) తెలిపినట్లు సమాచారం. ఇలా నిషేధిత జాబితాలో ఉన్న 98 దరఖాస్తులను ఈ తరహాలో జాబితా నుంచి తొలగిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ అంశంపై పోలీసులు కూడా విచారణ ప్రారంభించినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. సాంకేతికతను అడ్డుపెట్టుకుని నడిపిన ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిన ఇద్దరు ఉద్యోగులకు ఇంటిదొంగలు ఎవరైనా సాయపడ్డారా? ఈ భూ బాగోతంలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. 28 రోజుల్లో 98 దరఖాస్తులకు ఆమోదం ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై అప్పటి జిల్లా కలెక్టర్ హరీశ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ అక్టోబర్ 11న వేటు వేసింది. ఆ తర్వాత ఆయన స్థానంలో కొత్తగా భారతీ హోళికేరి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే జిల్లా ఎన్నికల అధికారిగా ఆమె బిజీగా మారారు. ధరణి పోర్టల్‌కు వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టి.. పూర్తిగా ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీకరించారు. ఇదే అదనుగా భావించిన ధరణి సిబ్బంది భారీ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. జిల్లాలో పలు చోట్ల ఉన్న భూదాన్ భూములను పట్టా భూములుగా మారుస్తూ ఆమోదముద్ర వేసినట్లు తేలింది. నిజానికి ఏదైనా ధరణి దరఖాస్తును ఆమోదించాలన్నా.. తిరస్కరించాలన్నా.. క్షేత్రస్థాయి రిపోర్టులే కీలకం. కానీ అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్యన ఎలాంటి రిపోర్టులు లేకుండానే సుమారు వంద అర్జీలకు ఆమోదం లభించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు ముమ్మరం కోర్టు కేసులు, అసైన్డ్, భూదాన్, మ్యూటేషన్లు, పాసు పుస్తకాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన వివాదాస్పద భూ సమస్యల అప్లికేషన్లకు పోర్టల్‌లో ఆమోదం రావడంపై కొందరు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఇంటి దొంగలే ఈ ఉదంతానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారులు ధరణి సమన్వయకర్త నరేశ్, ఆపరేటర్ మహేశ్‌లను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇందులో కేవలం సమన్వయకర్త, ఆపరేటర్ల పాత్ర మాత్రమే ఉందా? లేక జిల్లా ఉన్నతాధికారులు, ఇతర అధికారుల పాత్ర ఏమైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కరకట్ట సాక్షిగా క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణం కచ్చితంగా క్విడ్ ప్రో కోనే అన్నది స్పష్టమైంది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అన్నది తేటతెల్లమైంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు దక్కాయని తేలిపోయింది. సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో ఏ–3 లింగమనేని రమేశ్ కుటుంబానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినందుకే వారిద్దరికీ ఆ ఆస్తులు దక్కాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. క్విడ్‌ప్రోకో అభియోగాలను కొట్టివేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. చంద్రబాబు కరకట్ట నివాసం, నారాయణకు అమరావతిలో ఉన్న ప్లాట్లు, కౌలు, బ్యాంకులో ఉన్న నిధుల అటాచ్‌మెంట్‌కు అనుమతినిస్తూ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులలో న్యాయస్థానం కీలక అంశాలను వెల్లడించింది. ఈ కుంభకోణంలో చంద్రబాబు, నారాయణ అంతా తామై నడిపిన వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అంతా ఏ–1 చంద్రబాబే అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉందని తేల్చి చెప్పింది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడటంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారని న్యాయస్థానం వెల్లడించింది. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించారా లేదా అన్నదానితో దీనికి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లేని ఇన్నర్‌రింగ్ రోడ్డుపై కేసులు పెట్టడం ఏమిటంటూ టీడీపీ నేతలు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు న్యాయస్థానం వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది. టీడీపీ 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే అదే అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్డును నిర్మించి లింగమనేని కుటుంబానికి భారీగా లబ్ధి కలిగించేదన్నది స్పష్టం. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదని న్యాయస్థానం వెల్లడించడం గమనార్హం. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదన్నది స్పష్టం. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం అని దీంతో తేలిపోయింది. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదని న్యాయస్థానం పేర్కొంది. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. లోకేశ్‌దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని న్యాయస్థానం వెల్లడించింది. నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. వారు తన కుటుంబ సభ్యులు, బంధువులు అనే విషయాన్ని నారాయణ గోప్యంగా ఉంచారని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తెలిపింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. అంతా క్విడ్ ప్రోకోనే.. అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ద్వారా చంద్రబాబు, నారాయణ లింగమనేని రమేశ్‌తో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో క్విడ్‌ప్రోకోకు పాల్పడలేదంటూ లింగమనేని రమేశ్ చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ కేసును కొట్టి వేయాలన్న ఆయన వాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు అనుమతినిచ్చింది. -
అక్రమాల పుట్ట ‘అమరావతి’
సాక్షి, అమరావతి: ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్ధలవుతోంది. అధికార రహస్యాలను బయటకు వెల్లడించనని, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని, తన, పర బేధం చూడనని చేసిన ప్రమాణాన్ని (ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ ఉపసంఘం నుంచి సీఐడీ, ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరకు ఏ నివేదికను పరిశీలించినా అమరావతి అక్రమాల పుట్ట అని, చంద్రబాబు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని నిగ్గు తేలుతోంది. రాజధాని ముసుగులో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ లబ్ధిదారులు గత సర్కారు పెద్దలు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జాబితాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు, పుట్టా మహేష్ యాదవ్ తదితరులున్నారు. అమరావతి భూ కుంభకోణాన్ని మంత్రివర్గ ఉపసంఘం తవ్వి తీయడం తెలిసిందే. ఉపసంఘం నివేదికతో రంగంలోకి సీఐడీ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. రాజధాని పేరుతో లీకులు ఇచ్చి కారుచౌకగా భూములు కొట్టేసి ఆ తర్వాత ల్యాండ్ ఫూలింగ్‌తో ఆర్థికంగా లబ్ధి పొందిన అక్రమార్కుల జాబితాను సీఐడీ రూపొందించింది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్‌లో తక్కువ ధరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. రూ.కోట్లు విలువైన భూములను పేద వర్గాలు (797 మంది తెల్లకార్డుదారులు) కొనుగోలు చేయడం వెనుక బినామీలు టీడీపీ నాయకులేనని నిగ్గు తేల్చింది. నిజమైన పేదలే అయితే వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఒకవేళ డబ్బున్న వారైతే తెల్లకార్డులు ఎలా పొందారు? అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లకు నివేదికలు అందించడంతో ఆయా విభాగాలు తమదైన రీతిలో విచారణ సాగించాయి. అక్రమాల చిట్టా... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ కుటుంబం పేరుతో 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. లింగమనేని రమేష్ తన భార్య, బంధువుల పేర్లతో భూములు కొన్నారు. మాజీ మంత్రి నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్ పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాలు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మైత్రీ ఇన్ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్థారణ అయ్యింది. బినామీలకు భారీ లబ్ధి చేకూర్చేలా.. టీడీపీ నేతలు, వారి బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు రాజధాని సరిహద్దులను కూడా మార్పు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించింది. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. బినామీలు, నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని తేటతెల్లమైంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎదుర్కోలేక అడ్డుకునే ప్రయత్నాలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి తాజాగా సీఐడీ నమోదు చేసిన అసైన్డ్ భూ కుంభకోణం వరకు దర్యాప్తును ఎదుర్కొనేందుకు చంద్రబాబు అండ్‌కోకు ధైర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవస్థల ద్వారా దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ పెద్దలతోపాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రముఖుల గుట్టు రట్టు కావడంతో సీఐడీ, ఏసీబీ, సిట్ దర్యాప్తులను గతేడాది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. తాజాగా అసైన్డ్ భూ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు నేపథ్యంలో ఈ నెల 23న చంద్రబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన తప్పించుకునేందుకు దారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం. -
టీడీపీ నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, ఢిల్లీ: అమరావతి భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు, మాజీ ఏజీ దమ్మాలపాటి కేసుపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. నోటీసులకు టీడీపీ నేతలు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఆఖరి అవకాశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేదంటే తాము ప్రొసీడ్ అవుతామని హెచ్చరించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రలను సుప్రీంకోర్టు ఆదేశించింది. రీ జాయిండర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మార్చి 5న తుది విచారణ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. కాగా, అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ పరిశీలన మేరకు ఏర్పాటైన సిట్ దర్యాప్తును నిలిపివేయాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేయగా దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. (చదవండి: వివరాలు లేకుండా పిల్ ఎలా వేస్తారు?) సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోండి -
నందిగాం భూ బాగోతంలో కొత్త కోణాలు..
వీళ్లు మామూలు దొంగలు కాదు. సిగ్నే‘చోర్’లు. అంటే డిజిటల్ సంతకాలను కూడా దొంగిలించేవారు. నందిగాంలో వెలుగు చూసిన భూ బాగోతంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. చోరులు తమ అక్రమాలకు ఏకంగా తహసీల్దార్ కార్యాలయాన్నే కేంద్రంగా చేసుకున్నారు. తహసీల్దార్‌కు ఉండే డిజిటల్ సిగ్నేచర్ కీనే వాడుకున్నారు. ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారు? అక్రమార్కుడికి సహకరించినదెవరు? తహసీల్దార్‌కు తెలీకుండా జరిగిందా? ఇంకేదైనా గూడు పుఠాణీ నడిచిందా? ఇప్పుడు తేలాల్సి ఉంది. అధికారంలో ఉన్నన్నాళ్లూ అంతులేని అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులు ఓడిపోయిన తర్వాత కూడా కొన్ని చోట్ల చక్రం తిప్పుతున్నారు. దానికి నందిగాం ఘటనే సాక్ష్యం. మొత్తానికి ఇక్కడి రెవెన్యూ కార్యాలయం కేంద్రంగా ఏదో నడిచిందనే చెప్పాలి. ఇలాంటి తప్పుడు పాసు పుస్తకాలు, వన్‌బీల్లో దిద్దుబాట్లు ఇంకెన్ని సృష్టించారో, ఇంకెన్ని బాగోతాలు చేశారో నిగ్గు తేల్చాలి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పేదోడికి సెంటు స్థలం ఇవ్వలేదు గానీ ప్రభుత్వ భూములను మాత్రం టీడీపీ నేతలు ఇష్టారీతిన ఆక్రమించారు. తమ పేర్లను రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. అంతటితో వారి భూదాహం తీరలేదు. తమకు తెలిసిన వ్యక్తుల పేరు మీద ఉన్న భూముల వివరాలనే మార్చేసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారు. ఇందులో కొందరు రెవెన్యూ సిబ్బంది సహకరించారు. తిలా పా పం తలా పిడికెడు అన్నట్టుగా భూముల రికార్డుల మార్పిడిలో కుమ్మక్కై కథ నడిపారు. చెప్పాలంటే అక్రమార్కులతో చేతులు కలిపారు. అక్రమార్కుడు అధికారుల స్టాంపు, డిజిటల్ సిగ్నేచర్ పక్కా గా వినియోగించుకున్నాడంటే రెవెన్యూ కార్యాలయం కేంద్రంగా భూమాయ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అనువంశికంగా దఖలు పడిన భూమిని తన పేరున మార్చి, పట్టాదారు పాసుపుస్తకం, 1బీ, అడంగల్లు ఇప్పించాలని కాళ్లు అరిగేలా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగి నా 1బీ రాదు, పాసుపుస్తకం రాదన్న పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ పలుకుబడి, రెవెన్యూ సిబ్బందితో మచ్చిక చేసుకుంటే తనది కాని భూమిని కూడా తన పేరున, తన వారి పేరున ఎకరాల కొద్దీ మార్చేస్తారని నందిగాంలో తాజాగా జరిగిన ఘటన ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వ కాలంలో మండలంలో చక్రం తిప్పిన కొంత మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమకు కని పించిన ప్రభుత్వ భూములను, పోరంబోకు భూములను, మెట్టలను తమ పేరున మార్చుకొని లక్షలాది రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, ఇన్పుట్ సబ్సిడీలు పొందటం, బీమా పరిహారం పొందటం వంటివి చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడంతో ఆరితేరిన సిబ్బంది వీరికి లోపాయికారీగా సహకరించడం, తహసీల్దారు పని ఒత్తిడిలో తన డిజిటల్ కీను కంప్యూటర్ ఆపరేటర్లకు ఇవ్వడంతో తహసీల్దార్‌కు సంబంధం లేకుండానే భూములు మార్చకోవడం జరుగుతోంది. తాజా వ్యవహారంలో ఏం జరిగిందో విచారణలో తేలాలి. అంతులేని అక్రమాలు.. తెలుగు యువత అధ్యక్షుడు మదన్‌గౌడ్ విషయంలో బాధితుడు ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులు చూసి మోసపోయిన విషయం గుర్తించారు. మండల పరిధిలోని హరిదాసుపురా నికి చెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తికి మాదిగా పురం, సొంఠినూరు పరిధిలో సుమారు 60 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చూపుతుండగా, క్షేత్రస్థాయిలో వారికి 12 సెంట్లు, 24 సెంట్లు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి దరఖాస్తులు లేకుండా మండలంలోని మాదిగా పురం పరిధిలో గురుబెల్లి చిన్నిమ్ములు, తలగాపు సత్యవతిల పేరున సుమారు 14 ఎకరాలను, సొంఠినూరు పరధిలో గురుబెల్లి చిన్నమ్మలు పేరున 15 ఎకరాలు, తలగాన సత్యవతి పేరున 15 ఎకరాలు, కల్లేపల్లి త్రినాథరావు పేరున 15 ఎకరాలకు రెవెన్యూ రికార్డులను తయారు చేయించి వారి పేరున 1బీలు, అడంగల కాఫీలు తయారు చేశారు. అలాగే శివరాంపురం పంచాయతీ బడబందలో 149–1లో ఉన్న మెట్టలో 15 ఎకరాల వరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల పేరున 1బీలు తయారు చేసుకున్నారని, కాపుతెంబూరు పరిధిలో సర్వే నంబర్ 28, 28–2, లట్టిగాం పరిధిలో సర్వే నంబర్ 3–10లో సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు వారి పేరున తయారు చేసుకున్నారని, గొల్లూరు పంచాయతీ సొంఠినూరు సర్వే నంబర్ 1లో ఉన్న కొండపై అనేక మంది పట్టాలు సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాదు బయటకు రాని భూములు ఇంకా చాలా ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే మదన్‌గౌడ్ లాంటి వారు మరింత మంది బయటకు వస్తారని తెలుస్తోంది. ఫిర్యాదులపై దృష్టి సారిస్తే.. మండల పరిధిలో వందల ఎకరాల భూముల రెవెన్యూ రికార్డులను కొంతమంది తమ పేరున మార్చుకొన్న వ్యవహారంపై అధికారులకు పలు ఫిర్యాదులు వచ్చినా వాటిని పరిశీలించకపోవడం, దర్యాప్తు చేయకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలను కట్టడి చేయలేకపోవడం ఒక ఎత్తు అయితే ప్రస్తుత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు, అవినీతికి తావు ఇవ్వనప్పటికీ నేటికీ తారుమారైన రికార్డులు, భూములపై దృష్టి సారించకపోవడం వల్ల గత అక్రమాల కు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మండల పరిధిలోని భూముల వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే పలువురు కోరుతున్నారు. డిజిటల్ సిగ్నేచర్ దుర్వినియోగంపై ఫిర్యాదు నాకున్న డిజిటల్ సిగ్నేచర్ ఎలా దుర్వి నియోగమైందో విచారించి, దోషులను పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. డిజిటల్ సిగ్నేచర్‌ను ఆయుధంగా చేసుకుని రికార్డుల మార్పిడి చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్నాను. పోలీ సుల విచారణ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటాను. అలాగే ఇలాంటివి ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించండని వీఆర్ఓలతో సమావేశం పెట్టి చెప్పాను. – ఎన్.రాజారావు, తహసీల్దార్, నందిగాం తెలుగు యువత అధ్యక్షుడికి 14 రోజుల రిమాండ్ నందిగాం: రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి లేని భూమిని ఉన్నట్లుగా న మ్మించి అమ్మేయబోయిన నందిగాం మండల తెలుగు యువత అధ్యక్షుడు మదన్‌గౌడ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదన్గౌడ్పై నందిగాం పోలీసు లు కేసు నమోదు చేసి బుధవారం టెక్కలి కోర్టుకు తరలించారు. స్థానిక ఇన్చార్జి మెజిస్ట్రేట్ ప్రకాశరావు మదన్‌ను 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. అనంతరం పోలీసులు శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. -
విశాఖ భూస్కామ్‌పై 22న మహాధర్నా
- పాల్గొననున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడి సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంపై ఈ నెల 22న విశాఖ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపడుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. భూ బాధితులకు అండగా నిలిచేందుకు ఈ మహాధర్నాలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారని ఆయన ప్రకటించారు. విశాఖలో జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం తీసుకున్న నిర్ణయం మేరకు ఆందోళనను ఉధృతం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా తలపెట్టామని, ఇప్పటికే వామపక్షాలు, లోక్‌సత్తాతో పాటు వివిధ ప్రజా సంఘాలు, మేధావులు మద్దతు పలికారన్నారు. -
భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలి
బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోనే అతి పెద్ద భూ కుంభకోణం ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఆరోపించారు. ఈ కుంభకోణంలో సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్యమైన మంత్రులకు ప్రమేయం ఉందని అన్నారు. అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మియాపూర్ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రమేయం ఉందని ప్రతికల్లో వార్తలు వస్తున్నా యన్నారు. ఈ కుంభకోణంతో కేసీఆర్‌కు సంబంధం లేకపోతే వెంటనే మహమూద్ అలీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో ఒక్క ఐఏఎస్ అధికారిని కూడా ఎందుకు బాధ్యుడిని చేయలేదని నిలదీశారు. -
చిత్తూరు జిల్లాలో జర్నలిస్టుల నిరసన
తిరుపతి: అమరావతి భూకుంభకోణాన్ని వెలికి తీసిన సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లెల్లో సోమవారం పాత్రికేయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. విధి నిర్వహణలో ఉన్న ఫోటో, వీడియో జర్నలిస్టులపై దాడిచేసిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశాయి. తిరుపతిలో జర్నలిస్టులు నల్ల రిబ్బన్లు ధరించి ప్రెస్‌క్లబ్ నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి జర్నలిస్టులపై తప్పుడు కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్‌క్లబ్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, జర్నలిస్టు అసోషియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) సభ్యులు, సాక్షి నెట్వర్క్ ఇన్చార్జ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో.. చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నగరంలో పాత్రికేయులు కలెక్టరేట్ చేరుకుని నారాయణ భరత్ గుప్తకు వినతిపత్రం ఇచ్చారు. సాక్షి జర్నలిస్టులను వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లెలో.. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అక్కులప్ప, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మదనపల్లెలో పాత్రికేయులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాచేశారు. అనంతరం సాక్షి జర్నలిస్టులను వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కృతికాభాత్రాకు వినతి పత్రం సమర్పించారు.