తిరుపతి: అమరావతి భూకుంభకోణాన్ని వెలికి తీసిన సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లెల్లో సోమవారం పాత్రికేయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. విధి నిర్వహణలో ఉన్న ఫోటో, వీడియో జర్నలిస్టులపై దాడిచేసిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశాయి.
తిరుపతిలో జర్నలిస్టులు నల్ల రిబ్బన్లు ధరించి ప్రెస్‌క్లబ్ నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి జర్నలిస్టులపై తప్పుడు కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్‌క్లబ్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, జర్నలిస్టు అసోషియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) సభ్యులు, సాక్షి నెట్‌వర్క్ ఇన్‌చార్జ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరులో..
చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నగరంలో పాత్రికేయులు కలెక్టరేట్ చేరుకుని నారాయణ భరత్ గుప్తకు వినతిపత్రం ఇచ్చారు. సాక్షి జర్నలిస్టులను వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మదనపల్లెలో..
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అక్కులప్ప, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మదనపల్లెలో పాత్రికేయులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాచేశారు. అనంతరం సాక్షి జర్నలిస్టులను వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కృతికాభాత్రాకు వినతి పత్రం సమర్పించారు.
చిత్తూరు జిల్లాలో జర్నలిస్టుల నిరసన
Published Mon, Mar 28 2016 11:37 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement